తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి
చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో బడిపిల్లలు రాసిన బాలచెలిమి కథల పుస్తకాలు ఆవిష్కరణ
మెదళ్లను కదలించే శక్తి ఒక్క సాహిత్యానికి మాత్రమే ఉంటుందని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి పేర్కొన్నారు. బాలచెలిమి పిల్లల వికాస పత్రిక, చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ సంయుక్తాధ్వర్యంలో తెలంగాణ బడి పిల్లల కథల పుస్తకాల ఆవిష్కరణ సభ చిక్కడపల్లి కేంద్ర గ్రంథాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి హాజరై, సభకు అధ్యక్షత వహించారు. అనంతరం ఆయన తెలంగాణ పది జిల్లాల బడి పిల్లల కథల సంపుటాలను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ బాలసాహిత్యాన్ని నిరంతరం పరిచయం చేసి, బాలలను సాహిత్యంవైపు మళ్లించే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. ఎవరి అంతరంగాన్నైనా తెరిచి చూస్తే అందులో బాల్యమే ఉంటుందన్నారు. జ్ఞానం పెరుగుతున్న కొద్దీ మనిషి మంచి తనాన్ని కోల్పోతాడు అనడానికి చాలా ఉదాహరణలున్నట్లు చెప్పారు. అందరినీ ప్రేమించగలిగే వయసు బాలల సొంతం అన్నారు. ఎలాంటి అరమరికలు లేకుండా మెలిగే వయస్సు కేవలం బాలలకే ఉందన్నారు. చిన్నపిల్లలను చేరుకోవడం చాలా కష్టం అని, పెద్ద వాళ్లను మెప్పించడం చాలా సులువు అన్నారు. పిల్లలు అన్యాయం, దుర్మార్గాలను సహించరని, బాలవర్దిరాజు, బాలనాగమ్మ కథలో తన తల్లిదండ్రులను బంధించిన మాయలఫకీర్ ప్రాణం ఏడేడు సముద్రాల ఆవల మరిచెట్టు తొర్రలో రామచిలకలో ఉందని తెలిసి సాహసప్రాయణం చేసి చిలుకను చంపడం ద్వారా మాయలఫకీర్ ప్రాణం తీసి తల్లిదండ్రుల్ని విడిపించి వారి పట్ల ప్రేమను నిరూపించుకోవడమేకాక దుర్మార్గాన్ని ఎదిరించాడని చిన్నప్పటి నుండి ఆ కథ తనకు చాలా ఇష్టమని సిధారెడ్డి అన్నారు.
బాలచెలిమి ద్వారా ‘పిల్లలను చేరుకోవడానికి ఎన్ని మార్గాలున్నాయో అన్ని మార్గాలను బాలచెలిమి వెతకడం శుభపరిణామం’ అన్నారు. పిల్లలు రాసే కథలు ఎలా ఉండాలి, పెద్దలు రాసే కథలు ఎలా ఉండాలి అని చర్చించే వేదిక బాలచెలిమి అన్నారు. ఎవరు గొప్పవాళ్లు అంటే.. ఎవరితోవాళ్లు మాట్లాడుకొని, ఆనందంగా ఉండేవాళ్లు గొప్పవాళ్లన్నారు. అదే అత్యుత్తమమార్గం అన్నారు. శరీరం చెప్పదలచుకున్న విషయాలను వినాలని, అప్పుడే మనుషులు ఆరోగ్యంగా ఉంటారన్నారు. బాలచెలిమి ముచ్చట్లు ఇప్పటి వరకు నిరంతరంగా 23 వరకు జరగడం శుభసూచకం అని, మరెన్నో ముచ్చట్లు వరకు కొనసాగాలని ఆకాంక్షించారు.
గ్రంథాలయాలతో సమాజాభివృద్ధి : చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ చైర్మన్ మణికొండ వేదకుమార్
చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ చైర్మన్ మణికొండ వేదకుమార్ మాట్లాడుతూ తెలంగాణ సాహిత్య అకాడమి తెలుగు ప్రపంచ మహాసభల్లో బాల సాహిత్యానికి వేదిక కల్పించిన నందిని సిధారెడ్డికి కృతజ్ఞతలు తెలిపి, ఆ నెల నుండే బాలచెలిమి ముచ్చట్లు ప్రారంభం చేసామన్నారు. తెలంగాణలోని 33 జిల్లాల నుండి 882కిపైగా బడి పిల్లలు రాసిన బడి పిల్లల కథలను ఎంపిక చేసి తాము పుస్తక రూపంలో తీసుకురావడం చాలా సంతోషం అన్నారు. 33 జిల్లాల్లో బాలచెలిమి గ్రంథాలయాలు ఏర్పాటు చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని, ఇప్పటికే భూదాన్ పోచంపల్లి – యాదాద్రి జిల్లా, జల్లిపల్లి – ఖమ్మం జిల్లా, తడపాకల – నిజామాబాద్ జిల్లాలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో గ్రంథాలయాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బాలచెలిమి ముచ్చట్లు ఒక్క హైదరాబాద్‍కే పరిమితం కాకుండా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో నిర్వహిస్తున్నామని, ఇప్పటి వరకు 22 బాలచెలిమి ముచ్చట్లు జరిగాయని, వీటన్నింటినీ త్వరలో పుస్తకం రూపంలో తీసుకొస్తున్నట్లు చెప్పారు. పిల్లల వికాసం మరియు అభివృద్ధిలో భాగం పంచుకోవడమే తమ కర్తవ్యం అన్నారు. పుస్తకపఠనం పట్ల పిల్లలకు ఆసక్తి తీసుకురావడమే ధ్యేయంగా ఇలాంటి విభిన్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నట్లు చెప్పారు.
సొంత కల్పనలతో బాలలు కథలు రాయడం శుభపరిణామం : రచయిత్రి డా.ముదిగంటి సుజాతారెడ్డి
తమ చిన్నతనంలో అమ్మమ్మ లేదా నాన్నమ్మ ఆరణాలు ఇస్తే చందమామ పుస్తకాలు కొనుక్కొని చదువుకున్నట్లు రచయిత్రి డా.ముదిగంటి సుజాతరెడ్డి పేర్కొన్నారు. కొంతకాలం కింద తెలుగు విశ్వవిద్యాలయం బాలసాహిత్యంలో ఎవరికి అవార్డు ఇవ్వాలంటే చాలా ఆలోచించాల్సి వచ్చేదన్నారు. కానీ క్రమక్రమంగా బాలసాహిత్యానికి ఆదరణ లభిస్తుందన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి బాల సాహిత్యానికి ప్రత్యేక స్థానం కల్పించినట్లు తెలిపారు. నేడు బాలలు తమ సొంత కల్పనలతో మంచి కథలు రాయడం అమోఘం అన్నారు. వేదకుమార్ గారు పిల్లల కోసం బాలచెలిమి పుస్తకాలు, బడి పిల్లలు పుస్తకాలు అచ్చువేయడం అభినందించదగ్గ పరిణామం అన్నారు. పిల్లలు చదువుకునేందుకు పుస్తకాలు కొనాలని, పిల్లలను తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. తద్వారా పిల్లలకు జ్ఞానం పెరగడంతోపాటు నీతి, నియమాలు పెరిగి సృజనాత్మక శక్తి పెరుగు తుందన్నారు. చిన్నప్పటి నుండే పిల్లల మనస్సు ఎదగాలంటే సాహిత్యంపై అవగాహన కలిగించాలన్నారు. జిల్లాల్లో చాలా మంది ఉపాధ్యాయులు కథలు, కవితలు, వ్యాసాలు రాయించడం ద్వారా బాలల అభివృద్ధికి బాటలు పరుస్తున్నట్లు చెప్పారు. ముందు ముందు పిల్లలు మంచి పుస్తకాలు చదవాలని, సృజనాత్మక రచనలు చేయాలని ఆకాంక్షించారు.
పిల్లలు భిన్నంగా ఆలోచిస్తారు : కవి డా.అమ్మంగి వేణుగోపాల్
పిల్లలకు దగ్గర అవ్వడం అంత సులువు కాదని, పిల్లల కోసం సాహిత్యం రాసేవాళ్లు పిల్లల వయస్సుకు వెళ్లి కథలు రాయాల్సి ఉంటుందని కవి డా.అమ్మంగి వేణుగోపాల్ అన్నారు. పిల్లలు చాలా స్వచ్ఛమైన హృదయం గలవారన్నారు. పిల్లలు రాసిన కొన్ని అద్భుతమైన కథలు గురించి వివరించారు. పిల్లలు తాము ఉంటున్న ప్రపంచం కంటే భిన్నంగా కలలు కంటున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయులు ప్రోత్సహిస్తే మేటి రచయితలుగా రాణిస్తారన్నారు. ఇప్పుడు రాస్తున్న పిల్లలు ఇంకో ఇరవై, ముప్పై సంవత్సరాల తర్వాత గొప్ప రచయితలుగా ఎదుగుతారని, అప్పుడు వాళ్లకు వేదకుమార్ ఆదర్శ మూర్తిగా కనిపిస్తారన్నారు.
పిల్లలు అద్భుత ప్రయోగాలు చేయగలరు : కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కార గ్రహీత చొక్కాపు వెంకటరమణ
తనకు మూడేళ్లప్రాయంలోనే చందమామ కథలు వినే అదృష్టం కలిగిందని, తమ అక్క ద్వారా బాలల కథలు విని సాహిత్యంపై అవగాహన పెంచుకున్నట్లు కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కార గ్రహీత చొక్కాపు వెంకటరమణ అన్నారు. కొంచెం ఎదిగిన తర్వాత కథలు రాయడం, కథలు చెప్పడం మొదలుపెట్టినట్లు చెప్పారు. బాలసాహిత్యం తనను 1979లో ఆంధప్రదేశ్ బాలల అకాడమీ ప్రచురించే బాలచంద్రిక పత్రికకు ఎడిటర్‍ను చేసిందన్నారు. బాల రచయితలు రాస్తున్న కథలను ముద్రించి పాఠశాలలకు తీసుకెళ్లే అదృష్టం కలిగిందన్నారు. ఆ తర్వాత వేదకుమార్ బాలచెలిమి పత్రిక తీసేముందు తనకు గొప్ప అవకాశం ఇచ్చారని, అందులో సైన్స్ కథలు, వివిధ రకరకాల కార్టూన్ కథలు రాసేలా ప్రోత్సహించినట్లు చెప్పారు. పెద్దవాళ్లు కరెక్ట్గా చెబితే పిల్లలు అద్భుతంగా ప్రయోగాలు చేస్తారని వివరించారు. మొక్కలాంటి బడి పిల్లలకు వేదకుమార్ వేస్తున్న బీజాలు మరిచిపోలేనిదన్నారు. ఇరవై సంవత్సరాల క్రితం బాల సాహిత్యం రాసేవాళ్లు యాభై ఏళ్లపైబడి ఉన్నవాళ్లున్నారని తాను చాలా దిగులుపడ్డానని, ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా చాలా మంది బాలల కథల రచయితలు వెలుగులోకి రావడం సంతోషదాయకం అన్నారు. బడిపిల్లలు రాసే కథలకు చిత్రకారులు జిల్లాల వారీగా బొమ్మలు గీయడం చాలా సంతోష దాయకం అన్నారు.
పిల్లలకు దయ్యాల కథలు నచ్చుతాయి : బాలల కథా రచయిత మాచిరాజు కామేశ్వరరావు
పిల్లలకు దయ్యాల కథల పట్ల ఆసక్తి ఎక్కువ అని చందమామలో అనేక దయ్యాల కథలు రాసిన బాల కథా రచయిత మాచిరాజు కామేశ్వరరావు తెలిపారు. అందులో మంచి దయ్యాలు, చెడు దయ్యాలు అంటూ వైవిధ్యంగా కథలు రాసినట్లు తెలిపారు. చందమామ సంపాదకులు కొడవటిగంటి కుటుంబరావు దయ్యాలు కథలు ఎక్కువగా రాయమని చెప్పినట్లు తెలిపారు. తన మొదటి కథకు పది రూపాయలు పారితోషకం ఇచ్చినట్లు చెప్పారు. ఈ బడిపిల్లల కథల్లో మంచిగా రాసిన పిల్లలకు వెయ్యి రూపాయల పారితోషకం ఇవ్వనున్నట్లు తెలిపారు.
బాలచిత్రకారులతో బొమ్మలు గీయిస్తా : ఆర్టిస్టు కూరెళ్ల శ్రీనివాస్
బాలచిత్రకారులను తయారు చేసి వాళ్ల చేత బడి పిల్లల కథల పుస్తకాలకు చిత్రాలు గీయించేలా కృషి చేస్తానని బాలచెలిమి చిత్రకారుల కార్యశాల కన్వీనర్, ప్రముఖ చిత్రకారులు కూరెళ్ల శ్రీనివాస్ అన్నారు. తమ బాల్యమంతా చందమామ లాంటి పుస్తకాలతో గడిచిందన్నారు. బాల సాహిత్యం పుస్తకాలు చదివి ఉన్నతంగా ఎదిగినట్లు తెలిపారు. బాలసాహిత్యం ద్వారా పిల్లలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలన్నారు. ఈ పది పుస్తకాలకు వివిధ జిల్లాల నుంచి చిత్రకారులను పిలిపించి కార్యశాల నిర్వహించి బొమ్మలు గీయించటం తనకు, చిత్రకారులకు అద్భుతమైన అనుభవాన్ని, ఆనందాన్ని ఇచ్చింది బాలచెలిమి మరియు చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ అకాడమీయే అన్నారు. ఇది మా తదనంతర చిత్రకళ అభినివేశానికి దోహదం చేస్తుందన్నారు.
పిల్లల సాహిత్యానికి పాఠశాల నుండే పునాది : పైడిమర్రి గిరిజ
పిల్లల సాహిత్యానికి పాఠశాలలోనే పునాది పడాలని పైడిమర్రి గిరిజ అన్నారు. తమ పిల్లలు రచయితలు కావాలని గాఢంగా నమ్మినట్లు తెలిపారు. నిజానికి బెస్ట్ టీచర్ అవార్డు వచ్చినదానికంటే తమ పిల్లలు కథలు రాసినప్పుడే ఆనందం కలుగుతుందన్నారు. పిల్లల కథల్లో మానవ విలువలు, ప్రకృతికి సంబంధించిన కథలు, పర్యావరణానికి సంబంధించిన కథలు, సమాజానికి సంబంధించిన కథలు ఇలా ఎన్నో ఉన్నట్లు చెప్పారు. పిల్లలు రాసే నీతి కథలను వెలుగులోకి తీసుకొస్తే భారతదేశం గర్వించే రచయితలు అవుతారని చెప్పారు.
జిల్లా కన్వీనర్లు తోకల రాజేశం, ఘణపురం దేవేందర్, సిరిసిల్ల గఫూర్ శిక్షక్, కూకట్ల తిరుపతి, డా.వాసరవేణి పరశురాం, దండ్రె రాజమౌళి, డా.అమ్మిన శ్రీనివాసరాజు, ఉండ్రాళ్ల రాజేశం, కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, డా.భీంపల్లి శ్రీకాంత్, డా.తెలుగు తిరుమలేశ్, డా.బెల్లంకొండ సంపత్‍కుమార్, పైడిమర్రి గిరిజ, పైడిమర్రి రామకృష్ణ గార్లకు, చిత్రకారులు కూరెళ్ల శ్రీనివాస్, కైరంకొండ బాబు, మర్రిపల్లి రమేష్, టి.వి.రామకిషన్, హస్మతుల్లా, పర్కపల్లి యాదగిరి, సి.హెచ్.వెంకటరమణ, టి.భూపతి, వడ్డేపల్లి వెంకటేష్, ఎల్.నరేందర్, బీర శ్రీనివాస్, కె.రాఘవచారి, కేసగాని అజయ్ గార్లకు, ఇందులో కథలు రాసిన బాలరచయితలకు, ఈ పది పుస్తకాలు వెలువడటంలో వారి కృషిని, సహకారాన్ని అభినందిస్తూ పది పుస్తకాల కిట్‍ను జ్ఞాపికగా అందించి సత్కరించారు.
ఈ కార్యక్రమాన్నంతటినీ ఉండ్రాళ్ల రాజేశం సమన్వయపర్చగా, రాష్ట్ర కన్వీనర్ గరిపల్లి అశోక్ వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో రచయితలు శాంతారావు, మాఢభూషి లలితాదేవి, సుతారపు వెంకటనారాయణ, ధనుంజయ, సి.హెచ్. మల్లేశం, ఉరిమళ్ల సునంద, జుగాష్‍విలి, జన విజ్ఞానవేదిక రాజా, తెలంగాణ సాహితి అనంతోజు మోహన్‍కృష్ణ, కట్టా ప్రభాకర్, ఖైజర్ బాషా, జమున, శైలజ తదితరులు పాల్గొన్నారు.
– కట్టా ప్రభాకర్
8106721111