హిందూ ముస్లిం సమైక్యతకు సంకేతం‘చార్మినార్‍’

తేరే ఘర్‍ కె సామ్నే
దునియా బసావూంగా
తేరే ఘర్‍ కె సామ్నే
ఎక్‍ ఘర్‍ బనావూంగా
తారే సజావుంగా
తెరే ఘర్‍ కే సామ్నె.

1963లో వచ్చిన ఒక హిందీ సిన్మాలో హీరో దేవానంద్‍ తన ప్రియురాలికి చేసిన వాగ్దానాలివి.
‘‘నీ ఇంటి ముందు ఒక ప్రపంచాన్నే నెలకొల్పుతాను. నీ ఇంటి ముందు మరో ఇంటినే నిర్మిస్తాను. నిర్మించిన ఆ ఇంటి వాకిటిలో తారల తోరణాలు వ్రేలాడదీస్తాను’’ అని దాని అర్థం. సరిగ్గా 424 ఏండ్ల క్రితం నవాబు మహమ్మద్‍ కులీ కుతుబ్‍షా కూడా తన ప్రియురాలు భాగమతితో ఇలాంటి వాగ్దానాలే, వాదాలే చేసాడేమో అందుకే హైద్రాబాద్‍ నగరం వెలిసింది. నగరం నడిబొడ్డున చుక్కలను చుంబించే చార్మినార్‍ కూడా నిలిచింది. వారిరువురి హిందూ-ముస్లిం ప్రేమ వ్యక్తిగత ప్రేమగా మిగిలిపోక ఒక వైభవోజ్వల నగర నిర్మాణానికి దారితీసింది. దానికి ప్రత్యక్ష సాక్ష్యమే ఈనాటి చార్మినార్‍.
చార్మినార్‍ కీ కహానీ వెనుక మరో కహానీ కూడా వుంది. 1590లో గోల్కొండ కోటలో ప్లేగు వ్యాధి వచ్చి వేల మంది మరణించారు. నవాబుగారు రాజధానిని మార్చాలని నిర్ణయించి 1591లో నూతన నిర్మాణానికి ఒక ‘‘తాజియా’’ను (పీరు) శంకుస్థాపన చేశారు. అదే చార్మినార్‍. చార్మినార్‍లో ఒక మూలన ఆ తాజియా ఇప్పటికీ వుంది. సరిగ్గా దాని వెనుక భాగంవైపే మాతా భాగ్యలక్ష్మి మందిరం వుంది. ప్లేగు వ్యాధి మృతుల గౌరవార్థం వెలసిన నిర్మాణమే చార్మినార్‍ అని మరో కథ కూడా వుంది. ఎవరికి నచ్చిన కథలు వారు నమ్మవచ్చు.


మాతా భాగ్యలక్ష్మి దేవాలయ నిర్మాణం వెనుక కూడా ఒక స్థలపురాణం వుంది. చార్మినార్‍ నిర్మాణం జరుగుతున్న రోజులలో రాత్రిళ్లు సామానుల కాపలా కోసం నవాబు ఒక గొల్లవాడిని నియమించాడు. ఒక అమావాస్య చీకటి రాత్రి కర్పూర కళికలా వెలుగుతున్న ఒక రూపవతి ఘల్లుఘల్లున కాళ్ల గజ్జెలు మోగుతుండగా వజ్రవైఢూర్యాలు, బంగారు నగలు ధరించి ‘‘నేను వచ్చానని మీ రాజుగారికి చెప్పు’’ అని ఆజ్ఞాపించింది. మరి ఇక్కడికి సామానులకు కాపలా ఎవరుంటారు అని ప్రశ్నించిన ఆ అమాయక గొల్లవాడి ప్రశ్నకు ‘‘నువ్వొచ్చేవరకు నేనిక్కడ్నుండి కదలను’’ అని ఆమె హామీనిచ్చింది. గొల్లవాడు పరుగుపరుగున వెళ్లి నవాబును నిద్రలేపి విషయాన్ని వివరించాడు. ఆ వచ్చిందెవరో నవాబుగారు అర్థం చేసుకున్నాడు. రాజ్య సంక్షేమం కోసం తల్వారుతో వాడి తల నరికేశాడు. తెల్లారేసరికి ఆ నాతి రాతిగా మారిపోయింది. ఆమెనే భాగ్యనగరానికి సంబంధించిన భాగ్యలక్ష్మి. చరిత్ర పుటలలో చెదిరిపోయిన ఆ గొల్లవాడి త్యాగాన్ని ఎవరు గుర్తు పెట్టుకుంటారు?
మనం చూస్తున్న చార్మినార్‍ అసలుకు నకలు మాత్రమే. అసలు చార్మినార్‍ ఇరాన్‍లోని ‘‘ఇస్పహాన్‍’’ నగరంలో ఉంది. మనకు ఇస్పహాన్‍ టీ పౌడర్‍ పేరు తెలుసుగాని ఇరాన్‍లో ఇస్పహాన్‍ నగరం అంటూ ఒకటి వుందని అక్కడ అసలైన చార్మినార్‍ కట్టడం వుందని తెలియదు కదా! మహమ్మద్‍ ఖులీకుతుబ్‍షా అక్కడి కట్టడాన్ని కాపీ కొట్టి ఇక్కడ ఎందుకు నిర్మించినట్లు?


మొదటి కుతుబ్‍షా నవాబు ఇరాన్‍ నుండి దక్కన్‍లోని బహమనీ రాజ్యానికి వలస వచ్చి ఇక్కడ సైన్యాధికారిగా జీవితాన్ని ప్రారంభించి కాలక్రమేణా గోల్కొండ సుబేదారుగా తర్వాత స్వతంత్ర నవాబుగా అవతరించాడు. ఇక అప్పటి నుండి గోల్కొండ ముస్లిం ప్రధాన మంత్రులందరూ ఇరాన్‍ దేశం నుండి వలస వచ్చిన వారే. మహమ్మద్‍ కులీకుతుబ్‍షా 1591లో చార్మినార్‍ నిర్మాణానికి సంకల్పించినప్పుడు అతని ప్రధాని మీర్‍ మోమిన్‍ అస్త్రాబాదీ. ఇరాన్‍లోని అస్త్రాబాద్‍ నుండి ఇతను వచ్చాడు కనుక ఇతని పేరు చివరన అస్త్రాబాదీ స్థిరపడింది. నవాబు ఒక పెద్ద కట్టడాన్ని నిర్మించమని సకల అధికారాలు తన ప్రధానమంత్రికి అప్పగించటం వలన అతను ఇస్పహాన్‍లోని చార్మినార్‍ను ఒక నమూనాగా చేసుకుని హైదరాబాద్‍లో మన చార్మినార్‍ను నిర్మించాడు.


ప్రధాని మీర్‍ మోమిన్‍ మంచి పరిపాలకుడే గాక ఆ కాలంలో గొప్ప పండితుడు, గొప్ప ఇంజనీరు కూడా! అందరూ చార్మినార్‍ను చూస్తారు. మెచ్చుకుంటారు. కానీ మీర్‍ మోమిన్‍ గురించి ఎవరికీ తెలియదు. తెలిసినా పట్టించుకోరు. పాపం మీర్‍ మోమిన్‍ ‘‘రాళ్లెత్తిన కూలీల జాబితాలో’’ ఒకడుగా చేరిపోయాడు. ఏమిటీ? ఏమడుగుతున్నారూ? చార్మినార్‍ నిర్మాణం పూర్తయిన తర్వాత మీర్‍ మోమిన్‍ తన జన్మస్థలం ఇరాన్‍లోని అస్త్రాబాద్‍కు వెళ్లిపోయాడా అని అడుగుతున్నారా? కాదు కాదు. అతను పరదేశీ అయినా ఈ గడ్డ మీదనే జీవించి ఇక్కడ మట్టిలోనే మట్టిగా మారిపోయాడు. ఈ గడ్డ రుణం తీర్చుకోవడానికి మనకు చార్మినార్‍ను ఒక కానుకగా ఇచ్చి కాల యవనిక వెనక్కి కనుమరుగైపోయినాడు. మొగల్‍పురాలో రిఫాయే ఆం ఇస్కూల్‍ దాటి సుల్తాన్‍ షాహీ బస్తీకి వెళ్లే తోవల ఎడమవైపు ఒక ఖబరస్తాన్‍ (శ్మశానం) ఉంటుంది. దాని పేరు మీర్‍ మోమీన్‍ దాయెర (సమాధి).


మన నిత్యజీవిత సంగ్రామంలో కొంచెం తీరిక చేసుకుని దోసిలినిండా గులాబీలతో వెళ్లి, అతని సమాధిపై భక్తి శ్రద్ధలతో గులాబీలు వెదచల్లి నిండు హృదయంతో ఆ మహాను భావుడికి కృతజ్ఞతలు చెప్పుదామా?
సరే చార్మినార్‍ గురించి మరో మజేదార్‍ (ఇంటరెస్టింగ్‍) ముచ్చట చెప్పుకుందాం. చార్మినార్‍ నుండి గోల్కొండ కోటకు ఒక రహస్య సొరంగమార్గం ఉందన్న సంగతి మీకు తెలుసా? అబ్బే ఈ గ్లోబలైజేషన్‍లో మనం ‘‘విశ్వపౌరులం’’ అయిపోయాం కదా! ఇసుంటి చిన్న చిన్న విషయాలను పట్టించుకునే పురుసత్‍ మనకెక్కడిది? ప్రస్తుతం ఉన్న చార్మినార్‍ పోలీస్‍ కమీషనర్‍ ఆఫీస్‍ క్రింద నుండి ఈ సొరంగం ప్రారంభమవు తుంది. లాడ్‍బజార్‍, దాద్‍మహల్‍, అల్లారఖాబేగం మంజిల్‍, కోకాతట్టి, కార్వాన్‍, టోలీమసీద్‍, లంగర్‍హౌజ్‍ల నుంచి గోల్కొండకోట లోపలికి ఈ సొరంగ మార్గం వుంది. లాడ్‍బజార్‍ దగ్గర ఈ సొరంగం 30 అడుగుల లోతు 15 అడుగుల వెడల్పుతో వుంది. దీన్ని దూరాన్ని 4 కి.మీ. వరకు గుర్తించారు. ఆపైన వెళ్లటం ప్రమాదకరంగా వుంది- విషపూరిత క్రిమికీటకాలు, పాములు, త్రేళ్లు ఉండటం వలన! ఇవి నా ఆధారరహిత కల్పిత ఊహలు కావు. 1936లనే నిజాం కాలంలో అప్పటి మున్సిపల్‍ కమీషనర్‍ ఇనాయత్‍ జంగ్‍, ఆర్కియాలజిస్టు గులాం యాజ్దానీతో కలిసి రూపొందించిన రిపోర్టులోని సత్యాలు ఇవి.

లాడ్‍బజార్‍, ముర్గీకాచౌక్‍, కోకాతట్టి ప్రాంతాలలో ప్రజలు ఇళ్ల నిర్మాణాల కోసం ఇప్పటికీ తవ్వకాలు జరుపుతుంటే అనేకసార్లు ఈ సొరంగాలు బయటపడినాయి. కానీ పట్టించుకునే ప్రభుత్వాలు ఏవీ? నిన్నగాక మొన్న 14 మార్చి 2016 నాడు కోకా తట్టిలో ఒక వకీలు సాబ్‍ ఇంటి నిర్మాణం కోసం త్రవ్వుతుంటే ఒక పెద్ద ఫిరంగి బయటపడిందిన్న సంగతి అన్ని పత్రికలు రాశాయి.
1962లో 1936 రిపోర్టు ఆధారంగా సెన్సెస్‍ అసిస్టెంట్‍ డైరెక్టర్‍ ఖాజామోహియుద్దీన్‍, ఆర్కియాలజీ డైరెక్టర్‍ అబ్దుల్‍ వహీద్‍ ఖాన్‍లు కూడా పరిశోధనలు చేసి సొరంగ మార్గం నిజమేనని ప్రకటించారు. శత్రుసేనల నుండి రక్షణ కోసం, విలువైన సంపదలను తరలించేందుకు ఈ సొరంగ మార్గాన్ని ఉపయోగించేవారని వారు వివరించారు. ఇప్పటికైనా ఈ సొరంగాన్ని ఆ మార్గాన్ని పరిశోధ నలతో పునరావిష్కరిస్తే చార్మినార్‍ నుండి గోల్కొండ కోట వరకు అండర్‍గ్రౌండ్‍ మెట్రోరైలు మార్గాన్ని నిర్మించుకోవచ్చును. అనేక బస్తీలను అనుసంధానిస్తూ ప్రజారవాణా వ్యవస్థను రూపొందిచ వచ్చు.


ఉపరితల కాలుష్య వాతావరణాన్ని కూడా నివారించ వచ్చు. లండన్‍లో ఉన్న భూగర్భ మెట్రోరైలు వ్యవస్థను మనం కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. అంతేగాక దేశ, విదేశ పర్యాటకులను ఈ సొరంగం పుణ్యమా అని ఆకర్షించి వారి జేబులు కత్తిరించి మన ఖజానాలు నింపుకోనూవచ్చు! స్మార్ట్సిటీలు, హైటెక్‍ సిటీలు అని కోట్లాది రూపాయలు వెచ్చించే బదులు, హెరిటేజ్‍ వాక్‍లు అని లక్షలాది రూపాయలు వృథా చేసే బదులు ఈ అద్భుత, చారిత్రక, వారసత్వ సంపదైన ఈ సొరంగాన్ని పట్టించుకుని ప్రపంచానికి దీని గొప్పదనాన్ని పునఃపరిచయం చేద్దామా? చూద్దాం మన నవ తెలంగాణ ప్రభుత్వం దీని గురించి ఆలోచిస్తుందేమో?
సరే! మొదటి చార్మినార్‍ ఇరాన్‍లోని ఇస్సహాన్‍లో ఉంది. రెండవ చార్మినార్‍ హైద్రాబాద్‍లో ఉంది. మరి మూడవ చార్మినార్‍ ఎక్కడుందో తెలుసా? పాకిస్తాన్‍లోని కరాచీలో! దేశ విభజనానంతరం ఆ తర్వాత హైద్రాబాద్‍ రాజ్యంపై పోలీస్‍ యాక్షన్‍ జరిగినంక హైద్రాబాద్‍ నుండి చాలా మంది ముస్లింలు పాకిస్తాన్‍కు వలసవెళ్లి చార్మినార్‍ మీది ప్రేమతో కరాచీలో ఒక చార్మినార్‍ను నిర్మించుకుని ‘‘పొగడరా నీ తల్లి భూమి భారతిని’’ అని తమను తాము తృప్తి పరచుకున్నారు.
జయహో చార్మినార్‍.


(షహర్‍ నామా (హైద్రాబాద్‍ వీధులు – గాథలు) పుస్తకం నుంచి)
-పరవస్తు లోకేశ్వర్‍
 91606 80847

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *