సృజనాత్మక రచన కన్నా విమర్శ కష్టమైన పని. కష్టమైన పనే కాదు, కృతజ్ఞతలేని పని. విమర్శకుడు ఒక రచనను పూర్తిగా చదివి దానిలోని క్లిష్టమైన అంశాలను సైతం కూలంకషంగా అర్థం చేసుకోవాలి. దానిపై సాధికారికంగా వ్యాఖ్యనించేందుకు గాను పరిశోధన కూడా అవసరం. పరిశోధన ఖర్చుతో కూడుకున్న పని. ఇంతా చేసి తాను తెలుసుకున్న విషయాలు, కూర్చిన సమన్వయం, ఆర్జించిన జ్ఞానం, చేసిన పరిశోధన, నిర్ధారించిన వాస్తవాలు, వివరించిన వ్యాఖ్యానం, ఇచ్చిన తీర్పులు (రచనపై) అన్నీ కూడా సృజనకారుడికే గుర్తింపు తెస్తాయి. విమర్శ కొన్ని సార్లు సృజనకారుడి లోపాలను ఎత్తి చూపిస్తుంది. ఈ లోపాలు ఎత్తి చూపడం కూడా అంతిమంగా కవి/రచయితకే ఉపయోగపడుతుంది. దీపం చుట్టూత చీకటి ఉన్నట్లు విమర్శకుడు తాను చీకట్లో ఉంటూనే పాఠకులకు వెలుతురును ప్రసాదిస్తూ ఉంటాడు. ఇట్లా విమర్శకుడు ప్రసరించిన వెలుగులో ఒక రచనను చదివినట్లయితే దాని పూర్వపరాలు, అక్షరబద్ధం కాని అంశాలు సైతం పాఠకులకు అవగాహనలోకి వస్తాయి. ‘బిట్వీన్ ద లైన్స్’ ఏమున్నదో తెలుస్తది. ఎట్లా చూసిన విమర్శకుడి ఘనత చరిత్రలో రికార్డు కావడానికి చాలా సమయం పడుతుంది. కొన్సి సార్లు జీవితకాలం కూడా సరిపోక పోవొచ్చు. కానీ విమర్శకుడు సృష్టించిన వెలుతురులో నుంచే కవి/రచయిత పుట్టుకొస్తాడు. మంచి పాఠకుడే మంచి సృజన చేయగలడు. దానికి అనుభవం నగిషీలు చెక్కడానికి ఉపయోగ పడుతుంది. ఇది సాహిత్యం-సమాజం పురోగతికి తోడ్పడుతుంది.
చరిత్ర, సంస్కృతి , సమాజం, రాజకీయ, ఆర్థిక రంగాలపై విస్తృతమైన అవగాహన గలవారు, నిస్వార్థంగా ఉంటూ, త్యాగం చేయగలిగేవారు, తమ సమయాన్ని ఇతరుల కోసం వెచ్చించే వితరణ శీలురు మాత్రమే నికార్సయిన విమర్శను సృజించగలరు. తెలంగాణ ఉద్యమం అందించిన అట్లాంటి నికార్సయిన విమర్శకుల్లో ముందువరుసలో నిలిచే సాహితీవేత్త అమ్మంగి వేణుగోపాల్ సార్. తాను చెప్పదలుచుకున్న అంశం ముక్కుసూటిగా చెబుతూనే దాన్ని వినమ్రంగా వ్యక్తీకరిస్తాడు. ఇది అమ్మంగికే అబ్బిన విద్య. తెలంగాణ ఉద్యమంలో సబ్బండ కులాలు పాల్గొన్నాయి. సాహిత్యంలోనూ దాని ప్రతిఫలనాలున్నాయి. వాటన్నింటిని ఒడిసి పట్టుకొని మంచి చెడ్డల్ని విప్పి చెప్పిన ఎక్స్పర్ట్ కామెంటేటర్ అమ్మంగి సారు. ప్రధానంగా కవిత్వాన్ని మాత్రమే సృజించే వేణుగోపాల్‍సార్ వృత్తిరీత్యా తెలుగు లెక్చరర్‍గా పనిజేసిండు. డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‍గా రిటైరయ్యిండు. ఆ సమయంలో డాక్టరేట్ కోసం గోపిచంద్ పైన పరిశోధన చేసిండు. అంతకుముందు ‘మిణుగురు’ (1980), ‘పచ్చబొట్టు పటంచెరు’ (1999), ‘భరోసా’ (2008) కవితా సంపుటాలు వెలువరించారు. అంతేకాదు తెలుగుకు ఉర్దూకు ఉన్న అవినాభావ సంబంధాన్ని ‘మరో కొత్త వంతెన’ (1993) పేరిట పటిష్టపరిచిండు. ‘మజర్ మెహదీ మరో ప్రపంచం’ (2008) పేరిట రాసిన పుస్తకానికి సంపాదకత్వం వహించిండు. సురవరం, వట్టికోట ఆళ్వారుస్వామిలపై సాహిత్య అకాడెమీ అచ్చేసిన పుస్తకాలకు సంపాదకత్వ బాధ్యతలు నిర్వహించాడు. అయితే 2006 ఆ ప్రాంతంలో ఉద్యోగం నుంచి రిటైరయిన తర్వాత విస్తృతంగా సాహిత్యం చదివిండు. ముఖ్యంగా తెలంగాణ సాహిత్యంపై అధ్యయనం చేసిండు. ఒకవైపు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, ఊరూరా ధూమ్‍ధామ్‍లు, వివిధ రచయితల సంఘాలు, సంస్థలు తెలంగాణ వ్యాప్తంగా సభలు సమావేశాలు నిర్వహిస్తున్న సందర్భమది. అందుకే తెలంగాణ రచయితల వేదిక సిరిసిల్లలో ఏర్పాటు చేసిన సభపై ప్రత్యేకంగా ఒక వ్యాసమే రాసిండు. ఉద్యమ సందర్భంలో పరిశోధనా రంగంలో జరిగిన కృషి ఫలితంగా తెలంగాణకు సంబంధించిన ఎన్నో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. మరెంతో మంది మరుగున పడ్డ సాహితీవేత్తలు కొత్తగా తెరమీదికి వచ్చిండ్రు. ఆదిలాబాద్ మొదలు మహబూబ్‍నగర్ వరకు నిత్యం కవులు, కళాకారులు, రచయితలు, ఉద్యమకారులు, విద్యావంతులు తమ తమ ప్రాంతాల్లో సాహిత్య కార్యక్రమాలు నిర్వహించిండ్రు. తద్వారా తమ ప్రాంతంలో మరుగునపడ్డ కవులు, కళాకారులను పరిచయం చేసిండ్రు. ఇట్లా తెలంగాణ అంతటా మా ప్రాంతం కూడా చరిత్రకెక్కదగినదే అనే సోయితో వ్యవహరించిండ్రు. ఆత్మగౌరవ సోయి వారిని మరింత బలంగా తెలంగాణ కోసం కొట్లాడేలా చేసింది.
సరిగ్గా ఇదే సమయంలో అమ్మంగి వేణుగోపాల్ సార్ తనను తాను తెలుసుకుంటున్న తెలంగాణను దాని ఘనతను, చరిత్రను, సాహిత్యాన్ని సమకాలీన దృక్పథంతో ప్రపంచానికి పరిచయం చేసిండు. ఇందులో తెలంగాణేతరులైన వ్యక్తులు, వారి రచనలు ఉన్నప్పటికీ ఆయన దృష్టి, దృక్పథం రెండూ తెలంగాణనే అని చెప్పొచ్చు. సాహిత్యంలో సామాజిక న్యాయాన్ని కూడా భాగం చేసిండు. విస్మరణ, వివక్షకు గురైన వ్యక్తుల్ని, విషయాల్ని వినయంగా వెలుగులోకి తెచ్చిండు. ఇన్నేండ్లు తెలంగాణ వాండ్లు తమ రచనలపై ఆంధ్రా ప్రాంతానికి చెందిన వ్యక్తులు చెప్పే అభిప్రాయం కోసం అర్రులు చాచేవారు. వారి ముందుమాటల కోసం, కొన్ని సార్లు సమీక్షల కోసం, ఇంకొన్ని సార్లు పుస్తకాల వెనుక మాట కోసం ఆంధాప్రాంత కవులు, విమర్శకుల దగ్గర కొందరు తెలంగాణ వాండ్లు తమ నైజానికి విరుద్ధంగా చేతులు కట్టుకునేవారు. తెలంగాణ ఉద్యమం ఆ పోకడలకు స్వస్తి పలికింది. మన గురించి మనమే చెప్పుకోవాలనే సోయితో వ్యవహరించిండ్రు. ముందుమాటలు, విమర్శ, సమీక్ష, కొండొకచో పరామర్శ అన్నీ కూడా తెలంగాణ వాళ్ళు ఏ ప్రాంతానికి తీసిపోకుండా రాసిండ్రు.
ముందుమాటలు రాయమని అడిగిన వారికి, లేదా ఆత్మీయుల గురించి రాయడం ఒక ఆప్షనల్ అంశం. అట్లా గాకుండా పత్రికలో కాలమ్ రూపములో పక్షం రోజులకు ఒక రచన చేయడమంటే అదీ విమర్శనా పూర్వక రచన చేయడమంటే కత్తిమీద సాము లాంటిదే! ఈ సాముని విజయవంతంగా చేసిన వాడు అమ్మంగి వేణుగోపాల్. 1990లో ‘అవినాభావం’ పేరిట కొన్ని సాహిత్య వ్యాసాలను పుస్తకంగా తీసుకొచ్చిన ఈయన రిటైరైన తర్వాత టైర్‍లెస్‍గా (అవిశ్రాంతంగా) రాసిండు. దాదాపు రెండేండ్లకు పైగా ‘సూర్య’ దిన పత్రికలో అతి సూక్ష్మమైన అంశాన్ని సైతం భూతద్దంలో పరిశీలించి తెలంగాణ సాహిత్యానికి వన్నెలద్దిండు. వివిధ దిన పత్రికల్లో వచ్చిన వ్యాసాలకు, ఒకటి రెండు ముందుమాటలు, ‘సూర్య’ పత్రికలో ‘దస్తూరి’ శీర్షికన వెలువడ్డ రచనలన్నింటినీ కలిపి 2012లో పుస్తకంగా తీసుకొచ్చిండు. తెలంగాణ ఉద్యమం ఊపుమీదున్న దశలో ఇక్కడి రచనలపై ఒక ప్రత్యేకమైన శ్రద్ధ, ఆసక్తి, అభిరుచి, అభిమానంతో, స్వీయాదేశిత బాధ్యతగా స్వీకరించి విమర్శ చేసిండు. ఉద్యమావసరాలను దృష్టిలో పెట్టుకొని తనకు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తెలంగాణకు మేలు చేకూర్చిండు. 60 ఏండ్ల వయసులో ఏ సాహితీవేత్తయినా ముఖ్యంగా అతను కవి అయినట్లయితే కవిత్వ రచనకే పరిమితమైతారు. సి.నారాయణరెడ్డి లాంటి వారు ఒక వయసు తర్వాత ప్రధానంగా కవిత్వమే సృజించారు. అయితే తెలంగాణలో విమర్శావసరాన్ని గుర్తించి, గురుతర బాధ్యతగా భావించి విమర్శ చేసిన వారు అమ్మంగి వేణుగోపాల్. స్కైబాబ, అన్వర్, దాసి సుదర్శన్, దేవులపల్లి కృష్ణమూర్తి, గూడూరి సీతారామ్, గద్దర్, శివసాగర్, కంచ ఐలయ్య, శీలా వీర్రాజు తదితర దళిత, బహుజన, ముస్లిం మైనారిటీలపై శ్రద్ధతో విమర్శా వ్యాసాలు రాసిండ్రు. దళిత ఉపకులాలకు చెందిన కథల సంపుటి ‘నాగేటి సాళ్ళు’ పుస్తకాన్ని లోతుగా పరిశీలించి వ్యాఖ్యానించాడు. దేవులపల్లి కృష్ణమూర్తి రిటైరైన తర్వాత రాయడం ప్రారంభించిండు. ఈ సమయంలో రాసిన ఊరు-వాడ-బతుకు జీవిత చిత్రాన్ని కండ్లమందుంచిండు. ఇది అమ్మంగి సార్ మాత్రమే చేగలిగే పని. ఎందుకంటే దేవులపల్లి కృష్ణమూర్తి, దాసి సుదర్శన్‍లను దాదాపు 50 ఏండ్ల నుంచి దగ్గరగా చూసిన వ్యక్తి. వారి అభిరుచులు, సాహితీ, కళా పిపాస గురించి తెలిసిన వాడు. అందుకే వారిపై సాధికారమైన విమర్శ రాసిండు.
అమ్మంగి సార్ సాహిత్యంలోని అన్ని పక్రియల్లోని రచనలై విమర్శ చేసిండు. జీవిత చరిత్రలు, స్వీయ చరిత్రలు, లేఖా సాహిత్యం, కవిత్వం, కథలు, నవలలు, నాటకాలు, యాత్రారచన, సమగ్ర సాహిత్యం, వాఙ్మయసూచి, విజ్ఞాన సర్వస్వాలు, భాష, సినిమాలు, కళలు, చరిత్ర, మోనోగ్రాఫ్, విమర్శ, పరభాషా సాహిత్యాలు ఇట్లా భిన్నమైన విషయాలను తనదైన సౌమ్యమైన వ్యాఖ్యతో తెలుగు సాహిత్య చరిత్రలో చిరస్థానం కల్పించారు.
తెలంగాణకు చెందిన కాళోజి నారాయణరావు, సురవరం ప్రతాపరెడ్డి, దాశరథి, బిరుదురాజు రామరాజు, సామల సదాశివ లాంటి సాహిత్య వ్యక్తిత్వాలను భిన్న కోణాల్లో వ్యక్తీకరించారు. బిరుదురాజు రామరాజు, సామల సదాశివ, కాళోజి, దాశరథి, గూడూరి సీతారామ్‍లతో దగ్గరి సంబంధాలుండడంతో వారి గురించి రాసేప్పుడు రసగుళికల్లాంటి కొత్త అంశాలను జోడించిండు. కాళోజి గురించి రాస్తూ ‘ప్రాంతీయతత్వాన్ని అణువణువునా జీర్ణించుకున్న విశ్వమానవుడాయన’ అని రాసిండు. ఎమర్జెన్సీ రోజుల్లో కాళోజి రాష్ట్రమంతటా తిరుగుతూ మెదక్ జిల్లాలో పర్యటిస్తూ తన బసను ఎవరింట్లోనైనా ఏర్పాటు చేస్తామంటే వద్దు అందరితోపాటే ఇక్కడే గుళ్లో నిద్రపోతానని చెప్పి అక్కడే అందరితో పాటు పడుకున్న కాళోజి వ్యక్తిత్వాన్ని రికార్డు చేసిండు. సాహిత్యం విషయానికి వస్తే ‘నిజం మాట్లాడితే ఎవరికో ఎక్కడో మిరపకాయ పెట్టినట్టుండే చీకటి దినాలు దాపురించినై. కవులు, రచయితలు నిజం చెప్పకపోతే ఎవరు చెప్తరు?’ అంటూ కవుల ఉన్నత స్థానాన్ని కాళోజి చెప్పిండు. ఈ విషయాలన్నింటిని అమ్మంగి దగ్గరి నుంచి చూసినవాడు కావడంతో సాధికారికంగా రికార్డు చేసిండు.
తెలంగాణ వెలుగులే గాకుండా ఆంధ్రా ప్రాంతానికి చెందిన గురజాడ, కొడవటిగంటి కుటుంబరావు, భద్రిరాజు కృష్ణమూర్తి, తిరుమల రామచంద్ర, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిల రచనలు, వ్యక్తిత్వాలపై సాధికారికంగా వ్యాఖ్యానించాడు. గురజాడపై మైకెల్ ముదసూధన దత్తు అనే బెంగాళీ రచయిత ప్రభావం ఉందని రాసిండు. ఇట్లా చెప్పడానికి బెంగాళీ రచనలపై కూడా సాధికారికమైన అవగాహన ఉంటే కానీ సాధ్యం కాదు. అలాగే కొడవటిగంటి కుటుంబరావు గురించి రాస్తూ ‘‘కుటుంబరావు ఎంత రాశారో, అంతకంటె ఎక్కువే చదివారు. సరైన అధ్యయనం మూలంగా, అదివరకు సంపాదించిన జ్ఞానం సమీక్షకు గురై, చేర్పులతో నూతన చైతన్యం సంతరించుకుంటుందని విశ్వసిస్తే, అందుకు కుటుంబరావు జాతి గర్వించదగిన అధ్యయన శీలి’ అని చెప్పిండు. ఈ విషయాలపై పూర్తి పట్టు ఉంటే గాని ఇట్లా రాయడానికి వీలు కాదు. వీళ్ళంతా తొలితరానికి చెందిన తెలంగాణ, ఆంధ్రా ప్రాంతానికి చెందిన కవులు, రచయితలు, సాహితీవేత్తలు.
రెండో తరానికి చెందిన ఎం.వి.తిరుపతయ్య, కె.కె. రంగనాథాచార్యులు, వరవరరావు, అంపశయ్య నవీన్, తుమ్మేటి రఘోత్తమరెడ్డి, అల్లం రాజయ్య, జ్వాలాముఖి, బి.ఎస్.రాములు, దేవులపల్లి కృష్ణమూర్తి, దేవరాజు మహారాజు, జయధీర్ తిరుమలరావు, వి.ఆర్.విద్యార్థి తదితరులు తెలంగాణనుంచి తెలుగు సాహిత్యంలో తమకంటూ ఒక పేరుని సాధించుకున్న రచయితలు. కవిత్వంలో, కథల్లో, నవలలు తదితర అంశాల్లో ఒకొక్కక్కరు ఒక్కో రంగంలో ఘనత సాధించారు. తమ రచనల ద్వారా తెలంగాణ సమాజంపై ప్రభావం వేసిండ్రు. వీరి రచనలను జల్లెడ పట్టి అసలు అంశాలను మనకందించిండు. అలాగే ఆంధ్రా ప్రాంతంలో పుట్టిన పోరంకి దక్షిణామూర్తి, రాచమల్లు రామచంద్రారెడ్డి, సి.వి.కృష్ణారావు, శీలా వీర్రాజు, శివసాగర్, హరిపురుషోత్తమరావు, త్రిపురనేని గోపీచంద్, డా.కేశవరెడ్డి, బాలగోపాల్, వేగుంట మోహన ప్రసాద్‍ల రచనలపై సాధికారికమైన వ్యాఖ్యలు చేసిండు.
ఆంధ్రాకు చెందిన కవయిత్రి మందరపు హైమవతి, కుప్పిలి పద్మ కథలు ‘మంచుపూలు’ రచనలపై కూడా విమర్శ వ్యాసాలు రాసిండు. హక్కుల సంఘాల్లో చురుగ్గా పాల్గొన్న సురవరం ప్రతాపరెడ్డి, కాళోజి నారాయణరావు, కన్నబీరన్, బాలగోపాల్, వరవరరావు, గద్దర్, కంచ ఐలయ్యల రచనలను విమర్శనాత్మకంగా పరిశీలించి వ్యాఖ్యానించాడు. విమర్శకుడిగా బాలగోపాల్, కె.కె.రంగనాథాచార్యుల విశిష్టతను పాఠకుల ముందుంచిండు. గద్దర్ కవిత్వం, కన్నబీరన్ స్వీయ చరిత్ర, సుంకిరెడ్డి సాహిత్య చరిత్ర, కంచ ఐలయ్య సామాజిక చరిత్ర, కాళోజి కవిత్వంపై రాసిన విషయాలను సమకాలీన సందర్భంలో వ్యాఖ్యానిస్తూ వాటి సాహితీ విలువను ఖరీదు కట్టిండు.
ఈ తరంలో పెన్నా శివరామకృష్ణ, కందుకూరి శ్రీరాములు, స్కైబాబల రచనలపై లోతైన విశ్లేషణ గల వ్యాసాలు రాసిండు. అంతేకాదు వేమన, రామదాసు లాంటి వారి రచనలను కూడా అమ్మంగి వేణుగోపాల్ సార్ క్షుణ్ణంగా పరిశీలించి విమర్శా వ్యాసం రాసిండు. అయితే రామదాసుకు సంబంధించి సినిమాలు, నాటకాలు, కీర్తనలు, ఆయన రచనలు ఒక రకంగా ‘మోనోగ్రాఫ్’కు సరిపడా సినాప్సిస్ అందించిండు. వీటి ఆధారంగా రామదాసు రచనలన్నింటిని సేకరించి వాటిని అచ్చు వేయడమే గాకుండా సినిమాలను ఒక మ్యూజియం ఏర్పాటు చేసి రామదాసుకు సంబంధించిన సర్వ సమగ్ర సమాచారాన్ని ఒక్క దగ్గర చేర్చినట్లయితే భవిష్యత్ పాఠకులకు, బుద్ధిజీవులకు ఎంతగానో ఉపయోగ పడుతుంది.
కవిత్వం కచ్చితంగా అమ్మంగి వేణుగోపాల్ సార్‍కు ఇష్టమైన, ప్రాధామ్యములో ఉన్న విషయం. అందుకే కొత్త గోలకొండ సంచికలు పేరిట ఈ వ్యాస రచయితనైన నేను (సంగిశెట్టి శ్రీనివాస్), సుంకిరెడ్డి నారాయణరెడ్డిలు కలిసి సంయుక్తంగా సంపాదకత్వం వహించి వెలువరించిన ‘1969-73 తెలంగాణ ఉద్యమ కవిత్వం’ పుస్తకాన్ని ఆంధ్రజ్యోతిలో సమగ్రంగా విశ్లేషించిండు. ఒక్క ఈ పుస్తకమే గాకుండా సింగిడి నాగర్‍కర్నూల్ శాఖ వారు ప్రచురించిన ‘పొద్దైంది’, స్కైబాబ సంపాదకత్వంలోని ‘జాగో జగావో’, కరీంనగర్ ఉద్యమ కవితా సంకలనం ‘వల్లుబండ’ (2010), గాయాలే గేయాలై, ‘తెలంగాణ ఉరుములు, మెరుపులు’, ‘మా మట్టి కోసం, మా హైదరాబాద్ కోసం, తెలంగాణ కవిత-2009త తదితర కవితా సంకలనాలపై పది పేజీల వ్యాసం రాసిండు. ఇందులో సమకాలీన సందర్భంలో వచ్చిన తెలంగాణ కవిత్వాన్ని ఒక వజ్రాల ఎక్స్పర్ట్లాగా కవిత్వాన్ని ఎంచి తూచిండు. ఇందులో ‘‘తెలంగాణ సాహిత్య తవ్వకం పనిలో నిష్ణాతులైన సంగిశెట్టి శ్రీనివాస్, డా. సుంకిరెడ్డి నారాయణరెడ్డి అప్పటి కవిత్వాన్ని వెలికితీసి ‘1969-73 తెలంగాణ ఉద్యమ కవిత్వం’ (2009) పేరిట వెలుగులోకి తెచ్చారు. వారి శ్రమ ఫలితంగా 1).జి.యాదగిరి, ఋక్నుద్దీన్‍ల సంపాదకత్వంలో వెలువడ్డ ‘విప్లవఢంకా’ (1969), 2) ‘జనధర్మ’ ప్రత్యేక సంచిక (5.6.1969), 3) ‘ఎవరో’ సంపాదకత్వంలో ‘విప్లవశంఖం’ (1969) మళ్ళీ ఈ సంకలనంలో పునర్ముద్రణ పొందాయి. ‘తెలుగుగడ్డ’, ‘జై తెలంగాణ’, ‘విద్యుల్లత’, వంటి పత్రికలు కూడా తెలంగాణ ఉద్యమ కవిత్వాన్ని ప్రచురించాయి. వారికి లభించని కవితలు మరో వందదాకా వుండవచ్చు. దాశరథి, సినారె అప్పటి ఉద్యమానికి దూరంగా వున్నారూ. విరసం అధ్యక్షుని హోదాలో శ్రీశ్రీ వ్యతిరేకించారు.’’ అని ఎవరి కృషి ఏమిటని తేల్చి చెప్పిండు. నిజానికి అమ్మంగి వేణుగోపాల్ సార్ ‘సాహిత్య సందర్భం, సమకాలీన స్పందన’ పేరిట తన విమర్శ వ్యాసాలన్నింటిని (89)ని పుస్తకంగా తీసుకొచ్చిండు. ఇందులో విమర్శ చేసిన ప్రతి పుస్తకం ప్రచురణ తేదీని పక్కన ఇచ్చిండు. ఇది భావి పరిశోధకులు తప్పక పాటించాల్సిన ఒక నియమం అని కూడా తేల్చి చెప్పినట్లయింది. 2012కు రాసిన విమర్శా వ్యాసాలు పుస్తకంగా వచ్చింది. ఇందులో అవసరమైన చోటల్లా ఎలాంటి శషభిషలకు పోకుండా తెలంగాణ సాహిత్యాభ్యున్నతికి కృషిచేసిన వారిని గౌరవిస్తూ వ్యాసాల్లో వ్యాఖ్యానించిండు. ఇది ఆయన నిష్పాక్షికతకు నిదర్శనం. అట్లాగే నాయినపై అప్యాయతతో ‘నడి ఎండలో వెన్నెల పాట’ పేరిట అన్వర్ సంకలనం చేసిన ‘నాయిన’ కవిత్వాన్ని విశ్లేషించిండు. హైదరాబాద్ కవల పిల్లల తల్లి అంటూ తెలుగులో రాస్తున్న ముస్లిం కవులను గుర్తుకు తెచ్చిండు. అందులో అఫ్సర్ ముందువరుసలో ఉన్నాడు.
ఈ కొత్త గోలకొండ కవుల సంచికలతో పాటు సిరిస్‍లో వేముగంటి మురళీకృష్ణ, అందెశ్రీ, కాంచనపల్లి కలిసి తీసుకొచ్చిన ‘మునుం’, ఎస్.జగన్ రెడ్డి సంపాదకత్వంలోని ‘జులూస్’ తదితర కవిత్వ సంకలనాలపై కూడా సాధికారికమైన విశ్లేషణ, విమర్శ ఇందులో ఉన్నది. పెన్నా, ఎలనాగ కవిత్వాన్ని విశ్లేషించిండు. గురజాడ, చలం లేఖలను కూడా పరిశీలించిండు. సినిమాలకు సంబంధించి మాభూమి, పథేర్ పాంచాలి, దాసి సుదర్శన్‍పై కూడా ఇందులో వ్యాసాలున్నాయి. ఇక్బాల్, కమలదాస్ లాంటి ప్రాంతేతర సాహితీవేత్తల రచనలు, జీవితం గురించి కూడా విలువైన విమర్శా వ్యాసాలను అమ్మంగి అందించారు.
కవిత్వంతో పాటుగా కథలపై కూడా లోతైన విమర్శ చేసిండు. జూపాక సుభద్ర సంపాదకత్వంలో వచ్చిన దళిత ఉపకులాల కథలు ‘నల్లరేగటి సాల్లు’, జింబో వేముల వాడ కథలు, గాలివాన, తెలంగాణ స్త్రీల కథలపై రాసిండు. మునెమ్మ, అంపశయ్య, శీలావీర్రాజు నవలలపై కూడారాసిండు. త్రిపురనేని రామస్వామి చౌదరి నాటకంపై కూడా ఒక వ్యాసం రాసిండు.
పరిశోధనలో తన గురువైన బిరుదురాజు రామరాజు, నేలమాళిగల్లో కూరుకుపోయిన అంశాల దుమ్ముదులిపి వెలుగులోకి తెస్తున్న నెల్లూరుకు చెందిన కాళిదాసు రాసిన ‘దంపూరి నరసయ్య’ పుస్తకం, సంగనభట్ల, జయధీర్ తిరుమలరావులపై కూడా వ్యాఖ్యానించిండు. అలాగే చరిత్రకు సంబంధించిన సుంకిరెడ్డి నారాయణరెడ్డి రాసిన ‘ముంగిలి’కి విలువ తెచ్చే రచనలు చేసిండు. ఇవే గాకుండా గడియారం రామకృష్ణశర్మ, తిరుమల రామచంద్రల స్వీయ చరిత్రలు, కన్నబీరన్ 24 గంటలు, బాలశ్రీనివాసమూర్తి రాసిన ఆత్మకథల్లో అలనాటి చరిత్ర, ప్రొఫెసర్ ఆదినారాయణమూర్తి రాసిన యాత్రాచరిత్రలపై కూడా అమ్మంగి వేణుగోపాల్ రాసిండు. ఇవన్నీ చూస్తూంటే ఎంత విస్తృతంగా చదివిండో, దాన్ని అక్షర రూపంలో పెట్టడానికి అంతకన్నా ఎక్కువ కష్టపడ్డాడని తెలుస్తూనే ఉన్నది. ఎందుకంటే ఒక అంశంపై దాని మంచి చెడ్డలు విశ్లేషించుకునేందుకు అంతకుముందరి ఆకరాలు అనేక సందర్భాల్లో అందుబాటులో లేవు. అయినా కూడా ఆ యా రచనలపై సాధికారికమైన విమర్శ చేసిండు. వాఙ్మయసూచికి సంబంధించిన ‘దిక్సూచి’, అనువాద గ్రంథం ‘మనలిపి దాని పుట్టుపూర్వోతరాలు’ కూడా ఆయన విమర్శకు నిండుదనాన్ని తీసుకొస్తున్నాయి.
ఎవరైనా ఒక రచన చేయాలన్నా, దాని మీద విమర్శ రాయాలన్నా ముందుగా దానిపైన ఆసక్తి ప్రధానం. ఇట్లా ఆసక్తి ఉంటే గానీ విషయాన్ని హృదయానికి దగ్గరగా హత్తుకోలేము. నిజానికి ఇంత విస్తృతంగా రాసేప్పుడు అన్ని విషయాల పట్ల ఆసక్తి అదే స్థాయిలో ఉంటుందా? అంటే అవును అని చెప్పలేము. కానీ ఎంతో కొంత ఆసక్తి, అభిమానము, ఆత్మీయత, తెలుసుకున్న విషయాన్ని నలుగురితో పంచుకోవాలి, తద్వారా తన జాతికి మేలుకోవాలి, మేలుకలగాలి అనేది ప్రతి విమర్శకుడు ఆశిస్తాడు. అట్లా అమ్మంగి వేణుగోపాల్ కూడా ‘దస్తూరి’ శీర్షికలో రాసిన వ్యాసాలు, దానికి తోడు నేటి నిజం, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, పాలపిట్ట తదితర పత్రికల్లో ప్రచురితమైన వ్యాసాలను ఒక్క దగ్గరికి తీసుకొచ్చి పుస్తకంగా వేయడమంటే తెలుగు సాహిత్యానికి, ముఖ్యంగా తెలంగాణ సాహిత్యానికి ఎనలేని సేవ చేసినట్టు. అలాగే ‘మహాప్రస్థానం వస్తు శిల్పాలు’, ‘కవిత్వంలో సూర్యాగ్ని’ అనే రచనలు ఆయన సూక్ష్మపరిశీలనకు నిదర్శనాలు.
అయితే ఈ వ్యాస పరంపరలో తన పరిశోధనాంశమైన గోపిచంద్‍పై మూడు వ్యాసాలు, గురజాడ, సురవరం, తదితరులపై రెండేసి వ్యాసాలున్నాయి. అయితే ఇందులో అందరికన్నా ఎక్కువగా సామల సదాశివ పైన ఐదు వ్యాసాలున్నాయి. అంటే ఆయనపై తనకున్న అనురాగం తెలిసి వస్తుంది.
తెలుగు సాహిత్య రంగంలో మార్క్సిస్టు విమర్శకులు, సనతాన విమర్శకులు, బహుజన, దళిత విమర్శకులు అని గీతలు గీసే అవకాశముంది. అందుకు తగ్గట్టుగానే ఆయా విమర్శకులు తాము దృక్పథానికి అనుగుణంగా విమర్శ/పరామర్శలు రాసిండ్రు. అయితే సమకాలీన సందర్భంలో సాహిత్యంపై విమర్శా దృక్కోణంలో ఒక తెలంగాణ వాదిగా, ఒక బహుజనుడిగా, ఒక నిరంతర సాహిత్యాధ్యయన శీలిగా, కవితా ప్రేమికుడిగా ఇట్లా బహుముఖాలుగా ఏక కాలంలో తెలుగు సాహిత్యాన్ని భిన్న సంస్కృతికి కేంద్ర బిందువైన హైదరాబాద్ నగరం నడిబొడ్డున నిలబడి వ్యాఖ్యానించిన మృధు స్వభావి అమ్మంగి. ఆయన తన స్వభావాన్ని అక్షరాలుగా మలిచి విలువైన విమర్శ చేసిండు. ఈ విమర్శ చరిత్రలో కాల పరీక్షకు నిలబడి నెగ్గుకు వస్తుంది అనడంలో సందేహం లేదు.
-సంగిశెట్టి శ్రీనివాస్, 9849220321