బోయినపల్లి వినోద్‍కుమార్ (తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు)గారితో కోవిడ్-19పై ప్రత్యేక ఇంటర్వ్యూ
బోయినపల్లి వినోద్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు, మాజీ ఎంపీ, న్యాయవాది. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‍ఎస్) పార్టీ వ్యవస్థాపక సభ్యులు.
లాక్‍డౌన్‍లో ప్రజలు, ప్రభుత్వాలు కరోనాను ఏ విధంగా ఎదుర్కొంటున్నాయి?
కరోనా వైరస్‍నే కోవిడ్-19 అంటున్నాం. కోవిడ్ అంటే కరోనా వైరస్ డిసీజ్. 2019 సంవత్సరంలో వచ్చింది కావున కోవిడ్-19 అని వచ్చింది. ఈ వైరస్ ప్రపంచ వ్యాప్తంగా భూభాగం పైన ఉన్న మొత్తం మానవజాతికి భయంకరమైన సమస్యగా ఆవిర్భవించింది. ఎలా పుట్టింది, ఎలా పోతుంది అనేది ముఖ్యం కాదు ఇప్పుడు. కంటికి కనపడని జీవి కాదు అది. ప్రొటీన్‍కు చుట్టూ ఉండే కొవ్వు (ఫ్యాట్)ను వైరస్ అంటారు. ఈ వైరస్ మనుషుల గొంతులోకి వెళ్లిన తరువాత వ్యాప్తిచెంది శ్వాసకోస మండలానికి వెళ్లి అక్కడ ఊపిరితిత్తులకు సోకి ఫైబ్రోసిస్ వచ్చి ఊపిరి తీసుకోలేక మరణానికి దారితీసే టటువంటి లక్షణం ఈ వ్యాధికి వుంది.
ఈ వైరస్‍కు ధనిక పేద, అభివృద్ధి చెందిన దేశం, చెందని దేశం అన్న తేడా ఉండదు. ఎవరికి సోకినా ప్రమాదానికి గురవుతాడు. కాబట్టి వైరస్ సోకకుండా ఉండాలని ప్రపంచంలోని అన్ని దేశాలు దానిపైన దృష్టిపెట్టి లాక్‍డౌన్ విధించాయి. సామాజిక దూరం పాటిస్తూ ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండాలని. ఈ వ్యాధి సోకినటువంటి వ్యక్తి దగ్గితే వచ్చే తుంపర్లు (డ్రాఫ్‍లెట్స్) పడిన చోట మరొకరు ముట్టుకొని అవే చేతులతో కళ్లల్లో, ముక్కుల్లో, ముఖాన్ని తాకడం ద్వారా వ్యాప్తి చెందుతుంది. అందుకే శానిటైజర్, సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలని చెపుతున్నారు. ఈ వైరస్‍కు ప్రాణం లేదు. అది ప్రొటీన్ చుట్టూ ఉండే ఫ్యాట్ శానిటైజ్, సబ్బు నురగతో కరిగిపోతుంది. ప్రోటీన్‍కు ఉండే ఫ్యాట్‍కు తెగిపోయి వైరస్ నిర్వీర్యం అవుతుంది.
వీటిని నియంత్రించాలంటే లాక్‍డౌన్ వుండాలని చెప్పి ప్రపంచ దేశాలన్నీ దాదాపు లాక్‍డౌన్‍లోకి వెళ్ళాయి. బస్సులు, రైళ్లు, విమానాలు, కర్ఫ్యూ వల్ల మనిషి తిరగ కుండా చేసింది. ఎందుకంటే ఇది అంటు వ్యాధి కాబట్టి. అంటుకోకుండా ఉండడానికి ఇన్ని ప్రయత్నాలు చేశారు. ఎక్కడైతే నిర్లిప్తంగా ఉన్నారో అక్కడ ఇబ్బందిగా ఉంది. ఈ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతుంది. ఎండమిక్ అంటే ఒక ప్రాంతానికి మాత్రమే సంబంధం. కానీ కరోనా వైరస్ అనేది ప్యాండమిక్ అంటే ప్రపంచ వ్యాప్తంగా సోకుతుంది. ఎప్పుడైతే ఈ ఆలోచన వచ్చిందో భారతదేశం, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మొదటిగా లాక్‍డౌన్ ప్రకటించాం. దీని వల్ల ఆర్థిక నష్టం చాలా జరుగుతుందని తెలుసు.
ప్రభుత్వానికి వచ్చే రాబడి, పరిశ్రమలు వ్యాపారం చేసుకోలేక, రెక్కాడితే గానీ డొక్కాడని కష్ట జీవులు పనులు లేక ఇబ్బంది పడుతారని తెలిసినప్పటికి ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. బ్రతికి ఉంటే బలుసాకు తినొచ్చని అన్నారు. మొదలు మనిషి బతకాలి. కావున ఈ లాక్‍డౌన్ ప్రకటించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడి దేశవ్యాప్తంగా లాక్‍డౌన్ చేయాలని కోరడంతో రాష్ట్ర ప్రభుత్వాలన్ని ఈ లాక్‍డౌన్‍ను, ముఖ్యంగా విపత్తు చట్టం కింద పరిగణించారు. కొన్ని షరతులు, ఆంక్షలు పెట్టడం జరిగింది. ప్రాణ నష్టం జరగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా తీసుకున్న నిర్ణయాలను ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు తీసుకున్నాయి. ఆర్థికంగా కోల్కోలేని స్థితిలో ఉంది ప్రపంచ మొత్తం.
నేడు ఎదురవుతున్న ఆర్థిక సమస్యలను తట్టుకోవడం కష్టమవుతుంది. కొద్దిగా ఇబ్బంది అయినప్పటికీ ఎక్కువ వ్యాప్తి చెందకుండా, ఎక్కువ మందికి సోకకుండా కాపాడుకుందాం. లాక్‍డౌన్ ఎత్తేసినప్పటికీ కలిసిగి తిరగడం, జనసాంద్ర లేకుండా పెళ్ళిల్లు, పంక్షన్లు, పబ్లిక్ మీటింగ్‍లు జరగకుండా చూడాలి. వీటిని విస్మరిస్తే పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరుగుతుంది. 1918లో స్ఫానిష్ ఫ్లూ ఇదే విధంగా అమెరికాలో సోకింది. పడవల ద్వారా బాంబే నగరానికి వచ్చింది. 1918 ఎండాకాలంలో ఎక్కువ మంది ప్రాణ నష్టం జరగలేదని చెప్పి కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వర్షాకాలం వచ్చి మళ్లీ తిరగబడ్డది. ఆ తిరగబడ్డ సందర్భంలో దాదాపు కోటి అరవై లక్షల మంది చనిపోయారు. భారతదేశంలో అప్పుడున్న జనాభా 32 కోట్లు. దాదాపు 32 కోట్లలో కోటి 60 లక్షల మంది చనిపోయారు.
కరోనా కూడా ఇప్పడికి అయిపోయింది అనుకోవ డానికి లేదు. ఇది బాగా వ్యాప్తి చెందితే వచ్చేది వర్షాకాలం, అప్పుడు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. ఆరోగ్య సమస్యలు బాగా వస్తాయి.
ఇది న్యుమోనియా వ్యాధి. ఊపిరి తిత్తులను కట్టడి చేస్తది. వర్షాలకు కరోనా సోకితే చాలా ఇబ్బంది అవుతుది. చాలా ప్రాణ నష్టం జరుగుతది. ప్రభుత్వాలు ఆర్థికంగా ఇబ్బంది ఉండకూడదని చెప్పి కొన్ని సడలింపులు చేశారు. సడలింపు చేశారని ఎక్కడపడితే అక్కడ తిరగొద్దు. ఇది సమయం కాదు. అవసరముంటేనే బయటికి వెళ్లాలి. అవసరం లేకపోతే ఇంటినుండి బయటికే వెళ్లకూడదు. తప్పదు అన్నప్పుడే ప్రయాణం చేయాలి. వేరే జిల్లాలకు, పట్టణాలకు, బంధువుల దగ్గరికి అనవసరంగా ప్రయాణం చేయొద్దు. ఎవరికి వారు స్వీయ నియంత్రణ చేసుకోవాలి. అవసరమైతే వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా అధికారులు పని చేయాలి. మన ఇంట్లో పెద్దవాళ్లు 65 సంవత్సరాలు దాటిన వాళ్లు, షుగర్, కిడ్నీ సమస్య, బీపీ ఉన్నవాళ్లు, ఇంట్లో ఉండడమే మంచిది. చిన్న పిల్లలతో ఎక్కువ కలిసి ఉండకూడదు.
పెద్దవాళ్లకు వైరస్ సోకితే లక్షణాలను తట్టుకోలేక మరణిస్తారు. వాళ్లు బయటికి వెళ్ళకుండా చూడాలి. మన పెద్దలు చాలా అనుభవం ఉన్న వాళ్లు. వాళ్లను పోగొట్టు కోకూడదు. ఏడాదిపాటు కాపాడుకుంటే టీకా వస్తది. తరువాత నూటికి నూరుశాతం ఈ కోవిడ్ -19పై విజయం సాధిస్తం. రీసెర్చ్ చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నది.
ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు ఇలానే ఆలోచిస్తున్నాయి చాలా దేశాలు. అభివృద్ధి చెందిన అమెరికా, ఇంగ్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, స్విడ్జర్లాండ్ వంటి దేశాలు ఈ విధంగా ఆలోచిస్తున్నాయి. మనం కూడా అదే విధంగా ఆలోచిస్తున్నాము. భారతదేశంలో ఏ విధంగా నియంత్రించ గలిగింది. 130 కోట్ల జనాభా దేశంలో తక్కువ మంది చనిపోతున్నారు. తెలంగాణ గ్రామీణ ప్రాంతం ఇవాళ చాలా గొప్పగా స్పందించింది. గ్రామం లోపట ఎవరూ కలవడం లేదు. కలిసినా కూడా ఆడవాళ్లు కొంగు పెట్టుకుంటున్నరు. మగవాళ్లు ముక్కుకు కండువాలు, మాస్కులు పెట్టుకుంటున్నారు. ఒక్క కేసు కూడా లేదు. దురదృష్టవశాత్తు మధ్యలో మహారాష్ట్ర, బొంబాయి, గుజరాత్ సూరత్ నుంచి వలస బతుకుల కోసం బతకడానికి పోయినవారు తిరిగి వస్తున్నారు. వాళ్లతో కొంత ఇబ్బంది జరుగుతున్నది. మనవాళ్లను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం వాళ్లకి అన్ని చికిత్సలు అందిస్తున్నది. అలాంటి వాళ్లు వచ్చినప్పుడు 14 రోజులు క్వారంటైన్ ఇంట్లో ఎవరూ కలవకుండా పక్క రూంలో వుంచి వ్యాధి లక్షణాలు వుంటే వెంటనే హాస్పిటల్‍కు పంపాలి. దుబాయి, గల్ఫ్ దేశాలు, బొంబాయి, గుజరాత్ లాంటి రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్లను రానీయండి. మనవాళ్లు కాబట్టి రావచ్చు. కానీ వచ్చి ఒక వారం పది రోజులు ఎవర్నీ కలవకుండా ఇంట్లో దూరం ఉంటే మంచిది. ఏదైనా వ్యాధి లక్షణాలు వస్తే వెంటనే చికిత్స తీసుకుని ఒక పదిహేను ఇరవై రోజుల్లో చికిత్స అయిపోతది. తరువాత వాళ్లు కలిసి తిరగవచ్చు. కానీ దాన్ని తెల్వకుండా ఒక వంద మందికి సోకిస్తే, ఆ వందమంది వెయ్యి మందికి, వెయ్యి మంది పదివేల మందికి, పదివేల మంది లక్ష మందికి, లక్ష మంది పది లక్షల మందికి వ్యాప్తి చెందుతుంది. దయచేసి తెలంగాణ గ్రామీణ ప్రాంతం గత మూడు మాసాల్లో ఎలా గొప్పగా స్పందించారో రానున్న రోజుల్లో కూడా అదే విధంగా స్పందించాలని కోరుతున్నా. నిర్లక్ష్యంగా ఉంటే వైరస్ వ్యాప్తి చెందుతది. అరికడితే అరికట్టొచ్చు. ఇప్పటికే అరికట్టి చూపించినం. ఇది ప్రాణ నష్టం కంటే మిగతా ఎక్కువ ఇబ్బందులు పెడుతుంది. ప్రపంచ యుద్ధాలప్పుడు బాంబులు వల్ల విమానాలను కూల్చేసిండ్రు. రోడ్లు, ఢ్యాంలను ధ్వంసం చేసిండ్రు. కానీ ఈ కోవిడ్-19 వైరస్ ఇన్‍ఫాస్ట్రక్చర్ నష్టం జరగలేదు. బస్సు, విమానం, బిల్డింగ్‍లకు నష్టం జరగలేదు. కానీ అంతకంటే ఎక్కువ లాక్‍డౌన్ వల్ల విపరీతమైన ఆర్థిక నష్టం జరిగింది. ప్రాణం ముఖ్యం కాబట్టి ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలి.
సడలింపుల వల్ల విపరీతమైన కేసులు పెరుగుతున్నాయి? వలస కార్మికుల విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమిటి?
రోగి లక్షణాలు ఉంటేనే క్వారంటైన్ చేస్తారు. కాబట్టి వలస వచ్చిన అందరినీ క్వారంటైన్ చేయాల్సిన అవసరం లేదు. రాష్ట్రానికి వచ్చినవారు ఇంట్లో వుంటే సరిపోతది. ప్రభుత్వం ఏమి ఆలోచిస్తది అంటే గాంధీ హాస్పి•ల్‍లో వున్న రోగులను కూడా ఇంటికి పంపాలని ఆలోచిస్తది. అంటే రోగం వచ్చినప్పటికి కూడా ఇంట్లో ఉండు, ఊపిరితిత్తుల్లో ఇబ్బంది ఉండి, విపరీతంగా దగ్గుతో, జ్వరంతో ఉంటేనే హాస్పిటల్‍కు రండి. పాజిటివ్ ఉన్నంత మాత్రన రావాల్సిన అవసరం ఏమీ లేదని చెప్తున్నాం. దీన్ని పెద్ద సీరియస్‍గా తీసుకోవాల్సిన అవసరం లేదు. బ్రహ్మాండంగా ప్లాన్ చేసి పెట్టుకున్నాం. ముప్పైవేల మందికి ఐసీయూ బెడ్లు కూడా తయారు చేసి వుంచాం. కాబట్టి ఎటువంటి ఇబ్బందీ లేదు. అన్ని ఏర్పాట్లు చేసి వుంచాం. మనం వైరస్‍ను పరిష్కరించు కోవచ్చు.
(సచిన్, మల్లేష్ – దక్కన్ ఛానల్ ఇంటర్వ్యూ ఆధారంగా)
– కట్టా ప్రభాకర్
8106721111