వైద్య రంగంలో హైదరాబాద్‍ది విశిష్టమైన స్థానం. మలేరియాకు కారణమైన దోమను కనుక్కున్నది హైదరాబాద్‍లోనే. ఈ విషయాన్ని కనుక్కున్నందుకు రోనాల్డ్ రాస్‍కు 1902లో నోబెల్ బహుమతి దక్కింది. అట్లాగే డాక్టర్ మల్లన్న, ముత్యాల గోవిందరాజులు నాయుడు 1900 ప్రాంతం నాటికే దేశంలో పేరెన్నికగన్న వై ద్యులు. నిజామ్ రాజులను ఇన్నేండ్లు ఒకే దృక్కోణంతో చూస్తూ ‘ప్రగతిశీలురు’ వాళ్ళని దోపిడీదారులు, హిట్లర్, నాజీలతో పోల్చిండ్రు. అయితే నాణేనికి మరోవైపు ఉన్న విషయాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకుందాం. ఈ నిజామ్‍ల కారణం గానే హైదరాబాద్ ఇవ్వాళ ‘మెడికల్ టూరిజాని’కి కేంద్రంగా నిలుస్తోంది. ఉస్మానియా, నిలోఫర్, నిమ్స్, ఎం ఎన్‍జె, ఇఎన్‍టీ, సరోజిని, టీబీ హా స్పిటల్స్ హైదరాబాద్ ఘనతను ఎను కటనే చాటి చెప్పినయి. ఈ విషయా లన్నీ ఉస్మానియా మెడికల్ కాలేజిలోని ‘ఇండియన్ ఇన్సిట్యూట్ ఆఫ్ హిస్టరీ ఆఫ్ మెడిసిన్’లో ఇవ్వాళ కొలువు దీరి ఉన్నాయి.
అల్లోపతిలో ఆధునిక పద్ధతుల్లో రోగ నిర్ధారణ, చికిత్స చేసేందుకు 1845లోనే ఇక్కడ ‘హైదరాబాద్ మెడికల్ స్కూల్’ ప్రారంభమయింది. ఈ స్కూల్‍ని నాలుగో నిజామ్ నవాబ్ నాసిరుద్దౌలా ఏర్పాటు చేసిండు. ఇందులో బ్రిటన్‍లో శిక్షణ పొందిన సర్జన్లు విద్యాబోధన చేసేవారు. డాక్టర్ మెక్లీన్, ఒగిల్వీ, మీర్ అమీర్ అలీ, ముర్రే మరో ఇద్దరు అటెండర్లతో ఈ స్కూలు ప్రారంభమయింది. దీని కన్నా ముందు బొలారంలో ఒక మెడికల్ స్కూల్ ఉండింది కాని సరైన వసతులు లేక దాన్ని మూసివేశారు. ఈ దశలో నాలుగో నిజామ్ నాసిరుద్దౌలా అనారోగ్యంతో బాధపడుతూ ఆయుర్వేదం, యునానీ వైద్యం తీసుకున్నప్పటికీ ఎలాంటి స్వస్థత చేకూర లేదు. బ్రిటీష్ రెసిడెంట్ ఫ్రేజర్ సలహా మేరకు డాక్టర్ మెక్లీన్‍తో వైద్యం చేయించు కోవడానికి సిద్దపడతాడు. అయితే ఎలాంటి అల్లోపతి మందులు మింగబోనని షరతు విధిస్తాడు. పరిశీలన తర్వాత నిజామ్ డయాబిటిస్‍తో బాధపడుతున్నాడని తెలుసుకొని అందుకు డాక్టర్ మెక్లీన్ ఒప్పుకుంటాడు. షరతు ప్రకారం ఎలాంటి మందులు ఇవ్వకుండానే కచ్చితమైన డైట్‍తో నిజామ్‍కు స్వస్థత చేకూరుస్తాడు. దీంతో సంతోషించిన నాలుగో నిజామ్ నాసిరుద్దౌలా బ్రిటీష్ రెసి డెన్సీకి దగ్గరలో ‘హైదరాబాద్ మెడికల్ స్కూల్’ ప్రారంభించేందుకు అనుమతిస్తాడు. ఈ స్కూల్లో మొదట్లో ఉర్దూ మీడియంలోనే బోధన జరిగింది. ఇంగ్లీషులోని విషయాలను ఉర్దూలోకి తర్జుమా చేసేందుకు ముర్రే అనే సహాయకుడుండేవాడు. ఈ స్కూల్/కళాశాలకు తాను ప్రిన్సిపాల్‍గా వచ్చిన తర్వాత ఎడ్వర్డ్ లారీ 1885 నుంచి ఇంగ్లీషు మాధ్యమంగా బోధన ప్రారంభించిండు. శిక్షణ పొందిన వారికి ‘హకీమ్’ అనే పట్టాలను ఇచ్చేవారు.
నిజానికి అమెరికా, ఇంగ్లాండ్‍లలో మెడికల్ కాలేజీల్లో స్త్రీలకు అంత ఈజీగా ప్రవేశాలు దొరకని కాలంలోనే హైదరాబాద్‍లో మహిళలకు అవకాశం కల్పించారు. డాక్టర్ ఎడ్వర్డ్ లారీ ప్రోత్సాహం కారణంగానే 1884-85 సంవత్సరంలో హైదరాబాద్ మెడికల్ స్కూల్/కళాశాలలో ఐదు గురు మహిళలు అడ్మిషన్లు తీసుకున్నారు. ఈ ఐదుగురింట్లో ఇప్పుడు మనం చెప్పుకోబేయే ప్రపంచంలోనే మొట్ట మొదటి మహిళా అనస్థీషియాలజిస్ట్ రూపా భాయి ఫర్దూంజీ కూడా ఉన్నారు.
ఈనాటి సుల్తాన్‍బజార్‍లోని ఆసుపత్రి కేంద్రంగా ప్రారం భమైన ఈ హైదరాబాద్ మెడికల్ కళాశాలలో డాక్టర్ ఎడ్వర్డ్ లారీ నేతృత్వంలో అనేక పరిశోధనలు జరిగాయి. ఆరో నిజామ్ మహ బూబ్ అలీఖాన్‍కు వ్యక్తిగత వైద్యుడిగా కూడా పనిచేసిన లారీ బ్రిటిష్ రెసిడెన్సీ (ఇప్పటి సుల్తాన్‍బజార్ దవాఖాన) హాస్పిటల్‍లో సర్జన్‍గా పనిచేస్తూ 1885-1901 మధ్య కాలంలో కొన్ని వేల మందికి క్లోరోఫామ్ ద్వారా అనస్తీషియా ఇచ్చి నొప్పి తెలియకుండా సర్జరీలు చేసిండు. ఆనాటి ఆరో నిజామ్ మహబూబ్ అలీఖాన్‍తో గల సాన్నిహిత్యంతో ఆయన్ని ఒప్పించి 1888లో మొదటి క్లోరోఫామ్ కమీషన్‍ను 1889లో రెండో క్లోరోఫామ్ కమీషన్‍ని ఇంగ్లండ్‍కు పంపించాడు. ఈ బృందం అక్కడ మనుషులపై, జంతువులపై క్లోరోఫామ్ ద్వారా అనస్థీషియా ఇచ్చి చికిత్స చేసినారు. ఈ బృందంలో సభ్యురాలైన రూపాభాయి ఫర్దూంజీ అనే హైదరాబాద్ ఫార్సి మహిల ప్రతిభా పాఠవాల గురించి లారీ ఎంతగానో పొగిడారు. ఆమెను ప్రత్యేకంగా ఎంపిక చేసి తాను అంతకుముందు వైద్య విద్యాభ్యాసం చేసిన ఎడింబర్గ్కు పంపించాడు. వీరి పరిశోధనల్లోని విషయాలు తెలుసుకునేందుకు ప్రత్యేకంగా ఇంగ్లండ్‍కు చెందిన పత్రికల సంపాదకులు హైదరాబాద్‍కు వచ్చారంటే విషయ ప్రాధా న్యత అర్థమైతది.
నిజానికి క్లోరోఫామ్ అనస్థీషియా మొట్టమొదటి సారిగా ఎడ్వర్డ్ లారీ చదువుకున్న ఎడింబర్గ్లో సింప్సన్ అనే అతను నవంబర్ 15, 1847 నాడు వినియోగించాడు. అలాగే ఇండియాలో ఈ అ నస్థీషియాను జనవరి 12, 1848 నాడు వినియోగించారు.
రూపాభాయి ఫర్దూంజీ 1910లో ఎడింబర్గ్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ విభాగాల్లో చదువుకుంది. ఆనాడు అనస్థీషియా మీద ప్రత్యేకంగా కోర్సులు లేకపోవడంతో ఈ రంగాల్లో ఆమె విద్యా భ్యాసం చేసింది. హైదరాబాద్‍లో లారీ దగ్గర పాథాలజీలో శిక్షణ పొందింది. ఇంగ్లండ్‍కు అనిబిసెంట్‍తో కలిసి ఒకే ఓడలో ప్రయాణం చేసింది. దీంతో ఆమెతో సాన్నిహిత్యం ఏర్పడింది. అంతేగాదు అ నిబిసెంట్ ఇంగ్లండ్‍లోని మిత్రులకు ఆమెను రికమెండ్ చేస్తూ యోగ్యతాపత్రాన్ని కూడా ఇచ్చింది. ఫర్దూంజీ 1889 నుంచి 1920 ప్రాంతంలో రిటైరయ్యే వరకూ అంటే దాదాపు 30 ఏండ్లు నగరం లోని బ్రిటిష్ రెసిడెన్సీ, జనానా ఆస్పత్రుల్లో పనిచేసింది. ఆఖరికి చాదర్ఘాట్ (సుల్తాన్‍బజార్) ఆసుపత్రి సూపరింటెండెంట్‍గా రిటైరయ్యారు. నిజాం ఖాందాన్‍లో ఎంతోమందికి ఈవిడే పురుడు పోసింది. అవివాహితగా ఉన్న ఫర్దూంజీ ఒక్క హైదరాబాద్‍లోనే గాకుండా 1909లో ఇండియాకు తిరిగి వస్తూ సౌదీ అరేబియాలోని ఈడెన్ పోర్టులో దిగి బ్రిటిష్ రెసిడెంట్ కోరిక మేరకు అక్కడ కొంత కాలం వైద్య సేవలు అందించారు. అయితే రూపాభాయి జనన మరణాలు కచ్చితంగా తెలియ రావడం లేదు. ఈమె 1920 ఆ ప్రాంతంలో రిటైరయ్యారంటే బహుశా 1860 ఆ ప్రాంతంలో జన్మించి ఉండవచ్చు.
ఒక రోగికి క్లోరోఫామ్ ద్వారా అనస్థీషియా ఇచ్చిన మహిళ రూపాభాయి ఫర్దూంజీ. ఒక్క ఇండియాలోనే కాదు మొత్తం ప్రపంచం లోనే ఈమె మొట్టమొదటి మహిళ. ఈమె గురించి మెడికల్ జర్నల్స్లో అక్కడక్కడా కొంత సమాచారం లభ్యమైతుంది గానీ పూర్తి వివరాలు దొరకడం లేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇలాంటి విషయాలపై మరింత లోతుగా పరిశోధన చేయడానికి వీలు కల్పించాల్సిన అవసరముంది. చరిత్రలో మన ఘనతను చాటిన వారిని సదా యాదికుంచుకోవాలె. అందులో భాగమే ఈ స్మరణ.
– సంగిశెట్టి శ్రీనివాస్