ఇండీజెన్ ప్రాజెక్ట్…!!!
భూమి మీద అడుగిడిన తొలి మానవుడు తన ప్రారంభ దశలో ఆవాసం, ఆహారం లాంటి ప్రాథమిక అవసరాలు తీర్చుకునేందుకే ఆపసోపాలు పడ్డాడు, ఎన్నెన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు. ‘‘పడి లేచిన కెరటంలా’’ తన జీవనగమనంలో ఎదురు దెబ్బలు తిన్న ప్రతిసారి రెట్టించిన ఉత్సాహంతో తన చుట్టూ ముసురుకున్న సమస్యలను ప్రతిఘటించాడు. అంతిమంగా మనుగడ కోసం పోరాటం తప్పదన్న నిర్ణయానికొచ్చాడు. ఈ క్రమంలో తనకు సమస్యలెదురైనప్పడల్లా అలుపెరగని పోరాటంతో, తన సునిశిత మేధాశక్తితో వాటికి పరిష్కారాలు కనుగొన్నాడు. తన జీవితాన్ని సుఖమయం చేసుకున్నాడు. అయితే ‘‘వెలుగు తరువాత చీకటి దరిచేరినట్టు’’ సాఫీగా సాగి పోతున్న నావలాంటి మానవ జీవితంలోకి రోగాలు, వ్యాధుల లాంటి పెనుతుఫానులు ప్రవేశించి అల్లకల్లోలం సృష్టిం చాయి. ఇలాంటి ఊహించని పరిణామంతో ఉలిక్కిపడిన నాటి ఆదిమ మానవుడు తిరిగి ఆలోచనలో పడ్డాడు. తదనం తర కాలంలో ప్రతి వ్యాధికి తనచుట్టూ ఉన్న ప్రకృతిలోని వనరుల సహాయంతో విరు గుడు మందు కనిపెట్టాడు. ‘‘అయినా మనిషి మారలేదు, ఆతని మమత తీరలేదు’’ అన్న తెలుగు సినిమా పాటలో లాగా నాటి ఆదిమ మానవుని నుండి నేటి ఆధునిక మానవుని దాకా మానవుడిని పట్టిపీడిస్తున్న వ్యాధులకు మూలకారణం తెలుసుకొనేందుకు అవిశ్రాంతంగా పరిశోధనలు చేస్తూనే వచ్చారు. చివరకు మనిషి యొక్క ప్రవర్తనారీతుల్ని, అతని ప్రతి కదలికను నిర్దేశించే మూలకణం ‘‘జన్యువు’’ అని నిర్ధారణకొచ్చారు. ఆ జన్యుక్రమాన్ని విశ్లేషించినట్లయితే మానవుడికి సంక్రమించే రోగాల గుట్టుమట్లను ముందుగానే పసిగట్టవచ్చు అని తెలుసుకొన్నారు. తాజాగా మన భారత శాస్త్రవేత్తలు కూడా భారతీయుల యొక్క జన్యుక్రమాన్ని విశ్లేషించడానికి ‘‘ఇండీజెన్’’ పేరుతో ఒక ప్రాజెక్ట్ను చేపట్టడంతో ఈ జన్యువుల ఆమరిక వాటి, పని తీరు చర్చనీయాంశమైంది. అయితే ప్రపంచములోని విభిన్న దేశాల శాస్త్రవేత్తలందరూ కలిసి 1990లో మొదటి హ్యూమన్ జేనోమ్ ప్రాజెక్ట్ని ప్రారంభించి, 2003లో దానిని పూర్తి చేశారు.
ఇండీజెన్ ప్రాజెక్ట్ అంటే –
భారతీయుల జన్యుక్రమాన్ని విశ్లేషించేందుకు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్‍ఐఆర్), ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజి (ఐజీఐబి), హైదరాబాద్‍కు చెందిన సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీలు (సీసీఎంబీ) లు సంయుక్తంగా చేపట్టిన ప్రాజెక్ట్ను ‘‘ఇండీజెన్’’ అంటారు. దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజల జన్యుక్రమాన్ని విశ్లేషిం చేందుకు ఇండీజెన్ ప్రాజెక్ట్లో భాగంగా ‘‘సంపూర్ణ జన్యుక్రమ విశ్లేషణ’’ (whole genome sequence) పేరుతో గత ఏప్రిల్‍లో 1008 మంది నుండి (సీఎస్‍ఐఆర్) నమూనాలు సేకరించింది. ఆరు నెలలపాటు ఆ నమూ నాలపై అధ్యయనం చేసి ఇటీవలే ఫలితాలు కూడా వెల్లడించారు.
ఇండీజెన్ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశ్యం –
భారతీయుల యొక్క జన్యుక్రమాన్ని విశ్లేషించడం ద్వారా జన్యువులలో మార్పుల వల్ల మానవులకు సంక్రమించే వ్యాధుల అధ్యయన శాస్త్రాన్ని (Genetic Epidemiology) అభివృద్ధి చేయడం whole genome sequence (దీనినే ఇండీజెన్ ప్రాజెక్ట్ అంటారు) ముఖ్య ఉద్దేశ్యమని శాస్త్రవేత్తలు చెప్పారు. ప్రజల యొక్క జన్యు సమాచారాన్ని ఉపయోగించుకొని ప్రజారోగ్యానికి సంబంధించి, సాంకేతిక రంగ సహకారంతో ముందస్తు పరిష్కారాలను కనుక్కోవచ్చు. ఎంతో సంక్లిష్టమైన జన్యు నిర్మాణాన్ని (Genetic Blue Print) అనువదించి విశ్లేషించడం భారత జీవ వైద్య విజ్ఞాన శాస్త్ర రంగం (Bio medical Science) లోనే ‘‘సంపూర్ణ జన్యు క్రమ విశ్లేషణ’’ (whole genome sequence) ప్రాజెక్ట్ ఒక మైలురాయిగా నిలుస్తుందని వారు అభివర్ణించారు. ఈ నేపథ్యంలో అసలు జన్యువు జన్యువుల సముదాయం అంటే ఏమిటి, జన్యు క్రమ విశ్లేషణ అన్న విషయాలను కూడా అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది.
జీనోమ్ (జన్యుసముదాయం) అంటే –
మానవుని కణంలోపల డిఎన్‍ఏతో నిర్మితమైన తంతువులను జన్యువులు అంటారు. కొన్ని జన్యువుల యొక్క సముదాయాన్ని జీనోమ్ అందురు. మానవుని కణం యొక్క కేంద్రకంలో క్రోమోజోములు అనబడే నిర్మాణాలలో డిఎస్‍ఏ కొద్ది భాగం ద్వికుండలి ఆకారంలో చుట్టుకొని ఉంటుంది. మిగిలినది కణం యొక్క కేంద్రకం వెలుపల కణద్రవ్య పదార్థంలోని మైటోకాండ్రియాలో ఉంటుంది. దీనినే కణశక్త్యాగారం (power house of the cell)అంటారు. మానవుని డిఎన్‍ఏలో సమాచారమంతా సంకేత రూపంలో అడినైన్, గ్వానిన్, సైటోసిన్, థైమీన్ అనే నాలుగు రకాలైన నత్రజని క్షార అణువుల సమిళితమైన న్యూక్లి యోటైడ్‍లతో నిర్మితమై ఉంటుంది. డిఎన్‍ఏలో ఉన్న ఈ నాలుగు రకాలైన క్షారతంతు వులనే సాధారణంగా జన్యువులు అంటారు. ఈ నత్రజని క్షారాలు డిఎన్‍ఏలో ఏవిధంగా అమరి ఉన్నాయో అన్న దానిపై ఆధారపడి మానవశరీరంలో అమైనో ఆమ్లాలు, ప్రోటీన్ల ఉత్పత్తి తద్వారా జీవికి కావలసిన అన్ని లక్షణాలు ఆధారపడి ఉంటాయి.
జీనోమ్ సీక్వెన్సింగ్ అనగా –
డీఎన్‍ఏలో ఉన్న అడినైన్ (A), గ్వానిన్ (+) సైటోసిన్ (C), థైమిన్ (T) అనే న్యూక్లియోటైడ్‍లు స్పష్టంగా ఒక వరుస క్రమంలో అమరి ఉంటాయి. ఇవి నత్రజని క్షారాలుతో పాటు చక్కెర, ఫాస్ఫేట్ మిశ్రమాలతో గోడల్లాగా ఏర్పడి ఉంటాయి. న్యూక్లియోటైడ్‍లోని ఎడినిన్-థైమిన్‍ల రాశి (A=T), సైటోసిన్, గ్వానిన్‍ల రాశి (C=G) సమంగా ఉంటాయి. ఈ జంటలను హైడ్రోజన్ అణువు కలుపుతుంది.
ప్రతి న్యూక్లియోటైడ్‍లోనూ చెక్కెర అణువు, ఫాస్పరస్ అణువు కలిసి ఉంటాయి.ATC+ ఈ నాలుగూ వివిధ రకాల జంటలుగా రూపొందుతూ ఉంటాయి. ఇందులో ప్రతి మూడు జతలు (TRIPLETS) ఒక్కోరకమైన అమైనో ఆసిడ్లను ఉత్పత్తి చేస్తాయి. ఈ జతల అమరిక కూడా ఒక్కో జీవిలో ఒక్కోరకంగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పుకోవాలంటే మానవ శరీర నిర్మాణం కేవలం ఈ నాలుగు అక్షరాలపైనే ఆధారపడి ఉంటుంది. జన్యువులపై ఈ నాలుగు పదార్ధాల అమరికను తెలిపే దానిని జన్యు లిపి అంటారు. దానినే జన్యు సంకేతం (Genetic Code) అని కూడా అంటారు. సరిగ్గా ఇక్కడే జీన్ సీక్వెన్సింగ్ (జన్యువుల క్రమ అమరిక) ప్రారంభమవుతుంది.
జీన్ స్వీక్వెన్సింగ్‍లో భాగంగా వివిధ రకాల వ్యక్తుల జన్యు నమూనాలు సేకరించి వారి యొక్క జన్యుసంకేతాలను శాస్త్రవేత్తలు కూలంకుషంగా అధ్యయనంచేస్తారు. వారి జన్యు లిపి యొక్క అమరిక క్రమాన్ని తెలుసుకొంటారు. ఒకవేళ ఆయా వ్యక్తుల్లో ఆశించిన లక్షణాన్ని అభివృద్ధి చేయడానికి లేదా తొలగించడానికి జెనెటిక్ కోడ్ లో (ATCGల అమరిక) మార్పులు చేయడం లేదా పూర్తిగా తొలగించడం కూడా చేస్తారు. దీనినే జీన్ స్వీక్వెన్సింగ్ (జన్యువుల క్రమ అమరిక) అందురు. భిన్న జాతుల, మతాల, కులాల సమాహారమైన భారతదేశంలోని వివిధ రకాల వ్యక్తుల నుండి సీఎస్‍ఐఆర్ శాస్త్రవేత్తలు జన్యు నమూనాలు సేకరించి వారి యొక్క జెనెటిక్ కోడ్‍ను సమగ్రంగా అధ్యయనం చేసి. ఇటీవలే ఫలితాలు కూడా ప్రకటించారు.
జీనోమ్ స్వీక్వెన్సింగ్ ఆవశ్యకత –
మారుతున్న కాలాని కనుగుణంగా మానవాళికి సంక్రమించే వ్యాధులు కూడా తమ స్వరూప స్వభావాలు మార్చుకుంటున్నాయి. మందులకు లొంగని, అంతు చిక్కని మొండి వ్యాధులు తరు చుగా నేటి తరానికి సంక్ర మిస్తూ… వారి ఒళ్ళు గుల్ల చేస్తున్న నేపథ్యంలో పాశ్చాత్య దేశాలు జీన్ సీక్వెన్సింగ్ ద్వారా ఆ దేశాల పౌరుల యొక్క జన్యువుల పటాలు (జీన్ మ్యాపింగ్) తయారు చేయడంలో ముందంజలో ఉన్నాయి. కాబట్టి మనదేశం కూడా భారతీయుల యొక్క జీన్ స్వీక్వెన్సింగ్ పూర్తి చేసి ఆ సమాచారాన్నిభద్రపరచుకోవాల్సిన అవసరం ఉంది. తద్వారా మొండి వ్యాధులకు ఔషధాలను కూడా తయారు చేయవచ్చు. లేదా వాటిని ముందుగా నిరోధించవచ్చు. నేర నిర్ధారణ చేయడానికి డీఎన్‍ఏ షింగర్ ప్రింటింగ్, ఫోరెన్సిక్ సైన్స్లోనూ జీన్ సీక్వెన్సింగ్ డేటా ఉపయోగపడుతుంది. మనుషులే కాకుండా పంటలకు వచ్చే తెగుళ్ళ కారణమైన బ్యాక్టీరియా, వైరస్‍ల యొక్క జీన్ సీక్వెన్సింగ్‍ను పూర్తి చేసినట్లయితే, ఆయా సూక్ష్మ జీవుల యొక్క జన్యువులలో తగు మార్పులు చేసి పంట నష్టం యొక్క తీవ్రతను తగ్గించవచ్చు. ఈ విధంగా అనేక రంగాలలో జీన్ సీక్వెన్సింగ్ యొక్క అవశ్యకత ఉంది.
అనువర్తనాలు –
జీన్ స్వీక్వెన్సింగ్ వల్ల విభిన్న రంగాలలో బహుళ ప్రయోజనాలు ఒనగూరే అవకాశం ఉంది.
వ్యవసాయరంగం – జీనోమ్ స్వీక్వెన్సింగ్ వల్ల వ్యవసాయ రంగంలో ఎన్నో ఉపయోగాలున్నాయి. పంటల నాశించి, విపరీత నష్టం కల్గించే వివిధ చీడ పీడలను కలిగించే సూక్ష్మ జీవుల యొక్క జన్యు క్రమాన్ని ఆవిష్కరించినట్లయితే వాటి ద్వారా కలిగే తెగుళ్ళను పూర్తిగా నిరోధించి పంట నష్టాలను గణనీయంగా తగ్గించవచ్చు. పంటలకు మేలు కల్గించే సూక్ష్మ జీవులను గుర్తించి వాటి ద్వారా పంట దిగుబడులను కూడా పెంచవచ్చు.
వైద్య రంగం – జీనోమ్ స్వీక్వెన్సింగ్ ద్వారా వంశపారంపర్యంగా మానవాళికి సంక్రమించే విభిన్న రోగ కారక జన్యువులను గుర్తిచి వాటిని తొలగించడం ద్వారా, ఆ స్థానంలో ఆరోగ్య కారక జన్యువులను ప్రవేశపెట్టవచ్చు. ప్రమాదకర, దీర్ఘ కాలిక వ్యాధులను కల్గించే రోగకారక జన్యువులను కూడా గుర్తించి, జీన్ థెరపీ ద్వారా ఆయా జన్యువులను తొలగించి వ్యాధుల సంక్రమణాన్ని విజయవంతంగా నిరోధించవచ్చు.
ఫోరెన్సిక్ రంగం – నేరం జరిగిన ప్రదేశంలో లభించే వేలిముద్రలు, వెంట్రుకలు, గోర్లు, చర్మము, రక్తపు చుక్కల వంటి ఆధారాలను ఫోరెన్సిక్ ల్యాబ్‍లో నేరస్తుల యొక్క డీఎన్‍ఏతో సరిపోల్చడం ద్వారా సులువుగా నేరస్తులను గుర్తించవచ్చు.
చివరిగా – భూమిపై జీవన పోరాటాన్ని ప్రారంభించిన మానవుడు తనకు ఎక్కడో సుదూరాన ఉన్న అంతరిక్షానికైతే నిచ్చెన వేయగలిగాడు కానీ, ఏదో ఒక రోజు మానవుడి అంతానికి కారణమౌతున్న ‘‘మరణాన్ని’’ మాత్రం జయించలేకపోయాడు. నేటికీ ప్రపంచంలోని అనేక దేశాలు మానవుడి మరణానికి కారణభూత మౌతున్న విభిన్న అంశాలపై విభిన్న కోణాల్లో పరిశోధనలు జరిపేందుకు లక్షల డాలర్లను తృణ ప్రాయంగా ఖర్చుచేస్తున్నాయి. హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్, ఇండీజెన్ ప్రాజెక్ట్లు ఈ కోవలోనివేనని చెప్పవచ్చు. ఇండీజెన్ ప్రాజెక్ట్ ద్వారా భారతీయుల జన్యువులను విశ్లేషించి అందులోని సమాచారాన్ని వెలికితీయడం వరకూ బాగానే ఉంటుంది. కానీ దేశంలోని విభిన్న వ్యక్తులకు సంబంధించిన జన్యు సమాచారం దుర్వినియోగం కాకుండా, దానిని సురక్షితంగా భద్రపరచగలిగితే ఇండీజెన్ ప్రాజెక్ట్ మన దేశ ప్రగతికి ఇరుసుగా మారుతుందనడంలో ఎలాంటి సందేహంలేదు. పాలక పక్షాలు ఆదిశగా ఎలాంటి విధానాలు రూపకల్పన చేస్తాయి, అవి ఎంత మేరకు సఫలీకృత మౌతాయన్నది వేచి చూడాలి.
-పుట్టా పెద్ద ఓబులేసు,
ఎ : 9550290047