ప్రకృతే నియంత్రిస్తుంది! ప్రకృతే శాసిస్తుంది!! -5

ప్రకృతి సూత్రాలలో 18వది – అనగా జీవశాస్త్రపరంగా నాల్గోది : చివరిది
జీవులన్నీటి మధ్యన ఒకదానితో ఒకటి పాదార్థిక బంధాన్ని కల్గివున్నాయి.
(All Life Forms are connected to each other) మనిషిది వానర వారసత్వమంటే నమ్మనివారు, నమ్మేవారు ప్రపంచవ్యాపితంగా వున్నారు. ఇందులో చదువుకున్నవారే అధికులు కావడం గమనార్హం! వీరెవ్వరికి చార్లెస్‍ డార్విన్‍ ప్రతిపాదించిన ప్రకృతివరణ సిద్ధాంతం (Natural Selection) చెవికెక్కదు. పైగా విద్యాధికులు కొందరు పనిగట్టుగొని ఈ సిద్ధాంతాలకు, సైన్సుకు వ్యతిరేకంగా పనిచేయడం తెలిసిందే!


మరి ఈ జీవుల మధ్యన వుండే బంధం, సంబందం ఏమిటి?
ముందే ప్రస్తావించినట్లుగా, జీవం పుట్టుకకు నిర్జీవ పదార్థాలకు ఉన్న సంబంధం చూసాం. ఈ నిర్జీవ పదార్థాలే ఓ నిర్దేశిత వాతావరణ పరిస్థితుల్లో జీవంగా రూపాంతరం చెందిందని చూసాం. దీనికి యూరే-మిల్లర్‍ ప్రయోగాల రుజువుల్ని కూడా పరిశీలించాం. ఇలా అమినో ఆమ్లాలు నూక్లిక్‍ ఆమ్లాలుగా, కణమనే నిర్ధిష్ట ప్రమాణంగా రూపుదిద్దుకోవడం, ఇవి విభజన జరిగి కొత్తవిగా, బహుకణ జీవులుగా తర్వాతి కాలంలో వృక్షజాలాలుగా, జంతు జాలాలుగా అభివృద్ధి చెందాయనేది జీవపరిణామ శాస్త్రజ్ఞులు అనేక రుజువులతో చూపడం తెలిసిందే! ముందు ఫ్రెంచ్‍ ప్రకృతి శాస్త్రజ్ఞుడు జీన్‍ బాప్టిస్‍ లామార్క్ (1809), అవసరాలకు అనుగుణంగా జీవుల్లో మార్పు జరిగిందని, అవి వారసత్వంగా తమ సంతానానికి అందించాయని Inheritance of aquired characteristics to their off springs) సిద్ధాంతీకరించాడు. దీనికి ఆయన జిరాఫీ మెడపొడవును ఉదహరించాడు. కాని, 1859లో ఆంగ్ల ప్రకృతి, జీవశాస్త్ర శాస్త్రజ్ఞుడు చార్లెస్‍ డార్విన్‍, లామార్క్ సిద్ధాంతానికి మరో ప్రత్యామ్నాయ సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చాడు. ఈ సిద్ధాంత ప్రకారం జీవుల్లోని వ్యత్యాసం (Variation), వారసత్వం (Inheritance), ఎంపిక (Selection), కాలానుగుణంగా జీవించడం (Time & Adoption) అనే విధానాలపై జీవుల మనుగడ ఆధారపడి వుంటుంది. దీన్ని ఆంగ్లంలో క్లుప్తంగా VISTA అని సంబోధిస్తారు.


ఈ డార్విన్‍ సిద్ధాంతాన్ని విడమరిచి చూద్దాం!
1) ఏ జీవులు కూడా ఒకే విధంగా పోలిక కలిగి వుండవని Individuals of a species are not identical), అనగా కవలలు కూడా వైరుధ్యాల్ని (శారీరకంగా / గుణాలపరంగా) కలిగి వుంటారని. అలాగే, ఒకే చెట్టుపైగల ఆకులు ఏ ఒక్కటి కూడా మరో ఆకుతో ఫొటో కాఫీలా వుండదని. ఈవిధంగా ఒకే చెట్టుపైగల ఆకుల్లోని ఈ వ్యత్యాసం ప్రకృతి పరంగా జరిగిందని, అందుకే ప్రపంచంలోని వేపచెట్లపై వుండే ఆకులు (బిలియన్‍ కోట్లు) ఏ ఒక్కటి మరో దానితో అచ్చుగుద్దినట్లు వుండలేవు.
2) వారసత్వ లక్షణాలు ఒకతరం నుంచి మరోతరానికి అందించ బడతాయి (Traits are passed from one generation to next)
3) బతికి బట్టగట్టే జీవులకన్నా వాటి పుట్టక అధికం. అంటే పుట్టేవి అధికం. బతికేవి తక్కువ. (More offsprings are born than can survive) ప్రస్తుతం మనుషుల విషయంగా ఇది జరగడం లేదు.
4) బతికి, తట్టుకునే జీవులు మాత్రమే తమ సంతానాన్ని ఉత్పత్తి చేస్తాయి. (Only the survivors of the competition for resource will reproduce)


డార్విన్‍ సిద్దాంత అవగాహనతో ఈ కింది నిరూపణలకు రాగలుగుతాం.
1.పరిణామము (మార్పు) అనివార్యం (evolution as such)
2.తరతరానికి గుణాలు బదలాయించబడడం (Common descent)
3.క్రమానుగుణత (Gradualism)
4.జనాభ అభివృద్ధి (Population specification / multiplication of species)
5.ప్రకృతి ఎంపిక (Natural selection).


డార్విన్‍ సిద్ధాంతం (Darwinism)
వీటన్నింటిని కలబోసి, జీవరాసులన్నీ సుదీర్ఘకాలంలో ఒకే జీవి నుంచి ఉద్భవించి మార్పు చెందాయనేది సత్యమని, ఇదే జీవ పరిణామానికి ఆధారమైనదని, నేటికిదే ప్రపంచ వ్యాపితంగా నమ్మబడుతున్నదని, డార్విన్‍ సిద్దాంతంగా చెప్పడం జరుగుతుంది.
తర్వాత మూడు దశాబ్దాలకు (1890) డచ్‍ వృక్షశాస్త్రజ్ఞుడు, మొదటి తరం జన్యుశాస్త్రవేత్త హ్యూగో డివ్రీస్‍ జీవికి, జీవికి మార్పు (Mutation) వుంటుందనే సిద్ధాంతాన్ని ప్రవేశపెడుతూ, ప్రయోగ పూర్వకంగా జీవుల్లో జరిగిన శారీక మార్పుల్ని (organic evolution) చూపడం జరిగింది. దీంతో డార్విన్‍ సిద్దాంతమే సరియైనదని, లామార్క్ సిద్దాంతం తప్పు అని తేలిపోయింది.


వీటన్నింటిని క్రోడీకరించినప్పుడు, అమీబా నుంచి ఆదిమానవుడి దాకా, పాదార్థిక సంబంధం వుందని తేలిపోయింది. అనగా, అభివృద్ధి చెందిన మానవుడికి చింపాంజి, ఒరాంగ్‍టాన్‍, కోతులు పూర్వీకులైతే, వీటికి మరో జంతు వర్గం చుట్టరికం అన్నమాట. ఇలా లెక్కించుకుంటూపోతే మొదటి పూర్వీకులు ఏక కణజీవులైన అమీబా, యగ్లీనాలుగా తేలుతుంది. మరి ఇవన్నీ జంతువర్గం కదా అనే ప్రశ్న రావచ్చు! మొట్ట మొదటి జీవకణం, స్వయం పోషితం కాబట్టి, విధిగా ఆహారాన్ని స్వయంగా తయారు చేసుకునే గుణాన్ని కల్గివుండాలి. అలాగే చుట్టూ గల నిర్జీవ పదార్థాలైన నీరు, గాలి, వేడిని గ్రమించేవిగా వుండివుండాలి. ఈ రెండు లక్షణాలు వృక్ష జాలాలుగా, జంతు జాలాలుగా మార్పు చెంది వుండాలి. అందుకే ఈ రెండింటికి మధ్యన క్లామిడోమోనాస్‍ (chlamydomonas) అనే ఆల్గెకు చెందిన ఏకకణ జీవిని ప్రస్తావిస్తారు. ఇందులో క్లోరోప్లాస్ట్ అనే పత్రహరిత పదార్థం వుంటుంది. కాబట్టి స్వయంగా ఆహారాన్ని తయారు చేసుకుంటుంది. అలాగే కన్ను (eye spot) అనే భాగముంటుంది. దీంతో వెలుతురును గ్రహించి దూరంగా పోవడానికి ఫ్లాజెల్లాల (చలనాంగాలు) సహాయమున కదులుతుంది. ఒకే జీవి, అటు మొక్కలా స్వయం పోషకంగా, ఇటు జంతువులా కదలడంతో జీవ పరిణామంలో దీన్ని మధ్యస్థంగా భావించి, జంతు శాస్త్రజ్ఞులు దీన్ని జంతువు విభాగంలో, వృక్షశాస్త్రజ్ఞులు వృక్ష విభాగంలో చేర్చడం జరిగింది. వాస్తవంగా చెప్పాలంటే, అటు వృక్ష జాలాలకు, ఇటు జంతు జాలాలకు ఆదిమ చుట్టుమన్నమాట!


ఇలా వృక్షాలుగా, జంతువులగా, తిరిగి వర్గాలుగా (phyla), కుటుంబాలుగా (family), ప్రజాతులుగా (genus), జాతులుగా (species) వర్గీకరించబడిన వృక్ష, జంతు జాలంలోని కణపదార్థాలు దాదాపు ఒకటే! అంటే మన మానవ భాషలో రక్త సంబంధమన్నమాట. కప్ప గుండెకు, జీర్ణ, నాడీ రక్తప్రసరణ వ్యవస్థలకు మానవుడి వ్యవస్థలకు అవినాభావ సంబంధం వున్నట్లు మనం చూసిందే! అందుకే, పంది గుండెను మనిషికి అమర్చవచ్చు అని పరిశోధనలు తేల్చాయి. నైతికంగా బాగుండదని నిలిపివేసారు.
మరింత సులభతరంగా చెప్పాలంటే మానవుడి ఆహారం వృక్ష, జంతు సంబంధమైనదే! ఈ హార పదార్థాల (C-H) పాదార్థిక బంధం మనిషిలో కూడా వుండడంతోనే మనం వాటిని తినగలుగుతున్నాం. జీర్ణించుకో గలుగుతున్నాం. ఈ ఆహారమంతా తిరిగి నిరీంద్రియ (inorganic)) పదార్థాల నుంచే తయారు కావడం గమనార్హం! జీవం పుట్టక కూడా ఇదే! అందుకే మనకు ఏదైనా అనారోగ్యం సంభవిస్తే మందులుగా గోళీలను వాడుతాం. ఇవన్నీ కూడా ఖనిజాలకు (minerals) సంబంధించనవే! ఎముకల బలహీనతకు కాల్షియం (Ca), రక్తహీనతకు ఇనుము (Fe) లోపమని, వీటిని మందుల రూపంలో తీసుకుంటాం. అంటే, మన పుట్టుకకు నిరీంద్రియ పదార్థాల సంబంధం ఎలా ముడిపడి వుందో తెలుస్తున్నది. అలాగే విటమిన్లు కూడా. ఇవి వేటిల్లో లభిస్తాయో మనం ప్రాథమిక, సెండరీ పాఠశాలలో ‘ఆహారం’ అనే పాఠంలో చూసిందే!


అయినా మన పాఠ్యాంశాలు మొత్తంగా శాస్త్రీయంగా వున్నాయా అనేది ఓ ప్రశ్న! లేవనేదే సమాధానం అయినా, సామాన్యశాస్త్రంలో భౌతిక, వృక్ష, జంతు, సూక్ష్మజీవశాస్త్రాల పరిచయం చేయడం జరుగుతున్నది. పైన ప్రస్తావించిన అంశాలన్నీ మూడో తరగతి నుంచి పదో తరగతి దాకా పొందుపర్చబడ్డాయి. పోతే, గతంలో ఉపాధ్యాయులెంత సంప్రదాయవాదులైనా, సైన్సు బోధనను శాస్త్రీయంగా, కొంత ప్రయోగపూర్వకంగా వృత్తి ధర్మంతో బోధన చేసి విద్యార్థులకు చైతన్యాన్ని కల్గించేవారు. కాని తర్వాత వచ్చిన ఉపాధ్యాయులు, ఉన్నత విద్యను పొందినా, భౌతిక, రసాయన, జీవశాస్త్ర పట్టభద్రులైనా, భావవాదులగా అవతారమెత్తడంతో సామాన్యశాస్త్ర బోధనను సంప్రదాయాలతో ముడిపెట్టి, తూతూ మంత్రంగా బోధిస్తూ, పిల్లల మెదళ్ళలో మతాన్ని చొప్పిస్తున్నారు. ఇది భారత దేశంతోపాటు చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్న పెద్ద రుగ్మత. దీనికి వ్యతిరేకంగా పోరాడకున్నా, మార్చాల్సిన ఆవశ్యకతను గుర్తిస్తే, రేపటి తరం ఆరోగ్యకరమైన వ్యవస్థలో బతుకుతుంది.


నోటు : ఉపాధ్యాయులకు విధిగా, ప్రజాస్వామిక, లౌకిక, శాస్త్రీయ, మానవీయ కోణాలు వుండాల్సిందే! అప్పుడే ప్రకృతి పరంగా, పర్యావరణ పరంగా హేతుబద్దంగా బోధించగలుగుతారు. రేపటి తరాన్ని ఇదే దృక్పథంతో ఎదిరించగలగుతారు.


(నరావతారం – నండూరి రామ్మోహన్‍ పుస్తకం చదవండి)
(వచ్చే సంచికలో శాస్త్రీయ దృక్పథం, పద్దతుల గూర్చి చూద్దాం)

డా।। లచ్చయ్య గాండ్ల
ఎ : 9440116162

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *