రెసిడెన్షియల్ స్కూళ్లపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ
తెలంగాణ రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రక్షాళన చేసి బలోపేతం చేశామని మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. గురుకుల పాఠశాలలపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. రెసిడెన్షియల్ స్కూళ్లల్లో మంచి ఫలితాలు వస్తున్నాయి అని మంత్రి తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 603 కొత్త గురుకుల పాఠశాలలు ప్రారంభించాం. ఈ పాఠశాలల కోసం అద్దెకు తీసుకున్న భవనాల కోసం రూ. 174 కోట్ల 25 లక్షలు ఖర్చు చేయడం జరుగుతుందన్నారు. ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్స్ 104, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ 53, మైనార్టీ వెల్ఫేర్ స్కూల్స్ 204, బీసీ వెల్ఫేర్ స్కూల్స్ 242 ప్రారంభించామన్నారు. ఈ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు వార్షికంగా ఒక్కో విద్యార్థిపై రూ. 57,282 ఖర్చు చేస్తున్నామని తెలిపారు.
ఉమ్మడి జిల్లానే ప్రామాణికంగా తీసుకుని రెసిడెన్షియల్ స్కూళ్లల్లో ప్రవేశాలను కల్పిస్తున్నామని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 970 రెసిడెన్షియల్స్ స్కూల్స్ ఉన్నాయి. ఈ పాఠశాలల్లో మొత్తం 4 లక్షలకు పైగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. 71 మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లను ఇంటర్ కాలేజీలుగా అప్‍గ్రేడ్ చేస్తున్నామని తెలిపారు. సమైక్య రాష్ట్రంలో ఒకే ఒక్క సైనిక్ స్కూలు ఉండే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎస్సీ, ఎస్టీల కోసం మూడు సైనిక్ స్కూళ్లను ఏర్పాటు చేశామన్నారు. కంప్యూటర్ సైన్స్, రోబోటిక్ ల్యాబ్స్ను గురుకుల పాఠశాలల్లో నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. నాసా, అంతరిక్ష ప్రయోగాల్లో గురుకుల విద్యార్థులు పాల్గొంటున్నారు. మెడికల్ సీట్లను అత్యధిక స్థాయిలో సాధిస్తున్నారు. అసాధారణమైన ప్రతిభ కనబరుస్తున్నారు అని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు.
సమాజం ఎంతగా అభివృద్ధి చెందుతున్నా ఎస్సీలు మాత్రం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారు. తరాలు మారుతున్నా వీరి తలరాతలు మారడంలేదు. గత 20 ఏళ్లుగా షెడ్యూల్డ్ కాస్ట్ సబ్ ప్లాన్ వంటివి అమలులో ఉన్నప్పటికీ వీరు ఆశించిన స్థాయిలో అభివృద్ధికి నోచుకోవడం లేదు.
అనేక విషయాలను పరిశీలించిన తర్వాత… ఈ ప్రణాళికలు సరిగ్గా అమలుకాలేదన్న విషయం స్పష్టమవుతుంది. అందుకే దేశం అభివృద్ధిపథం వైపు దూసుకెళుతున్నప్పటికీ… దళితులు అలాగే ఉండిపోయారు. వీరిలో అక్షరాస్యతా శాతం కూడా చాలా తక్కువ. షెడ్యూల్డ్ కాస్ట్ సబ్ ప్లాన్ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయిస్తున్న నిధులపై సరైన పర్యవేక్షణ లేకపోవడం కూడా… ప్రణాళికల వల్ల ప్రయోజ నాలు చేకూరకపోవడానికి కారణాలుగా చెప్పవచ్చు. ఎస్సీ అభివృద్ధి, సామాజిక న్యాయం జరగాలన్న లక్ష్యంతో షెడ్యూల్డ్ కాస్ట్ సబ్ ప్లాన్‍ను ఏర్పాటు చేశారు. దేశంలోని షెడ్యూల్డ్ కులాల ఆర్థికాభివృద్ధి, సామాజిక అభివృద్ధి జరగాలన్న ఉద్దేశంతో ఆరవ పంచవర్ష ప్రణాళికలో స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ ఏర్పాటు చేశారు. దళితులను వృద్ధిలోకి తీసుకునిరావాలన్న లక్ష్యంతో… 1980 వరకు జరిగిన ఉద్యమాల ఫలితంగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. దీని ప్రకారం, కేంద్ర, రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాలు.. ఎస్సీల అభివృద్ధి కోసం వారి జనాభా ప్రాతిపదికన తమ బడ్జెట్‍లలో ప్రత్యేక నిధులు కేటాయించారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం దళితుల అభివృద్ధి, సంక్షేమం కోసం విశేష కృషి చేస్తుంది. ఒకవైపు వారి ప్రాథమిక అవసరాలైన విద్యా రంగంలో అనేక విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తూనే మరోవైపు వారి అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా కార్యక్రమాలు చేపడుతుంది.
స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ చరిత్ర :
సాధారణ బడ్టెట్‍లో కేటాయింపులవల్ల ఎస్సీలకు తగినరీతిలో న్యాయం జరగడంలేదని 1970లోనే ప్రభుత్వం గుర్తించింది. వారి అభివృద్ధి కోసం జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయిస్తేనే వారి అభివృద్ధి సాధ్యమని అనుకున్నారు. అప్పుడు మాత్రమే భారత్‍లోని ఇతర సామాజిక వర్గాలతో సమానంగా వారిని కూడా అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లవచ్చని నాటి ప్రభుత్వం భావించింది. అయితే ఆరవ పంచవర్ష ప్రణాళికకు ముందు.. వారి కోసం ప్రత్యేక కేటాయింపులతో ప్రత్యేకంగా నిధులు ఏర్పాటు చేయలేదు. కానీ జానాభా ప్రాతిపదికన నిధుల కేటాయింపులపై నిర్ణయాలు మాత్రం తీసుకున్నారు. 1979లో సామాజిక ఆర్థిక, విద్యా అభివృద్థితోపాటు పని పరిస్థితులు, జీవన ప్రమాణాలు పెంచాలన్న లక్ష్యంతో షెడ్యూల్డ్ కాస్ట్ సబ్ ప్లాన్‍కు అంకురార్పణ జరిగింది. అప్పటి వరకు ఉన్న షెడ్యూల్డ్ కాస్ట్ ప్లాన్ పేరును ట్రైబల్ సబ్ ప్లాన్ మాదిరిగా షెడ్యూల్డ్ కాస్ట్ సబ్ ప్లాన్‍గా మార్చారు. దీంతో.. ఎస్సీల సామాజిక, విద్యాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, వారి పని పరిస్థితులు మెరుగుపరిచేందుకు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలన్నది లక్ష్యం.
జనాభా ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని ప్రణాళికా సంఘం సూచించింది. ప్రత్యేక బడ్జెట్‍కు అధికారులు, వారికి అనుబంధంగా ఇతర సిబ్బందిని కేటాయించడం, ఆ నిధులను ఇతర పనులకు కేటాయించకుండా చేయడం… షెడ్యూల్డ్ సబ్ ప్లాన్ పనులు స్పష్టంగా జరిగేలా.. కేంద్ర మంత్రులు, వివిధ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు తమ బాధ్యతలు నిర్వర్తించేలా నిబంధనలు రూపొందించారు.
ఎస్సీల కోసం సబ్ ప్లాన్ చట్టం :
ఎస్సీల సబ్ ప్లాన్ కోసం కేటాయిస్తున్న నిధుల వినియోగం సరిగ్గా లేనందున సబ్ ప్లాన్ చట్టం చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. సబ్ ప్లాన్ నిధుల కేటాయింపు, ఖర్చు చేయడంపై ప్రణాళికా సంఘం సూచనలను పక్కనపెట్టి గత ప్రభుత్వాలు వారి ఇష్టానుసారంగా వ్యవహరించాయి. ఎస్టీలకు కేటాయించిన నిధులను వేరే వాటికి మళ్లించడం జరుగుతుండేవి. దీంతో నియమనిబంధనల సాధనలో ప్రత్యేకచట్టం ఉంటేనే లక్ష్యం నెరవేరుతుందని నాటి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. జానాభా ప్రాతిపదికన.. 16.23 శాతం నిధులు ఎస్సీల కోసం బడ్జెట్‍లో కేటాయించారు. ఈ నిధుల కేటాంపు కేవలం పేపర్లపై మాత్రమే కనిపించేవి. వాటిని ఇతర కార్యక్రమాల నిర్వహణ కోసం ప్రభుత్వాలు ఖర్చు చేశాయి. అయితే సబ్ ప్లాన్ నిధులను ఇతర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల కోసం వాడకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక బిల్లును రూపొందించింది. దీని ప్రకారం బడ్జెట్‍లో సబ్ ప్లాన్ కోసం నిధులు కేటాయించారు. వారికి కేటాయించిన నిధులు పూర్తిగా వినియోగం అయ్యేలా చూడాల్సిన బాధ్యత సబ్‍ప్లాన్ చట్టంపై ఉంది. ముఖ్యమంత్రి సారధ్యం వహించే రాష్ట్ర సంఘం నిధులను కేటాయిస్తుంది. రాష్ట్ర సంఘం ఏడాదిలో రెండు సార్లు సమావేశం కావాలి. రాష్ట్ర స్థాయితోపాటు జిల్లా స్థాయి ఎస్సీ సబ్ ప్లాన్‍లను ఏర్పాటు చేశారు. సమాజంలోని ఇతర వర్గాల అభివృద్ధితో సమానంగా… ఎస్సీల అభివృద్ధి జరగాలన్న లక్ష్యంతో చట్టాన్ని రూపొందించారు.
మనదేశంలోని దళితులపై సుదీర్ఘ కాలంగా… ఆర్థిక దోపిడీలు, సామాజిక అణచివేత జరుగుతున్నాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడుస్తున్నప్పటికీ… ప్రభుత్వాలు అనేక పథకాలు, కార్యక్రమాలు, చర్యలు చేపడుతున్నప్పటికీ… ఎస్సీలను అభివృద్ధిలోకి తీసుకునిరావడంలో విఫలమయ్యాయి. వారిపై జరుగుతున్న వివక్షను ఆపలేకపోయాయి. దీంతో ఎస్సీ సబ్ ప్లాన్ రూపకల్పన జరిగింది. దళితుల అభివృద్ధి కోసం… ప్రత్యేకంగా రూపొందించిన బడ్జెటే ఎస్సీ సబ్ ప్లాన్. సాధారణ బడ్జెట్ ద్వారా వారి అభివృద్ధి సాధ్యంకానపుడే… ఎస్సీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేశారు.
సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ :
సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్‍ను సీనియర్ దళిత జర్నలిస్టు అయిన మల్లేపల్లి లక్ష్మయ్య 1999లో ఏర్పాటు చేశారు. స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ ఫర్ ఎస్సీ అంశంపై.. మార్చి 29, 2001న వార్త దినపత్రికలో మల్లేపల్లి లక్ష్మయ్య తన తొలి వ్యాసాన్ని రాశారు. దీనికి అప్పటి వార్త ఎడిటర్ కె.రామచంద్రమూర్తి సహాయం అందించారు. దివంగత ఐఏఎస్ అధికారి ఎస్.ఆర్.శంకరన్ అధ్యక్షతన.. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‍లపై 2001లో సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్( సీడీఎస్) అనేక చర్చలను నిర్వహించింది. 2002-03 సంవత్సరాల్లో సీడీఎస్, మానవ హక్కుల సంస్థ సాక్షి సంయుక్తంగా… క్షేత్రస్థాయిలో దళిత సంఘాలకు శిక్షణా కార్యక్రమాలతోపాటు… 2005లో ఎస్సీ, ఎస్టీ శాసనసభ సభ్యులతో అనేక చర్చలను నిర్వహించాయి.
2002లో సెంటర్ ఫర్ రూరల్ స్టడీస్ అండ్ డెవలప్‍మెంట్, దళిత్ డెస్క్ ఆఫ్ సెంటర్ ఫర్ వరల్డ్ సొలిడారిటీ, దళిత్ బహుజన్ ఫ్రంట్, నేషనల్ దళిత్ ఫోరం, ఆర్.పి.ఐ. వంటి సంస్థలతోపాటు ఇతర సామాజికవేత్తలంతా కలిసి.. ఎస్సీల అభివృద్ధికై ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులు జరగాలని సీడీఎస్ ఆధ్వర్యంలో తమ గళాన్ని వినిపించాయి. సీడీఎస్‍తోపాటు ఇతర సంఘాలు చేసిన కృషి ఫలితంగా 2007లో సీపీఐ-ఎం మద్దతిస్తున్న కుల వ్యతిరేక పోరాట సంఘం ముందుకొచ్చి వారి ప్రయత్నాలకు అండగా నిలిచింది. దళితుల జీవితాలు బాగుచేయాలన్న లక్ష్యంతో అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ… నాటి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బి. రాఘవులు.. నిరాహార దీక్ష చేపట్టారు. ఆ ప్రయత్నం విజయవంతమై నాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్… అక్టోబర్ 2007లో.. ఎస్సీల కోసం ప్రత్యేక కేటాయింపులు చేస్తామని అసెంబ్లీలో ప్రకటన చేశారు.
2011లో రిటైర్డ్ ఐఏఎస్ కాకి మాధవరావు చైర్మన్‍గా :
సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి కె.రామస్వామి అడ్వైజర్‍గా… 100 మంది ప్రముఖులు, పలు ఎన్జీవోలు ఒకే వేదికపై చేరి.. ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల సాధనా ఐక్య కార్యాచరణ కమిటీగా ఏర్పడ్డాయి. షెడ్యూల్డ్ కాస్ట్ సబ్ ప్లాన్‍కు చట్టబద్ధత కల్పించాలని, కమిటీలోని పలువురు కలిసి ఒక డ్రాఫ్ట్ రూపొందించారు. డ్రాఫ్టింగ్ కమిటీ రూపొందించిన డ్రాఫ్ట్ బిల్లును భారత ప్రణాళికా సంఘానికి సమర్పించారు. దీని ప్రకారం… రాష్ట్రంలో ఎస్సీలకు సమానంగా బడ్జెట్ కేటాయింపులు జరగాలి. సాధారణ బడ్జెట్‍తోపాటు గానే దీన్ని కూడా ప్రవేశపెట్టాలి. ఎస్సీల కోసం ఏర్పాటు చేసిన బడ్జెట్‍ను విడిగానే ఉంచాలి. సబ్ ప్లాన్ నిధులను ఖర్చు చేయడం కోసం.. ప్రత్యేక కార్యక్రమాలకు పర్యవేక్షణ సంస్థ (అథారిటీ) ఉండాలి. అభివృద్ధి కార్యక్రమాల కోసం నిధుల వినియోగంపై పర్యవేక్షణ అధికారాన్ని అథారిటీకి ఇవ్వాలి. సబ్ ప్లాన్ నిధులు ఒక ఆర్థిక సంవత్సరంలో మిగిలి పోయినప్పటికీ.. వాటిని ఆ తర్వాత ఆర్థిక సంవత్సరంలో కొత్త కేటాయింపులకు కలపాలి. ముఖ్యంగా ఆ నిధులను ఏ ఇతర పథకాలకు, కార్యక్రమాలకు కేటాయించరాదు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల సాధనా ఐక్య కార్యాచరణ కోర్ కమిటీ ప్రతినిధులు… రాష్ట్రంలోని అన్ని పార్టీల ప్రజా ప్రతినిధులను కలిసి… ఉద్యమానికి మద్దతును కోరాయి.
సబ్ ప్లాన్ నిధుల సాధనా ఐక్య కార్యాచరణ కమిటీ.. హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద మార్చి 23, 2012 నుంచి 72 గంటల నిరాహారదీక్షకు పిలుపునిచ్చింది. వివిధ సంఘాలతో పాటు 72 మంది దళిత, ఆదివాసీ, బహుజన నేతలు రోజుకు కొందరు చొప్పున రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ప్రజా సంఘాలతోపాటు పలు పౌరహక్కుల సంఘాలు కూడా… ధర్నా చౌక్‍కు వచ్చి… దీక్షకు మద్దతిచ్చాయి. ఉద్యమంలా సాగిన ఈ ప్రయత్నంలో.. సెంటర్ ఫర్ దళిత స్టడీస్ అన్ని పార్టీల నేతలను కలిసి మద్దతు కూడగట్టడంలో కీలక పాత్ర పోషించారు.
మార్చి 26, 2012న సబ్ ప్లాన్ నిధుల సాధనా ఐక్యకార్యా చరణ కమిటీ.. ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించింది. అన్ని ముఖ్య పార్టీల నేతలతో పాటు… పలు ప్రజా సంఘాలు అంతా కలిసి సుమారు 30 వేల మంది తరలివచ్చారు. ఛలో అసెంబ్లీ కార్యక్రమంలో భాగంగా… నిరసనకారులంతా అసెంబ్లీ వైపు కదులుతుండగా.. పోలీసులు అడ్డుకున్నారు. కమిటీ చైర్మన్, ఇతర కోర్ కమిటీ సభ్యులను సీడీఎస్ వ్యవస్థాకులను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత సీఎం, డిప్యూటీ సీఎం తరపున ప్రతినిధులు వచ్చి కమిటీ సభ్యులతో భేటీ అయి… ఛలో అసెంబ్లీని విరమించు కోవాలని కోరారు. తమ డిమాండ్లపై అసెంబ్లీలో సీఎం ప్రకటన చేసేవరకు వెనక్కి తగ్గేది లేదని… కోర్ కమిటీ సభ్యులు తేల్చి చెప్పారు.
మార్చి 26, 2012న నాటి దళిత డిప్యూటీ సీఎం, డిప్యూటీ స్పీకర్, ఇతర ఎస్సీ, ఎస్టీ రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ ముఖ్యమంత్రిని కలిసి… సబ్‍ప్లాన్‍కు చట్టబద్థత కల్పిస్తూ ప్రకటన ఇవ్వాల్సిందిగా కోరారు. దీంతో షెడ్యూల్డ్ క్యాస్ట్ ప్లాన్, షెడ్యూల్ట్ ట్రైబల్ ప్లాన్‍కు చట్టబద్ధత కల్పించడానికి కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని… దీనిపై రెండు రోజులపాటు అసెంబ్లీ సెషన్ కూడా నిర్వహిస్తామని సీఎం హామీ ఇచ్చారు. అలా.. నవంబర్ 30 నుంచి రెండు రోజులపాటు ప్రత్యేక అసెంబ్లీ సమావేశపరచి… ఏకగ్రీవంగా బిల్లును పాస్ చేసి చట్టం చేయడం జరిగింది. షెడ్యూల్డ్ ప్లాన్‍కు చట్టబద్ధత కల్పించడాన్ని… దళితుల సంఘాలు స్వాగతించాయి.
ఉమ్మడి రాష్ట్రం ఎస్సీ సబ్ ప్లాన్ చట్టం :
ఆంధప్రదేశ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ సబ్ ప్లాన్ చట్టం… జనవరి 24, 2013 నుంచి అమలు చేయబడింది. వచ్చే పదేళ్లలో ఎస్సీలను ఆర్థికంగా, సామాజికంగా, విద్యపరంగా అభివృద్ధి దిశలో నడిపించడం.. వారికి సామాజిక గౌరవాన్ని పెంపొందించాలన్న లక్ష్యంతో.. చట్టం రూపొందించారు. దీంతో వారి జనాభా ప్రాతిపదికన వారికి బడ్జెట్ కేటాయింపులు సాధ్యమయ్యాయి. ఈ చట్టంతో… సమాజంలో వారి హక్కులను పరిరక్షించడంతోపాటు… వారు సమగ్రమైన అభివృద్ధిలోకి రావడానికి అవకాశం కల్పించినట్టయింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఎస్సీ సబ్ ప్లాన్ :
జూన్ 2, 2014న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక… తెలంగాణలో 15.44 శాతం ఉన్న షెడ్యూల్డ్ కులాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చింది. సాంఘిక సంక్షేమ శాఖను.. ఎస్సీ డెవలంప్‍మెంట్ శాఖగా మార్చింది. వారి అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పకనే చెప్పింది. షెడ్యూల్ కులాల కుటుంబాల కోసం భూమి కొనుగోలు, కళ్యాణ లక్ష్మి, అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి వంటి ప్రత్యేక పథకాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
తెలంగాణలో ఎస్సీల కోసం ప్రవేశపెట్టిన పథకాలు :
- దళితులకు భూ పంపిణీ
- ఎస్సీ వధువులకు కళ్యాణ లక్ష్మి పథకం అమలు
- విదేశాల్లో ఉన్నతవిద్య చదువుకోవాలనుకునే విద్యార్థులకు రూ. 20 లక్షల వరకు ఆర్థిక సాయం అందించే అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి
- నెలకు 50 యూనిట్లకంటే తక్కువ వాడే వారికి ఉచిత విద్యుత్
- సాంఘిక సంక్షేమ, రెసిడెన్షియల్ హాస్టళ్ల కోసం ఉచితంగా సన్నబియ్యం పంపిణీ
- సాంఘిక సంక్షేమ, రెసిడెన్షియల్ స్కూళ్ల హాస్టల్ భవనాల మరమ్మత్తులకు పెద్ద ఎత్తున నిధుల కేటాయింపు
- కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం
- నిరుపేద ఎస్సీలకు డబుల్ బెడ్‍రూం ఇళ్ల నిర్మాణం
- ఎస్సీ కాలనీల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు నిధుల పెంపు
- ఎస్సీ విద్యార్థులకిచ్చే మెస్ చార్జీల పెంపు
2014-15 ఆర్థిక సంవత్స రంలో… షెడ్యూల్డ్ కాస్ట్ సబ్ ప్లాన్ కోసం రూ. 7579 కోట్లు కేటాయించారు. ఉమ్మడి ఆంధప్రదేశ్‍లో కేటాయిం పులకంటే… ఇది చాలా అధికమనే చెప్పాలి. వారికి కేటాయించిన నిధులు పూర్తిగా వినియోగం అయ్యేలా చర్యలు తీసుకున్నారు.
సోషల్, రెసిడెన్షియల్ స్కూళ్ల భవనాల మరమ్మత్తులు, కొత్త నిర్మాణాల కోసం… సబ్ ప్లాన్‍లో అధిక మొత్తంలో కేటాయింపులు చేశారు. ఎస్సీ వధువుల కోసం కళ్యాణ లక్ష్మీ పథకాన్ని ప్రవేశపెట్టారు. వివాహ ఖర్చుల కోసం రూ. 51,000 లను ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం అందిస్తున్నారు. అక్టోబర్ 2014 నుంచి ఈ పథకం నేటికీ అమల్లో ఉంది. ఆ తర్వాతి కాలంలో ఆ మొత్తాన్ని రూ. 1,16,000 లకు పెంచారు. ఇలాంటి పథకాలను ఎస్సీలు తమ హక్కుగా భావించి ఉపయోగించు కునేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఎస్సీ సబ్ ప్లాన్ చట్టం వల్ల… తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‍స్టిట్యూషన్స్ సొసైటీలపై అద్భుత ప్రభావం పడింది. షెడ్యూల్ కులాలతో పాటు బలహీనవర్గాల విద్యాభివృద్ధి కోసం వీటిని నెలకొల్పారు. సోసైటీ కింద రాష్ట్రంలో 238 స్కూళ్లు, 30 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. తెలంగాణ ఏర్పాటుకు ముందు… 134 రెసిడె న్షియల్ స్కూళ్లు ఉండగా… ప్రస్తుతం ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే… 238 స్కూళ్లు 2017 నుంచి పని చేస్తున్నాయి.
పేద విద్యార్థుల కోసం గతంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు ఉండేవి కావు. దీంతో ప్రయివేటు కాలేజీల్లో ఖర్చును భరించలేని వారు… తమ పిల్లలను బలవంతంగా మధ్యలోనే చదువు మాన్పించే వారు. ప్రత్యేకంగా ఆడపిల్లల విషయంలో… మైనర్ వివాహాలు ఎక్కువగా జరిగే ప్రమాదం ఉండేది. ఇలాంటి పరిస్థితుల్లో… తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీలు వారి బాధ్యతలు తీసుకుని ఇంటర్ వరకు చదివిస్తున్నాయి. అట్టడుగు వర్గాల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు సొసైటీ చేస్తున్న కృషిని తెలంగాణ ప్రభుత్వం గుర్తించి ప్రోత్సహిస్తోంది. డాక్టర్. బాబా సాహెబ్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా… రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్… 103 కొత్త రెసిడెన్షియల్ స్కూళ్లను… ప్రత్యేకంగా ఆడపిల్లల కోసం 30 రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేశారు. ఇవన్నీ 2016-17 విద్యా సంవత్సరం నుంచి నడుస్తున్నాయి…
ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి ఏర్పాటులో సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ పాత్ర :
ఎస్సీ సబ్ ప్లాన్‍పై చర్చించేందుకు… రాష్ట్రంలోని అన్ని పార్టీల ఎస్సీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లతో జనవరి 27, 2017న ప్రగతి భవన్‍లో సీఎం కేసీఆర్ ప్రత్యేక సమా వేశం ఏర్పాటు చేశారు. ఆ సమయం లోనే… బడ్జెట్ ప్రణాళికపై… సీడీఎస్ కొన్ని మార్గదర్శకాలను రూపొందిం చింది. పాత ఎస్సీ సబ్ ప్లాన్‍కు మార్పులు అనివార్య మయ్యాయి. దీనికోసం వివరణాత్మకంగా చర్చ జరపాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఎస్సీ ప్రతినిధుల చేసిన సూచన లన్నింటీని పరిగణలోకి తీసుకుంటామని.. సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఇందు కోసం ఎన్నికైన ప్రజాప్రతి నిధులతో… ఎస్సీ కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వచ్చే బడ్జెట్ సెషన్‍లో.. సబ్ ప్లాన్ నిధుల కేటాయిం పులు ఎలా ఉండాలనేదానిపై ఎస్సీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అధ్యక్షతన ఎస్సీ కమిటీలు ఏర్పాటు అయ్యాయి. ఆ తర్వాత… ప్రభుత్వం 4 సమావేశాలు ఏర్పాటు చేసి… అందరి ఆమోదంతో.. ప్రత్యేక అభివృద్ధి నిధి చట్టాన్ని రూపొందించింది.
చట్టం రూపొందడానికి ముందు :
కొత్తగా తెచ్చే చట్టం… ఎస్సీల సంక్షేమానికి పెద్దపీట వేసి, నీతి ఆయోగ్ చెప్పినట్టుగా బడ్జెట్ తీరుతెన్నులు వంటివి ఉండాలని సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి తగిన సూచనలు చేసింది. ఆ మొత్తం పక్రియలో సీడీఎస్ ప్రముఖ పాత్ర పోషించింది. మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, దళిత మేథావులు, ఇతర సామాజికవేత్తలతో.. సీడీఎస్ వ్యవస్థాపకులు మల్లేపల్లి లక్ష్మయ్య పలు దఫాల చర్చలు నిర్వహించారు. సీడీఎస్ వ్యక్తపరచిన దాదాపు అన్ని సూచనలను చట్టం రూపొందించే క్రమంలో ప్రభుత్వం స్వీకరించింది.
చట్టంలోని ప్రధానాంశాలు :
- పాత చట్టంలో ఉన్న పదేళ్ల కాలపరిమితిని తొలగించారు.
- ఎస్సీల ప్రత్యేక అభివృద్ధి నిధి పూర్తిగా 100 శాతం వారి ప్రయోజనాలకే వినియోగిస్తారు.
- ఏదైనా సంవత్సరంలో బడ్జెట్‍లో నిధులు వినియోగం కాకుండా మిగిలిపోతే… మళ్లీ వచ్చే ఏడాది పద్దుకు ఆ మొత్తాన్ని కలుపుతారు. ఇది ప్రగతి పద్దులో కేటాయింపులకు అదనం.
- నిధుల అమలు, కేటాయింపుల బాధ్యత ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి నిర్వహిస్తారు..
- ప్రభుత్వ పథకాలు రూపొందించడం… ప్రోత్సాహకాలు ఇవ్వడంతో పాటు… చట్టం అమలులో నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు కూడా ఉంటాయి.
సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ ప్రయత్నం :
దళిత వర్గం ప్రయోజనాలు పొందే ఉద్దేశంతో.. దళిత ఉద్యమానికి పరిశోధనా సహాయంతోపాటు.. మేథో పరమైన మద్దతు ఇచ్చే లక్ష్యంతో… సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ (సీడీఎస్) ఏర్పాటు అయింది. కాలం గడిచే కొద్దీ సీడీఎస్ చేపట్టిన అనేక పరిశోధనలు న్యాయ పోరాటాలకు ఉపయోగపడ్డాయి. ఆ విధంగా సీడీఎస్ యాక్టివిస్ట్ ఆర్గనైజేషన్ గానూ మారింది. అయితే అది అనుకోకుండా జరిగిన పరిణామం. పేరుకు తగ్గట్టుగా పరిశోధనా, న్యాయపరమైన పోరాటం మాత్రమే ప్రాథమికంగా సంస్థ ఉద్దేశం. షెడ్యూల్డ్ క్యాస్ట్ ప్లాన్ ప్రాముఖ్యతను తెలుసు కోవడానికి బడ్జెట్ విశ్లేషణ, నోడల్ ఏజెన్సీ ఏర్పాటుతోపాటు ప్లాన్ రక్షణకు ఒక చట్టం ఆవశ్యకతను సీడీఎస్ గుర్తించింది. ఎస్సీ, ఎస్టీల కోసం 1992 నుంచి 2009 మద్య కేటాయింపుల్లో 20 వేల కోట్ల రూపాయలు దారిమళ్లాయి. బడ్జెట్ కేటాయింపుల చిక్కుల్ని అర్థం చేసుకోవడానికే రెండేళ్ల సమయం పట్టింది. ఇది ప్రజల్లోకి వెళ్లగానే పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్త మయ్యాయి. అణగారిన వర్గాలకు జరిగిన అన్యాయంపై రాజకీయ పార్టీలు విమర్శలు సంధించాయి. నిధుల మళ్లింపు జరగకపోయి ఉంటే.. అణగారిన వర్గాల అభివృద్ధి కొంతైనా జరిగి ఉండేదని భావిం చాయి. ఎస్సీ సబ్ ప్లాన్‍కు చట్టబద్ధత ఉంటే బాగుంటుందని 2011లో డిమాండ్ తెరపైకి వచ్చింది. అయితే సాధారణ ఎన్జీవో వంటి సంస్థలు రాజకీయ నాయకులను ఎదుర్కొనే పరిస్థితి ఉండదు. అందుకనే ఎన్నికైన ప్రజాప్రతినిధులతోనే సీడీఎస్ చర్చా కార్యమ్రాలు చేపట్టింది. అలా… ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి చట్టం-2017 రూపకల్పనలో సీడీఎస్ తనవంతు పాత్ర పోషించి ప్రత్యేకతను చాటుకుంది.
–కట్టా ప్రభాకర్, 8106721111