పవనశక్తిని వాడుదాం-పర్యావరణాన్ని పరిరక్షిద్దాం

ప్రపంచ పవన శక్తి సంస్థ ఆధ్వర్యంలో పిల్లలు, యువత మరియు పెద్దలకు పర్యావరణ హితమైన పవన శక్తి ఉత్పత్తి మరియు వినియోగ ఆవశ్యకతను వివరించే ప్రయత్నాలు చేస్తున్నది. సాంప్రదాయేతర తరగని పునరుత్పత్తి చేయగల శక్తి వనరులలో ముఖ్యమైనదిగా పవన శక్తిని భవిష్యత్‍ శక్తి వనరుగా భావించి వినియోగించుకోవలసిన మార్గాలను అన్వేషించాల్సిన సమయం ఆసన్నమైంది. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని ఆన్‍షోర్‍ మరియు ఆఫ్‍షోర్‍ పవన శక్తి ఉత్పత్తి కేంద్రాలు, పవనశక్తి ఉపయోగాలు, ఉత్పత్తి సవాళ్ళు మరియు సదుపాయాలు, సెమినార్‍లు, విద్యాలయాలలో అవగాహనలు, పవన శక్తి ప్రదర్శనలు, పవన టర్బైన్‍ల వినియోగం, పవన శక్తి అదనపు ఆకర్షణలు లాంటి పలు అంశాలలో సంపూర్ణ అవగాహనలు కల్పిస్తారు. సాంప్రదాయ శిలాజ తరిగే ఇంధనాల వినియోగంలో దాగి ఉన్న పర్యావరణ సమస్యలకు సరైన సమాధానంగా సాంప్రదాయేతర పవన, అలల, సౌర శక్తులను ఆచరణలోకి తీసుకురావలసి ఉంది. పవన శక్తిని భవిష్తత్‍ అవసరాలకు వాడుకోవాలనే సదుద్దేశంతో 2015లో ప్రపంచవ్యాప్తంగా 100 బిలియన్‍ డాలర్లు ఖర్చు చేయడం జరిగింది. పవన శక్తి ఉత్పత్తిని ప్రోత్సాహించేలా ప్రభుత్వ, స్వచ్ఛంధ మరియు పౌర సమాజానికి పలు సౌకర్యాలను కల్పిస్తూ, రాయితీలను ప్రకటించడం కూడా జరుగుతోంది.


వీచే గాలిలో శక్తి దాగి ఉంటుంది. ఎక్కువ వాతావరణ పీడనం ఉన్న ప్రదేశం నుండి తక్కువ పీడనం గల ప్రదేశానికి గాలి వేగంగా వ్యాపిస్తుంది. ఈ రెండు ప్రదేశాల వాతావరణ పీడనాల వ్యత్యాసాలు పెరిగితే గాలి వేగంగా ప్రయాణిస్తూ శక్తి వనరుగా పని మారుతుంది. భూమిపై వివిధ ప్రదేశాలలో సూర్యరశ్మి తేడాలతో ఉష్ణోగ్రతలు వేరు వేరుగా ఉండటంతో వాతావరణ పీడనాలలో వ్యత్యాసాలు జనిస్తాయి. దీని ఫలితంగా గాలి వీస్తూ, పవన శక్తికి ఉత్పత్తికి దారిని సుగమం చేస్తాయి. సాధారణ పవనాలతో పాటు తుఫానులు, సునామీలు, హరికేన్‍లు, టార్నిడోల సందర్భాలలో గంటకు వందల కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ప్ర కృ తి ప్రళయాలు జరిగినపుడు పవన శక్తిని తట్టుకోలేక ఇండ్లు, చెట్లు, విద్యుత్తు లైన్‍లు కూలిపోవడం కూడా జరుగుతుంది.వేగంగా విస్తరిస్తున్న పవన శక్తి వినియోగంతో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉత్పత్తి కేంద్రాలు నెలకొల్పే చర్యలకు అన్ని దేశాలు ప్రాధాన్యతలను ఇస్తున్నాయి. కర్బన ఉద్గార ఇంధన వినియోగాన్ని తగ్గించుటలో పవన శక్తి మనకు మంచి ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నది. విశ్వవ్యాప్తంగా 651 జిడబ్ల్యు (గీగాబైట్‍) యూనిట్ల పవన శక్తి ఉత్పత్తి అవుతోంది. ఇందులో 2019లోనే ప్రపంచ వ్యాప్తంగా 60 జిడబ్ల్యు యూనిట్ల పవన శక్తి ఉత్పత్తి కేంద్రాలు నెలకొల్పడం జరిగింది. ప్రపంచ దేశాలలో చైనా, అమెరికా, జర్మనీ, ఇండియా, స్పేయిన్‍, బ్రజిల్‍, ఫ్రాన్స్ మరియు కెనడాలు పవన శక్తి ఉత్పత్తి జాబితాలో ముందున్నాయి. ప్రపంచంలోనే ‘‘కంట్రీ ఆఫ్‍ విండ్స్’’గా డెన్మార్క్ పిలువబడుతోంది.


గత 25 సంవత్సరాలుగా పవన శక్తి ఉత్పత్తికి భారత్‍ చేస్తున్న  కృ షిలో భాగంగా ప్రపంచ జాబితాలో నాలుగవ స్థానాన్ని ఆక్రమించి దూసుకుపోతోంది.  2020 గణాంకాల ప్రకారం భారత దేశంలో 37.7 జిడబ్ల్యు యూనిట్ల పవనశక్తి ఉత్పత్తి జరుగుతోంది. దక్షిణ, పశ్చిమ మరియు ఉత్తర భారతదేశ ప్రాంతాలలో పవన శక్తి ఉత్పత్తి అధికంగా జరుగుతోంది. దినదినం పవన శక్తి ఉత్పత్తి పెట్టుబడి ఖర్చు తగ్గుట వలన చవకగా వినియోగదారులకు అందుబాటులోకి వస్తోంది. మన దేశంలో అన్ని శక్తి ఉత్పత్తిలో 10 శాతం పవన శక్తి అందుబాటులోకి రావాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పవన శక్తిలో 70 శాతం మే – సెప్టెంబర్‍ మాసాలలో ఉత్పత్తి చేయుటకు వాతావరణం అనుకూలిస్తున్నది. భారత దేశంలో తమిళనాడు రాష్ట్రం 9232 మెగావాట్ల పవన శక్తి ఉత్పత్తితో ముందంజలో ఉంది. గుజరాత్‍ (7204 మెగావాట్‍), మహారాష్ట్రా (4794 మెగావాట్‍), కర్నాటక (4753 మెగావాట్‍), రాజస్థాన్‍ (4300 మెగావాట్‍), ఆంధప్రదేశ్‍ (4077 మెగావాట్‍), మధ్యప్రదేశ్‍ (2520 మెగావాట్‍) మరియు తెలంగాణ (128 మెగావాట్‍) ఉత్పత్తుల జాబితాలో ముందున్నాయి. దేశంలోనే అత్యధిక సౌర విద్యుత్తు ఉత్పత్తి చేసే రాష్ట్రంగా ఆంధప్రదేశ్‍ అగ్రస్థానంలో ఉండటం హర్షదాయకం. పెనుగొండ, నల్లకొండ ప్రాంతాలలో పవన శక్తి మిల్లుల ద్వారా ఉత్పత్తి అధికంగా జరుగుతోంది. తెలంగాణలో పవన మరియు సౌరశక్తులను ఉత్పత్తి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు.

పవన శక్తి ఉపయోగాలు అమూల్యమైనవి. పునరుత్పాదక శక్తిగా పవన శక్తి ఎన్నటికీ తరగని ప్రత్యామ్నాయ శక్తి వనరుగా భవిష్యత్తులో ఎల్లవేళల అందుబాటులో ఉండే వనరుగా గుర్తించబడింది. పర్యావరణానికి ఎలాంటి చేటు చేయని పవనశక్తి కాలుష్యాన్ని కలిగించదు. పర్యావరణానికి హాని చేసే శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించుటలో పవనశక్తి సహకరిస్తుంది. అందరికి పవనశక్తి ఉచితంగా అందుబాటులో ఉంటుంది. పవన టర్బైన్‍లు తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తాయి. గుట్టలు, కొండలు, పర్వతాలు, సముద్రాలలో కూడా పవనశక్తిని ఉత్పత్తి చేయవచ్చు. పరిశ్రమల మరియు గృహ వినియోగానికి పవన శక్తిని వాడవచ్చు. దేశ మారుమూల ప్రాంతాలకు పవనశక్తిని అందుబాటులోకి తీసుకురావచ్చు. పవన శక్తి సాంకేతిక పరికరాలు చవకగా అందుబాటులో ఉన్నాయి. పవన టర్బైన్‍ల మెంటెనెన్స్ ఖర్చు చాలా తక్కువ. పవన శక్తి ఉత్పత్తి సులభం కాబట్టి చవకగా లభిస్తుంది. భవిష్యత్తులో ఉత్తమ శక్తి వనరుగా వాడే అవకాశం ఎక్కువ. భవిష్యత్తులో శక్తి భద్రతలో పవన శక్తి పాత్ర విశిష్టమైంది. పవనశక్తి రంగంలో లక్షల సంఖ్యతో ఉద్యోగాలు లభిస్తాయి.


పవన శక్తి ఉత్పత్తి మరియు వినియోగంలో కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. పవన శక్తి గాలి వ్యాప్తి మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి నిరంతరం స్థిరంగా అందుబాటులో ఉండక హెచ్చు తగ్గులు ఉంటాయి. పవన టర్బైన్‍ల స్థాపనలో ఆర్థిక భారం ఎక్కువ. పవన టర్బైన్‍లు ఎక్కువ వేడిని మరియు శబ్దాన్ని చేయటంతో వన్యప్రాణులకు హాని కలుగవచ్చు. శబ్దకాలుష్యానికి కారణమైన పవన టర్బైన్‍లతో చూపరులకు దృశ్యకాలుష్యం కూడా జరుగవచ్చు. భూతాపానికి కారణమైన హరిత గృహ ప్రభావానికి దూరంగా, సులభంగా ఉత్పత్తి మరియు వినియోగించుకోగల పవన శక్తి ద్వారా పర్యావరణ పరిరక్షణ జరుగుతోంది. పునరుత్పత్తి చేయగల ప్రకృతి పవనం మనందరి జీవన ప్రమాణాలను పెంచుటలో దోహద పడుతుందని అశిద్దాం. భవిష్యత్తు ప్రత్యామ్నాయ తరగని శక్తి వనరుగా పవన శక్తిని ప్రోత్సహిద్దాం.


-డా।। బుర్ర మధుసూదన్‍ రెడ్డి,
99497 00037

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *