సైన్స్ – మానవత

ఈ భూగోళం మీద జీవం ఆవిర్భవించి దాదాపు రెండు కోట్ల సంవత్సరాలు అవుతోంది. ఈ సుదీర్ఘ కాలంలో ప్రాణికోటి నిదానంగా, నిలకడగా ఎన్నో పరిణామ దశలు దాటుకుంటూ వచ్చింది. ఈ పరిణామ క్రమంలో అత్యల్ప సూక్ష్మజీవులు మొదలుకొని భూచరాలైన చతుష్పాద జంతువులు, రెండుకాళ్ళ మనిషి దశవరకు మార్పు చెందడం అనేది ఒక వినూత్న శకాన్ని ఆవిష్కరించింది. దీనితో బాటు మానవుల భావ ప్రకటనకు అనువుగా భాష కూడా రూపొందడం మరో అద్భుత పరిణామం. ఇది మరెన్నో పరిణామాలకు నాంది పలికింది.


అనాది మానవునికి ప్రకృతి గురించి తెలిసింది అతి స్వల్పం. అతని మెదడు సరిగా వికసించకపోవడమే దానికి కారణం. అయితే, నిత్య జీవితంలో అతనికి ఎదురయ్యే ఎన్నో సంఘటనలు అర్థంకాని ప్రశ్నలుగా నిలిచాయి. కారు మబ్బు పట్టినపుడు వినపడే ఉరుములూ, కనపడే మెరుపులూ అతణ్ణి ఆశ్చర్యచకితుణ్ణి చేయడమే గాక అతనిలో భయభ్రాంతులు కలిగించాయి. మిట్టమధ్యాహ్నపు సూర్యకాంతిని చీకటిమయం చేసే సూర్యగ్రహణమూ, వెన్నెల వెలుగులో మసక చీకట్లను చిమ్మే చందగ్రహణమూ అతనికి అయోమయంగా తోచాయి. అటువంటి భౌతిక సంఘటనలకు అతీత శక్తులే కారణమని అతను భావించాడు. అట్లాగే మనిషి పుట్టుకా, మరణమూ అతనికి అసలు అర్థం కాక ఎంతో గందరగోళాన్ని సృష్టించాయి. కాలగమనంలో క్రమేణా వీటి గురించి అతనికి ఉత్సుకత మొదలైంది. అతనికి అర్థం కాని వాటిని అతను పరిశీలించడం ప్రారంభించాడు. అటువంటి పరిశీలనతో మరిన్ని ప్రశ్నలు అతనికి ఎదురయ్యాయి. దానితో అతని ఆలోచనా వికసించింది. ఇటువంటి విశేషాలు అతనికి కొంచెం కొంచెం అవగతమవుతూ వచ్చాయి. ఆ విధంగా కాలక్రమేణా మనిషి తన కెదురయ్యే ప్రతి చిన్న విషయాన్ని ప్రశ్నిస్తూ తరచూ పరిశీలించడం అలవాటు చేసుకున్నాడు. ఇట్లాంటి ఆలోచనా రీతే విజ్ఞాన శాస్త్రానికీ, శాస్త్రీయ  దృక్పథానికీ బాట వేసింది.


అయితే ‘’సైన్స్’’ అనే పదాన్ని చాల కొద్దిమంది మాత్రమే సరైన రీతిలో అర్థం చేసుకుంటున్నారు. సైన్స్ను, టెక్నాలజీతో ముడివేసి రెండూ ఒకటేనని భావించకూడదు. ఉదాహరణకు విమానం తీసుకుందాం. అది కేవలం శాస్త్రం ఆధారంగా నిర్మించిన ఒక యంత్రం మాత్రమే! అట్లాగే ఇంజనీరు వేసిన ప్లానూ, దాని ఆధారంగా కట్టిన భవనమూ ఒకటి కావు. అదీ సైన్స్కీ, టెక్నాలజీకి వున్న తేడా!
టి.ఎ. థాంసన్‍ ‘ఇంట్రడక్షన్‍ టు సైన్స్’ అనే పుస్తకంలో సైన్స్ ఉద్దేశాన్ని ఇట్లా వివరిస్తారు. వీలైనంత ఖచ్చితంగా, సులువుగా, సంపూర్తిగా, మరలా మరలా పరీక్షించేందుకు వీలుగా వ్యక్తిగతం కానటువంటి విషయాలను వివరించడమే సైన్స్ ఉద్దేశం. ఒక భౌతిక సంఘటనను పరశీలించిన శాస్త్రవేత్త దానిలోని సారూప్యతనూ, నిర్ధిష్టతనూ గమనించి కొన్ని సర్వసాధారణ నియమాలను పేర్కొంటాడు. వాటి నుంచి ఫలితాలను రాబట్టి సూత్రీకరిస్తాడు. అంటే భౌతిక సంఘటనను గమనించి, హేతుబద్ధంగా సత్యాన్ని నిర్ధారించ డంలో శాస్త్రం రూపుదిద్దుకొంటుంది. ప్రయోగానికీ, పరీక్షకూ నిలబడే గుణం అనేవి సైన్స్ని సంపూర్తి చేస్తాయి. సైన్స్ దేన్నయినా అంగీక రించేముందు దాన్ని శల్యపరీక్ష చేస్తుంది. ఆధారం, కారణం లేకుండా సైన్స్ దేన్నీ ఒప్పుకోదు. అత్యంత పురాతన పుస్తకంలోని మాట అని గానీ, ఒక గొప్ప వ్యక్తి అభిప్రాయ మని గానీ శాస్త్రం అంగీకరించదు. ప్రతిదాన్నీ ప్రశ్నిస్తుంది, పరిశోధి స్తుంది. ఆ రకంగా సైన్స్ అభివృద్ధి చెందుతుంది. పరిశోధించే వ్యక్తి రాగద్వేషాల మీద సైన్స్ ఎంతమాత్రమూ ఆధారపడదు. అంటే సైన్స్ వ్యక్తిగతం కాదు. అది సార్వత్రికమైంది. అయితే సైన్స్లో అన్ని నిర్ధారణలూ సర్వకాలికమైనవి కావు. మరింత విషయ పరిజ్ఞానంతో, కొంగ్రొత్త ప్రాయోగిక అనుభవంలో సైన్స్ ఎప్పటికైనా మారవచ్చు. అభివృద్ధి చెందవచ్చు. ఈ పరిణామ పద్ధతినే శాస్త్రీయంగా సత్యశోధన జరపడం (శాస్త్రీయ దృక్పథం లేదా సైంటిఫిక్‍ టెంపర్మెంట్‍) అని అనవచ్చు. ఈ శాస్త్రీయ  దృక్పథం పూర్తిగా సార్వత్రికమైంది.


అడుగడుగునా మత మౌఢ్యంతోనూ, పిడివాదంతోనూ పోరాడి, పోరాడి సైన్స్ ప్రస్తుత స్థానాన్ని అధిష్టించింది. దాని ప్రగతికీ, ప్రాచుర్యానికీ అడ్డుపడుతున్న ప్రతిదానితోనూ సమరం సాగిస్తోంది. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మనం గణనీయ ప్రగతిని సాధించినా, దానికి తగ్గ శాస్త్రీయ దృక్పథాన్నీ, స్పూర్తినీ పెంపొందించ లేకపోయాం. మనిషి చంద్రుని మీదకు వెళ్ళి దిగ్విజయంగా తిరిగి వచ్చినా మన ఆలోచనాస్థాయీ, దృక్పథమూ ఇంకా అధ్వాన్నస్థితిలోనే వున్నాయి. ఉదాహరణకు సూర్యగ్రహణానికి రెండు సిద్ధాంతాలు వున్నాయి. ఒకటి టీచర్‍ క్లాస్‍రూంలో బోధించడానికీ, మరొకటి తను ఇంట్లో పాటించడానికి. ఇంట్లో పాటించే విషయంలో అతని దృష్టిలో సూర్యచంద్రులు ఇంకా రాహు కేతువుల నుండి బయటపడలేదు. డార్విన్‍ పరిణామ సిద్ధాంతాన్ని జీవశాస్త్ర ఆచార్యుడు చక్కగా బోధిస్తాడు. అయితే అతను మాత్రం తనకుతాను అశాస్త్రీయ సిద్ధాంతాన్ని గుడ్డిగా నమ్ముతాడు. అదే విధంగా ఒక ఫిజిక్స్ అధ్యాపకుడు పదార్థాన్ని సృష్టించడం కానీ, నశింపచేయటం కానీ సాధ్యపడదనే ‘‘నిత్యత్వనియమాన్ని’’ (లా ఆఫ్‍ కన్సర్వేషన్‍) క్లాసులో అతి చక్కగా వివరిస్తాడు. కానీ తను మాత్రం గాలిలోంచి గడియారం తీయడం సాధ్యమంటాడు. అట్లాగే ఒక ఖగోళ శాస్త్రజ్ఞుడు పూర్తిగా అసంబద్ధిత జ్యోతిష్యాన్ని నమ్మినా ఆశ్చర్యపడవలసిన పనిలేదు. ఇటువంటి వారికి సైన్స్ పొట్ట కూటికి సాధనమవుతుందే కానీ వారి జీవిత మార్గం కాదు. అటువంటి వారు పరిశోధనలో, బోధనలో అత్యంత హేతుబద్ధంగా వున్నా, నిజ జీవితంలో మాత్రం ఎంతో హేతురహితంగా ప్రవర్తిస్తారు. పాపం అప్పుడు వారి ఆలోచనా, యింగితమూ అటకెక్కి సెలవు తీసుకుంటాయోమో!


సైన్స్ ఆటంబాంబు తయారు చేయడానికి తోడ్పడుతుంది. కానీ దానితో ఉత్పన్నమయ్యే శక్తిని సమాజానికి సద్వినియోగపడే విధంగా వాడుకోమనేటటువంటి నైతిక ఆదర్శాలను మాత్రం బోధించదు. అలాగే ఆటంబాంబు ప్రయోగించే మనిషి ఆలోచనను ప్రభావితం చెయ్యలేదు. కనుక మానవ సంపూర్ణాభివృద్ధి, సామాజిక సంక్షేమం అనేవి సైన్స్ కు పరమాదర్శాలు కావాలి. నేడు ఎన్నో మతాలున్నాయి. వాటిని వివిధ కాలాల్లో, వివిధ దేశాల్లో స్థాపించారు. వాటి స్థాపనకు మూలకారణాలు ఏవైనా, ప్రస్తుత కాలంలో మతాలు మాత్రం మానవజాతిని చీల్చి చెండాడి, మానవుల ఐక్యతను మంటగలుపుతున్నాయి. వారి ప్రగతిని నాశనం చేస్తున్నాయి. ఒక మతం మరొక మతంపై కత్తిని దూసింది. నిజానికి ఒక మతానికి మరో మతాన్ని మించిన శత్రువు అంటూ ఏదీ లేదు. అది రెండు మూఢ సమూహాల మధ్య జరిగే యుద్ధం తప్ప మరొకటి కాదు. స్థూలంగా అన్ని మతాల మౌలిక సూత్రాలు ఒక్కటే ! వాటి ప్రకారం ‘’దేవుడు’’ మాత్రం స్థిరంగా నెలకొని వున్నాడు. ప్రతి మతం అత్యద్భుతాలకూ, అసంగతాలకూ నిలయం. ఇవన్నీ ప్రకృతి సూత్రాలకు విరుద్ధం, వాస్తవానికి ఎంతో దూరం. ప్రతి మతానికి ఒక పవిత్ర గ్రంథముంటుంది. అయితే, ఏ మతగ్రంథంలోనూ ఈ భౌతిక ప్రపంచ ప్రవృత్తిని కానీ, దాని పోకడలను గానీ వివరించలేదు. ఆ పని కేవలం శాస్త్రపరిశోధనల ఫలితంగానే సాధ్యపడింది. ఒక వేళ, అట్లా ప్రయత్నించే మతం ఏదైనా వుంటే అది మోసానికి, వంచనకీ గురవుతూ వుంది.


మూఢనమ్మకమే ప్రతి మతానికీ పునాది. ‘‘నమ్మితే నమ్మూ…. లేకపోతే వదిలెయ్‍’’- ఇదే ప్రతి మతం యొక్క మౌలిక  దృక్పథం. మతం ఆలోచనను అసహ్యించు కుంటుంది. హేతువును వ్యతిరేకిస్తుంది. పరిశోధనను విసర్జిస్తుంది. ఈ విధంగా మానవ స్వేచ్చావలోకనాన్ని బంధించేదిగా మతం తయారయ్యింది. మూఢత్వాన్ని బలవంతంగా సంఘం నెత్తిన రుద్ధడమే మతోన్మాదుల ముఖ్యమైన పనిగా అయ్యింది. స్వర్గం, నరకం అనే భావనలు కూడా మతమే కల్పించినవే.


మనిషి శిరస్సుపై మతం పైశాచిక నృత్యం చేసిన రోజులున్నాయి. అప్పుడు బూటకం, మోసం, వంచనా అనేవి అందలం ఎక్కితేబీ నిజాయితీ, స్వేచ్ఛా, ఆలోచనా అనేవి సంకెళ్ళ పాలయ్యాయి. మధ్యయుగకాలంలో ఆలోచించిన పాపానికి చర్చి జరిపిన దురాగతాలు తలచుకోవడమే ఎంతో విషాదకరం ! ప్రశ్నించడం నేర్వని ఆ చీకటి రోజుల్లో కేవలం ఆలోచించిన నేరానికి గెలీలియో, బ్రూనో వంటి వారిని బాధించి, వేధించి, వధించారు. అభ్యుదయానికి పాటుపడిన ప్రతి ఉద్యమాన్నీ మతాలు అడ్డుకున్నాయి.


మతానికీ, సైన్స్కూ పోరు సాగుతూనే వుంది. అవి రెండు జతపడటం సాధ్యం కాదు. గుడ్డి నమ్మకం, ఆలోచనా లేమి, హేతు రాహిత్యం అనేవి మతానికి మూలమైతే- హేతువాదం, అన్వేషణ, ప్రయోగం అనేవి సైన్స్ కు ఆధారం. మూఢత్వంతో సైన్స్ కాపురం చేయలేదు. మానవ వికాసానికీ, సంక్షేమానికీ ఎంతో పాటు పడుతున్నట్లు కనిపించినా మతం సైన్స్ కు సరైనజోడీ కానేకాదు.


అయినా, ఈ ‘దేవుడు’ అంటే ఏమిటి? దేవుడి గురించి వున్న భావనలలో ఏకాభిప్రాయం లేదు. దేవుడి గురించి ఒక్కోమతం ఒక్కోరకంగా నిర్వచిస్తుంది. కొన్ని మతాల ప్రకారం దేవుడు సాకారుడైతే, మరి కొన్నిటి ప్రకారం నిరాకారుడు. నిజానికి దేన్నైతే దైవశక్తిగా నిన్న భావించామో దాన్నే నేడు ప్రకృతి శక్తిగా లెక్కిస్తున్నాం. ఎక్కడయితే భౌతికశాస్త్రజ్ఞుడు విచారించి విషయాన్ని కనుక్కుంటాడో అక్కడ నుంచి పూజారి పలాయనం చిత్తగిస్తాడు. మనకు అర్థం కానిదీ, తెలియనిదీ ‘దేవుని’ గా చలామణీ అవుతుంది. నిక్కచ్చిగా చెప్పాలంటే అసలు అజ్ఞానం అనేది దేవుడికి సమానం అవుతుంది. సైన్స్ విస్తరించి, అభివృద్ధి చెందటంలో రోజురోజుకూ దేవుడి స్థానమూ, ప్రభావమూ కుంచించుకు పోతున్నాయి. సైన్స్ చేతిలో అసంగతమతం చావు దెబ్బలు తిన్నది, తింటోంది. కొన్ని సమయాల్లో సత్యమే దేవుడని పేర్కొన్నారు. ఇదే నిజమైన పక్షంలో కర్పూర నివాళులూ, ధూప దీపాలతో నిండిన దేవాలయం కన్నా సత్యశోధనలకు సతతం పాటుపడే ప్రయోగశాలలే ఎంతో అవసరం మనిషిని దేవుడు సృష్టించాడనేకన్నా,తత్వవేత్త వోల్టేరు చెప్పినట్లు ఈ మానవుడే ‘దేవుడు’ అన్న భావనను కల్పించాడనేది మరింత నిజమనిపిస్తుంది. సైన్స్ ప్రకారం ఏదీ కొత్తగా పుట్టుకురాదు. కానీ ఉన్న ప్రతీదీ మరో విధంగా పరిణామం చెందుతుంది.


సైన్స్ దేవుడి గురించి ఏమీ పట్టించుకోదు. భౌతిక సంఘటనలు అర్థం చేసుకోవడంలో ‘దేవుడ’నే భావన ఎంత మాత్రమూ సహకరించదు. అలాగే మానవతావాదం కూడా దేవుణ్ణి పట్టించుకోదు. ఒకవేళ దేవుడున్నా మనుషుల విషయాల్లో అతడికేమీ పాత్రలేదు. హేతువాదమే ప్రధాన మార్గంగా మానవ సమస్యలను పరిష్కరించటమే మానవతావాదం. మనిషి పెరుగుదలా, సాఫల్యమూ, సృజనాత్మకతా అనేవి మానవతావాదానికి ప్రధానం. ఈ మానవతావాదం ప్రకారం- మనిషి దైవ సాయం లేకుండా తన కాళ్ళ మీద తాను నిలబడి, తన కర్తవ్యం తాను చెయ్యాలి. తన విధికి తానే విధాత! తన భవిష్యత్‍కు తానే నిర్మాత!


ఇంకా ప్రార్థనల ద్వారా, పూజల ద్వారా విన్నపాలు చేసుకోవడం కూడా అర్థ రహితం. మనిషి ఆలోచన మీదా, అతడి అమోఘశక్తి సామర్థ్యాల మీదా నమ్మకం కలిగివుంటే చాలు. ఈ స్వర్గ-నరక భావనలూ, కర్మ సిద్ధాంతాలు, వ్యర్ణ వ్యవస్థలూ, పునర్జన్మ వాదమూ, మోక్ష సాధన వంటివి సామాజిక అన్యాయానికీ, ఆర్థిక మోసాలకూ తోడ్పడతాయి. సామాజిక న్యాయానికై పోరాడేవారి మనో నిగ్రహాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి నమ్మకం చాటున, భయం నీడన కాకుండా హేతు వాదపు వెలుగుల్లో ప్రయోగాల ఊతతో మానవతావాదం నిలబడుతుంది. ప్ర కృతికీ, మానవ జీవితానికీ సైన్స్, టెక్నాలజీలను అనువర్తించి పరిసరాల్ని అదుపు చేయవచ్చు. పేదరికాన్ని పారద్రోలవచ్చు. రోగాలను తగ్గించవచ్చు. మానవ ఆయుర్దాయాన్ని పెంచవచ్చు. విజ్ఞానవంతుని చేయవచ్చు. మనిషి పరిణామాన్నే మార్చవచ్చు! ఎన్నో వినూత్న శక్తులకు తలుపులు తెరచి మనిషికి విస్తృతమైన, అర్థవంతమైన జీవితాన్ని కల్పించవచ్చునని మానవతావాదం ఆశిస్తోంది.


సంప్రదాయక నీతిసూత్రాలూ, పద్దతులూ (పురాతనమైనవైనా, ఆధునిక మైనవైనా) అవి మనిషి అవసరాలకు తగినంతగా సాయపడలేదు. మత సిద్ధాంతాల ప్రకారం నైతికత అనేది సాపేక్షికమైంది. నిన్న నీతికానిది నేడు నీతికావచ్చు. ఈ నీతిశాస్త్రం సాంఘికమైనది, స్వతంత్రమైనదీ, కాలంపై ఆధారపడనిదీ. దీనికి మత సంబంధమైన ఉత్తర్వు ఎంతమాత్రం అవసరం లేదు. మనం అబద్ధం, మోసం, దొంగతనం వంటి పనులకు పాల్పడకపోవటానికి బుద్ధుడో,  కృష్ణుడో, క్రీస్తో, అల్లానో కారణం కాదు. అటువంటి పనులు తప్పు అనీ, అవి ఎవరికీ ఏ రకంగానూ తోడ్పడవనీ మనకు అనుభవ పూర్వకంగా తెలియడమే కారణం. నీతిసూత్రాలు, శీలగుణాలు అనేవాటికి దైవికమైన ఉత్తర్వు ఏదీ అవసరం లేదు. కాబట్టి మన ప్రవర్తనకు, మతానికీ సంబంధం లేదు. అందువల్ల మతాన్ని దూరంగా వుంచాల్సిన అవసరం ఎంతో వుంది. జాతి, దేశం, ప్రాంతం, రంగు, లింగం, పుట్టుక వంటి వాటి ఆధారంగా కాకుండా మనిషి శక్తి సామ ర్థ్యాలూ, మేథా, సహృదయతలను బట్టి మనిషి విలువను మానవ తావాదం నిర్ణయిస్తుంది. మనిషి హుందాతనాన్ని కాపాడుతుంది.


ఈ రకంగా శాస్త్రీయ దృక్పథంలో, మానవతా వాదాలలో చాలా సామాన్య అంశాలున్నాయి. రెండూ పరిణామ బద్ధమైనవీ, సార్వత్రికమైనవీ, ప్రాయోగిక బద్దమైనవీను. వాటికి హేతుబద్ధమైన ఆలోచనే పునాది. రెండింటిలో ఏదీ పిడివాదం కాదు. నిజాన్ని, నిజాయితీని గౌరవిస్తాయి. ఈ రెండూ నైసర్గికమైనవే కానీ దైవికమైనవి కావు. మనిషిని వ్యక్తిగా పెంపొందించడానికి ఈ రెండూ తోడ్పడ తాయి. సామాజిక అన్యాయాలూ, అమానుషత్వాలూ, మోసాలు, ఆర్థిక అసమానతలూ, ప్రగతి నిరోధక వాదాలూ మొదలైన వాటిని రూపుమాపడానికి పాటుపడతాయి. కాబట్టి ఈ శాస్త్రీయ దృక్పథం, మానవతావాదాలు విద్యాప్రణాళికలో సమ్మిళితం అయితే, అప్పుడు సామాజిక ప్రగతి సాధ్యమవుతుంది.

సంప్రదాయాలూ, ఆచారాలు పేరుకున్న ఈ సమాజాన్ని మార్చడానికి సంప్రదాయిక సూత్రాలతో ఏర్పడిన విద్యా ప్రణాళిక మనకు సత్ఫలితాలనివ్వదు. పిడివాదం విషయంలో విశ్వవిద్యాలయాలు దేవాలయాలకన్నా తక్కువేం తినలేదు. ఈ విశ్వవిద్యాలయాలు గులకరాళ్ళకు మెరుగు పెట్టి, వజ్రాలను బొగ్గులుగా చేస్తాయి. ఒక్కోసారి గులకరాళ్ళకు మెరుగుపెట్టడం కూడా అనుమానాస్పదమే! నేటి మన విద్యా వ్యవస్థ అక్షరాస్య మూఢులనూ, చదువు వచ్చిన మతోన్మాదులనూ తయారు చేస్తున్నది. వీళ్ళు చాలా ప్రమాదకరం. చాలా మంది విద్యావేత్తలకి విద్య గమ్యం ఏమిటో తెలవదు. సామాజిక, ఆర్థిక సంస్కరణలకు విద్యను ప్రధాన ఆయుధంగా వాడుకోవాలి. విశ్వవిద్యాలయాల గురించి నెహ్రూ యిలా అంటారు.


‘‘మానవతకు, హేతుబద్ధతకు, ఊహల సాహసాలకు విశ్వవిద్యాలయాలు ప్రతీకలు. అవి మానవ జాతి ఉత్కృష్ట లక్ష్యసాధనకై ప్రగతిమార్గంలో పయనించాలి. అప్పుడే దేశమూ, ప్రజలూ సవ్యంగా వుంటారు. సత్యావిష్కరణా, అన్వేషణా విశ్వవిద్యాలయ విధుల్లో ప్రధానమైనవి. పరీక్షకు, పరిశోధనకు నిలవనంత పవిత్రమైనవి ఏవీ లేవు. విశ్వవిద్యాలయాలు వాటి విధులను సక్రమంగా నిర్వర్తించాలంటే మన విద్యా ప్రణాళికలో సైన్స్, మానవతావాదాలు పడుగుపేకలు కావాలి!’’


(రచనా కాలం: 1976 కు ముందు, అనువాద కాలం: 1986)
ఆంగ్ల మూలం : డా. హెచ్‍. నరసింహయ్య
తెలుగు స్వేచ్ఛానువాదం : డా. నాగసూరి వేణుగోపాల్‍
ఎ : 9440732392

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *