ప్రఖ్యాత లాయర్ కిషన్ లాల్ ఇంటి మొదటి అంతస్తు నుండి మెట్లు దిగి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి తన చేంబర్ పుష్ డోర్ నెట్టుకుంటూ వెళ్లి ఎగ్జిక్యూటివ్ కుర్చీలో కూర్చుని రిమోటుతో ఏసీ వేశాడు. కొద్ది నిమిషాల్లో ఆయేషా పర్వీన్ తన ఆరుగురు పిల్లలతో చేంబర్లోకి వెళ్లి నమస్కారం చేసి ‘‘సర్, నా పేరు ఆయేషా పర్వీన్, నేనే మీకు కాల్ చేసి మీ అప్పాయింట్ మెంట్ తీసుకున్నాను’’ అంది. ప్రతి నమస్కారం చేస్తూ ‘‘కూర్చో అమ్మా’’ అంటూ కిషన్ లాల్ తన సీటులో కూర్చుంటూ కాలింగ్ బెల్లు నొక్కాడు. జూనియర్ లాయర్ గిరిధర్ పుష్ డోర్ త్రోసుకుంటూ లోనకు వచ్చాడు. ‘‘గిరిధర్, నేను ముఖ్యమైన కేసు వివరాలు తీసుకుంటున్నాను, ఎవరినీ లోనకు రానివ్వకండి’’ అన్నాడు. ‘‘అలాగే సర్’’ అంటూ గిరిధర్ బయటకు వెళ్లాడు.
ఆయేషా వైపు తిరిగి ‘‘చెప్పమ్మా నీ కేసు వివరాలు’’ అన్నాడు కిషన్ లాల్.
‘‘కోర్టు నుండి నాకు వచ్చిన కేసు కాగితాలు చూడండి సార్’’ అంటూ తన చేతిలోని కాగితాల కట్టను కిషన్ లాల్‌కు అందించింది ఆయేషా.
పేపర్లు అందుకున్న కిషన్ లాల్ కళ్ళజోడు పెట్టుకొని వాటిని ఒక పది నిమిషాల్లో చదవటం ముగించి ‘‘జరిగిన విషయాలు వివరంగా చెప్పు’’ అన్నాడు ఆయేషాతో.
‘‘సార్, కోర్టులో కేసు వేసిన వాది జలీల్‌తో నా వివాహం జరిగి పద్నాలుగు సంవత్సరాలైంది. పెళ్ళైన ఆరు నెలల నుండి నాకు శారీరక, మానసిక వేధింపులు మొదలయ్యాయి. ఉద్యోగం చేస్తూ నెలకు లక్ష రూపాయల పై చిలుకు సంపాదిస్తున్నాడు. అయినా మా తల్లి గారింటి నుండి డబ్బులు తెమ్మని చిత్ర హింసలు పెడుతున్నాడు. ఇంటి ఖర్చులకు ఒక్క పైసా ఇవ్వడు. తను ఏ సామాను కొనుక్కు రాడు. నాకు పెళ్ళిలో మా ముస్లిం సంప్రదాయం ప్రకారం మా నాన్న అన్ని వస్తువులు ఇవ్వటమే కాకుండా కట్నం కింద కూడా నా భర్తకు డబ్బులు ముట్ట జెప్పాడు. నా భర్తకు పెళ్లి కాక ముందు నుండే త్రాగుడు అలవాటుంది. అప్పటికి మాకు ఆ విషయం తెలియదు. మా మామ మా నాన్న మధ్య ఉన్న పరిచయంతో నమ్మి పెళ్లి చేస్తే నన్ను సర్వనాశనం చేశాడు. ఎప్పటికీ త్రాగి వచ్చి నన్ను తిట్టడం, కొట్టడం, మా అమ్మ గారింట్లో దిగ పెట్టటం, నాలుగైదు రోజుల తర్వాత మా అమ్మ గారింటికి రావటం, అదనపు కట్నం ఇవ్వాలని మా అమ్మ నాన్న మీద జులుం చేయటం, తిరిగి నన్ను తీసుక పోవటం జరుగుతుంది. అదనపు కట్నం ఇవ్వక పోతే నన్ను, నా పిల్లల్ని వదలి వేస్తానని ఎన్నో సార్లు బెదిరించాడు సార్. నా భర్త వేధింపులు, నా బాధ చూడ లేక మా నాన్న రెండు సంవత్సరాల క్రితం చనిపోయాడు. ఆ దిగులుతో మా అమ్మ కూడా మంచం పట్టింది’’ అంటూ ఆగింది ఆయేషా.
‘‘మరి నీవు, నీ పిల్లలు ఎలా బ్రతుకుతున్నారమ్మా’’ అడిగాడు కిషన్ లాల్.
‘‘నాకు ముగ్గురు మగ పిల్లలు, ముగ్గురు ఆడ పిల్లలు. చిన్నా చితకా పనులు చేస్తూ పిల్లల్ని పోషిస్తున్నాను. మా పెద్దోడు హోటల్లో పని చేసి పాలకు నీళ్ళు తోడు అన్నట్టు సంపాదిస్తున్నాడు. గత రెండు నెలల క్రితం నా భర్త మమ్మల్ని నా తల్లి గారింట్లో దిగబెట్టాడు, మళ్లీ రాలేదు. ఈ కాగితాలు కోర్టు నుండి మూడు రోజుల క్రితం వచ్చాయి. వాటిలో ఏమి రాశారు సార్’’ అడిగింది ఆయేషా.
‘‘నీకు నీ భర్తతో కాపురం చేయటం ఇష్టం లేదని తెలిపి నావని, అందువల్లనే నీవు ఎప్పటికి నీ తల్లి గారింట్లో ఉంటున్నావని, సలీం అనే అతనితో వివాహేతర సంబంధం పెట్టుకున్నావని, నీవు జన్మనిచ్చిన ఆరుగురు సంతానానికి నీ భర్త కారకుడు కాడని, కాబట్టి వారిని తన సంతానం కాదని ప్రకటించాలని కోర్టును కోరుతూ కేసు వేశాడమ్మా’’ అంటూ ఆగాడు కిషన్ లాల్.
‘‘ఇది అన్యాయం సార్. సలీం నా పెద్దమ్మ కొడుకు. నాకు, అతనికి అక్రమ సంబంధం కట్టటమేమిటి. ఆరుగురు పిల్లలకు తను తండ్రి కాడని ఎలా అంటాడు. మమ్మల్ని పోషించటం ఇష్టం లేక లేని పోని అభాండాలు వేస్తున్నాడు. నా ఆరుగురు పిల్లలను పోషించటం చాలా ఇబ్బంది అవుతుంది. అయినా గౌరవంగా బ్రతుకుతున్నాము. లక్ష రూపాయల జీతం ఏమి చేస్తాడో అంతు బట్టడం లేదు. మా పోషణకు అయ్యే ఖర్చు జలీల్ భరించే విధంగా కోర్టు నుండి తీర్పు కోరవచ్చా సార్.’’
‘‘తప్పకుండా కోరవచ్చు. అతడు వేసిన కేసుకు నీవు ఇచ్చే జవాబులో అతడి నుండి మనోవర్తి, పోషణ ఖర్చులు ఇప్పించే విధంగా మనం కోరుదాము. అయితే తుది తీర్పుకు కొంత సమయం పడుతుంది. ఈ వకాల్తా మీద సంతకం పెట్టు’’ అంటూ ఒక ప్రింటెడ్ ఫారం మీద క్రాస్ మార్కు పెట్టీ ఆయేషా ముందు పెట్టాడు. ఆయేషా అలాగే అంటూ సంతకం పెట్టింది.
‘‘ఒక వారం రోజుల తర్వాత నన్ను కలువు. అప్పటి లోగా నేను జవాబు తయారు చేసి పెడతా. నీవు దానిపై సంతకం పెట్టిన తర్వాత కోర్టులో దాఖలు చెయ్యాల్సి ఉంటుంది. ఇక నీవు వెళ్లు’’ అంటూ కిషన్ లాల్ లేచాడు.
ఆయేషా తన సంతానంతో బయటికి నడిచింది.
![](http://deccanland.com/wp-content/uploads/2021/06/2-2.jpg)
కిషన్ లాల్ వారంలోపే జవాబు తయారు చేశాడు. జలీల్ వేసిన పిటిషన్ చెల్లుబాటు కాదని, భర్తగా, తండ్రిగా బాధ్యతల నుండి తప్పించుకోవటానికి మోసపూరిత పిటిషన్ వేశాడని, ఆయేషా, ఆమె ఆరుగురు పిల్లలకు నెలకు ఒక్కొక్కరికి పదివేల రూపాయల మనోవర్తి క్రింద ఇచ్చేట్టుగా ఆదేశాలు జారీ చేయవలసిందని జవాబులో కోరడం జరిగింది. ఆయేషా పర్వీన్ జవాబు పత్రంపై సంతకం చేసిన తదనంతరం దాన్ని జూనియర్ లాయర్ గిరిధర్ కోర్టులో దాఖలు చేశాడు.
చూస్తుండగానే రెండు సంవత్సరాల కాలం గడిచింది. జలీల్ వేసిన కేసు విచారణకు వచ్చింది. జలీల్ తన న్యాయవాది ద్వారా మరో పిటిషన్ వేస్తూ తనను, ఆయేషా జన్మనిచ్చిన ఆరుగురు పిల్లలను డిఎన్ఎ పరీక్షకు పంపాల్సిందిగా మధ్యంతర ఉత్తర్వుల జారీకై కోర్టును ప్రాధేయ పడ్డాడు. లాయర్ కిషన్ లాల్ ఆ పిటిషన్‌ను తీవ్రంగా వ్యతిరేకించాడు. భారత సాక్ష్యాల చట్టం ప్రకారం భార్యా భర్త లిరువురి చట్ట బద్దమైన వివాహం కొనసాగినప్పుడు భార్యకు కలిగిన సంతానం సక్రమ సంతానమే. అలా కాకుండా 280 రోజులు విడివిడిగా ఉండి కలుసుకోలేదని నిరూపణ అయి ఉండి ఆ మధ్య కాలంలో భార్య గర్భవతి కావటం లేదా ప్రసవించినట్లైతేనే పుట్టిన సంతానం భర్త ద్వారా కాలేదనుటకు ఆస్కారముందని, అప్పుడే డిఎన్ఎ పరీక్ష కు ఉత్తర్వులు జారీ చేయవచ్చని వాదించాడు. కిషన్ లాల్ వాదనతో ఏకీభవిస్తూ కోర్టు ఆ పిటిషన్‌ను కొట్టి వేసింది.
దానితో జలీల్‌కు తప్పని సరిగా సాక్ష్యాలు ప్రవేశ పెట్టే పరిస్థితి వచ్చింది. అతని తరపున తను కాకుండా వేరెవరిని మౌఖిక సాక్ష్యులుగా ప్రవేశ పెట్టలేదు. ఆయేషా తరపున తను, తన పెద్ద కొడుకును మౌఖిక సాక్ష్యులుగా విచారించారు. ఇరువురు న్యాయ వాదులు తమ వాదనలను కోర్టుకు వినిపించారు. కిషన్ లాల్ తన వాదనకు మద్దతుగా అత్యున్నత న్యాయస్థానం తీర్పులను కూడా ప్రవేశ పెట్టాడు.
వాదోపవాదాలు విన్న కుటుంబ న్యాయస్థానం తుది తీర్పును ఆయేషా పర్వీన్‌కు అనుకూలంగా జలీల్‌కు వ్యతిరేకంగా ప్రకటించింది. జలీల్ వేసినటువంటి కేసులో పరిశీలించ దగ్గ అంశాలు లేవని, మొదటి సంతానం కలిగిన పన్నెండు సంవత్సరాల పిదప, అదే విధంగా ఆరవ సంతానం కలిగిన మూడు సంవత్సరాల పిదప ఆయేషాపై అభాండాలు మోపుతూ అర్థం లేని పిటిషన్ వేసి ఆరుగురి పిల్లల్ని అక్రమ సంతానంగా ప్రకటించాలని కోరటం సహేతుకం కాదు. ఎందుకంటే వారి చట్ట బద్దమైన వివాహం కొనసాగుతుంది. భారత సాక్ష్యాల చట్టంలోని సెక్షను 112 ప్రకారం అతడు 280 రోజుల పాటు ఆయేషాతో ఎటువంటి సంబంధం లేకుండా విడిగా ఉన్నట్టు, ఆ సమయంలోనే ఆయేషా గర్భవతి కావటం లేదా ఆరుగురిలో ఏ ఒక్కరికైనా జన్మనిచ్చినట్టు జలీల్ రుజువు చేయలేక పోయాడు. వివాహేతర సంబంధం ఆరోపణ కేవలం నిరాధారమైన లేదా ఊహా జనితమైనది మాత్రమే. అదే విధంగా జలీల్ నెలసరి వేతనం లక్ష రూపాయలని రుజువైంది. అయినా భార్యకు, పిల్లలకు ప్రేమ పంచటం మాట అటుంచి ఆర్థిక మద్దతు ఇవ్వకుండా క్షమించరాని నిర్లక్ష్యం చేశాడు. కాబట్టి భార్యకు మనోవర్తి క్రింద, ముగ్గురు మగ పిల్లలకు వారు మేజర్లు అయ్యేంత వరకు, ముగ్గురు కుమార్తెలకు వివాహం అయ్యేంత వరకు ఒక్కొక్కరికి నెలకు పదివేల రూపాయలు పోషణ నిమిత్తం, మొత్తంగా డెబ్భై వేల రూపాయలు ప్రతి నెల పదవ తేదీ లోగా ఆయేషా బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలి. అరుగురి వివాహం కూడా జలీల్ బాధ్యతే అంటూ జలీల్ వేసిన పిటిషన్ కొట్టివేసి, ఆయేషాకు అనుకూలంగా తీర్పు ఇవ్వటం జరిగింది.
జల్సాలకు అలవాటు పడ్డ జలీల్ ఏదో విధంగా భార్యా పిల్లలను వదిలించు కోవాలనే దురుద్దేశ్యంతో వేసిన కేసులో నెలకు డెభ్భై వేల రూపాయలు చెల్లించాలనే ఆదేశం అతడు ఊహించలేదు. తానొకటి తలిస్తే కోర్టు మరోలా ఇచ్చిన తీర్పుతో అతడి మైండ్ దిమ్మ తిరిగింది.
తడకమళ్ళ మురళీధర్,
ఎ : 9848545970