అలనాటిమేటి తెలంగాణ శాసనాలు-11


గండప్పనాయకుని కొలనుపాక
కంచుగంట చిన్న శాసనం (క్రీ.శ.1040?)


శాసనం చిన్నదే. మొత్తం 36 అక్షరాలు, ఒకే ఒక పంక్తి. అయితేనేం! ఆ శాసనం ఒక కళాత్మకమైన కంచుగంటపైన చెక్కబడింది. ఆ గంటపైన గల దేవతామూర్తులు, డిజైన్లు చారిత్రక ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి. ఇంతకీ ఆ కంచుగంట ఎక్కడిదో, దానిమీదగల శాసనం ఏమిటో, ఎప్పటిదో తెలుసుకొన్నకొద్దీ ఆసక్తిరేగుతుంది. ఆ శాసనమున్న కంచుగంట 1960లో తెలంగాణలోని ఒకప్పటి నల్లగొండ జిల్లా, ఇప్పటి భువనగిరి – యాదాద్రి జిల్లా, ఆలేరు సమీపంలోని కొలనుపాక గ్రామం పక్కనే పారుతున్న ఒక నదిలో దొరికింది. వెంటనే రాష్ట్ర పురావస్తుశాఖ, ప్రధాన కార్యాలయానికి చేరింది. అదే కాదు, దానితో పాటు ఇంకా రెండుగంటలు కూడా దొరికాయి. వాటిలో రెండు మాత్రం, ప్రస్తుతం హైదరాబాద్‍ పబ్లిక్‍ గార్డెన్స్లో నున్న తెలంగాణ స్టేట్‍ మ్యూజియంలో ప్రదర్శనలో ఉన్నాయి. ఎంతో చారిత్రక ప్రాధాన్యతగల ఈ 3 కంచుగంటల్లో, శాసనమున్న, మరో గంటపై పురావస్తుశాఖ అప్పటి సంచాలకులు డా. ఎన్‍. రమేశన్‍ విస్తృత అధ్యయనం చేశారు.
(ఎన్‍.రమేశన్‍, త్రీవెస్టర్న్ చాళుక్యన్‍ బ్రాంజ్‍ బెల్స్ లలిత్‍ కళ. వా.10, బొంబే, 1961, పే.25-30)
ఒక గంటపైన కింది భాగంలో చుట్టూ, ‘స్వస్తి శ్రీమతు కందప్పనాయకరు కొల్లిపాకెయ సఖరేశ్వరద సోమేశ్వర దేవరిగె కొట్టిపూజ’ అని తెలుగు – కన్నడ లిపిలో, కన్నడ భాషలో శాసనం చెక్కబడింది. కొల్లిపాకలోని సోమేశ్వరదేవునికి, శ్రీమతు కందప్పనాయకరు సమర్పించాడని ఆ శాసనం భావం. లిపిని బట్టి ఈ శాసనం క్రీ.శ.11వ శతాబ్దికి చెందింది.


ఈ శాసనం దొరికింది కొల్లిపాకలో. అంటే కొలనుపాకలో. ఇచ్చింది కందప్ప నాయకుడు. కొల్లిపాకను గురించి ప్రస్తావనలు తమిళ, కన్నడ దేశ శాసనాల్లో చాలా చోట్ల కనిపిస్తాయి. తంజావూరులోని బృహదీశ్వరా లయంలోని రాజేంద్రచోళుని క్రీ.శ.1018 నాటి శాసనంలో, (సుల్లిచుళ మదిల్‍ కొల్లిపాక్‍ రైయుమ్‍) చుట్టూ చెట్లూ, పొదలతో నున్న కొల్లిపాకను తాను జయించినట్లు చెప్పుకొన్నాడు (సౌత్‍ ఇండియన్‍ ఇన్స్క్రిప్షన్స్, వా.పే.90). కర్నాటక రాష్ట్రంలోని నంజనగుడ దగ్గరి నందిగుండలోని క్రీ.శ.1021 నాటి శాసనంలో కొల్లిపాకగా చెప్పబడింది (ఎపిగ్రాఫియా కర్నాటిక, వా.3, పే.134). మైసూరు దగ్గరి తాడిమలింగిలోని అదే సం।।పు శాసనంలో ‘కొల్లిపాకై’ గా పేర్కొనబడింది (సౌత్‍ ఇండియన్‍ ఇన్స్క్రిప్షన్స్. వా.1,పే.95). కర్నాటకలోని బీజపూర్‍ జిల్లా, భైరాన్‍మట్టిలోని కళ్యాణచాళుక్య చక్రవర్తి జగదేకమల్ల రెండోజయసింహుని క్రీ.శ.1034 నాటి శాసనంలో తాను ‘కొల్లిపాకె’లో విడిది చేసినట్లు చెప్పుకొన్నాడు (ఎపిగ్రాఫియా కర్నాటిక, వా.3, పే.230). మైసూరు సమీపంలోని బెల్గామిలోని, కళ్యాణ చాళుక్యచక్రవర్తి త్రైలోక్యమల్ల మొదటి సోమేశ్వరుడు తన సామన్తుని గురించి ‘కొల్లిపాకెయ కవమ్‍’ అని ప్రస్తావించాడు (ఎపిగ్రాఫియా కర్నాటిక, వా.6, పే.323). మైసూరు సమీపంలోని గంగవరపల్లిలోని క్రీ.శ.1046 నాటి శాసనంలోనూ, కాంచీపురం సమీపంలోని మణిమంగళం లోని చోళ రెండో రాజ రాజు మరో శాసనంలో కళ్యాణచాళుక్య చక్రవర్తి మొదటి సోమేశ్వరునితో జరిగిన యుద్ధంలో, కొల్లిపాకను దగ్ధం చేసినట్లు చెపుకొన్నాడు (ఎపిగ్రాఫియా కర్నాటిక వా.9.పే.75; సౌత్‍ ఇండియన్‍ ఇన్స్క్రిప్షన్స్ వా.3.పే.51). ఆంధప్రదేశ్‍లోని గుంటూరు జిల్లా, చేబ్రోలులోనున్న విక్రమచోళుని క్రీ.శ.1127 నాటి తెలుగు శాసనంలో నంబయ్య కొల్లిపాక పాలకునిగా ఉన్నట్లు చెప్పబడింది (ఎపిగ్రాఫియా ఇండికా, వా.6, పే.233). విజయనగర చక్రవర్తి సదాశివరాయని క్రీ.శ.1566 నాటి రాగిరేకు శాసనంలో, తాను దానం చేసిన 31 గ్రామాల్లో ఎంతో అందమైన, ప్రశస్తిగాంచిన కొలిపాక గ్రామం (ప్రతీతంచ మనోహరం) కూడ ఉందని చెప్పుకొన్నాడు (బ్రిటీష్‍, మ్యూజియం ప్లేట్స్ ఆఫ్‍ సదాశివరాయ శకసంవత్‍ 1478 ఎపిగ్రాఫియా ఇండికా, వా.4, పే.1-22). అంతే కాక రాష్ట్ర పురావస్తుశాఖ ప్రచురించిన, పివి పరబ్రహ్మశాస్త్రి, (సం) ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్‍ ఆంధప్రదేశ్‍ : నల్గొండ డిస్ట్రిక్టు, వా.1, హైదరాబాదు, 1993; డా. నేలటూరి వెంటరమణయ్య (సం) ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్‍ ఆంధప్రదేశ్‍ : నల్గొండ డిస్ట్రిక్టు, వా.2, హైదరాబాదు, 1994 సంపుటాల్లో, కొలనుపాకలోని మొత్తం 52కు పైగా గల శాసనాలు ప్రచురించబడగా, వాటిలో కొలనుపాక, కొల్లిపాకె, కుల్యపాకగా పేర్కొనబడింది. కొలనుపాకలో చాలా కాలం ఉపాధ్యాయునిగా పని చేసి, చరిత్రపై మమకారం పెంచుకొని, అనేక స్థలాలు, కట్టడాలు, శిల్పాలు, శాసనాలను కొత్తగా వెలుగులోకి తేవడమేగాక, కొలనుపాక చరిత్ర, శాసనాలు, దేవాలయాలపై పుస్తకాలు రాసిన, విరువంటి గోపాలకృష్ణ, అదే వరవడిలో చరిత్ర పరిశోధనలు ప్రారంభించి, ముమ్మరం చేసి, కొత్త తెలంగాణ చరిత్ర బృందానికి నాయకత్వం వహిస్తూ ఆలేరు కంపణం లాంటి స్థానిక చరిత్ర, తెలంగాణ చరిత్ర గ్రంథాలను రాసిన శ్రీరామోజు హరగోపాల్‍, కొలనుపాకపై సాధికారిక పరిశోధనలు గావించిన సంగతిని కూడ ఇక్కడ చెప్పుకోవాలి. ఎందుకంటే పై ఇద్దరి పుస్తకాలు కొలనుపాక చరిత్రకు అద్దం పడుతున్నాయిగాబట్టి.


తరువాత, పి. శ్రీనివాసాచారి, పి.బి.దేశాయి, (సం), కన్నడ ఇన్స్క్రిప్షన్సు ఆఫ్‍ ఆంధప్రదేశ్‍, హైదరాబాదు, 1961లోని, 45, 46, 47, 48, 49, 50, 51, 52 శాసనాల్లో కొల్లిపాక ప్రస్తావనను కూడ గమనించవచ్చు. అలాగే, సి.ఎస్‍. వాసుదేవన్‍ (సం), కన్నడ ఇన్స్ క్రిప్షన్స్ ఆఫ్‍ ఆంధప్రదేశ్‍, కన్నడ యూనివర్సిటీ హంపి, 1999 : కె.ఆర్‍. గణేశ్‍, ఆర్‍.శేషశాస్త్రి (సం), ఆంధప్రదేశద కన్నడ శాసనగళు : – భాగ-1, భాగ-2, కన్నడ విశ్వవిద్యాలయం, హంపి, 2001లలో కొలనుపాకలోని కన్నడ శాసనాలున్నాయి. బి.ఎన్‍.శాస్త్రిగారి నల్లగొండ జిల్లా సర్వస్వం, జి. జవహర్లాల్‍, జైనిజం ఇన్‍ ఆంధ్రదేశ, ఎం. రాధాకృష్ణశర్మ, టెంపుల్స్ ఆఫ్‍ తెలింగాణలలో. కొలనుపాక చరిత్ర, శాసనాలున్నాయి. ఇంకా కొలనుపాక స్థల ప్రదర్శనశాలపై గైడ్‍ బుక్‍ను రమాకాంతం రాశారు. ఇలా కొలనుపాక చరిత్ర, శాసనాలు, శిల్పాలపై చాలా మంది పరిశోధనలుగావించారు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, యువ పరిశోధకులు వీటిని చదివి ఆకళింపు చేసుకొంటారన్న ఆశతో.


ఇన్ని వివరాలు ఎందుకు చెప్పాల్సొచ్చిందంటే, కొలనుపాకలో దొరికిన ఒక గంటపై ఉన్న శాసనంలోని కందప్ప / గండప్ప నాయకర్‍ ఎవరో తెలుసుకోవటానికి. చోళ రాజాధిరాజు, ధాన్యకటకం వద్ద, కళ్యాణ చాళుక్య చక్రవర్తితో క్రీ.శ.1045లో చేసిన యుద్ధంలో, ఆహవమల్ల సోమేశ్వరుని సైన్యాధికారులైన, విక్కి, విజయాదిత్య, సంగమయ్యలతో పాటు, గండప్పయ, గంగాధరులు కూడా ఉన్నారని ఒక శాసనంలో చెప్పుకున్నాడు. ఇంతకు ముందు రాజేంద్రచోళుడు, తరువాత రాజాధిరాజ చోళుడు, కొల్లిపాకపై దాడిచేసి, అగ్నికి ఆహుతిని గావించిన సంగతిని కూడ ఇక్కడ చెప్పుకోవాలి. దీనిని బట్టి, కొలనుపాకలో దొరికిన ఈ కంచు గంటల్ని, కళ్యాణ చాళుక్య ప్రభువైన మొదటి సోమేశ్వరుని సైన్యాధ్యక్షుడైన గండప్పే (అతన్ని శాసనాల్లో గండప్పయ, కందప్ప నాయకర్‍ అని కూడా పేర్కొన్నారు) నన్నది సుస్పష్టం. ఇతడు క్రీ.శ.1045 నాటి ధాన్యకటకం యుద్ధంలో మరణించాడని కొందరు చరిత్రకారులు పేర్కొన్నారు. కంచుగంట శాసనంలో తేదీ లేనందున, గండప్ప నాయకుడు, కొలనుపాకలోని సోమేశ్వరునికి క్రీ.శ.1040 ప్రాంతంలో సమర్పించి ఉండొచ్చు.


ఇక రెండు కంచుగంటలపై నాలుగు వైపులా ఉన్న దేవతా శిల్పాన్ని పరిశీలిద్దాం. మొదటి గంటపైన ఆసీన గణపతి, స్థానక సూర్యుడు, ఆసీన దక్షిణామూర్తి, విష్ణుమూర్తి శిల్పాలు, రెండో గంటపై కూడ గణపతి, సూర్య, దక్షిణామూర్తి, అతిరిక్తాంగ భైరవ శిల్పాలు, క్రీ.శ.11వ శతాబ్ది నాటి కాంస్య శిల్పకళకు, ఆనాటి శిల్పుల పనితనానికి మచ్చుతునకలుగా ఉన్నాయి.


ఇంతటి ప్రాముఖ్యతగల శాసనం గురించి పురావస్తు శాఖ ప్రచురించిన నల్లగొండ జిల్లా శాసన సంపుటాల్లో పేర్కొనక పోవడం గమనించాల్సిన విషయం. కొలనుపాక, ఒక జైన, వైష్ణవ (వీర నారాయణ) శైవ కేంద్రంగా పద్దెనిమిది కులాల మఠాలు, దేవాలయాలుగల ప్రాముఖ్యత స్థావరమైనా, నా వ్యాసాన్ని కేవలం కంచు శాసనానికే పరిమితం చేసుకొన్నాను.


రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో కంచుగంటలున్నా, కొలనుపాక గంటల పనితనం మరెక్కడా కనిపించదు. అందులోనూ కళ్యాణ చాళుక్యుల దండనాధుడైన గండప్ప నాయకుని శాసన ముండటం మరో ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. శాసనం చిన్నదే అయినా, క్రీ.శ.11వ శతాబ్దినాటి లిపి, భాష. కాంస్యకళ, ఆలయ సంస్క•తికి అద్దంపడు తున్నందున, ఆ గంటల్ని బహూకరించిన గండప్ప నాయకుని శాసనం అలనాటి మేటి తెలంగాణ శాసనాల జాబితాలో చోటు దక్కించుకొంది. ఈ శాసనంపై ఇంత వివరంగా తొలిసారిగ నా వ్యాసాన్ని ప్రచురించిన దక్కన్‍ల్యాండ్‍ మాసపత్రిక సంపాదకులు, ఎం. వేదకుమార్‍గారికి నా కృతజ్ఞతలు. డా.ఎన్‍. రమేశన్‍గారికి, శ్రీరామోజు హరగోపాల్‍ గారికి, విరువంటి గోపాలకృష్ణగారికి, కొలనుపాక కంచుగంటల పొటోలను, వాడుకోవటానికి అనుమతిచ్చిన అప్పటి పురావస్తుశాఖ సంచాలకులు డా.వి.వి. కృష్ణ శాస్త్రిగారికి, ఇప్పటి సంచాలకులు శ్రీ కె. శ్రీనివాస రాజుగారు, అధికారులు నాగరాజు, గంగాదేవిగార్లకు నా ధన్యవాదాలు.


-ఈమని శివనాగిరెడ్డి-స్థపతి
ఎ : 9848598446

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *