ఆంధ్రా నీటి దోపిడి నిరోధానికి


అనివార్య ప్రతిచర్య


పోతిరెడ్డిపాడు హెడ్‍ రెగ్యులేటర్‍ దిగువన ఉన్న శ్రీశైలం కుడి ప్రధాన కాలువ (SRMC) సామర్థ్యాన్ని80 వేల క్యూసెక్కులకు పెంచే పనులకు, రోజుకు 3 tmc నీటిని ఎత్తిపోసే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పరిపాలనా అనుమతినిస్తూ ఆంధప్రదేశ్‍ ప్రభుత్వం మే 5న జిఓ నంబరు 203ను జారీ చేయడం, ఆ తర్వాత టెండర్లు పిలిచి, పెద్ద ఎత్తున టిప్పర్లు, మట్టిని తవ్వే భారీ యంత్రాలు, సిమెంట్‍ కాంక్రీట్‍ బ్యాచింగ్‍ ప్లాంట్‍, కంకర క్రషింగ్‍ ప్లాంట్‍ నెలకొల్పి పనులు ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసినదే. ఈ నిర్ణయాన్ని డిసెంబర్‍ 2019 లోనే ఆంధప్రదేశ్‍ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‍ జగన్‍ మోహన్‍ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించినారు. ఈ సంగతిని అన్ని పత్రికలు పతాక శీర్షికలతో వార్తలు ప్రకటించినాయి. ఇటువంటి ఒక తీవ్ర నిర్ణయం యొక్క పూర్వ పరాలను, మంచిచెడ్డలను, తెలంగాణా రాష్ట్ర ప్రాజెక్టులపై పడే ప్రభావాలు, ఈ అంశంలో ఆంధప్రదేశ్‍ తరపున వస్తున్న అసంబద్ద వాదనలను చర్చించడమే ఈ వ్యాసం లక్ష్యం.


జి ఓ 203 లో కీలక అంశాలు :

మొదట జి ఓ నంబరు 203 లో ఉన్న కీలక అంశాలు ఏమిటో తెలుసుకుందాం

  • శ్రీశైలం జలాశయం నుండి రోజుకు3 TMCనీటిని ఎత్తిపోసి పోతిరెడ్డిపాడు హెడ్‍ రెగ్యులేటర్‍ దిగువన శ్రీశైలం కుడి ప్రధానకాలువ (SRMC) లో జారవిడిచేందుకు సంగమేశ్వరం వద్ద రాయలసీమ లిఫ్ట్ పథకం యొక్క పంపింగ్‍ స్టేషన్‍ నిర్మాణం. దీనిఅంచనా విలువ రూ.3825.00 కోట్లు. ఈ పంప్‍ హౌజ్‍లో పంపులను 800 అడుగులలెవెల్‍ వద్ద బిగిస్తున్నట్టుగా తెలుస్తున్నది.
  • పోతిరెడ్డిపాడు హెడ్‍ రెగ్యులేటర్‍, దాని కింద శ్రీశైలం కుడి ప్రధాన కాలువను బనకచర్ల కాంప్లెక్స్ వరకు ప్రవాహ సామర్థ్యాన్ని80 వేల క్యూసెక్కులకు పెంచడానికి లైనింగ్‍, తదితర ఇంప్రూవ్‍ మెంట్‍ పనులు చేయడం. ఈ పనుల అంచనా విలువ : రూ. 570.45 కోట్లు
  • శ్రీశైలం కుడి కాలువ (SRBC) / గాలేరు నగరి సుజల స్రవంతి (GNSS) కాలువను లైనింగ్‍ చేసి దాని ప్రవాహ సామర్థ్యాన్ని 30 వేల క్యూసెక్కులకు పెంచడం. వీటి అంచనా విలువ రూ. 2,433.70 కోట్లు.
  • 203 జిఓలో పేర్కొన్న పనుల మొత్తం అంచనా విలువ రూ. 6,829.15 కోట్లు.
  • పాఠకుల అవగాహన కోసం శ్రీశైలం జలాశయం యొక్క కొన్ని ప్రధాన అంశాలను పేర్కొంటున్నాము.
  • శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం (FRL) : 885 అడుగులు
  • FRL వద్ద శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వ: 216 TMCలు
  • శ్రీశైలం జలాశయం కనీస నీటి మట్టం (MDDL) : 834 అడుగులు
  • MDDL వద్ద జలాశయంలో నీటి నిల్వ : 54 TMC పోతిరెడ్డిపాడు హెడ్‍ రెగ్యులేటర్సిల్‍ లెవెల్‍ (Sill Level): 841 అడుగులు
  • పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్‍ దిగువన గల శ్రీశైలం కుడి ప్రధాన కాలువ (SRMC ప్రవాహ సామర్థ్యం 44,000 క్యూసెక్కులు
  • ఇప్పుడు జిఓ 203లో ప్రతిపాదించిన శ్రీశైలం కుడి ప్రధాన కాలువ ప్రవాహ సామర్థ్యం : 80,000 క్యూసెక్కులు
  • పోతిరెడ్డిపాడు హెడ్‍ రెగ్యులేటర్‍ ద్వారా శ్రీశైలం జలాశయంలో నీరు 841 అడుగుల మట్టానికి పైన ఉంటేనే నీటిని తీసుకువెళ్ల గలుగుతారు.


కృష్ణ జలాల కేటాయింపులు :
బచావత్‍ ట్రిబ్యునల్‍ ఆంధప్రదేశ్‍ ఉమ్మడి రాష్ట్రానికి 811 టిఎంసిల నికర జలాలను కేటాయించింది. ఈ నీటిలో 68% పరివాహక ప్రాంతం కలిగిన తెలంగాణాప్రాజెక్టులకు ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించిన నీరు 299 TMCలు (36.86%), 32% పరివాహకప్రాంతం కలిగిన ఆంద్ర ప్రాంతం పొందిన నీటి వాటా 512 టిఎంసిలు (63.14 %). ఇది ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా జలాల్లో తెలంగాణాకు జరిగిన అన్యాయం. నేడు అమలులో ఉన్న ట్రిబ్యునల్‍ తీర్పు ప్రకారం ఎగువ రాష్ట్రాలకు 75% డిపెండబిలిటీ వద్ద కేటాయించిన నికర జలాలు వాడుకున్నాక దిగువకు వచ్చే నీళ్ళను ఉమ్మడి ఆంధప్రదేశ్‍ రాష్ట్రం వాడుకోనే వెసులుబాటు ఉంది. కానీ వాటిపై హక్కు మాత్రం ఉండదు. ఆ వెసులుబాటు (liberty) కూడా భవిష్యత్తులో ఏర్పాటయ్యే ట్రిబ్యునల్‍ పునఃపంపిణీ (రివ్యూ) చేసి మార్చవచ్చు. ఈ వెసులుబాటు ఆధారంగానే ఉమ్మడి రాష్ట్రంలో పలు ప్రాజెక్టులను నాటి రాయలసీమ, తెలంగాణప్రాంతాల్లో ప్రతిపాదించడానికి ఆస్కారం లభించింది. బ్రిజేష్‍ కుమార్‍ ట్రిబ్యునల్‍ (KWDT-ll) ఆ నీళ్ళను కూడా మూడు రాష్ట్రాలకు పంచింది. బ్రిజేష్‍ కుమార్‍ అవార్డు అమల్లోకి రాకుండా సుప్రీం కోర్టు నిలిపివేసినందున ఇప్పటికీ బచావత్‍ ట్రిబ్యునల్‍ అవార్డ్ అమల్లో ఉన్నది. వరద జలాల వినియోగం కోసం ఉమ్మడి రాష్ట్రం తెలంగాణాలో కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్‍ఎల్‍బిసి ప్రాజెక్టులు రాయలసీమలో హంద్రీ-నీవా, గాలేరు-నగరి, వెలిగొండ మొదలైనవి ప్రతిపాదించింది. తెలంగాణ ప్రాజెక్టులకు 77 టిఎంసిలు, ఆంధ్రా ప్రాజెక్టులకు 150 టిఎంసిల వరద జలాలు కేటాయించారు. వరద జలాల కేటాయింపుల్లో కూడా కృష్ణా బేసిన్లో ఉన్న తెలంగాణ పట్ల వివక్షను చూపించారు ఉమ్మడి పాలకులు.


కృష్ణా బేసిన్‍ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్‍ రాష్ట్రాల్లో ప్రాజెక్టుల డిమాండ్స్ లలో సరియైనవిగా భావించిన (worth consideration) వాటిని పరిగణలోకి తీసుకొని వాటన్నింటినీ రాష్ట్రాల పరంగా కలిపి ఆ మొత్తాన్ని గంపగుత్తగా (enbloc or mass allocation) రాష్ట్రాలకు కేటాయించడం జరిగింది. ఈ కేటాయింపులు ఏ ప్రాజెక్టులకు ముడిపెట్టి ఇవ్వ లేదు. రాష్ట్రాలు తమకు కేటాయించిన మొత్తానికి మించకుండా నీటిని ఎక్కడైనా ఎట్లైనా వాడుకోవచ్చు అని ట్రిబ్యునల్‍ స్పష్టం చేసింది. అందువల్లనే, రాష్ట్ర విభజన తరువాత ఆ గంపగుత్త కేటాయింపును, ప్రస్తుత క్రిష్ణా ట్రిబ్యునల్‍-ll (బ్రిజేష్‍ కుమార్‍ ట్రిబ్యునల్‍)కు ప్రాజెక్టుల వారీగా, రెండు తెలుగు రాష్ట్రాలకు కేటాయింపులు చేయాలని ఆంధప్రదేశ్‍ విభజన చట్టం, 2014 సెక్షన్‍ 89 ప్రకారం నివేదించడం జరిగింది. కృష్ణా ట్రిబ్యునల్‍ రెండు రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులు జరిపే దాకా ఇరు రాష్ట్రాల మధ్య 2016 లో కుదిరిన ఒక తాత్కాలిక అవగాహన ప్రకారం 299 మరియు 512 లకు మించకుండా తెలంగాణ మరియు ఆంధప్రదేశ్‍లు ఆయా ప్రాజెక్టుల వద్ద వాడుకుంటున్నాయి. అందువల్లనే నేడు ఆంధ్ర ప్రదేశ్‍, నాగార్జునసాగర్‍, ప్రకాశం బ్యారేజీల వద్ద కాకుండా పోతిరెడ్డిపాడు, హెచ్‍ఎన్‍ఎస్‍ఎస్‍ తదితరాల వద్ద నుండి తన కోటా నీళ్ళను వాడుకో గలుగుతున్నది. అట్లాగే, తెలంగాణ తన వాటాలోంచి జూరాల, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల సాగర్‍, ఎలిమినేటి మాధవరెడ్డి, నాగార్జునసాగర్‍ ప్రాజెక్టుల వద్ద వాడుకోగలుగుతున్నది. ఈ నిష్పత్తిలో ఇరు రాష్ట్రాలు వాడుకోవడం తాత్కాలికం. ప్రస్తుత ట్రిబ్యునల్‍ తన తీర్పు ఇచ్చేవరకు మాత్రమే అని గమనించాలి. ఆంధప్రదేశ్‍ రాష్ట్రం రాయలసీమ ఎత్తిపోతల పథకం, శ్రీశైలం కుడి ప్రధాన కాలువ సామర్థ్యాన్నిపెంచే పనులు, బనకచర్ల క్రాస్‍ రెగ్యులేటర్‍ కింద కాలువల విస్తరణ పనులు చేపట్టింది. వీటి వల్ల కృష్ణా నదీ జలాల్లో తెలంగాణాకు న్యాయబద్దంగా పొందాల్సిన వాటాకు గండి పడే ప్రమాదం ఏర్పడింది. పాలమూరు-రంగారెడ్డి, డిండీ, ఎస్‍ఎల్బిసి, కల్వకుర్తి, నాగార్జునసాగర్‍ ఎడమ కాలువ ఆయకట్టు, హైదారాబాద్‍కు తాగునీరు, మిషన్‍ భగీరథ తాగునీటి పథకాలకు తీవ్రమైన నీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. కృష్ణా బేసిన్లోని మహబూబ్‍ నగర్‍, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో ఒక పంటకు సాగునీటికి, తాగునీటికి అలమటిస్తుంటే, కృష్ణాబేసిన్‍ ఆవతల పెన్నా బేసిన్లో అయిదారు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న భూములకు పెద్ద ఎత్తున నీటిని తరలించే ఈ పథకాలు పూర్తిగా అక్రమమైనవి. మోసపూరితమైనవి.


కృష్ణా నదినే మలుపుక పోయే కుట్ర :

పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచడం ఇది మూడవసారి. మానవతా దృక్పథంతో 15 టిఎంసిల నీటిని 1500 క్యూసెక్కులతో చెన్నై తాగునీటి ప్రాజెక్టుపై మూడు రాష్ట్రాల మధ్య ఒప్పందం 1976-77 లో కుదిరింది. ఆ తర్వాత 19 టిఎంసిల శ్రీశైలం కుడిగట్టు కాలువను తెరపైకి తెచ్చి, చెన్నై తాగునీటి పథకంతో కలిపి శ్రీశైలం కుడి ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 11,500 క్యూసెక్కులకుపెంచినారు. తరువాత దానికి తెలుగుగంగ కాలువ అనే పేరు పెట్టారు. పోతిరెడ్డిపాడు హెడ్‍ రెగ్యులేటర్‍ను 4 గేట్లతో 11,500 క్యూసెక్కుల సామర్థ్యంతో ఎన్టీఆర్‍ హయాంలో నిర్మించారు. పోతిరెడ్డిపాడు నుంచి ఆంధప్రదేశ్‍ తరలించగలిగే నికర జలాలు 34 టిఎంసిలు మాత్రమే. 2005-06 లో వైఎస్సార్‍ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని10 అదనపు గేట్లతో కాలువ సామర్థ్యాన్ని 44,000 క్యూసెక్కులకు పెంచింది. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత బ్రిజేష్‍ కుమార్‍ ట్రిబ్యునల్‍ ముందు ఈ పెంపును సవాలు చేయడం జరిగింది. ఈ అంశం ట్రిబ్యునల్‍ విచారణలో ఉన్నది. అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్టు వైఎస్సార్‍ తనయుడు 44 వేల క్యూసెక్కులను 88 వేలకు పెంచాడు. ట్రిబ్యూనల్‍ ముందు న్యాయ విచారణలో ఉన్న ఈ వివాదాస్పద అంశాన్ని 88 వేల క్యూసెక్కులకు పెంచడం అక్రమం.


పోతిరెడ్డిపాడు తూముల వాస్తవ సామర్థ్యం:
పోతిరెడ్డిపాడు వద్ద పాతవి 4 గేట్లు, కొత్తవి 10 గేట్లు ఉన్నాయి. శ్రీశైలం ప్రధాన కుడి ప్రధాన కాలువను లైనింగ్‍ చేసినట్లైతే ఆ కాలువ కొలతలేమీ మార్చకుండానే 88,800 క్యూసెక్కులను పంపవచ్చు. అంటే రోజుకు 7.67 టిఎంసీలను తరలించవచ్చు. వరద ఉన్నప్పుడు గ్రావిటి ద్వారా, వరద లేనప్పుడు సంగమేశ్వరం వద్ద ప్రతిపాదించిన రాయలసీమ పంపింగ్‍ సిస్టం ద్వారా తరలిస్తారు. కేవలం వరద జలాలను మాత్రమే తరలిస్తామని వారు చెపుతున్నప్పటికీ శ్రీశైలం జలాశయంలో సంగమేశ్వరం వద్ద నిర్మించడాలచిన రాయలసీమ పంప్‍ హౌజ్‍ లెవెల్‍ ను 797 అడుగుల లోతులో పెట్టారు. అంటే శ్రీశైలంలో ఏ మట్టంలో నీరున్నా ఆ నీటిని తరలించ గలిగే ఏర్పాట్లు వారు చేస్తున్నారు.ఇక పోతిరెడ్డిపాడుకు అదనంగా శ్రీశైలం నుండి ముచ్చుమర్రి వద్ద నిర్మించిన హంద్రీ-నీవా లిఫ్ట్ స్కీం ద్వారా 3850 క్యూసెక్కులు, కెసి కెనాల్‍ లిఫ్ట్ స్కీం ద్వారా 1000 క్యూసెక్కులు, వెలిగొండ టన్నెల్‍ ద్వారా 11,570 క్యూసెక్కుల చొప్పున.. రోజుకు 1.42 టిఎంసీలు తరలిస్తారు. అంటే శ్రీశైలం నుండి రోజుకు మొత్తం 7.67+1.42=9.09 టిఎంసీలు మళ్లించే సామర్థ్యం ఆంధప్రదేశ్‍ రాష్ట్రానికి ఏర్పడుతుంది. ఈ నీరంతా కృష్ణా బేసిన్‍ ఆవల పెన్నా బేసిన్‍కు తరలిపోతాయి. బ్రిజేష్‍ ట్రిబ్యునల్‍ ఇంకా రెండు రాష్ట్రాలకు కేటాయింపులు జరపక ముందే ఇంత పెద్ద ఎత్తున నీటిని తరలించే పథకాలు చేపట్టడం నీటి దోపిడి కాకపోతే మరెమిటీ? ఇక తెలంగాణ సంగతి చూస్తే.. ఎస్‍ఎల్‍బిసి టన్నెల్‍ ద్వారా 4,000 క్యూసెక్కులు, పాలమూరు-రంగారెడ్డి మరియు డిండి ఎత్తిపోతల ద్వారా 23,150 క్యూసెక్కులు, కల్వకుర్తి నుండి 3200 క్యూసెక్కులు.. మొత్తం 30,350 క్యూసెక్కులు.. అంటే రోజుకు 2.62 టిఎంసిల నీటిని శ్రీశైలం జలాశయం నుంచి తరలించే అవకాశం తెలంగాణా ఉంటుంది.


ఆంధ్రా నాయకుల అసంబద్ద వాదనలు :

పోతిరెడ్డిపాడు వివాదం నేపథ్యంలో కృష్ణా జల వివాదాలపై ఆంధప్రదేశ్‍ తరపున అసంబద్ద వాదనలు వినిపిస్తున్నాయి. వాటిలో ముఖ్యమైన అంశాలను పరిశీలిద్దాం.


1. 512 టిఎంసిల మా వాటా నీళ్ళను వాడుకోవాటానికి ప్రాజెక్టులు కట్టుకుంటే అభ్యంతరాలు దేనికి ?

పూర్వపు ఆంధప్రదేశ్‍ రాష్ట్రానికి బచావత్‍ ట్రిబ్యునల్‍ 811 టిఎంసిల నీటిని గంపగుత్తగా కేటాయించిన నీటిలో ఆంధ్ర ప్రాంత ప్రాజెక్టులకు చేసిన పునః కేటాయింపులు 512 టిఎంసిలు, తెలంగాణ ప్రాంత ప్రాజెక్టులకు చేసినవి 299 టిఎంసిలు. ఉమ్మడి ఆంధప్రదేశ్‍ ప్రభుత్వం బేసిన్‍ లో 68% ఉండే తెలంగాణకు 36.80 % నీటిని కేటాయించి, 32% ఉన్న ఆంధ్రా ప్రాంతానికి 63.20% కేటాయించడం అన్యాయం. ఆంధ్రాకు కేటాయించిన 512 టిఎంసిల నీటిలో 350 టిఎంసిలకు పైగా నీరు బేసిన్‍ ఆవల ఉన్న ప్రాంతాలకు తరలిపోతున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణా ప్రాజెక్టులకు న్యాయబద్దంగా రావలసిన వాటా కోసం తెలంగాణా ప్రభుత్వం బ్రిజేష్‍ కుమార్‍ ట్రిబ్యునల్‍ ముందు పోరాటం చేస్తున్నది. నికర జలాల కేటాయింపులు లేని ఎస్‍ఎల్‍బిసి, కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు-రంగారెడ్డి, డిండీ, గట్టు తదితర ప్రాజెక్టులకు కలిపి కనీసం 565 టీఎంసీలు రావాలని ఆశిస్తున్నది. బ్రిజేష్‍ కుమార్‍ ట్రిబ్యునల్‍ తీర్పు వచ్చే వరకు తాత్కాలికంగా నీటిని 299:512 నిష్పత్తిలో పంచుకోవడానికి ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి. ఇది తాత్కాలిక ఏర్పాటే తప్ప హక్కు కాదు. ఇది కూడా ఒక సంవత్సరం వరకే. ట్రిబ్యునల్‍ తీర్పు వచ్చేవరకు ఆంధప్రదేశ్‍ రాష్ట్రం కృష్ణాలో తమ వాటా 512 టిఎంసిలు అని చెప్పుకోవడానికి వీలు లేదు. కొత్త ప్రాజెక్టులు కట్టి ఈ కేటాయింపులను స్థిరపరచుకుంటామని అనడం న్యాయ విరుద్దం. మోసపూరితం. రాష్ట విభజన జరిగిన తర్వాత ఇప్పటికీ ఇరు రాష్ట్రాలకు కృష్ణాలో adjuducate అయిన నీటి వాటాలు లేవు. అందువల్ల మా నీరు మేము వాడుకుంటామన్న ఆంధప్రదేశ్‍ వాదన ఆమోదయోగ్యం కాదు.

2.సముద్రంలోకి వృధాగా పోతున్న వరద జలాలను తరలించడానికి ప్రాజెక్టులు కట్టుకుంటే తప్పు ఏమిటి?
సముద్రంలోకి వృధాగా పోతున్న వరద నీటిని కరువు పీడిత ప్రాంతాలకు తరలించడానికి తెలంగాణకు అభ్యంతరం లేదు. తెలంగాణ సర్వేజనా సుఖినోభవంతు అన్న భావన కలిగిన సమాజం. అయితే వరద జలాలు అంటే ఏవీ? 216 టిఎంసిల సామర్థ్యం కలిగిన శ్రీశైలం, దిగువన ఉన్న 312 టిఎంసిల నాగార్జున సాగర్‍, 45 టిఎంసిల పులిచింతల నిండి పొంగి పోర్లుతున్నప్పుడు మాత్రమే కృష్ణా నదిలో వరద జలాలు ఉన్నట్టు లెక్క. ఇవన్నీ పొంగి పొర్లుతున్నప్పుడు, శ్రీశైలం వద్ద పూర్తి నీటి మట్టం (885 అడుగులు) ఉన్నప్పుడు కదా వరద జలాలను తీసుకోవలసింది. అప్పుడు పోతిరెడ్డిపాడు హెడ్‍ రెగ్యులేటర్‍ ద్వారా గ్రావిటీ ద్వారానే ఇప్పుడున్న వ్యవస్థ ద్వారానే తీసుకుపోయే అవకాశం ఉంది కదా! మరి ఈ రాయలసీమ లిఫ్ట్ స్కీమ్‍ పంపింగ్‍ లెవెల్‍ శ్రీశైలం జలాశయం అట్టడుగు నుంచి (797 అడుగులు) నీటిని తోడుకోవడం అంటే అది వరద నీటిని తీసుకోవడం ఎట్లా అవుతుంది? శ్రీశైలం రిజర్వాయర్‍ లోకి జూన్‍ జులై నెలల్లో వచ్చే కృష్ణా నది తొలి ప్రవాహాలను మరియు రిజర్వాయర్లో నిలువ ఉన్న డెడ్‍ స్టోరేజి నుంచి నీటిని మొత్తంగా మళ్లించడానికి ఉద్దేశించిందే ఈ కొత్త లిఫ్ట్ స్కీం అని రూడి అవుతున్నది. అందువల్ల పోతిరెడ్డిపాడు కాలువ సామర్థ్యాన్ని పెంచడం, రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణం తెలంగాణ ప్రాజెక్టులకు గొడ్డలిపెట్టు లాంటిదని చెప్పక తప్పదు.

3.పోతిరెడ్డిపాడు కింద ఉన్నతెలుగుగంగ, హంద్రీనీవా, గాలేరునగరి, వెలిగొండ తదితర ప్రాజెక్టులకు కేటాయింపులు ఉన్నాయి. వాటి అవసరాలను తీర్చడం కొసం మాత్రమే రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టినాము తప్ప కొత్తగా సాగు లోకి వచ్చే ఒక్క ఎకరం లేదు, నింపడానికి కొత్త జలాశయం లేదు.
అసలు పోతిరెడ్డిపాడు నుంచి ఎంత నీటిని తరలించడానికి అనుమతులు ఉన్నాయి అన్నది కీలకమైన అంశం. ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించిన ప్రాజెక్టులు, జలాశయాలు అన్నీ ఏ అనుమతులు లేకుండా నిర్మించినవే. 1976 వెలువరించిన తీర్పులో బచావత్‍ ట్రిబ్యునల్‍ (KWDT-l) శ్రీశైలం ప్రాజెక్టును కేవలం జల విద్యుత్‍ ప్రాజెక్టుగానే పరిగణించింది. శ్రీశైలం జలాశయం నుంచి 33 టిఎంసి ఆవిరి నష్టాలను మాత్రమే బచావత్‍ ట్రిబ్యునల్‍ కేటాయించింది తప్ప సాగు నీటికి కేటాయింపులు ఇవ్వలేదు. మానవతా దృక్పథంతో మద్రాస్‍ నగరానికి 15 టిఎంసిల తాగునీరు అందించడానికి మూడు రాష్ట్రాల మధ్య 1977లో ఒక ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం ప్రకారం పోతిరెడ్డిపాడు వద్ద నిర్మించే రెగ్యులేటర్‍ ద్వారా 1500 క్యూసెక్కుల నీటిని తాగునీటి కోసం మాత్రమే తరలించాలి. ఆ నీటిని సాగు కోసం వినియోగించరాదు అని ఒప్పందంలో స్పష్టంగా రాసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆంధప్రదేశ్‍ ప్రభుత్వం శ్రీశైలం కుడి గట్టు కాలువకు 19 టిఎంసిల కృష్ణా నికర జలాలను కేటాయిస్తూ కేంద్ర ప్లానింగ్‍ కమీషన్‍ నుంచి అనుమతి పొందింది. అట్లా పోతిరెడ్డిపాడు నుంచి తరలించే నీటి పరిమాణం 34 టిఎంసిలకు పెరిగింది.


1500 క్యూసెక్కుల సామర్థ్యంతో నిర్మాణం కావలసిన పోతిరెడ్డిపాడు హెడ్‍ రెగ్యులేటర్‍ 11,500 క్యూసెక్కుల సామర్థ్యంతో, 4 గేట్లతో నిర్మాణం అయ్యింది. ఆ తర్వాత అదనపు జలాల వినియోగం కోసం తెలుగుగంగ, హంద్రీనీవా, గాలేరునగరి, వెలిగొండ తదితర ప్రాజెక్టులు నిర్మించుకున్నారు. ఈ ప్రాజెక్టుల కింద 350 టిఎంసిల సామర్థ్యం కలిగిన జలాశయాలు నిర్మించుకున్నారు. ఈ ప్రాజెక్టులకు వేటికీ నికర జలాల కేటాయింపులు లేవు. ఏ ట్రిబ్యునల్‍ అనుమతులు లేవు. ఇవన్నీ పెన్నా బెసీన్లో ఉండే ప్రాంతాలకు కృష్ణా నీటిని సరఫరా చేసే ప్రాజెక్టులు.ట్రిబ్యునల్‍ అనుమతులు లేని, బేసిన్‍ ఆవల ఉన్న ప్రాంతాలకు నీటిని తరలించడానికి రాజశేఖర్‍రెడ్డి హయాంలో పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 44000 క్యూసెక్కులకు పెంచుకున్నారు. కొత్తగా 10 గేట్లు నిర్మాణం అయినాయి. ఇప్పుడు పోతిరెడ్డిపాడు సామర్త్యాన్ని 80000 క్యూసెక్కులకు పెంచడానికి జగన్‍ మోహన్‍ రెడ్డి ప్రభుత్వం జిఓలు జారీ, టెండర్లు పిలిచి పనులకు శ్రీకారం చుట్టింది. కొత్తగా రోజుకు 3 టిఎంసిలను తరలించే సామర్థ్యం కలిగిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రతిపాదించింది. పోతిరెడ్డిపాడు నుంచి అనుమతి కేవలం 34 టిఎంసిలకు ఉంటే ఆంధ్రా ప్రభుత్వం 250-300 టిఎంసిల నీటిని తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నది. అదే సమయమలో ఉమ్మడి రాష్ట్రంలో శాంక్షన్‍ అయిన, వంద శాతం బేసీన్లో ఉన్న పాలమూరు రంగారెడ్డి, డిండీ ఎత్తిపోతల పథకాలను కొత్త ప్రాజెక్టులని ముద్ర వేస్తున్నది. గతంలో ఏనాడూ జాడ పతా లేని, పెద్ద ఎత్తున బేసిన్‍ ఆవలకు నీటిని తరలించే రాయలసీమ ఎత్తిపోతల పథకం మాత్రం కొత్తది కాదట. ఇంతకంటే హాస్యాస్పదం అయిన విషయం మరొకటి ఉంటుందా?

4.తెలంగాణ ప్రాజెక్టులు శ్రీశైలం నుంచి 800 అడుగుల మట్టం నుంచి నీటి పంపు చేస్తున్నారు కనుక మేము కూడా అదే మట్టం నుంచి పంపు చేసుకోవడానికి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రతిపాదించాము.
బేసిన్లో ఉండే తెలంగాణ ప్రాజెక్టులను, బేసిన్‍ ఆవలకు నీటిని తరలించే ఆంధ్రా ప్రాజేక్టులను ఒకే గాటన కట్టి వాదించే పద్దతి గర్హనీయం. నదీ జలాల కేటాయింపుల్లో దశాబ్దాలుగా జరిగిన అన్యాయం ఫలితమే తెలంగాణ ప్రత్యెక రాష్ట్ర ఉద్యమం. ఇదే విషయాన్నిఅపెక్స్ కౌన్సిల్‍ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‍ గట్టిగా చెప్పారు. ఇండస్‍ కమీషన్‍ (1942) మొదలుకొని హెల్సింకి రూల్స్ (1966), యునైటెడ్‍ నేషన్స్ వాటర్‍ కోర్సెస్‍ కన్వెన్షన్‍ (1997), బచావత్‍ ట్రిబ్యూనల్‍ (1980), బ్రిజేష్‍ కుమార్‍ ట్రిబ్యూనల్‍ (2013), ఎన్‍డి గుల్హాటి లాంటి జల వివాదాల నిపుణులు అందరూ బేసిన్లో ప్రాంతాల అవసరాలు తీరిన తర్వాతనే మిగులు జలాలను బేసిన్‍ ఆవల ఉన్న ప్రాంతాలకు తరలించవచ్చునని నిర్దేశిస్తున్నారు. కానీ కృష్ణా నదీజలాలను ఏ విధమైన సహజ న్యాయసూత్రాలు, అంతర్జాతీయ న్యాయ సూత్రాలు గానీ పట్టించుకోకుండా కేవలం ఆంధ్ర ప్రాంతాల ప్రయోజనాలే లక్ష్యంగా ఉమ్మడి ఆంధప్రదేశ్‍ ప్రభుత్వాలు తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో తీవ్ర వివక్ష చూపించాయి.ఉమ్మడి రాష్ట్రంలో జగినదంతా తిరకాసు వ్యవహారమే. మొదట ఏదో విధంగా ప్రాజెక్టులను కట్టి ఆ తరువాత వాటి వినియోగాలను కొన్ని సంవత్సరాల తర్వాత ఇప్పటికే వాడుకలో ఉన్న, స్థిరపడ్డ వినియోగాలుగా హక్కులు అడగడం ఒక వ్యూహంగా ఆంధప్రదేశ్‍ ప్రాజెక్టుల పర్వం సాగింది. విచిత్రంగా ఈ ప్రాజెక్టులన్నీ కూడా కృష్ణా బేసిన ఆవల ఉన్న ప్రాంతాలకు నీటిని తరలించేవే.


కృష్ణా ట్రిబ్యునళ్ళు బేసిన్‍ ఆవలి మరియు బేసిన్‍ లోపలి వినియోగాలను ఒకే విధంగా పరిగణించలేదు. బ్రిజేష్‍ కుమార్‍ ట్రిబ్యూనల్‍ తీర్పును రాసేటప్పుడు బేసిన్‍ లోపల ప్రాంతాలు ఏవి, బేసిన్‍ ఆవల ప్రాంతాలు ఏవి అన్న అంశాలను పరిగణనలోకి తీసుకున్నది. అందుకే ఆంధప్రదేశ్‍ ఎంత వేడుకున్నా బేసిన ఆవల ఉన్న ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేయలేమని ఖరాఖండిగా చెప్పింది. ‘‘బేసిన్‍ ఆవలికి కేటాయింపులు చేయడంపై నిషేదం లేదు కానీ, బేసిన్‍ లోపలి అవసరాలను పట్టించుకోకుండా ఒక పరిమితిని మించి చేయడం సరికాదు’’ అని స్పష్టం చేసింది. ఎన్‍డి గుల్హాటి తన ‘‘అంతరాష్ట్ర నదుల అభివృద్ధి : లా అండ్‍ ప్రాక్టీస్‍’’ అనే పుస్తకంలో ‘‘బేసిన్‍లోని ప్రాంతాలకు ఆ నది జలాలపై మొదటి యాజమాన్య హక్కు ఉంటుంది. బేసిన్లోని ప్రాంతాల అవసరాలు పూర్తిగా తీరిన తర్వాత ఆ పైన లభించే నీటిని బేసిన్‍ ఆవలి ప్రాంతాలకు మళ్లించవచ్చు. బేసిన్‍ అవసరాలను కాదని బేసిన్‍ ఆవలికి తరలిస్తే ఇప్పుడైనా ముందుముందైనా అవాంఛనీయ ఉపద్రవాలకు దారితీయవచ్చు’’ అని హెచ్చరించారు. ఇప్పుడు కృష్ణా బేసిన్లో జరుగుతున్నది అదే. కృష్ణా బేసిన్లో ఉండే మహబూబ్‍ నగర్‍, నల్లగొండ, రంగారెడ్డి, హైదరాబాద్‍ జిల్లాల సాగు, తాగునీటి అవసరాలు తీరిన తర్వాతనే బేసిన్‍ ఆవల ప్రాంతాలకు నీటిని తరలించడానికి తెలంగాణకు అభ్యంతరం ఉండదు. మీరు 800 అడుగుల వద్ద నుంచి నీటిని పంపు చేస్తున్నారు కనుక మేమూ అదే మట్టం వద్ద నుంచి నీటిని పంపు చేస్తాము అన్నది గిడసబారిన న్యాయ విరుద్ద భావన


కోర్టు, కేంద్రం ఆదేశాలు ఉల్లంఘించి..
ఆంధప్రదేశ్‍ విభజన చట్టం 2014 ప్రకారం రెండు రాష్ట్రాలు తప్పనిసరిగా కృష్ణా నది యాజమాన్య బోర్డు సిఫారసుతో, అపెక్స్ కౌన్సిల్‍ అనుమతి తీసుకొని మాత్రమే కొత్త ప్రాజెక్టులు చేపట్టాలి. ఆంధప్రదేశ్‍ ఈ చట్టాన్ని బేఖాతరు చేసి రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టింది. చంద్రబాబు హయాంలో పట్టిసీమ, పురుషోత్తపట్నం తదితర ప్రాజెక్టులను నిర్మించింది. ఆంధప్రదేశ్‍ నిరంతరాయంగా విభజన చట్టాన్ని ఉల్లంఘించి ప్రాజెక్టులు చేపడుతూ, ఉమ్మడి రాష్ట్రంలోనే అనుమతి పొందిన పాలమూరు-రంగారెడ్డి, డిండీ ఎత్తిపోతల పథకాలను, అనుమతులన్నీ పొందిన కాళేశ్వరం, దేవాదుల, సీతారామా, తుపాకులగూడెం, మిషన్‍ భగీరథ ప్రాజెక్టులను నిలిపి వేయమని కేంద్ర ప్రభుత్వానికి శికాయతులు చేస్తున్నది. ఇదీ ఆంధప్రదేశ్‍ ప్రభుత్వం అనుసరిస్తున్న రెండు నాలుకల ధోరణి. కేంద్ర జలశక్తి మంత్రి, కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‍ఎంబి), నేషనల్‍ గ్రీన్‍ ట్రిబ్యునల్‍ ఆదేశాలను సైతం ధిక్కరించి రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు కొనసాగిస్తున్నది. ప్రాజెక్టు డిపిఆర్‍ తయారీ కోసం సర్వే పనులు మాత్రమే కొనసాగిస్తున్నామని గ్రీన్‍ ట్రిబ్యునల్‍ కు చెప్పిన ఆంధప్రదేశ్‍, వందలాది టిప్పర్లు, మట్టిని తవ్వే భారీ యంత్రాలు, కాంక్రీట్‍ బ్యాచింగ్‍ ప్లాంట్‍, కంకర క్రషింగ్‍ ప్లాంట్‍లను భారీగా పనులు చేయడానికి కాకపోతే ఎందుకు నెలకొలిపినట్టు? ఇంత జరుగుతున్నా కేంద్రం మాత్రం లేఖలు రాసి తమ పని అయిపోయినట్టు చేతులు దులుపుకున్నది. తమ ఆదేశాలను అమలు చేయించడంలో కేంద్రం విఫలం అయ్యింది కనుకనే న్యాయం కోసం తెలంగాణ సుప్రీం కోర్టు, గ్రీన్‍ ట్రిబ్యునల్‍ తలుపులు తట్టవలసి వచ్చింది. ఎన్‍జిటి తొలుత పనులను నిలిపి వేస్తూ స్టే ఇచ్చింది. ఆ తర్వాత సమగ్ర విచారణ అనంతరం 2021 ఫిబ్రవరిలో పర్యావరణ అనుమతి పొందే వరకు ప్రాజెక్టు పనులు కొనసాగించ వద్దని ఆదేశించింది.


రాజీ లేని పోరాటం :
కృష్ణా నది జలాల్లో తెలంగాణకు దక్కవలసిన న్యాయమైన వాటా కోసం రాజీ లేని పోరాటం చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటించారు.6 అక్టోబర్‍, 2020 న జరిగిన రెండవ అపెక్స్ కౌన్సిల్‍ సమావేశంలో గట్టిగావాదించారు. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటాను సంపూర్ణంగా వినియోగించుకునే విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ ప్రాజెక్టులకు కేటాయించిన 967.94 టిఎంసిల గోదావరి జలాలను వినియోగించు కోవడానికి ప్రభుత్వం ఇప్పటికే ప్రాజెక్టులను రూపకల్పన చేసి అమలు చేస్తున్నది. కృష్ణా జలాల్లోన్యాయంగా రావలసిన 565 టిఎంసిల వాటా కోసంబ్రిజేష్‍ కుమార్‍ ట్రిబ్యూనల్‍ ముందు వాదనలు వినిపిస్తున్నది. కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్‍ఎల్‍బిసి,పాలమూరు, డిండీ, గట్టు ప్రాజెక్టులకు నికర జలాలు కేటాయించమని ట్రిబ్యూనల్‍కు నివేదించింది. ఆంధప్రదేశ్‍ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పనులను అనుమతులు పొందకుండా కొనసాగించినట్టయితే తెలంగాణ రైతాంగం ప్రయోజనాలను కాపాడటానికి, కృష్ణా జలాలపై తమ హక్కును స్థిరపరచుకోవడానికి తాము ఆలంపూర్‍ వద్ద రోజుకు 3 టిఎంసిలు ఎత్తిపోసేందుకు బ్యారేజీని నిర్మిస్తామని అపెక్స్ కౌన్సిల్‍ సమావేశంలోనే ప్రకటించారు. ఈ మాట సమావేశం మినిట్స్లో కూడా నమోదు అయ్యింది. వారికి తగినంత సమయాన్ని ఇచ్చి, అన్ని సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాత ప్రతిచర్యగా కృష్ణా జలాల వినియోగం కోసం జోగులాంబ బ్యారేజి, భీమా వరద కాలువ, సుంకేశుల జలాశయం నుంచి మరో ఎత్తిపోతల పథకం, పులిచింతల జలాశయం నుంచి ఎడమ కాలువ, నాగార్జునసాగర్‍ టెయిల్‍ పాండ్‍ నుంచి ఎత్తిపోతల పథకం చేపడతామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రాజెక్టుల డిపిఆర్‍ లను తయారు చేయమని సాగునీటి శాఖను ప్రభుత్వం ఆదేశించింది. ఇది అనివార్యమైన ప్రతిచర్య. రాష్ట్ర ప్రయోజ నాలను కాపాడుకోవడానికి తెలంగాణ సమాజం కలసికట్టుగా నిలబడి ప్రభుత్వం చేస్తున్నక•షికి మద్దతుగా నిలవాల్సిన తరుణం ఇది.

శ్రీధర్‍రావ్‍ దేశ్‍పాండే

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *