గ్రీన్ ఇండియా చాలెంజ్‍లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి
‘ప్రపంచ నదులు దినోత్సవం’ సందర్భంగా మూసీనది వద్ద మొక్కలు నాటిని పర్యావరణవేత్త
మణికొండ వేదకుమార్
ఎన్నో చాలెంజ్‍లు ఉంటాయి కానీ గ్రీన్‍చాలెంజ్ లాంటిది మాత్రం ప్రపంచంలో ఎక్కడా చూడలేదని పర్యావరణవేత్త మణికొండ వేదకుమార్ అన్నారు. హరితహారంలో ఒక సీజన్ వరకు మాత్రమే మొక్కలు నాటుతుంటారని, గ్రీన్ చాలెంజ్ మాత్రం 365 రోజులు కొనసాగుతుందని తెలిపారు. మార్చి నెల మండుటెండల్లోనూ గ్రీన్ చాలెంజ్‍లో మొక్కలు నాటడం గొప్ప విషయమన్నారు. సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకు ఇందులో పాల్గొంటున్నారని తెలిపారు. మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రతిరోజు జరగటం ఒక్క తెలంగాణలోనే సాధ్యమవుతున్నదని అన్నారు. అన్ని రాస్ట్రాలకు ఎంపీ సంతోష్‍కుమార్ మొదలుపెట్టిన చాలెంజ్ మోడల్‍గా మారిందని పేర్కొన్నారు.
‘ప్రపంచ నదులు దినోత్సవం’ సందర్భంగా మూసీనది వద్ద విద్యార్థులతో కలిసి వేదకుమార్ మొక్కలు నాటారు. నారాయణపేట ఎస్‍పీ చేతన ఐపీఎస్ విసిరిన చాలెంజ్‍ను స్వీకరించి మొక్కలు నాటామని అన్నారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వాములై మొక్కలు నాటి నదులను కాపాడుకోవాలని తెలిపారు. దసరా పండుగకు ఎంపీ సంతోష్‍కుమార్ 20వేల జమ్మిచెట్టు మొక్కలను పంపిణీ చేయడం గొప్ప విషయమన్నారు. వివక్షకు గురైన ప్రాంతాన్ని సుస్థిరాభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‍రావు తీసుకొంటున్న నిర్ణయాలు సత్ఫలితాలిస్తున్నాయన్నారు. గ్రామస్థాయిలో హరితహారం ఉద్యమంలా సాగటం వల్లనే ఏడేండ్లలో నాలుగుశాతం గ్రీన్‍కవర్‍ను పెంచుకో గలిగామన్నారు.
చరిత్రలో ఎప్పుడు, ఎక్కడ మొక్కలు నాటినా 50 శాతం కంటే ఎక్కువ బతికిన దాఖలాలు లేవని, హరితహారంలో నాటిన మొక్కల్లో 85శాతానికిపైగా బతికాయని వేదకుమార్ పేర్కొన్నారు. ఎంతో నిబద్ధత, చిత్తశుద్ధి, నిజాయతీతో పర్యావరణం పరిరక్షణకు చేసిన కృషికి ఇది నిదర్శనమన్నారు. మొక్కలు నాటడం తెలంగాణ జీవన విధానంలో ఒక భాగమైందని, రోడ్లకు ఇరువైపులా, పారిశ్రామిక ప్రాంతాల్లో, యూనివర్సిటీల్లో, అటవీ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా పెద్ద సంఖ్యలో మొక్కలు నాటుతున్నారని తెలిపారు. దీనివల్ల భూమి కోత నివారణ, భూగర్భ జలాల పెంపు, పక్షి, జంతువులకు ఆవాసం, ఆహారం అందించడం సాధ్యమవుతున్నదని చెప్పారు. కాలుష్యాన్ని నివారించి, ప్రాణవాయువును అందించడం జీవవైవిధ్యాన్ని కాపాడటంలో హరితహారం ఎంతో ఉపయోగపడుతున్నదని పేర్కొన్నారు.
గ్రీన్ ఇండియా చాలెంజ్‍తో దేశవిదేశాలకు తెలంగాణ హరిత కాంక్షను చేరవేసిన ఎంపీ సంతోష్‍కుమార్‍ను వేదకుమార్ ప్రశంసించారు. వేదకుమార్ నారాయణపేట ఎస్‍పీ చేతన ఐపీఎస్ విసిరిన చాలెంజ్‍ను స్వీకరించి మొక్కలు నాటిన అనంతరం గ్రీన్ ఇండియా చాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాల్సిందిగా పద్మశ్రీ శాంతా సిన్హా నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ చైర్ పర్సన్, ఎన్‍కె పటేల్, సన్ బిల్డర్స్ ప్రెసిడెంట్స్ ఫౌండర్ ఛైర్మన్, డాక్టర్ రావు, వి.బి.జే. చెలికాని, నేషనల్ ప్రెసిడెంట్ కాన్పిడరేషన్ ఆఫ్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్, ఇండియా ప్రొఫెసర్ సయ్యద్ ఐమల్ హసన్, మను యూనివర్సిటీ నవీన్ పిప్లానీ ప్రెసిడెంట్ ఐ కామస్ ఇండియా, హరిప్రీత్ సింగ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, డైరెక్టర్ జనరల్ ఎంసీఆర్‍హెచ్‍ఆర్‍డి, ఇంజినీర్ నరేంద్రసింగ్ ప్రెసిడెంట్, ఇన్సిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ మహమ్మద్ షఫీవుల్లా, రాష్ట్ర వక్ప్బోర్డ్ చైర్మన్‍లకు వేదకుమార్ చాలెంజ్ విసిరారు. కార్యక్రమంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ కో – ఫౌండర్ రాఘవ, ఎఫ్‍బిహెచ్ సభ్యులు శోభాసింగ్, ఆదర్శ్ కుమార్ శ్రీవాస్తవ, జి. వేణుగోపాల్, మహమ్మద్ తురట్, విద్యావేత్తలు, పర్యావరణ వేత్తలు పాల్గొన్నారు.
- దక్కన్‍న్యూస్, ఎ : 9030 6262 88