భావితరాల ప్రయోజనకారి-నేటి విద్యావిధానం

అనేక సామాజిక రుగ్మతలకు మూలం నిరక్షరాస్యత.
ఈ నిరక్షరాస్యతకు మూలం సామాజిక అసమానతలు.


విద్య, వైద్య విధానాల రూప కల్పన, ఆచరణ ఆయా సామాజికాభివృద్ధికి కారణమవుతాయి. నూతన రాష్ట్రం ఏర్పడినాక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందరికీ విద్య అందాలన్న సదాశయంతో దేశంలో మరెక్కడా లేని విధంగా కెజీ టూ పీజీ ఉచిత విద్యకు అంకిత భావంతో అంకురార్పణ చేసింది. గిరిజన, ఆదివాసీ, మైనారిటీ, దళిత బహుజన విద్యార్థుల కోసం గురుకుల పాఠశాలలను, స్థానిక, ప్రాంతీయ భాషల అభివృద్ధిలో భాగంగా ఉర్దూ పాఠశాలలను, మోడల్‍ స్కూళ్ల్లను విజయవంతంగా నిర్వహిస్తున్నది. కరోనా అన్ని రంగాల వలె విద్యా రంగాన్ని అతలాకుతలం చేసింది. సుదీర్ఘకాలం విద్యా సంస్థలు మూతపడ్డాయి. ఆన్‍లైన్‍ క్లాస్‍లు అందరికీ అందుబాటులో లేవు. డ్రాఫ్‍-అవుట్స్ పెరిగాయి. సుదీర్ఘకాలం పాఠశాలలు మూసివేత వల్ల వచ్చే అనర్థాల గురించి విద్యా వేత్తలు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఉన్నారు. వీటిని గుర్తించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా మూడవ వేవ్‍ విజృంభిస్తున్న సమయంలో కూడా ఎందరు వ్యతిరేకించినా పాఠశాలలను తెరిచింది. విద్యాభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నది.


ఇంతవరకూ రెసిడెన్షియల్‍, ప్రైవేట్‍ పాఠశాలలకే పరిమితమైన ఇంగ్లీష్‍ మీడియంను వచ్చే ఏడాది నుంచి 26 వేల ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని స్థాయిల్లో ప్రవేశ పెట్టాలని కేబినెట్‍ సబ్‍ కమిటి నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా ఇంగ్లీష్‍ బోధించగలిగే సామర్థ్యమున్న ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ యిస్తుంది. ఎల్‍కేజీ, యూకేజీ వలె ఒకటవ తరగతికి ముందు ప్రత్యేక ఇంగ్లీష్‍ శిక్షణకు ప్రయత్నిస్తుంది. ఈ విధానాన్ని నిర్ధిష్టంగా అమలు చేయడానికి విద్యాధికారులు, విద్యావేత్తలతో చర్చలు నిర్వహిస్తుంది. ఏ మీడియం కావాలన్న ఎంపికను విద్యార్థుల, తల్లిదండ్రులకు యిస్తుంది. ఈ రెండు మాధ్యమాల విద్యావిధానం విద్యార్థుల ప్రయోజనాలను కాపాడుతోంది. ఈ విధానాన్ని ఉపాధ్యాయ సంఘాలు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు హర్షిస్తున్నారు. నాణ్యమైన ఉచిత విద్యను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం అంకిత భావంతో చర్యలు తీసుకుంటున్నందుకు అభినంనదలు. అయితే ఈ నూతన విద్యా విధాన ఆచరణలో వున్న సాంకేతిక అడ్డంకులను పరిష్కరించుకోవలసి వుంది.


రైతుల జీవిత బీమా పథకం రైతులకు బలమైన భరోసా 2018 ఆగస్ట్ 15న ప్రారంభించిన ఈ పథకం వల్ల ఈ మూడున్నర ఏళ్లలో 72వేల మంది రైతులు పరిహారం పొందారు. రైతుల తరఫున ప్రభుత్వమే ప్రతి ఏడాది వెయ్యి కోట్ల రూపాయలు ప్రీమియం చెల్లించడం దేశంలో మరెక్కడా లేదు. ఈ నిశ్శబ్ద విప్లవ రూపకర్త కేసీఆర్‍ అభినందనీయులు.
ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతర ఫిబ్రవరి 12 నుంచి 15 వరకు జరగబోతున్న మేడారం జాతర. ఎనిమిది శతాబ్దాలుగా ఒక తరం నుంచి మరో తరానికి సాంస్కృతిక వారధి ఈ జాతర. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అధికారిక జాతర. అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ఈ జాతర లివింగ్‍ హెరిటేజ్‍. ఈ విశిష్టతను UNESCO దృష్టికి తీసుకెళ్లి UNESCO గుర్తింపును సాధించే వైపుగా ప్రభుత్వం, పురావస్తు, వారసత్వ సంపద పరిరక్షకులు, సామాజిక, సాంస్కృతిక శాస్త్రవేత్తలు కృషి చేయాల్సి వుంది.


(మణికొండ వేదకుమార్‍)
ఎడిటర్

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *