సిరిప్రెగడ భార్గవరావు

‘‘పల్లెలు మా నివాసములు పచ్చని పంట పొలాలు మా మనః పుల్లత గూర్చు చైత్రములు, బోదెల పైని రసాల శాఖికా పల్లవముల్‍ గ్రసించు చిరుపాటలదియాని తేనెతేటలు జిల్లు పికంబు మా యనుగుచెల్లెలు గానమె మాదు ప్రాణమౌ’’.
అని కంఠమెత్తి పాడిన కవికోకిల సిరిప్రెగడ భార్గవరావు.
ఎక్కడో నల్లగొండ జిల్లాలోని చండూరు సమీపముగల చిరుపల్లె గూడెపల్లిలో సిరిప్రెగడ జన్మించారు. ఆయన జనన తేది కూడా సాహితీలోకానికి తెలియదు. చాలా పిన్న వయస్సులోనే 1963లో ఆయన అస్తమించారు.
1934లో గుంటూరు జిల్లా ‘ఏదుబాడు’ నుండి ‘కవిరత్న’ అంబటిపూడి వేంకటరత్నంగారు నల్లగొండ జిల్లాలోని చండూరుకు వచ్చి అక్కడే స్థిరనివాస మేర్పరచు కున్నారు. కృష్ణభక్తులైన అంబటిపూడి వారు సంస్కృతాంధ్ర భాషా విశారదులు, విద్వత్కవులు. చండూరు పరిసర ప్రాంతాల ప్రజల ఆదరాభిమానాలు అనతికాలంలో ఆయనకు దండిగా లభించాయి. ప్రజల సహకారంతో తమ ఆశ్రమంలో కృష్ణభక్త సమాజాన్ని స్థాపించారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలతో కృష్ణసంకీర్తన సభలు నిర్వహించారు. సహజంగా కవులైన అంబటిపూడి ‘సాహితీ మేఖల’ అనే సంస్థను స్థాపించారు.
అనేకమంది శిష్యులను కూడగట్టుకున్నారు. వారితో సంస్కృత కావ్యాలు పూర్వాంధ్ర కావ్యాలు, నవ్యాంధ్ర కావ్యాలు చదివించారు. సాహిత్య దేశికులుగా వారికి భాష పట్ల, సాహిత్యం పట్ల అభిమానం కలిగించడంలో కృతకృత్యులయ్యారు. వారి శిష్యులలో సిరిప్రెగడ భార్గవరావు, పులిజాల హనుమంతరావు, ధవళ శ్రీనివాసరావు, పులిజాల గోపాల రావు, మద్దోడు సత్యనారాయణ, తాడిశెట్టి నరసింహ గుప్త, మంచుకొండ శివలింగయ్య వంటి ప్రముఖులు ఉన్నారు. వారిలో భార్గవరావు సంస్కృతాంధ్ర భాషావ్యవసాయం ఎక్కువగా చేసినవారు. ఆయనది కవితారూప తపస్సు, పద్యరచనలో తనదైన శైలీ రమ్యతను సాధించారు. గంగాఝరీ ప్రవాహ సదృశం అయన కవితాధార. ఆయన జీవించి ఉండగా రచనలేవీ ముద్రింపబడలేదు. భార్గవరావు మరణానంతరం 1967లో ఆయన పద్య రచనలన్నీ ‘భార్గవానందల హరి’ పేరుతో గ్రంథంగా వెలువడింది. అది సాహితీ జగత్తును ఓ కుదుపు కుదిపింది. ఆకృతిని చదివి ప్రశంసించని సాహితీపరుడు, సహ•దయుడు లేడు.


సిరిప్రెగడ భార్గవరావు నవ్యభావకవి. కవితా తపస్వి, రససిద్ధుడు. తెలంగాణపు ముద్దుబిడ్డ. భార్గవరావు శోకమే పద్యమై పొంగివచ్చింది. భావకవుల కవిత్వం వలెనే సిరిప్రెగడ కవిత్వమంతా ఆత్మాశ్రయమే. సంద్రాయ మూల్యాలను పరిరక్షించి, అద్భుతమైన పద్యాలను రచించిన భార్గవరావును, నవ్యభావకవి అని విమర్శకులు పేర్కొన్నారు.
ఆనాటి కవి ప్రవరకందరికి నీడనిచ్చిన కవితా మాకందం పాపాతీమేఖల, భార్గవానందలహరిలో
‘వీణానిక్వణనమ్ముతోడ, కబరివిన్యస్తపుష్పానన
ధ్యానమ్ముక శ్రుతి గూర్చియున్‍ గళమునెత్తంబాపు ఆ
వేళనీ
సానందద్యుతి చంద్రికా లలితలాస్యన్యాస మైసర్గిక
శ్రీ నైర్మల్యము ఖంబు జూపగదె తల్లీ సాహితీ మేఖలా’
అంటూ ఆ సంస్థ గొప్పతనాన్ని సిరిప్రెగడ ప్రస్తుతించారు. వృత్తరచనలో, శిల్పతో శబ్దాలంకార ప్రయోగము అరితేరిన కవి సిరిప్రెగడ. భార్గవానందలహరిలో
పన్నీరు, కన్నీరు, మున్నీరు, భక్త్యాంజలి అనేవి ప్రధాన శీర్షికలు
పన్నీరులో – ప్రాంజలి, గానేందిర, ఏకాంతగోష్ఠి, వెలబాలుడు, మధురయామిని, తెలుగుతల్లి, మధులక్ష్మి, ఓదార్పు ఆవేదన అన్న ఖండకావ్యాలున్నై,
కన్నీరు, సతీవియోగంతో రచించిన శోకకావ్యం.
మున్నీరులో యశోద పిలుపు, వేణుగానం, ఏకాంత
గోష్టి, రాధికా విరహగీతి, అందాల కలము, భావమైత్రి వంటి పదమూడు ఖండికలున్నై.
భక్త్యంజలిలోని నాలుగు ఖండకావ్యాలు ఆయన గురుదేవులైన అంబటిపూడి వెంకటరత్నంగారిని ప్రస్తుతిస్తూ రచించినవే.
కోతలు వడ్డ నాయెడ దక్కునే నవనీతము
భిక్షపెట్టి ప్ర
స్ధిత మనోజ్ఞగానరస సింధువుచే నుపశాంతి గూర్చి లీ
లాతత పాదనూపుర ఝళంఝళ రమ్యరమమున్‍ స్ఫుర
ద్దీతికలందజేసి జగతిన్‍ నను నిల్పెడి వాణి మ్రొక్కెదన్‍
అని (ప్రాంజలి)
వాణీని కవి ప్రశంసించిన తీరు మనోజ్ఞం.
కన్నలరమోడ్చి కమ్మని కంఠమెత్తి
సుందరోహకరంబితానందగగన
యానములలోన మోహనగార ఝుల
నాలపింతుమురమ్ము నాయందునీవో వంటి పద్యాలు (ఏకాస్త గోష్ఠి) పడు తెలంగాణ
సిరిప్రెగడ భావకవితా సౌందర్యాన్ని ఎత్తి చూపుతాయి.
కృష్ణశాస్త్రిని తలపుకు తెస్తాయి.
‘నాలోన వందబృందానమ్ములు లేచి
దిగ్దిగంతల నర్తిల్లనిమ్ము
నాలోన వేయిరత్నాకరంబులు పొంగి
శంపాలతత గౌగిలింపనిమ్ము
నాలోన లక్షఘంటానాదములు మించి
నినదించి జగమెల్ల నిండనిమ్ము
నాలోన గోటి చందన సౌరభములూరి
ఆ సీమ ఈ సీమ నలమనిమ్ము
నీ యశోవైభవ ప్రవాహయామాన
గౌతమీకృష్ణవేణి ప్రపూతశీత
నవ పయోధార నాహృదానందవిధి
కావ్య కమనీయసారై కదలనిమ్ము (తెలుగుతల్లి).


సిరిప్రెగడ పోతన్నలాగా పోతపోసిన సీసపద్యాల రచన ఆయన కవితా ప్రౌఢీమకు శైలీరమ్యతకు పరమోదహరణాలు.
సిరిప్రెగడ ‘కన్నీరు’ పద్యాలు వింటే శిలలు ద్రవించి ఏడుస్తాయి. భార్యవియోగంతో క్రుంగిపోయి ఆయనలోని శోకం ఏరై పారింది. తెలుగు సాహిత్యంలో భార్యావియోగం వస్తువుగా దువ్వూరి, విశ్వనాథ వంటి ప్రముఖులు రచించిన కావ్యాలు అందరికీ తెలిసినవే. నేనెరిగినంతవరకు ‘కన్నీరు’ వంటి శోకకావ్యం తెలుగు సాహిత్యంలో రాలేదు.
శోకబంధురమైన జీవితం గడుపుతూ ఉండగా భార్గవుడికి వివాహమయింది. తన జీవితం సుఖప్రదమైందని ఆనందించాడు. కొద్దికాలం అర్ధాంగిలో స్వర్గాన్ని దర్శించాడు. అనుభవించాడు. తాను సర్వస్వంగా భావించిన ఆమె అకస్మాత్తుగా కన్ను మూసింది. భార్గవరావు భూనభోంత రాళాలు ద్రవించి పోయేలా విలపించాడు. ఆయన జీవితపు సోంపుల మేడలు కూలిపోయినాయి. కన్నీటి కణాలే మిగిలినాయి.
‘నా యానందయవై దరస్మితమవైన వెల్లువై చూడ్కివై
నా యుత్సాహమలై సుధారంజనిపై నాశయ్యపై సుప్తివై
నా యిష్టంబుల ప్రోవువై మానసువై నా సర్వమై నేనయై
మాయంబైతివి నీవు నీవులేని జగతీ మధ్యన నే
మిధ్యగాన్‍.’ (కన్నీరు)
అన్న ఒక్క పద్యం చాలు సిరిప్రెగడ హృదయం దుఃఖార్ణవ మైందని చెప్పడానికి.
కన్నీరులోని ప్రతిపద్యం ఘోషించిన కవినేత్రాల నుండి రాలిన అశ్రుకణం ..
‘కనుదోయిన్‍ ముకుళించినన్‍ దెరచినన్‍
కమ్రస్మితంబొప్పమో
హనధావళ్య సుచేతవై
నూసితవర్ణాన్వీత సచ్చోళవై
కనువిందై త్రిజగన్మనోజ్ఞ
లలనాకల్యాణ ఖండంబ ! నిన్‍
క్షణమైనన్‍ మరువంగ జాలన సుతుల్‍ జ్వాలారు
నందాకనున్‍ (కన్నీరు)
కన్నీరులో అసలైన కవి హృదయము పొంగి పొరలి ప్రవహించింది అన్నారు కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి.
సిరి భార్గవరావు అంబటిపూడి వెంకటరత్న దేశికుల అంతే వాసిత్వంలో ఎదిగిన కవి కుమారుడు. ఆ గురుదేవులకు శిష్యుడు భుక్తితో సమర్పించుకొన్న ప్రసూనాంజలి భక్త్యంజలి.
‘బ్రతుకెల్లన్‍ వడగట్టి సత్కళకుధారన్‍వోసి యుదద్రసాం
చిత సత్కావ్యములన్‍ రచించి కవులన్‍ స•ష్టించి
నిద్రాణమై
న తెలంగాణమునందు నింపె కవితానంద
ప్రవాహెరీర్మిలా
లితరజ్యన్నవనాద సద్గళ కళాలీలా విభూతుల్‍ వేసన్‍
(ముగ్గురుదేవులు)
అని తెలంగాణలో అంబటిపూడి చేసి సాహితీసేవను ప్రస్తుతించారు.
జీవితంలో దెబ్బలు తిన్నవాడు భార్గవరావు. ఆ బాధలోంచి అద్భుత కవిత్వం పలికినవాడు. భార్గవుడు వాఙ్మయ తపస్వి అన్నారు రాయప్రోలు.
ఈ కవి చక్కగా నిర్దుష్టముగా పద్యములు వ్రాయగల వాడని, భావసంగ్రహణ బుద్ధియని తోచినది ఈ చిన్నికావ్యమాతని యశఃపతాకగా నిలుచుగాక, ఇది విశ్వనాధ ప్రశంస.


‘తెలంగాణము తెలుగుతల్లి అందాలకోరె. ఆ తల్లి తన కొప్పులో ముద్దుగా ముడుచుకొన్న ఒక మల్లెమొగ్గ మన భార్గవుడు’ అన్నారు మహాకవి శేషేంద్ర.
జీవనగాధను కవితామయం చేసి పిన్న వయసులోనే అస్తమించిన సిరిప్రెగడ భార్గవరావు. తెలుగు వారు గర్వించే తెలంగాణ మహాకవి. ఒకే ఒక వేదనామయ కావ్యం ‘భార్గవానందలహరి’ ద్వారా సాహిత్య ప్రపంచంలో దేదీప్యమానంగా వెలిగే కవిద్యుమణి.
తెలుగువారికి పోతనలా ప్రాతఃస్మరణీయుడైన మధురకవి. సిరిప్రెగడ భార్గవరావు వేలకలంబుగైకొని చిగిరిన భావపరంపరా విమద్దాలల నాలలాడుచు రసోదయసిద్ధి గడించుకొన్న రాగాలసమైన సత్కవిభావము సిరిప్రెగడది.
తెలుగు కవితా సామ్రాజ్యంలో కలకాలం నిలిచే కవిచక్రవర్తి, ఆరని తెలంగాణ కవితాజ్యోతి సిరిప్రెగడ.
‘జయన్తితే సుకృతినో
రస సిద్ధాః కవీశ్వరాః
నాస్తితేషాయశః కాయే
జరామరణ జంభయమ్‍’.


(తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ప్రచురించిన ‘తెలంగాణ తేజోమూర్తులు’ నుంచి)
డా।। తిరునగిరి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *