(గత సంచిక తరువాయి)
గత రెండు కథనాలలో అంటార్కిటికాకు సంబంధించిన చాలా విషయాల్ని తెలుసుకున్నాం. అంటార్కిటికాపై జరిగిన ప్రయోగాలన్నీ గతంలో కన్నా అంటార్కిటికా వేడి ప్రాంతంగా మారుతుందన్నట్లుగా గణాంకాల్ని అందించాయి. గత ఆరు దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో ప్రతీ దశాబ్దానికి ఉష్ణోగ్రత ఈ కింది విధంగా పెరుగుతున్నట్లుగా తేల్చారు.
అలాగే గత అయిదు సంవత్సరాల నుండి ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరుగుతున్నట్లుగా శాస్త్రజ్ఞులు, పరిశోధకులు గుర్తించారు. అవి వరుసగా
24 మార్చి 2015 17.5°C
6 ఫిబ్రవరి 2020 18.3°C
13 ఫిబ్రవరి 2020 18.3°C
2 జులై 2021 18.3°C
గతి తప్పుతున్న కాలానుగుణ హిమపాతం!
సాధారణంగా ధృవాల్లో శీతాకాలంలో హిమపాతం జరగడం, వేసవిలో కరగడం జరుగుతుంది. ఇదో ప్రకృతి సహజ పక్రియ. ఇదే పక్రియ ఎత్తైన పర్వతాల్లో కూడా జరుగుతుంది. అందుకే ఈ పర్వతాల్లో పుట్టే నదులు వర్షాకాలంలో వర్షపు నీటితో ప్రవహించగా, వేసవిలో మంచు కరిగి ప్రవహిస్తాయి. అందుకే వీటిని జీవనదులని అంటారు. కాని, ఈ సహజ ప్రకృతి క్రియలు తలక్రిందులుగా మారుతున్నాయి. ధృవాలలో మంచు కురవడం, తరగడం ఓ సమతుల్యతతో జరిగేవి. కాని ఈ చర్యలు కూడా అపసవ్యంగా జరుగుతున్నాయి.
ఉదాహరణకు అర్కిటిక్ (Arctic) ప్రాంతంలో 1978-2021 దాకా ప్రతీ దశాబ్దానికి 13.1 శాతం చొప్పున హిమపాతం తగ్గినట్లుగా రికార్డులు తెలుపుతున్నాయి. అనగా ప్రతీ సెప్టెంబర్‍లో కురవాల్సిన మంచుకన్నా 2.6 శాతం మంచు తక్కువగా కురుస్తున్నది. ఇదే స్థితి అంటార్కిటికాలో మరో రూపంలో జరుగుతున్నట్లు పరిశోధనలు చెపుతున్నాయి. వాటిని తెలుసుకునే ముందు అంటార్కిటికాకు సంబంధించిన భూ భౌగోళిక విషయాల్ని చూద్దాం!
భౌగోళికంగా అంటార్కిటికా : (Physical geography)
దక్షిణ ధృవం చుట్టూ ఆవరించిన అంటార్కిటికా, ఇతర భూఖండాలకు భిన్నమైన భౌగోళిక, వాతావరణ రుతువుల్ని కలిగి వుంటుంది. ఎత్తైన పీఠభూమిలా చిన్నపాటి కొండలతో దాదాపు నాలుగు కి.మీ. మంచు పలకల మందంతో వుండే ఈ మంచు (ఎడారి) క్రింద మైదానాలు, లోయలు, పర్వతాలు, నదులు వున్నట్లుగా పరిశోధకులు భావిస్తున్నారు. ఉపరితలంగా అగ్నిపర్వతాలు చోటుచేసుకోకున్నా మంచు అడుగు భాగాన దాదాపు 91 అగ్ని పర్వతాలున్నట్లు గుర్తించారు.
రుతువులు (Seasons) :
శీతాకాలం, వేసవి కాలం మాత్రమే ఇక్కడ కనిపించే రెండు రుతువులు. మార్చి నుంచి సెప్టెంబర్ దాకా శీతాకాలం (మంచు కురిసే కాలం) కొనసాగగా, అక్టోబర్ నుంచి ఫిబ్రవరి దాకా వేసవి కొనసాగుతుంది. దీనికి ముందు నవంబర్, డిసెంబర్‍లో వసంత రుతువు ఏర్పడుతుంది. ప్రతి జనవరిలో అతి వేడి మాసంగా గుర్తిస్తారు. అనగా (0°C ) ఉష్ణోగ్రత అన్నమాట!
ప్రతి శీతాకాలంలో రమారమి 5 సెం.మీ. మంచు మాత్రమే కురిసినా, కురిసిన మంచు కురిసి నట్లుగా గడ్డకట్టును. కారణం,చల్లని గాలి ఏమాత్రం తేమను పొదిమి పట్టక పోవడంతో నిరంతర అవపాతం (precipitation) జరగదు. కాబట్టి వాతావరణంలో తేమ (humidity) లేకపోవడానికి, అక్కడ వేడి లేకపోవడం కూడా ప్రధాన కారణం.
మొత్తంగా అవపాతం లేకుండా, ఉష్ణోగ్రత పెరగకుండా పడిన మంచు పడినట్లుగానే వుంటుంది. అలాగే గడ్డగా (స్త్రశ్రీ••ఱవతీ) మారుతుంది. కాని, ఈ పక్రియలో కూడా ఇప్పుడు మార్పులు జరుగుతున్నాయి.
వాయువులు : (winds)
సాధారణంగా గాలులు మైదానాల గుండా వీచి కొండల్ని, గుట్టల్ని, పర్వతాల్ని తాకి దారి మళ్ళుతాయి. కాని దీనికి విరుద్దంగా అంటార్కిటికాలో గాలులు ఎత్తైన దిబ్బల, కొండల నుంచి క్రిందికి వీస్తాయి. వీటిని కాటాబాటిక్ (Katabatic) గాలులని పిలుస్తారు. వీటి వేగం గంటకు 100 కి.మీ. నుంచి 160 కి.మీ. సరాసరి వున్నా, ఆ మధ్యన గంటకు 320 కి.మీ. వేగం కూడా నమోదు అయింది. ఇక ఎత్తుగా వుండే దక్షిణ ధృవం దగ్గర సరాసరి గంటకు కేవలం 19 కి.మీ. వేగం మాత్రమే వుంటుంది.
అర్థరాత్రి సూర్యుడు (Midnight Sun)
అక్టోబర్ నుంచి ఫిబ్రవరి దాకా అయిదు నెలల పాటు కొనసాగే వేసవిలో దాదాపు ఆకాశంలో సూర్యుడు అగుపిస్తూనే వుంటాడు.
ఉత్తర ధృవంలో ఆరు నెలలు పగలు, ఆరు నెలలు రాత్రులు ఏర్పడితే, ఇక్కడ కొంత తేడాగా వుంటుంది. దీర్ఘ పగలుతో సూర్యుడు అస్తమించని దృశ్యం వుంటుంది. అందుకే అంటార్కిటికాను ‘అర్థరాత్రి సూర్యుడి’ ఖండంగా పిలుస్తారు. ఈ కాలంలోనే కావల్సినంత సూర్మరశ్మి లభించడంతో ఈ ప్రాంత జీవులన్నీ చురుకుగా వుంటాయి. సాధారణ ఉష్ణోగ్రత (-100 నుంచి 0°C) ల మధ్య తచ్చాడడంతో పరిశోధకులకు ఇది అనువైన కాలంగా భావించి ఇక్కడికి చేరుకుంటారు. ఈ కాలంలో పొడిగా ఉన్న మంచు ఎడారిలా కనిపిస్తుంది.
అందుకే ఈ ప్రాంతాన్ని అత్యధిక పొడి, శీతల, వేగవంతమైన గాలుల నిలయమైన ఖండంగా పరిశోధకులు చెప్పుకుంటారు. కాబట్టి ఇక్కడ ఎలాంటి టైమ్ జోన్‍ను (time zone) గుర్తించలేదు. ఆయా దేశాల పరిశోధకులు వారి దేశాల, ప్రాంతాల టైమ్ జోన్స్నే పాటిస్తారు.
తలక్రిందులవుతున్న తూర్పు అంటార్కిటికా వేసవి శీతలీకరణ: (Disturbance of summer cooling system)
ప్రకృతి సహజసిద్ధంగా చోటుచేసుకునే వాతావరణ పరిస్థితులు భౌగోళికంగా రుతుచక్రాల్ని కల్గిస్తాయి. కాని కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రకృతి దృగ్విషయాలు గతి తప్పుతున్నాయి. మానవ మేధస్సుకు, వాతావరణ మార్పుల్ని గుర్తించే యాంత్రిక శక్తికి కూడా అంతుచిక్కని పరిస్థితులు ఈ మధ్యన భౌగోళికంగా సాక్షాత్కరిస్తున్నాయి. పోయిన డిసెంబర్‍లో అమెరికాలో సంభవించిన టొర్నాడో (tornado) సృష్టించిన భీభత్సం తెలిసిందే! ఇప్పుడు అంటార్కిటికా మంచు ఖండానికి ఇలాంటి విపత్తులే రాబోతున్నాయి.
భూతలంపై, జల తలంపై ఏర్పడే పీడనాలు, వాటి మధ్యన గల వ్యత్యాసాలు వాతావరణాన్ని ప్రభావితం చేయడం తెలిసిందే! ఇది ఓ క్రమానుగుణంగా జరుగుతే ప్రకృతి ఆహ్లాదకరమే! కాని గతి తప్పితే భౌగోళిక ప్రళయమే! గత అయిదు దశాబ్దాలుగా తూర్పు అంటార్కిటికా వేసవి శీతలీకరణ విధానం తలక్రిందు లవుతున్నట్లుగా అమెరికా జాతీయ కేంద్ర వాతావరణ పరిశోధన సంస్థ (NCAR) శాస్త్రజ్ఞులైన పాల్ జూలియన్ (Paul Julian) మరియు రోలాండ్ మాడెన్ (Roland Madden)లు 1971లో అంటార్కిటికాను పరిశీలించడం ద్వారా గుర్తించారు.
భూమధ్యరేఖ ప్రాంతంలోని ఉష్ణమండలాలను (tropical), పసిఫిక్, హిందూ మహా సముద్రాలపై ఏర్పడే ఆవర్తనాలను, అల్పపీడన ద్రోణులను
(depressions) పరిశీలించగా పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణసంవహన (convection) పక్రియ కేవలం ఉపరితలానికే పరిమితమైనట్లుగా వీరు గుర్తించారు. దీంతో జనించిన ఉష్ణం వాతావరణంలోనే 30-90 రోజులు తచ్చాడి, మెళ్ళిగా తూర్పు అంటార్కిటికా వైపు పయనిస్తున్నట్లుగా గ్రహించారు. ఈ ప్రకృతి చర్యలతో దక్షిణార్థగోళ (austral) ప్రాంత వాతావరణం వేడక్కడంతో ఏకరీతి వాతావరణ విధానానికి భిన్నంగా ప్రాంతీయంగా రూపొందే వేడి, చల్లదనాలు ఓ అతుకుల బొంతలా (patch work) అంటార్కిటికాపై చోటు చేసుకున్నట్లు వీరి పరిశీలనలు తెలిపాయి.
మేడన్ – జూలియన్ డోలనం
పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంపై అకాలవర్షాలు (cluster) చోటు చేసుకోవడంతో వాతావరణంలోని తేమ ద్రవీకరణ (liquefaction) జరిగి విపరీతమైన ఉష్ణం జనిస్తున్నదని, ఇలా జనించిన ఉష్ణం వాతావరణంలోకి చేరి పీడనాల వ్యత్యాసాల్ని కల్గిస్తున్నాయని, దీంతో వేగవంతమైన గాలులు చెలరేగడం, ఇవి భూభ్రమణంచే ప్రభావితం కావడంతో ఊహించని వాతావరణ మార్పులు జరుగుతున్నట్లుగా పై అమెరికా శాస్త్రజ్ఞులు గుర్తించారు. ఈ విధంగా చెలరేగే వేడి గాలులు పశ్చిమ భూ మధ్యరేఖ ప్రాంతం నుంచి సోలమన్ (solaman) ద్వీపాలవైపు పయనించడంతో తూర్పు అంటార్కిటికా శీతలీకరణ 3-11 రోజులు అదనంగా జరుగుతున్నట్లుగా వీరు తేల్చారు. ఈ పరిశోధనలకు గుర్తుగా ఈ వాయువు తరంగాలకు మేడన్-జూలియన్ డోలనం (Madden – Julian Ossillation -MJO) అని పేరు పెట్టారు.
ఇదే విధానం హిందూ మహాసముద్రంపై చోటు చేసుకుంటే శీతలీకరణ విధానం దెబ్బతిని తూర్పు అంటార్కిటికా వేడెక్కుతున్నట్లుగా వీరు గుర్తించారు. 1979 నుంచి 2014 దాకా ఈ విధానంతోనే వేసవి శీతలీకరణ జరిగేదని, కాని అకాల వర్షాలు, అనుచిత పీడనాలు పశ్చిమ ఉష్ణప్రాంతమైన పసిఫిక్‍పై ప్రభావం చూపుతుండగా, హిందూ మహాసముద్రంపై తగ్గుతున్నట్లుగా వీరు పరిశీలించారు. ఈ విధానం తూర్పు అంటార్కిటికా వేసవి శీతలీకరణానికి (austral summer -Nov-Mar) దోహద పడుతున్నట్లుగా దక్షిణ కొరియా శాస్త్రజ్ఞుల బృంద నాయకుడు ప్రొ।। యిలీ (Yilee) కూడా దృవీకరించడం గమనించాలి.
దీనికి తోడుగా తరిగే ఓజోన్ పొర, ఎల్‍నినో (Elnino), దక్షిణ డోలనం (south ossillation) లు కూడా తూర్పు అంటార్కిటికాపై ప్రభావాన్ని చూపుతున్నాయి.
దెబ్బతింటున్న ఓజోన్ పొర (Depletion of Ozone) :
స్ట్రాటో ఆవరణ కింద వుండే ఓజోన్ పొర సూర్యుని నుంచి వచ్చే కిరణాలలోని అతినీలలోహిత (UV) కిరణాల్ని వడబోయడం (filter)తో భూగోళంపై గల ప్రాణకోటి (జంతువులు, మొక్కలు మొ।।) బతికి బట్ట కట్టుతున్నాయి. కాని మానవ విభిన్న చర్యల ద్వారా, ఉత్పత్తి చేసి వినియోగించే రసాయనాల ద్వారా ఈ ఓజోన్ పొర క్షీణించడం, కొన్ని సందర్భాలలో రంధ్రాలుపడడం జరుగుతున్నదని శాస్త్రజ్ఞులు ఈ మధ్యన గుర్తిస్తున్నారు. ప్రధానంగా ఓజోన్ హారక పదార్థాలు, (ozone depletion substamceses) హెలోకార్బన్ రిఫ్రిజెరంట్లు, కొన్ని రకాల ద్రావకాలు (solvents), హెలోజనులు (HCFCలు), క్లోరోఫోరో కార్బన్లు (CFC) మొదలగునవి ఓజోన్ పొరను దెబ్బతీస్తున్నాయి. వీటిని శీతలీకరణ యంత్రాలకు వాడే వివిధ పరికరాలలో వాడుతారు. అలాగే ఎరోసోల్స్ (aerosols) ల ద్వారా ఈ పదార్థాలు వాతావరణంలో చేరుతాయి. ఇవి స్ట్రాటో ఆవరణకు చేరి కాంతి విశ్లేషణ పక్రియ ద్వారా (photo dissociation) హలోజన్‍లను (Cl, Br మొ।।) విడుదల చేస్తాయి. ఇవి ఉత్పేరకాలుగా (catalyst) పనిచేసి ఓజోన్ O3) అణువును ఆక్సిజన్ (O2) అణువుగా విచ్ఛిన్నం చేస్తాయి. దీంతో ప్రాణకోటికి రక్షణ కవచంలా పనిచేసే ఈ పొర మందగించడం, క్షీణించడం జరుగుతున్నది.
అలాగే భూతాపానికి (global warming) కారణమవుతున్న కార్బన్ డయాక్సైడ్ (CO2) రేడియేటివ్ ఒత్తిడి కూడా స్ట్రాటో ఆవరణను చల్లబరుస్తుంది. పైగా ధృవప్రాంతాల్లో అతి శీతలంలో కూడా ఈ ఆవరణ చల్లగా వుంటుంది. ఈ ప్రభావంతో ఓజోన్ క్షీణత, రంధ్రాలు ఏర్పడడం కూడా ధృవప్రాంతాల్లో ఎక్కువగా జరుగుతాయి. అందుకే అంటార్కిటికాలో ఓజోన్ క్షీణత శీతాకాంలో పెరిగి వేసవిలో తగ్గుతున్నట్లుగా పరిశోధనలు తెలుపుతున్నాయి. ముఖ్యంగా ప్రతి ఆగస్టులో మామూలుగా (moderarte) మొదలయ్యే ఓజోన్ క్షీణత సెప్టెంబర్ నాటికి ఉధృతిని దాలుస్తుందని, ఈ కోవలోనే గత అక్టోబర్ 7 2021న అంటార్కిటికాపై ఓజోన్ రంధ్రం అతి పెద్దదిగా ఏర్పడిందని, 1979 నుంచి లెక్కించినట్లైతే, ఇది 13వ అతిపెద్ద రంధ్రమని నాసా (NASA) ఎర్త్సైన్స్ ప్రధాన శాస్త్రజ్ఞుడైన పాల్ న్యూమెన్ (Paul Newman) ప్రస్తావించడం జరిగింది. ఇలా జరగడానికి, 2021లో సరాసరి చలి ఎక్కువగా వుండడమే కారణమని, నిజానికి 1987లో మాంట్రియల్ ఒప్పందం జరగకుంటే ఈ పెరుగుదల మరింత విశాలంగా ఏర్పడేదని, 1989 అమల్లోకి వచ్చిన ఈ ఒప్పందంతో ఓజోన్ క్షీణిత సంబంధిత పదార్థాలు (ozone delpletion substances) ఉద్గారాలను తగ్గించడం మూలంగా ఇది అనుకున్నంతగా పెరగలేదని ఆయన సంతోషాన్ని వెలిబుచ్చాడు.
ఓజోన్ పొర క్షీణత గూర్చి దాదాపు 1950 నుంచి చర్చలు, పరిశోధనలు జరుగుతూనే వున్నాయి. 1980లో దీని తీవ్రతను గుర్తించిన శాస్త్రజ్ఞులు దీని పరిణామాలపై దృష్టిసారించారు. ముందుగా జపాన్, బ్రిటన్ శాస్త్రవేత్తలు దీని క్షీణతపై గణాంకాలు సేకరించారు. వీటి ఆధారంగా 1985లో బ్రిటీష్ అంటార్కిటికా సర్వే నివేదిక పేరున నేచర్ (Nature) అనే పత్రికలో అంటార్కిటికాపై క్షీణిస్తున్న ఓజోన్ గూర్చిన కథనం ప్రచురించబడింది. దీని పరిశోధనకై ఓ పరికరాన్ని (Dobson spectro photo meter) వాడి విలువల్ని డాబ్సన్ యూనిట్లలో (DU) తెలుపుతారు.
నాసా ప్రయోగించిన ఉపగ్రహాల ద్వారా, భూకేంద్రంగా బెలూన్ల ప్రయోగాలతో అంటార్కిటికాపై ఓజోన్ స్థితిని ప్రతీ సంవత్సరం పర్యవేక్షించడం జరుగుతున్నది. శీతాకాలం చివర్లో (సెప్టెంబర్) నుంచి వసంత రుతువు (నవంబర్, డిసెంబర్) దాకా ఓజోన్ పొర క్షీణత కొనసాగుతున్నట్లుగా పరిశోధనలు తెలుపుతున్నాయి. మాంట్రియల్ ఒప్పందంపై 189 దేశాలు సంతకాలు చేసి, 2050 నాటికి హేలోజనుల ఉద్గారాలను పూర్తిగా తగ్గించి 1980 నాటి స్థాయికి కుదించాలని నిర్ణయించినా, ఇప్పటికీ విడుదలయిన ఈ కారకాలు వాతావరణంలో దశాబ్దాల తరబడి వుంటాయి. సుఖలాలస జీవన సంబంధిత పరికరాలు (ACలు) యావత్ భూమండలాన్నే శీతలీకరణకు (refrigiration) గురి చేస్తున్న అభివృద్ధి నమూనాలు వీటిని ఏదో రూపంలో వాతావరణంలోకి విడుదల చేస్తూనే వుంటాయి. ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాల నుంచే ఇవి అత్యధికంగా విడుదల అవుతూ వుంటాయి. అందుకే అంటార్కిటికా పరిసరాలు వీటి ప్రభావానికి గురవుతూనే వున్నాయి.
ఓజోన్ పొర క్షీణతతో వాయువేగాలు పెరిగి తుఫానులు, మంచు తుఫానులు సాధారణ మయ్యాయి. దక్షిణ సముద్రంపై 15-20 శాతం వాయు వేగాలు పెరగడంతో పశ్చిమానగల అముండుసేన్ (Amundsen) సముద్రంపై అల్పపీడనాలు ఏర్పడి అంటార్కిటికా లోతట్టు ప్రాంతాల చల్లదనాన్ని ఆకర్షించడంతో ఆప్రాంతం వేడెక్కుతున్నాయి.
దీని ప్రభావం రోస్ (Ross) సముద్రంపై పడడంతో మంచు ఏర్పడడం అధికమైందని, దీనికి ఆనుకొని వున్న పైన్ ద్వీపంలో ఏర్పడే తక్కువ లవణ సాంద్రత గల స్వచ్ఛమైన నీరు రోస్ సముద్రవైపు పయనించి చలి తుఫానులకు కారణమై, సముద్రతలంపై విపరీతమైన మంచు ఏర్పడుతున్నదని శాస్త్రజ్ఞులు గుర్తించారు. శీతాకాలంలో జరగాల్సిన పక్రియ వేసవిలో కూడా కొనసాగడంతో అంటార్కిటికాపై రుతువులు గతి తప్పుతున్నాయి. ఈ వేడి శీతల గాలులకు, అల్పపీడనాలకు ఓజోన్‍పొర క్షీణతనేనని వారు నిర్ణయానికి రావడం జరిగింది.
ఈ అసమతుల్యతలతో ఉష్ణోగ్రత సుమారు ఒక డిగ్రీ సెల్సియస్ (10°C) పెరగడంతో అముండ్‍సేన్ తీర ప్రాంతం ఓ అఖాతంగా రూపొందడంతో పశ్చిమ తీర అంటార్కిటికా హిమానీనదం (glacier) దాదాపు 87 శాతం వెనక్కి (retreat) తగ్గిపోయినట్లుగా తేలింది. ఈ పక్రియగత 20 సం।। నుంచి వేగవంతమైనట్లుగా, దీంతో 1990 నుంచి త్వాయ్‍టెస్ హిమానీనదం నుంచి పది బిలియన్ టన్నుల మంచు కరిగిపోగా 2020 నుంచే 80 బిలియన్ టన్నుల మంచు కరిగి సముద్రంగా మారినట్లుగా గణాంకాలు తెలుపుతున్నాయి. ఈ విధ్వంసం పారిశ్రామిక విప్లవం తర్వాత మొదలై, ఈ మధ్యన వెర్రితలలు వేస్తున్నట్లుగా ఓజోన్ పరిశీలక బృందాలు భావిస్తున్నాయి.
ముగింపు :
ఇప్పటికి అందుబాటులో వున్న సమాచారం ప్రకారం అంటార్కిటికా పై కొంత చర్చ చేశాం. మనకు తెలియని, తెలుసుకోలేని అంశాలను కూడా ఈ కథనాల్లో చూసాం. ఇప్పటి పరిశోధనల ప్రకారం రేపటి అంటార్కిటికా ఎలా వుండబోతుందో దాని ప్రభావం యావత్ భూగోళంపై ఎలా వుంటుందో పై పరిశోధనల, పరిశోధకుల అభిప్రాయాల్ని క్రోడీకరించగా అవి ఈ కిందివిధంగా వున్నాయి.
నేటి అంటార్కిటికా :
- గడిచిన 8,00,000 లక్షల సం।। కన్నా అంటార్కిటికాలో హరితవాయువులైన కార్బన్ డయాక్సైడ్ (CO2) / మీథేన్ (CH4) అధికంగా వున్నాయి.
- క్లాడ్ లోరియస్ అంచనా ప్రకారం గత 20,000 సం।। కన్నా ప్రస్తుతం CO2 శాతం బాగా పెరిగింది.
- గతంలో 387 (ppm)గా వున్న CO2, మే 2021 నాటికి 419 (జూజూఎ)కు చేరుకుంది. పారిశ్రామిక విప్లవం తర్వాత ఇది 40% పెరిగింది.
- గత అయిదు దశాబ్దాలలో ఉష్ణోగ్రత 10°C – 30°C కు పెరిగింది.
- అంటార్కిటికా సరాసరి ఉష్ణోగ్రత (-37°C)
- కాని మరికొన్ని ప్రాంతాల్లో (-5°C) అని పరిశోధకులు తెలుపుతున్నాయి.
- (-37°C) ఉష్ణోగ్రత వద్ద ప్రమాదం కాదు. అంటే 10°C
- ఉష్ణోగ్రత పెరిగినా (-27°C) అవుతుంది. కాని (-5°C) లెక్కన 10°C ఉష్ణోగ్రత పెరిగితే మాత్రం అంటార్కిటికా ఉష్ణోగ్రత 5°C చేరుకుంటుంది. అప్పుడు దాదాపు అంటార్కిటికా మంచంతా కరిగి నీరుగా మారుతుంది. ఇదే జరిగితే సముద్ర మట్టాలు 10 అడుగులకు పైగా పెరుగుతాయి.
- అప్పుడు హాలెండ్ సముద్రంగా మారుతుంది.
- బంగ్లాదేశ్ బంగాళా ఖాతంలో కలిసి పోతుంది.
- కాకినాడ కనపడకుండా పోతుంది
- ముంబాయి మాయమైతుంది. ఇంకా…. ఇంకా…
ఇప్పుడు నమోదు అవుతున్న ఉష్ణోగ్రతల ప్రకారం పశ్చిమ అంటార్కిటికా (దక్షిణ అమెరికాకు దగ్గరగా వుంటుంది) భౌగోళికంగా వేడెక్కుతున్న దానికన్నా పది రెట్లు అధికంగా వేడెక్కుతున్నది. దీంతో 1980తో పోలిస్తే (1992-2017 మధ్యన) అంటార్కిటికా మంచు ఆరు రెట్లు తరిగింది.
అంటార్కిటికాలో ఏం జరగబోతుంది!!
- రాబోయే 50 సం।।లలో అంటార్కిటికా ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయి.
- దీంతో గాలిలో తేమశాతం పెరుగును
- తేమ పెరగడంతో మంచు అధికంగా కురుస్తుంది
- మంచు కరుగుటను (melt)ను నిరోధిస్తుంది
- దీంతో మంచు ఎడారిగా మారిన అంటార్కిటికాపై అవపాతం (precipition) తగ్గడంతో కురిసిన మంచు హిమానీనదం (glacier) గా మారాలంటే అనేక సంవత్సరాలు పడుతుంది. ఈ మధ్య కాలంలో పెరిగే ఉష్ణోగ్రతలతో కురిసిన మంచు కురిసినట్లుగా ద్రవస్థితికి చేరుతుంది.
- లభ్యమయ్యే మంచు కరిగిపోగా, కొత్తగా హిమానీనదం (glacier) ఏర్పడదు. రాబోయే 20-25 సం।।లో వేసవి మంచు కనపడదు.
భౌగోళిక విపత్తులు :
రాబోయే కాలంలో అంటార్కిటికాకే కాదు నష్టం, భౌగోళికంగా అనేక పరిణామాలు చోటు చేసుకుంటాయి. అవి
- అత్యధిక ఉష్ణోగ్రతలు (ఇప్పటికే చవిచూస్తున్నాం)
- వర్షాల్లో మార్పులు. ఎప్పుడు, ఎంత కురుస్తుందో చెప్పలేం. దాదాపు 2013 నుంచి వీటి అనుభవం వుంది. 2021లో ప్రత్యక్షంగా చూసాం. అమెరికాలో టొర్నాడోలు అంతు పట్టవు.
- మంచు కురియుటలో హెచ్చుతగ్గులు. (change of snow pattern)
- అధిక కరువులు
- ఊహించని వాతావరణాలు (wilder weather)
- సముద్రాలు ఆమ్లీకరణ (acidic) చెంది వేడెక్కడం. సముద్ర మంచు ద్రవీకరణ చెందడం.
- శాశ్వత మంచు (perma frost) ప్రాంతాలు కుదించుక పోతాయి
ప్రధాన కారణాలు : నివారణలు :
- బొగ్గు, అణు ఆధారిత విద్యుత్ కేంద్రాలు. (అమెరికాలోనే 40%)
- (సౌర, అలల, గాలి మరల, బయో విద్యుత్ ఉత్పత్తులు పెంచాలి. వినియోగం నియంత్రించబడాలి)
- అత్యధిక రవాణా సాధనాలు. శిలా ఇంధనాల వినియోగం
- (ప్రజా రవాణాకే ప్రాధాన్యత. ప్రత్యామ్నాయ ఇంధనాల వాడకం)
- పెరుగుతున్న వ్యవసాయ సాగు. రసాయనాల వాడకం.
- (కొత్తగా సాగు భూమిని నిషేధించడం. సేంద్రియ వ్యవసాయం తప్పనిసరి చేయడం)
- అడవుల్ని నరికి వేయడం. 1960 నుంచే ఒక మిలియన్ చ.కి.మీ. వైశాల్యపు అటవి తగ్గింది.
- (చెట్లు కొట్టడం నిషేధించడం. సామాజిక అడవులస్థానే, సహజ అడవుల్ని పెంచడం)
- శిలాజ ఇంధనాలకై సహజ వాయువులకై సముద్ర మథనం
- (అత్యవసరంగా దీన్ని నిషేధించి నిలుపుదల చేయడం)
- ప్రకృతి విరుద్ద గృహోపకరణాల, ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం.
- ప్రకృతి అనుకూల (eco-friendly) వస్తువుల్నే ఉత్పత్తి చేయాలి.
- విపరీతమైన ప్లాస్టిక్ వినియోగం.
- (ప్రాథమిక స్థాయిలోనే వీటి ఉత్పత్తిని ఆపివేయాలి)
అంటార్కిటికా రక్షణకై జరగాల్సినవి – చెయ్యాల్సినవి :
నేటికి అంటార్కిటికా ఒక్కటే భౌగోళికంగా స్వేచ్ఛా ప్రాంతం! ప్రభుత్వాలు, ప్రజలు లేని భూ (మంచు) భాగం! కాని 52 దేశాలు (ప్రపంచ జనాభాకు 80% ప్రాతినిథ్యం చేసేవి) 1961లో ఈ కింది ఒప్పందాల్ని చేసుకున్నాయి. భారత్ కూడా ఈ ఒప్పందంపై సంతకం చేసింది.
ఒప్పందాలు (Treaties) :
- ఇక్కడ ఎలాంటి సైనిక, అణు సంబంధిత కార్యకలాపాలు జరపకూడదు (must be demilitarized & nuclear free zone)
- అంటార్కిటికా రక్షణకు, భౌగోళిక పరిరక్షణకు, శాంతియుత ప్రయోజనాలకు మాత్రమే ఇక్కడ పరిశోధనలు జరగాలి.శ్రీ కొన్ని దేశాలు ఆశిస్తున్నట్లుగా ఈ భూభాగం ఏదేశానికి సరిహద్దుకాదు. ఏ దేశానికి చెందకూడదు.
- అంటార్కిటికాలో, చుట్టూగల సముద్రంలో నిక్షిప్తంగా వున్న ఖనిజ, బొగ్గు, శిలాజ ఇంధనాలు, సహజ వాయువల్ని ఏ దేశం, వ్యక్తులు తవ్వితియ్యరాదు.
చర్చకు రాని అంశాలు : చెయాల్సినవి :
- వినోదం పేరున కొన్ని దేశాలు అంటార్కిటికాకు యాత్రికుల్ని తీసుకెళ్ళుతున్నాయి. దీనిపై నిషేధం విధించాలి.
- పరిశోధన కేంద్రాల పేరుతో ఇక్కడ స్థిర ఆవాసాల్ని ఏర్పాటు చేయకూడదు. తాత్కాలిక ఆవాసాల్నే ఏర్పర్చుకోవాలి.
- చుట్టూ సముద్రాలో చేపల వేటకు పరిమితుల్ని, సరిహద్దుల్ని నిర్ణయించాలి.
- అంటార్కిటికా సంబంధిత ఆహారపు గొలుసును పరిరక్షించాలి. పీతలు, రొయ్యలు (krill) ప్లాంక్టన్ అనే జీవులపై పెంగ్విన్‍లు, తాబేళ్ళు, చేపలు, సాల్పస్ (salps), సీల్స్, ఒర్కా్స ఆధారపడుతాయి. తిమింగలాలు సాల్పస్పై, చేపలపై, పీతలపై ఆధారపడి జీవిస్తాయి.
- శ్రీ ఈ మధ్యన చేపల వేటతోపాటు పీతల వేట అధికమైంది. దీంతో మిగతా జంతుజాలం ఉనికి ప్రమాదంలో పడింది. దీన్ని కాపాడాల్సిన బాధ్యతను గుర్తించాలి.
కాబట్టి.. అంటార్కిటికా రక్షణే భౌగోళిక రక్షణ!
భౌగోళిక రక్షణే వృక్ష, జంతు, మానవ రక్షణ!!
ఇప్పుడన్నా కళ్ళు తెరుద్దాం! నోరువిప్పి మాటల్ని కలుపుదాం!!
(వచ్చే సంచికలో భూగ్రహానికి ప్రకటించిన రెడ్ అలర్ట్ (Red Alert)ను చూద్దాం!)
- డా।। లచ్చయ్య గాండ్ల,
ఎ : 9440116162