పెదకొండూరులో కాకతీయ శాసనం


కాకతీయుల కాలంలో గ్రామపాలనలో ప్రజల భాగస్వామ్యం గురించి చరిత్రకారులు ఎక్కువసార్లు వెంకిర్యాల శాసనాన్ని ఉదాహరణగా చూపుతుంటారు. రాజులు, మంత్రులు, అధికారులు ఏ దాన,ధర్మాలు చేసినా గ్రామంలోని అష్టాదశప్రజలు, మహాజనులందరి ఆమోదంతో జరుగాలన్న నియమం ఆ శాసనంలో వివరించబడ్డది. నిరంకుశ, ఏకచ్ఛత్ర రాజరికపాలనలో ఈ ప్రజాస్వామిక నియమాలు చట్టబద్ధత సంతరించుకోవడం చాల గొప్పవిషయం. అయితే సాతవాహనుల కాలంలో శ్రేణుల వంటి వ్యాపారసంస్థల నుంచి కళ్యాణీచాళుక్యుల కాలందాక గ్రామ గావుండాలు, అష్టాదశప్రజలు, మహాజనులు చేసాయని, ప్రజలు తమ సమయాలు, సంస్థల ద్వారా ఆమోదం తెలుపడమనేది, అవసరమైనపుడు తమవంతు వితరణ చేయడమనేది శాసనాల ద్వారా తెలుస్తున్నది. ఇటీవల యాదగిరిగుట్ట-భువనగిరి జిల్లా చౌటుప్పల్‍ మండలంలోని పెదకొండూరు అనే గ్రామంలో లభించిన కొత్త కాకతీయశాసనం కూడా ఇటువంటిదే.


కాకతియ ప్రతాపరుద్రుని కాలంలో అతనిలెంక, అంటే రాజును నిరంతరం అంటిపెట్టుకుని వుండే కమెండోవంటి భటుడు, సేవకుడు, వార్తాహరుడైన మాదయలెంక, (భార్య)మల్లుబాలమ్మ పెదకొండూరులో వరదరాజస్వామి దేవాలయంలో తిరుప్రతిష్ట చేయించినపుడు వేయించిన శాసనం ఇది. ఈ శాసన లిపి, భాషలు తెలుగు. లిపి ఆధారంగా ఈ శాసనం 13,14వ శతాబ్దాలకు చెందింది. ఈ శాసనంలో పేర్కొన్నట్లు (శక సం.భాగం విరిగి పోయింది) విరోధికృత్‍ శ్రావణ శుద్ద ద్వాదశి బుధవారం నాడు వేయబడ్డది. ప్రతాపరుద్రుని పాలనాకాలం ఆధారంగా, ఇండియన్‍ ఎఫిమెరిస్‍ ప్రకారం, శాసనం తేది 1311 జూలై 28 బుధవారం అవుతున్నది.
రాజవర్షి శ్రీనాథ రచించిన ఈ శాసనంలో రుద్రదేవుని నుంచి ప్రతాపరుద్రుని వరకు కాకతీయుల వంశక్రమం వివరించబడ్డది. సింహబలుడు, సాక్షాద్ధర్మరూపుడు, దుష్టజనులను దండించువాడైన రుద్రదేవుడు, అతని అనుజుడు రాజ మహదేవుడు, అతని ఆత్మజుడు ‘క్షతాఖిలారాతి పుర’వరేణ్యుడైన గణపక్షితీశుడు, అతని సుత రుద్రమహాదేవి, ఆమె దౌహిత్రుడు రుద్రదేవ ప్రతాపరాజు అని వర్ణించబడ్డారు కాని, ఎక్కడా వంశనామం ‘కాకతీయ’ ప్రస్తావన లేదు.


వరదరాజస్వామి దేవాలయంలో తిరుప్రతిష్ట సందర్భంగా గుడిలోని దేవుని అంగ,రంగ భోగాలకుగాను ఎవరెవరు, ఎంతెంత చేసిన భూదానాలు, చెల్లించిన పన్నులు ఈ శాసనంలో వివరించబడ్డాయి. ఈ శాసనం కాకతీయుల నాటి సామాజిక, ఆర్థిక సంస్థలను వివరించింది. గ్రామంలో గుడినిర్మాణం చేసినపుడు ఊరుమ్మడిగా తమ ఆదాయాల నుంచి దేవాలయ నిర్వహణకు తమ వంతుగా ఇవ్వాల్సిన పన్నులను పేర్కొన్నది శాసనం.
మల్లు బాలమ్మ, మాదయ లెంకగారలు పెదకొండూరు వరదరాజస్వామి అంగరంగభోగాలకు, అముడుపడి (నైవేద్యం)కి ధారాపూర్వకంగా కొండూరి చెరువు దగ్గర ఇరుకార్తెలు పండే జలచేను(నీర్నేల, తరిభూమి)ను, క్రయలబ్ధం చేసిన(కొన్న) భూములను దానంచేసారు. ఈ గుడికి సర్వమాన్యంగా పెక్కండ్రు(వ్యాపారసంస్థ) పన్ను రూపంలో ఆదాయం ఇచ్చారు. 20 పొంకలు(పొనికెలు, ఎడ్లబండ్లల్లో వేసే గూడువంటిది) పత్తి కొన్నవారు మాడ లెక్కన, తమలపాకుల మోపులు కొన్నవారు 2మాడలు, ధాన్యాల అమ్మకం చేసినవారు మాడ-మానెడు ధాన్యం పన్నుకట్టారు. అష్టాదశప్రజలు వదులుకున్న ఆదాయం రంగభోగానికి, మహాజనాలు తమ వ్రిత్తుల(పారంపర్య దాన మాన్యాలు)నుంచి 1మర్తురు(1న్నర ఎకరం) తరిపొలము, చిన్నము(చిన్నబంగారునాణెం), మెట్టపొలము నుంచి 1పుట్టి ధాన్యం-చిన్నము ఇచ్చారు. కోమట్లు ఇంటికి 1చిన్నం, గొల్లవారు ఇంటికి మాడ-10 అడ్డుగులు, కుమ్మరులు ఇంటికి (?)అడ్డుగులు, మోడివారు ఇంటికి పాతికలు, సాలెవారు మగ్గానికి 1అడ్డుగు, కరణాలు, ఇప్పర్లు జతగూడి మాడ-పాతికలు, తలారిబంట్లు మాడ-పరకలు, పల్నవారు, కొలువుగలవారు మనిషికి ద్రమ్మము ఇచ్చి సుకృతం పొందాలని శాసనం శాసించింది.


పెక్కండ్రు అంటే ఒక వ్యాపారశ్రేణి. ఇటువంటి సంస్థలు స్వదేశీ, విదేశీ వ్యాపారాలు చేసేవి. వీరి వ్యాపారాలకు సురవరం, ఆలంపురం, త్రిపురాంతకం, వరంగల్‍ వంటి ప్రధాననగరాలు, పెద్దగ్రామాలు కేంద్రాలుగా వుండేవి. శాసనాలు, సాహిత్యం వీరిని గురించి పలుసార్లు ప్రస్తావించాయి. ఈ వ్యాపార సంస్థలలో పెక్కండ్రు, నానాదేశి పెక్కండ్రు, ఉభయ నానాదేశి పెక్కండ్రు, స్థలపెక్కండ్రు, 56దేశాల పెక్కండ్రు, వీరబలింజలు, నకరము, అయ్యవోలు-500 ప్రసిద్ధమైనవి.
పెదకొండూరులోని వరదరాజస్వామి దేవాలయం ఏకకూటాలయం. గర్భగుడి, అంతరాళం, అర్థమంటపం, ముఖ మంటపాలతో, ఇటుకలతో కట్టిన విమానంతో ఉండేది. ఆ గుడి పునఃనిర్మాణం కొరకు విప్పిపెట్టారు. అక్కడి ప్రాచీన శివాలయంలో కాకతీయశైలి లింగవేది, శివలింగం ఉన్నాయి. ద్వారబంధాలకు రెండువైపుల కలశాలున్నాయి. గుడిద్వారానికి లలాటబింబంగా మూలాధారబంధనాసనంతో గజలక్ష్మి శిల్పం ఉంది. చాళుక్యశైలిలో ఒక సప్తమాత•కా ఫలకం ఆ ప్రాంగణంలో ఉంది. చాళుక్యపూర్వశైలిలో చెక్కిన మహిషాసురమర్దిని శిల్పం ప్రత్యేకమైనది. పెదకొండూరులో శాసనాలున్న రెండు వీరగల్లులు, రెండు ఆత్మాహుతి వీరగల్లులు, ఒక సతిశిలను సభ్యులు గుర్తించారు. పెదకొండూరు పాటిగడ్డమీద సాతవాహనులకాలంనాటి ఎరుపుపూత కుండపెంకులు సేకరించారు. లభించిన పురావస్తు, శిల్ప, దేవాలయాల ఆధారంగా పెదకొండూరు సాతవాహనుల నుంచి కాకతీయుల దాక చారిత్రకంగా విలసిల్లిన గ్రామమనిపిస్తుంది.

పెదకొండూరు శాసన పాఠం:
1వ వైపు

  1. (చతుర్దళపుష్పం) శ్రీవరదరాజయనమః
  2. శ్రీమాన్యజ్ఞొ వరాహః ప్ర
  3. కటిత వి…సద్దంష్ట్రయో
  4. ద్ద్రుత్య-పృథ్వింకాంతామాలింగ్య
  5. చుంబంస్ఫురదతుళమహ
  6. భూషణభూషితాంగఃl రా
  7. జచ్చామీకరాభస్సనకముఖ ము
  8. నివ్రాత సంస్తూయమానః సాశ్చ
  9. రియం దేవ(వై)రిదైరదిగత మహి
  10. మాదేవదేవొవతా… llలాసితా
  11. ..(వం)శ సంభవన్రుప శ్రీరుద్ర
  12. దేవాభి(దౌ)విరాణాం ప్రవరః ప్ర
  13. సింహ్వబలినోజితారి భూపాన్ర
  14. ణ్యసర్వాంక్షాణ మిమా మనన్య
  15. శరణుం దమ్మణ శాస్తిసమః సా
  16. క్షాద్దర్మ(ణ)వానయం నసహతే దు
  17. ష్టారిజనాం దండయన్‍ ll అథాను
  18. జ స్తస్యశశాసభూమిం రాజమ(హా)
  19. దేవ ఇతిప్రసిద్ధః l తదాత్మజాభూ(../గ)
  20. ణ(ప)క్షితిశః క్షేత్రాఖిళారాతి
  21. పురవరేణ్యః ll తస్య రుద్రమహా
  22. దేవిసుతా రాజ్యమపాలయ లో
  23. కాధివస కళారాతినాశురొషా
  24. దబ క్షయతే ll తద్దౌహిత్రా రుద్రదే
  25. వః ప్రతాపిరాజ రక్షత్యక్షా
  26. స్తో ధరిత్రిం l ఇష్టాన్చేంగాన్యోవి
  27. తన్పన్న్రులోకే విద్బద్బ్యవుస్మారయ
  28. త్కల్పవృక్షం ll ఇదిరాజవర్షి l శ్రీనాథ

2వ వైపు

  1. మల్లుబాయితి జగత్ప్రసి
  2. …ముల సచ్చామర ద్యుర
  3. ..న అస్స్మేవరాజ్ఞః పరిచారి
  4. ….భూల్లక్ష్మిపతేః పాదస
  5. …జభ్రుంగి…అస్యాః పుత్రా
  6. …వనవిదితొనాయకొ మా
  7. ..నామానానా శస్త్రేష్పతి కు
  8. …లది య్యుద్దశూరాగ్రగణ్యః
  9. ………..చతురచరితా బ్రా
  10. ….ణష్ఛప్రయ…శ్రీమది
  11. మిశ్చరణశరణొభూషయ
  12. తోషలోకం ll కొండూరి లబ్ధవస
  13. తిం విబాతప్రతిష్టం లక్ష్మిపతిం
  14. వరదరాజ ఇతి ప్రసిద్ధరాక్రుత్పా
  15. దద ద్బహుళవ్రిత్తభువం నిబం
  16. ద్ధం దేవస్య భోగపుటనాత్థమ
  17. కల్పయత్యా ll జయతి సుర
  18. వితతి వినుతం నమ దఖిళ మ
  19. నోరథప్రదం సతతం l కొండూ
  20. రి వరదరాజ శ్రీపదయు
  21. గళం నృణాం శరణం ll శ్రీనాథ

3వ వైపు

  1. స్వస్తిశ్రీర్విజయాభ్యుదయశ్చ…
  2. భ శక ధరాధీశవత్సరములు 1…
  3. అగునెంది విరోధక్రుత్సంవత్స(ర శ్రా)
  4. వణ శు.12/3బు l ఆల..య(వర)
  5. దరాజు తిరుప్రతిష్టకాల….
  6. ప్పుడు మల్లుబాలంమ్మ….
  7. రూ మాదయలెంకంగా(రు)…
  8. …..ముడుపడిచాతు….
  9. అంగరంగభోగాలకు ధా
  10. పూర్వకముసేసిన (క్షి)త్రా…
  11. అముడు పడికి కొండూ(రి)..
  12. బవు చెఱువు జలచేను ఇరుగా
  13. రుం బాఱ మఱుతురు l ఇ క్ర
  14. మాననే నల్లంజెఱువువెనుక తూ
  15. ముకడను క్రయలబ్దంనన్ను వెట్టింది రె
  16. 0డు విసాలు భవుట చెఱువు
  17. దక్షిణపుంగొంమున వెలిపొ
  18. లం పది మఱుతురు భూతు
  19. లబండకడ క్రయలబ్దం కొ
  20. మ్మ యమలువెట్టింది పది
  21. మఱుతురు నల్లంజెఱ్వు వెను
  22. క తాడెపడుమడి మామిడితొంట అడ్డసా
  23. తుపడికి పువ్వదొంట తూర్పున అడ్డ
  24. వస్త్రలకు సేనెమగ్గం ఒకటి, దీపా
  25. లకు నూనెకు గానుగు ఒకటి, యితవట్టు
  26. సర్వమాన్యం ప్రెక్కండ్రు విడిచిన ఆ
  27. యము కొండూరిస్థలము ఎడూ…
  28. ను అసిబె నిరువయి పొంకలు కొంన్న
  29. వారు మాడం బది పొంకలు ప్రత్తిగొ

4వ వైపు

  1. న్నవారు మాడను యంబులంసేసి త
  2. మలపాకులు మోపునం గవ రెండు
  3. సేసి ధాన్యాలపేరను అమ్మకమువల్ల మా
  4. డ మానెండుసేసి యెడగాళ అష్టాదశ
  5. ప్రజలుంను విడిచిన ఆయము ర
  6. 0గబోగానకు మహాజనాలు త
  7. మ వ్రిత్తులందు నీరునేల మఱుతు
  8. రు చింనముంన్ను వెలివొలము
  9. లందు పుట్టి చింనముంను కా
  10. 0పు……….క్క….ప్రజలున్ను….
  11. యం లెఖ?ను తమ అరిబది
  12. మాడం బెఱుకలు కారు
  13. లందు బోనందూ మెండుసే
  14. సి కొమట్లు ఇంటి చింనం
  15. (గొ)ల్లవారు ఇంటిమాడబడి అడ్డు
  16. గులుకుంమరులు ఇంట్టనడుగు…నె
  17. …వారు ఇంట్టంబాతికలు వ్రిఇత్తులు
  18. ఇంట్ట నద్దుగులు సనెవారు మగ్గాన
  19. నడ్డుగు కరణాలుం డిర్పరును
  20. జెతబడి మాడం బాదుకలు తలా
  21. రి బంట్లు మాడంబఱకలు పల్నవా
  22. రు కొలువుగలవారెలాను మానిసి
  23. ద్రంమ్మము సేసిపెట్టి సుక్రుతంపడయు
  24. దురు ll ఇయ…ఇట్టి ప్రతిపాలిం
  25. చినవారి శ్రిపాదం మా సిరసు మీంది ది
  26. యి యత్నాన కెవ్వ రేమి విగ్ప్నం సేసిన వా
  27. రు గంగాదేవిలో గంగిక…నడ్డాయ
  28. దానండల దిగ నడిచినవారు ll స్వదత్తాద్వి
  29. గుణంపుణ్యం పరదత్తానుపాలనం l పర
  30. దత్తాపహారేణ స్వదత్తం న్నిష్పలం
  31. భవేత్‍ ll స్వదత్తాం పరదత్తాం వా
  32. యోహరేతి వసుంధరా షష్టి
  33. ర్వరుష సహస్రాణి విష్టాయాం
  34. జాయతె క్రిమిll

(మాడ=10కేసరిరూకలు, అడ్డుగ= అర్థరూక, పాతిక=రూకలో పావలా, పఱక=రూకలో 1/8, చిన్నం= 1/14 మాడ(?) ఆధారం: పరబ్రహ్మశాస్త్రి-కాకతీయులు)
ధన్యవాదాలు: కొత్తతెలంగాణ చరిత్రబృందం సభ్యులు వేముగంటి మురళీకృష్ణ, డా.మండల స్వామి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‍ మండలంలోని పెదకొండూరులో కొత్త కాకతీయ శాసనాన్ని గుర్తించారు. ఈ శాసనం వెలుగు చూడడంలో పెదకొండూరు గ్రామసర్పంచ్‍ కాయితి రమేష్‍ గౌడ్‍, ఎంపిటీసి బద్దం కొండల్‍ రెడ్డి, ఆలయకమిటీ చైర్మన్‍ జక్కిడి కొండల్‍ రెడ్డి, వైస్‍ ఛైర్మన్‍ గుండెబోయిన ఇస్తారి యాదవ్‍, ఉపాధ్యాయుడు పాలకూర వెంకటేశ్‍ గౌడ్‍ సహకరించారు.

  • శ్రీరామోజు హరగోపాల్‍,
    ఎ : 99494 98698

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *