(గత సంచిక తరువాయి)
శ్రీఘ్రగతిని మార్పు చెందుతున్న భూగోళస్థితిగతుల్ని అంచనా వేయాలని ఐక్యరాజ్యసమితి ఇంటర్ గవర్నమెంట్ పానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ (IPCC) అనే వేదికను అయిదు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసింది. ఈ వేదిక ప్రపంచ వ్యాపితంగా జరుగుతున్న భౌగోళిక మార్పుల్ని పరిశీలించి నివేదికల్ని రూపొందిస్తున్నది. (ఈ వేదిక గూర్చి, సూచనల గూర్చి తర్వాత సంచికలో చూద్దాం!) భూగోళ రక్షణకై శాస్త్రీయ పరిష్కారాల్ని, మానవాళి చేపట్టాల్సిన తక్షణ కర్తవ్యాల్ని సూచిస్తున్నది. ఈ నివేదికల్లో చివరి నివేదిక గత నెల ఏప్రిల్ (2022) మొదటి వారంలో ఐక్యరాజ్య సమితికి అందింది. భూగోళం ప్రమాదపుటంచున వుందని, ఇప్పటికే పరిస్థితులు చేజారిపోయాయని, ఇప్పుడన్నా స్పందించకపోతే భూగోళం తన ఉనికిని కోల్పోతుందని, ఈ నివేదికలో వివిధ దేశాల శాస్త్రజ్ఞులు హెచ్చరించారు.
ఐక్యరాజ్యసమితి సెక్రటరి జనరల్ ఆంటోనియో గుటెర్రస్ ఈ నివేదిక విడుదల సందర్భంగా మాట్లాడుతూ, ప్రపంచం ప్రమాదపుకర పరిస్థితుల్లో చిక్కుకున్నదని, ఇప్పటికే పునరుద్దరించలేని స్థితికి చేరుకున్నదని, ఇప్పుడన్నా అన్ని దేశాలు, నేతలు కదలాలని, ప్రజలు ఎక్కడిక్కడ పర్యావరణాన్ని కాపాడుకొనే చర్యలు చేపట్టాలని కోరాడు. ఈ నివేదిక ప్రకారం ఈ క్రింది ప్రమాదాలు భూగోళానికి పొంచి వున్నాయి.
- గడ్డి భూములుగా మారబోతున్న అమెజాన్ అడవులు
- కనుమరుగవుతున్న పగడపు దీవులు
- మంచు అడవులు తరిగిపోవుట
- అట్లాంటిక్ సముద్ర ప్రవాహం ఆగిపోవుట
- ఇరు ధృవాల మంచు పలకలు కరిగిపోవుట. (దీని గూర్చి గత కథనాల్లో చూసాం!)
సవన్నాలుగా మారుతున్న అమెజాన్ అడవులు :
భూమధ్యరేఖ ప్రాంతపు వర్షపు అమెజాన్ అడవులు తమ ఉనికిని కోల్పోయి సవన్నాలుగా (గడ్డి భూములుగా) మారిపోతున్నట్లు నివేదిక తెలిపింది. 6.5 మిలియన్ చ.కి.మీ. విస్తీర్ణంతో గల ఈ అడవులు 10 శాతం ప్రపంచ జీవరాసికి ఆలవాలం. పెరుగుతున్న ఉష్ణోగ్రతకు, వర్షాభావస్థితికి, అనునిత్యమైన కరువు కాటకాలకు ఈ అడవులు అంటుకొని బుగ్గైపోతున్నాయి. దీనికి తోడు పెరు, బ్రెజిల్ రాజకీయ అనిశ్చిత పరిస్థితులు, కాంట్రాక్టర్లు ఈ అడవుల్ని నరుకుతున్నారు. వ్యవసాయ విస్తరణ, ప్రజల వలసలు ఈ అడవుల్ని కుంచింపచేస్తున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల అవసరాల్ని తీర్చడానికై సోయాబీన్, పామ్ ఆయిల్, కోకా సాగు అధికమైంది. దీనికై అమెజాన్ అడవుల్ని నరకడం, కాల్చడం మామూలైపోయింది. చట్టవ్యతిరేక బంగారు గనుల తవ్వకాలు కూడా ఈ అడవుల్ని అంతమొందిస్తున్నాయి.
పై నివేదిక ప్రకారమే 2020 నుంచే 75 శాతం ఆవాస ప్రాంతాలు నశించగా, ఇందులో 40 శాతం తిరిగి పునరుద్దరించని విధంగా మార్పు జరిగిందని దీని సారాంశం! ఇలా ప్రకృతి సహజసంపద తరిగి, గడ్డి భూములుగా మారుతున్నాయని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన వాతావరణ శాస్త్రజ్ఞుడు డెనియల్ స్వేన్ పేర్కొన్నాడు.
కనుమరుగైతున్న పగడపు దీవులు (coral reefs)
సముద్రపు అడుగు భాగాన వుండే ఎర్రని ప్రవాళికలు (coral polyps) నీటిలో కరిగిన కార్బన్‍ను గ్రహించి కాలనీలను (CaCo3) ఏర్పాటు చేయును. వీటి నుంచే నవరత్నాల్లో ఒకటైన పగడాలను తయారు చేస్తారు. సముద్రంలో 0.2 శాతంగా వుండే ఈ సముదాయాలు సముద్రాల ఆరోగ్యాన్నే నియంత్రిస్తాయంటే ఆశ్చర్యమే! కారణం, చిరు చేపలకు, సూక్ష్మజీవులకు ఇవి ఆవాసాలుగా వుండడంతో పెద్ద జంతువుల నుంచి రక్షణ కలుగుతుంది. ఇలా రక్షణ పొందిన చేపలు, ఇతర జలచరాలు పెరిగి పెద్దవిగా మారడంతో అభివృద్ధి చెందుతున్న దేశాల ఆహారపు కొరత 25 శాతం తీరుతున్నది. అతి స్వల్ప ఉష్ణోగ్రతలో మనుగడ సాగించే ఈ పగడపు దీవులు పెరుగుతున్న సముద్ర ఉష్ణోగ్రతలకు 2009 నుంచే 15 శాతంకు పైగా నశించినట్లు నివేదిక తెలిపింది.
మాయమైతున్న మంచు అడవులు : (snow forests)
పశ్చిమ అమెరికా, కెనడా, అలస్కా ప్రాంతాల్లోగల శీతల అడవులు భూగోళంపై జనించిన కార్బన్‍ను 30 శాతం గ్రహించి నిక్షేపిస్తాయి. కాని, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తరుగుతున్న మంచు అడవులు తగలబడుతున్నాయి. చలికి సంవత్సరానికి ఒకసారి మాత్రమే ప్రత్యుత్పత్తి జరిపే మాత్‍లు, బీటల్స్ (కాండాల్ని ఆధారంగా చేసుకొని జీవించే రెక్కల కీటకాలు), పెరిగిన వేడిమికి రెండుసార్లు ప్రత్యుత్పత్తి జరుపు కుంటున్నట్లుగా పరిశోధనలు చూపాయి. దీంతో వీటి సంఖ్య అధికమై కాండాల బెరడును తినివేడయంతో చెట్లు తొందరగా క్షీణించి అగ్నికి ఆహుతి అవుతున్నాయి. గత సంవత్సరం మెక్సీకోలో వేలాది హెక్టార్లలో అడవులు తగలబడడం ఈ మార్పులతోనే! అలాగే యూరఫ్ దేశాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతున్నది. ఈ విధంగా అడవులు కనుమరుగైపోయి గడ్డి భూములుగా మారుతున్నట్లు పై నివేదిక తెలిపింది.
నిలిచిపోతున్న అట్లాంటిక్ సముద్ర ప్రవాహాలు :
అధిక ఉష్ణోగ్రత నుంచి, అల్ప ఉష్ణోగ్రత వైపు సముద్ర జలాలు ప్రవహించడం ఓ ప్రకృతి చర్య! దీంతో ప్రపంచ స్థాయి సముద్రాలలో ఉషోణగ్రత, సాంద్రత, లావణీయతలు క్రమబద్దీకరించబడుతాయి. ముఖ్యంగా భూమధ్యరేఖ ప్రాంత సముద్ర జలాలు ఉత్తరార్థ గోళం వైపు కదలాడి అమెరికా తీర ప్రాంత సముద్ర జలాల్ని స్థిరీకరిస్తాయి. సముద్రనీటి విద్యుత్తు ప్రవాహంగా భావించే ఈ పక్రియను అట్లాంటిక్ మెరిడియోనల్ ఒవర్ టర్నింగ్ సర్క్యులేషన్ (AMOC)గా పిలుస్తారు. ఈ పక్రియ ప్రకారం భూమధ్యరేఖ ప్రాంత వేడి సముద్రనీరు ఉత్తరదిశగా ప్రవహించగా, కొంత నీరు ఆవిరైతుంది. మిగతా నీటి ఉప్పుగాఢత పెరగడంతో నీటి సాంధ్రత కూడా పెరుగుతుంది. ఇలా సాంధ్రత పెరిగిన నీరు సముద్ర అడుగుభాగానికి చేరుతుంది. తక్కువ గాఢత గల నీరు తిరిగి దక్షిణదిశ వైపు ప్రయాణిస్తుంది. ఇలా ఉష్ణ సంవహనానికి దోహద పడే ఈ ప్రవాహాలు యావత్ సముద్రాల ఉష్ణోగ్రతను ఒకే విధంగా ఉండేలా నియంత్రిస్తాయి. ఈ చర్యలతో సముద్ర జలాలమధ్యన ఉష్ణము, శక్తి మార్పిడులు జరగడంతో, ప్రపంచ పవనాలు ఏకరీతిని వుండే అవకాశం వుంటుంది. కాని, ఈ గమనం గత 2019 నుంచి నిలిచిపోతున్నట్లు నివేదికలు చూపుతున్నాయి.
కనుమరుగైతున్న ఇసుకు తిన్నెలు! ఆవిరైపోతున్న భూగర్భజలాలు!
వర్షాకాలంలో వరదకు కొట్టుకవచ్చిన ఇసుకను కుప్పగా చేర్చి, పిల్లలు పిట్టగూళ్ళు కట్టి ఆనందించడం ఒకనాటి కల! ఇప్పుడా కల చెదిరిందింది. ఒర్రెలు, వాగులు, వంకలు, నదులు చివరికి సముద్రంలో కలిసే నదుల ముఖద్వారాలు బోసి పోతున్నాయి. నీటి నిల్వలలకు స్పాంజ్ (sponge)లా పనిచేసే ఇసుక తిన్నెలు పట్టణీకరణతో, అభివృద్ధి పేరుతో, రహదారుల, ఆకాశహార్మ్యాల నిర్మానాలతో అంతరించి పోతున్న సహజ వనరులలో మొదటి స్థానంలో వున్నాయి. ప్రపంచ వ్యాపితంగా నీళ్ళ తర్వాత అత్యధికంగా వాడబడుతున్నది ఇసుకనే!
ఇసుకను నిర్మాణాలతోపాటు, అత్యధికంగా గాజు పరిశ్రమలో వాడుతారు. ఇసుకలో వుండే సిలికా (silica)తో అందాల మందుసీసాలు, చీర్స్ చెప్పే గ్లాసులు, తలుక్కుమనే అద్దాల మేడలు, అంతపుర కాంతులు తయారవుతాయి. సిమెంట్ పరిశ్రమలో, రంగుల తయారిలో, ఆక్వేరియంలతో పాటు, ఇతర ఇరువైరకాల వస్తువుల తయారికి కూడా వినియోగిస్తారు. ఇలా లక్షలాది సంవత్సరాలుగా పోగుపడిన ఇసుక 21వ శతాబ్దంలో విచ్చలవిడిగా వినియోగించబడడంతో గత రెండు దశాబ్దాలులోనే ఇసుక వాడకం మూడురెట్లు పెరిగిందని ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం (UNEP) తెలిపింది.
ఇసుక వాడకంపై తొలిసారిగా స్పందించిన ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం గత మే నెలలో ఓ నివేదికను విడుదల చేసింది. ప్రపంచ వ్యాపితంగా 22 మంది పరిశోధకులు అందించిన పరిశోధన పత్రాల ప్రకారం, ఏడాదికి సగటున 5వేల కోట్ల టన్నుల (50 లక్షల కోట్ల టన్నుల) ఇసుకను రహదారులు, భవన నిర్మాణాలు మింగేస్తున్నాయని తేలింది. ఇసుకతో భూగోళం చుట్టూ 27 మీ. ఎత్తుతో, 27 మీ. వెడల్పున ఓ గోడనే నిర్మించవచ్చునట! సగటున ప్రతి మనిషి 17 కిలోల ఇసుకను వినియోగిస్తున్నట్లుగా ఈ నివేదిక ప్రకటించింది.
ప్రతీ వర్షాకాలంలో కొత్తగా ఇసుక చేరుతుందనే వారున్నారు. అవసరానికి మించి ఇసుకను వాడి రహదారుల, భవన నిర్మాణాలు నిర్మిస్తే వాగుల, నదుల లోతు పెరిగి నీటి ప్రవాహం ఆగిపోతుంది. దీంతో పై భూభాగాలు విపరీతమైన ఒత్తిడికి గురై నేల కరిగి భూస్వరూపమే మారిపోయే ప్రమాదం వుంది. ఇప్పటికే ఈ పక్రియ ప్రపంచ వ్యాపితంగా మొదలైంది. హిమాలయ పర్వతశ్రేణులు తమ ఆకృతిని కోల్పోతున్నాయి. సుందర్బన్ డెల్టాలు ఈ విధంగానే మారిపోతున్నాయి. భూసారం తగ్గి, వ్యవసాయం కుటుంపడుతుంది. ఆహారపు కొరత తీవ్రమైతుంది. వాతావరణంలో మార్పులు సంభవించి అతివృష్టి, అనావృష్టీ, సునామీలు భూకంపాలు నిత్యకృత్యంగా మారుతాయి. సముద్రాలకన్నా భూభాగాలు లోతట్టుగా మారి సముద్రలం ఆక్రమిస్తుంది. తీరప్రాంత ప్రజలకు, పట్టణాలకు పెను ప్రమాదం ఏర్పడుతుంది. ప్రపంచవ్యాపితంగా సముద్రతీర పట్టణాలు ఉనికినే కోల్పోతాయి.
భూగోళం మనుగడకే కాదు, యావత్ జీవరాసికి, మానవుడి ఉనికికే పెను ప్రమాదంగా మారబోతున్న ఇసుక వాడకంపై తక్షణం నియంత్రణ జరగాలి. నిర్మాణాల్ని స్థానిక వ్యవసాయ, వృక్ష సంబంధ వ్యర్థాలతో, ఆదునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిర్మించేలా నిబంధనలు పెట్టాలి. ప్రపంచవ్యాపిత పట్టణీకరణను నిలుపుచేసి పల్లె వికాసాల్ని చేపట్టాలి. లేదంటే మరెప్పుడో కాదు, మన కళ్ళముందే మన భూగోళం కరిగిపోతుంది.
సుందర్బన్ – ఒకనాటి సుందర స్వప్నం!
సుందర్బన్ అనగానే బెంగాల్ టైగర్స్ కళ్ళముందు కదలాడుతాయి. బంగ్లాదేశ్‍లో, భారత్‍లోని పశ్చిమ బెంగాల్‍లో బంగాళాఖాతం తీరం వెంబడి 310 కి.మీ. వెడల్పుతో వందకు పైగా ద్వీపాలతో 10,277 చ.కి.మీ. (బంగ్లా – 6,017/పశ్చిమ బెంగాల్ 4,260) వైశాల్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టా ప్రాంతంగా ప్రసిద్ధిగాంచింది. బ్రహ్మపుత్ర, గంగా, మేఘన లాంటి ప్రధాన నదులతోపాటు పదుల సంఖ్యలో ఇతరనదుల సంగమ ప్రాంతమిది. హిమాలయాలనుంచి, ఇతర మైదాన ప్రాంతాల నుంచి నదులు తెచ్చిన మెత్తటి మృతిక (soil) తో వేలాది సంవత్సరాలుగా పోగుపడిన డెల్టాలు కావడంతో, దట్టమైన మడ (mangroves) అడవులు వేళ్లూనుకోవడంతో, డెల్టాలు తరగకుండా, సముద్ర అలలు గట్టుకు చేరకుండా కాపాడబడడంతో, రాజసం ఉట్టిపడే పులులు, ఇరవాడి డాల్ఫిన్స్ (irawadi dolphins) నదీ ముఖద్వారం దగ్గర పెరిగే మొసళ్ళు, మంచినీటి, ఉప్పునీటిలో ఆవాసం వుండే చిన్న రకం తాబేళ్ళు (terrapin), పక్షులు, ఉభయచరాలు, ఇతర పాలిచ్చే జంతువులు అత్యధికంగా జీవించేవి. కాని ఇది ఒకనాటి కల.
పెరుగుతున్న కాలుష్యం, భూ ఉష్ణోగ్రతలతో ఇదంతా తలక్రిందులుగా మారిపోతున్నది. గత పదిసంవత్సరాలలో సముద్రం సం।।నికి 3 సెంమీ. చొప్పున పెరుగుతుండడంతో ముఖద్వారా దీవులు సముద్రంలో కలుస్తున్నాయి. హుగ్లీనదితో ఏర్పడిన లోహచర ద్వీపం 1980లో వచ్చిన వరదలకు సముద్రంలో కలిసిపోయింది. ప్రపంచంలో కనుమరుగైన మొదటి డెల్టాకూడా ఇదే! తర్వాత బెడ్‍ఫోర్డ్, కాబాసాగడి, సుసారిబంగా దీవులు బంగాళాఖాతంలో మునిగి పోయాయి. ఈ విధంగా గత నాలుగు శతాబ్దాల కాలంలో 12 శాతం సుందర్బన్ డెల్టాభాగం కనుమరుగైపోయింది. కోల్‍కతాకు దక్షిణాన 92 కి.మీ. దూరంలో వున్న గోరామరా ద్వీపం కూడా ప్రస్తుతం 5 చ.కి.మీ.కు కుంచించుకు పోగా త్వరలోనే తన అస్తిత్వాన్ని కోల్పోనున్నది. ఇక్కడ ఆవాసం వుండే మూడు వేల జనాభా దగ్గరలోని అతిపెద్ద సాగర్‍ద్వీపానికి వలసపోతున్నారు. నిజానికి సాగర్ ద్వీపం రెండు లక్షల జనాభాతో తాగునీరు లేక అల్లాడుతుంటే, మునిగిపోతున్న ద్వీపాల జనాభా వలసలతో మృత్యుఘోషను తలపిస్తుంది.
అలియా, ఫమి, బుల్‍బుల్ లాంటి పెద్ద తుఫానులు గత 20సం।।లలో 10కి పైగా సంభవించడంతో, సముద్రనీరంతా నదుల ముఖద్వారాల్లో చేరడంతో తాగడానికి చుక్కనీరు దొరకక పదుల కి.మీ. దూరం నుంచి ప్రజలు నీరు తెచ్చుకోవాల్సివస్తున్నది. ఈ విధంగా 2019 నుంచి దాదాపు 35 లక్షల జనాభా దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటున్నది. వ్యవసాయం దెబ్బతినడంతో, ప్రజలు చేపల వేటవైపు మరలడంతో బోట్ల నిర్మాణానికి, వంట చెఱకుకు మడ అడవుల్ని విచ్చలవిడిగా నరకడం, బడా కాంట్రాక్టర్లు రాజకీయ పలుకుబడితో కలపను అమ్ముకోవడం నిరంతరమైంది. అలాగే గంగా, బ్రహ్మపుత్రలపై భారత్, చైనా, బంగ్లా దేశాలు అనుమతులకు మించి బ్యారేజ్‍లను నిర్మించడంతో, సారవంతమైన మట్టి డెల్టాలకు చేరని స్థితి. ఫరక్కాబ్యారేజ్ నిర్మాణం తర్వాత, మడ అడవుల క్షీణదశ ప్రారంభమైనట్లు అధ్యయనాలు తెలుపుతున్నాయి. ఈ విధంగా తరుగుతున్న మడ అడవులు అక్కడి జీవావరణంపై, జనాభాపై తీవ్ర ప్రభావం చూపడంతో పర్యావరణ విపత్తువలసలు (climate migration) ప్రపంచంలో మొదటిసారి ఈ ప్రాంతంలోనే మొదలయ్యాయి. వలసవెళ్ళినా, పనిదొరకక, ఉన్న ఆవాసాల్ని వదిలిన మనోవేదనతో 2017 గణాంకాల ప్రకారం గత 30 సం।।లలో 60,000 మంది సుందర్భన్ వాసులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు తేలింది. పులులతో సహా, ఇతర జంతువుల ఆహారపు గొలుసు దెబ్బతిన్నది. ప్రఖ్యాతి గాంచిన హిల్సా (hilsa) చేపల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది.
కపిలముని దేవాలయం:
ఇక్కడి ప్రజలు ఆరాధ్యదైవంగా భావించే కపిలముని దేవాలయం సముద్రంలో కలిసిపోవడంతో, పక్క దీవిలో నిర్మించినా లాభంలేకుండా పోతున్నది. ఇప్పటికి నాల్గవసారి ఈ దేవాలయాన్ని ఒక దీవి నుంచి మరో దీవికి తరలించాల్సి వచ్చింది.
సుందర్బన్ భవిష్యత్:
పశ్చిమబెంగాల్‍లోని 4.5 మిలియన్ల, బంగ్లాదేశ్‍లోని 3 మిలియన్ల జనాభాపై ఇప్పటికే తీవప్రభావం పడింది. అత్యధిక శాతం జనాభా బతుకుబండిని లాగడానికై కోల్‍కతా, డాకా నగరాలకు, కర్మాగారాల ప్రాంతాలకు వలసపోతున్నారు. అక్కడ పోటీ వుండడంతో దినమోగండంగా గడుపుతున్నారు. అలాగే భారతదేశ తీరప్రాంతాల్లో (50 కి.మీ. పరిధి) 250 మిలియన్ల (20%) జనాభాకూడా 2030 నుంచి తీవప్రభావానికి గురికాబోతున్నది. రాబోయే కాలమంతా వాతావరణ విపత్తుల కాలమే! నెదర్‍ల్యాండ్‍లా గోడల్ని, డెక్కుల్ని నిర్మించినా లాభం లేదంటున్నారు నిపుణులు. ఢాకా, కోల్‍కతా, ముంబాయి నగరాలకు కూడా ప్రమాదం పొంచి వున్నదని పర్యావరణవేత్తల ఆందోళన! తూర్పు ఆసియాలో బ్యాంకాక్, షాంగైలకు కూడా ఇదే స్థితి వుంటుంది. (2050 నాటికి 3 రెట్ల తీరప్రాంత జనాభాపై తీవ్ర ప్రభావం పడబోతున్నది).
సుందరి అనే స్థానిక పేరుతో పిలవబడే మడ అడవులుగల ఈ సుందర్బన్ సౌందర్యం ప్రపంచంలోనే అత్యధికంగా సముద్రకోతకు గురౌతున్న ప్రాంతంగా గుర్తించబడింది. ప్రస్తుతం దీని ప్రాశస్తం కోల్పోవడంతో 45 శాతం అటవిని, 45శాతం సస్తన జాతుల్ని, 46 శాతం ప్రాకుడు జంతువుల్ని, 36 శాతం ఉభయచరాల్ని, 42 శాతం పక్షుల జనాభాను కోల్పోయింది. దీంతో ప్రజల జీవనాధారం దెబ్బతినడంతో ఈ ప్రాంతం నుంచి వచ్చే 41 శాతం రెవెన్యూ తగ్గిపోయింది.
ఉష్ణోగ్రతలు ఇలాగే పెరిగితే, అడవుల నరికివేత ఇలాగే కొనసాగితే, పాలకుల బుద్దికోణం మారకపోతే, వాతావరణ సమతుల్యత కాపాడబడకపోతే బంగ్లాదేశ్ యొక్క 16 కోట్ల, పశ్చిమబెంగాల్ యొక్క 10 కోట్ల (26కోట్లు) జనాభాలో 14 కోట్ల జనాభాపై రానున్న 30 సం।।లలో అతి తీవ్రమైన ప్రభావం ఏర్పడుతుంది. ఇప్పుడన్నా మనం ప్రభుత్వాల్ని కదిలించగలమా..???
ప్రపంచీకరణ లాగానే ప్రకృతి విపత్తులు కూడా ప్రపంచ వ్యాపితం అవుతున్నాయి. గతంలో కొన్ని ప్రాంతాలకు, రుతువులకు పరిమితమైన ఈ భీభత్సాలు సర్వాంతర్యామిగా మారాయి. ప్రకృతి ప్రకోపం ఏ రూపంలో వస్తుందో మానవుడి మేధస్సు పసిగట్టలేక పోతున్నది. ఇలా నిత్యకృత్యంగా మారిన ఈ తుఫానులు, పెరుగుతున్న సముద్రమట్టాలు ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో సుందర్బన్ డెల్టాలే చక్కని ఉదాహరణ!
ఆధారం:
- The Uninhabitable Earth – David Ballace well-2019
(100 మంది పర్యావరణ నిపుణుల అభిప్రాయాలతో)
ఈ పుస్తక పరిచయం -Nicholas Muller (2020) - Dr. Joyashree Roy, పర్యావరణవేత్త
(2007లో IPCC రిపోర్ట్కు వచ్చిన నోబెల్ బహుమతిలో భాగస్వామి) - USA Today- 8 -10 April 2022
(వచ్చే సంచికలో పర్యావరణంపై నిరంతర వాగ్భాణాలు చూద్దాం!)
- డా।। లచ్చయ్య గాండ్ల,
ఎ : 9440116162