ప్రాచీన గుహాచిత్రాల స్థావరం – పాండవుల గుట్టలు


వరంగల్‍ జిల్లాకేంద్రానికి 50కి.మీ. దూరంలో, వరంగల్‍-మహదేవపూర్‍ రహదారిపై రేగొండ మండలం రావులపల్లె పరిసరాల్లో ఈ పాండవులగుట్టలున్నాయి. ఎక్కువ మట్టుకు సున్నపురాళ్ళతో, అవక్షేపశిలలతో ఏర్పడిన ఈ గుట్టల్లో పొరలు పొరలుగా ఒకదాని మీదొకటి పేర్చినట్టుగా అనేక శిలాక•తులు కన్పిస్తాయి. ఎత్తైన బండరాళ్ళ మధ్య లోతైన అగాధాలతో లోయలు, అడుగడుగునా అబ్బురపరిచేవిధంగా పడిగెలెత్తి నిల్చున్న కొండ వాళ్ళు. ఆ కొండగోడలపై అపురూపమైన ప్రాచీన రాతిచిత్రాలు.


భారతదేశంలోని 100 శిలాచిత్రలేఖన మండలాల్లో దాదాపు 2,500 చిత్రిత శిలాశ్రయాలున్న 400ల స్థావరాలు కన్పిస్తున్నాయి. ఆంధప్రదేశ్‍లో 30చోట్ల, తెలంగాణాలో 70తావుల్లో ఈ రాతి చిత్రాలున్నాయి. పాండవుల గుట్టల్లోని చిత్రాలు అంత్యప్రాచీన శిలాయుగం నుండి మధ్యశిలాయుగంవరకు తర్వాత చారిత్రక యుగంలో కూడా చిత్రించబడినవి. పాండవులగుట్టలో రాళ్ళను చూసినపుడు అమెరికాలోని ‘కొలరాడో’ ప్రాంతం గుర్తొస్తుంది. రాతిచిత్రాలను చూస్తే పాండవుల గుట్ట తెలంగాణాలోని ‘చిత్రిత శిలాశ్రయాల విశ్వవిద్యాలయం’ అనిపిస్తుంది. ప్రాక్‍ యుగం నుండి చారిత్రయుగం దాకా మానవజీవన పరిణామాన్ని ఒకేచోట నిలుపుకున్న గుహారాతిచిత్రాల సమూహమిది. ఈ గుట్టలమీది రాతిచిత్రాలను తొలిసారి గుర్తించింది, పురావస్తువారికి రిపోర్టు చేసింది చారిత్రకపరిశోధకులు, రచయిత డా.ఈమని శివనాగిరెడ్డిగారు.


పాండవులగుట్టల్లో ‘ఎదురుపాండవులు, గొంతెమ్మగుహ, పంచపాండవులు, పోతిరాజు చెలిమె, మేకలబండ, ముంగీసబండ, తుపాకులగుండు, యానాదుల గుహ’లు చూడాల్సిన ప్రదేశాలు. వాటిలో ఎదురుపాండవులు దానికి కుడిపక్కన వెనకవైపు గుహలు, గొంతెమ్మగుహ, పంచపాండవుల దొనెల్లో అద్భుతమైన శిలాశ్రయచిత్రాలున్నాయి. ప్రాక్‍ యుగం నుండి చారిత్రకయుగం దాకా వేయబడిన రాతిచిత్రాలెన్నో అప్పటి జీవనశైలీ వైవిధ్యాల్ని కనువిందు చేస్తున్నాయి. కొన్నిచోట్ల పాతబొమ్మల మీదనే కొత్తబొమ్మలు (అధ్యారోపణం) వేసిన జాడలగుపిస్తున్నాయి. ఆరుచోట్ల వున్న చిత్రిత శిలాశ్రయాల్లో అన్నిబొమ్మలు ముదురు ఎరుపురంగుతో చిత్రించబడ్డవే. మందమైన గీతలతో చదునైన పూతలతో గీయబడిన ఈ బొమ్మల్లో శాఖాహార, మాంసాహార జీవులు, మనుషుల బొమ్మలు వున్నాయి. వీటిలో జింకలు, చేపలు, మేకలు, కుక్కలు, ముళ్ళపందులు, కుందేళ్ళు, తాబేలు, పాము, చిలుక, సీతాకోకచిలుకలు, కొండెంగ, నెమలి, కప్ప,బల్లి, ఎలుగుబంటి, పెద్దపులులు, పండు, వలతో మనుషులు, పులి వంటి జంతువును చంపిన సరీసృపం వంటి పెద్ద జంతువు, కుందేళ్ళను తరుముతున్న కుక్కలు, కుక్కలు చుట్టి నిలుచున్న మనిషి, ఈనిన జింక, జింకపిల్లను నాకుతున్న దృశ్యాన్ని చూస్తున్న మనిషి, త్రిభుజాలు, త్రిశూలం, చుక్కల వంటి రేఖాకృతులు, కొన్ని శిథిలచిత్రాలు, ఇవేకాక గొంతెమ్మగుహలో చేతిగుర్తులు, యుద్ధసన్నివేశాన్ని తలపించే బొమ్మలున్నాయి. పంచపాండవుల గుహలో రంగులలో 13వ శతాబ్దానికి చెందిన పంచపాండవులు, కుంతి, ద్రౌపది, ద్రుపదుడు, పాండవుల పెండ్లి, శేషశాయి, గణేశుడు, శివలింగం, ఆంజనేయుడు, బ్రహ్మ, సరస్వతుల చిత్రాలున్నయి.


ఈ బొమ్మలన్నింటిలో ‘ఎదురు పాండవుల’నే కొండచరియలో వేసివున్న రాతిచిత్రాలు అతి పురాతనమైనవి, అపూర్వమైనవి. ఈ చిత్రాలొకచోట 6 అడుగుల కంటె ఎత్తుగా వున్నాయి. ఈ చిత్రాలు వేసిన తీరు, శైలి, మొరటుదనం, వాటిలోని జంతు జీవజాలం అన్నింటిని పరిశీలించి కాలానుశీలన చేస్తే ఇవి మనదేశంలోని మధ్యప్రదేశ్‍ ‘బింబేట్కా’ గుహల్లోని రాతిచిత్రాల కన్నా ప్రాచీనమైనవని తెలుస్తుంది.World Heritage వారు చెప్తున్నవిధంగా బింబేట్కా చిత్రాలు 30వేల యేళ్ళనాటివైతే మనపాండవుల గుట్టబొమ్మల్లో అశ్వికులు, యుద్ధ సన్నివేశాలు, ఆయుధాలు, వివిధ వాహనాలు, అలంకరణలు వంటి ఆధునిక రూపాలేవీ లేవు కనుక ఇవి వాటికన్నా ప్రాచీనకాలానికి చెందినవని రుజువవుతున్నది. ఒక్క పంచపాండవుల గుహలో మాత్రమే వర్ణచిత్రాలున్నాయి. (అవి 12, 13 శతాబ్దాల నాటివిగా పురాశాఖ వారు అనుమానిస్తున్నారు.)


పాండవుల గుట్టల్లో అన్నీ విశేషాలే. ‘ఎదురు పాండవుల’ గుహలకు కుడిపక్కన వెనక వైపున 5 చోట్ల రాతిచిత్రాల దొనెలతో పాటు ఒకచోట పెద్ద రాతిగుండులోనే క్షయకరణంవల్ల ఏర్పడ్డ అద్భుతమైన సహజసిద్దమైన అవిచ్ఛిన్న ‘శిలాతోరణం’ వుంది. ఒక రాతిగుండులో రెండు నిలువుల ఎత్తున ఈ శిలాతోరణం ఎంతో అందంగా కనిపిస్తున్నది.


గొంతెమ్మగుహ కూడా విశేషాలున్న తావు. ఇక్కడి గుహలో చేతిముద్రలు, చిత్రాలు, లిపులున్నాయి. వివిధ చిత్రితశిలాశ్రయాల్లో మాదిరిగానే ఇక్కడ ముదురు ఎరుపురంగులో (కుడి)చేతిముద్రలు వున్నాయి. గుహ బయట వీరుల యుద్ధసన్నివేశం చిత్రించబడి వుంది. రంగు, గీతలను బట్టి ఈ బొమ్మ చారిత్రకయుగం నాటిదనిపిస్తున్నది. గుహలో ఒక రాతిగో మీద బూడిదవన్నె రంగుతో రాసిన లిపి వుంది. అట్లాంటి రాతలే ఎరుపురంగులో పంచపాండవుల గుహలో కూడా వున్నాయి. లిపిని బట్టి 6,7 శతాబ్దాలనాటివని తోస్తున్నది ఆ రాతలు.


పాండవుల గుట్టల్లో మరొక చారిత్రకయుగ విశేషముంది. గొంతెమ్మగుహ తూర్పున బండరాయి అంచున ఒక ‘లఘుశాసనం’ వుంది. అది ‘శ్రీ ఉత్పత్తి పిడుగు’ శాసనం. ఈ శాసనం గురించి పురావస్తుశాఖ వారు వివరించి రాయలేదు. కాని, ఇదే పేరుతో గల ఇట్లాంటి లఘుశాసనాలు తెలుగునాట 18చోట్ల, మహారాష్ట్రలో ఒకచోట లభించాయి. పది చోట్ల ‘శ్రీ ఉత్పత్తి పిడుగు’ అని తప్ప సంపూర్ణశాసనాలు లభ్యం కాలేదు. తక్కిన ఆరు తావుల్లో శాసనాలని చదివి తెలిసిందానిమీద చర్చోపచర్చలు చేసిన చారిత్రక పరిశోధకులు ‘శ్రీ ఉత్పత్తి పిడుగు’ అనేది ఒక శిల్పకారుల సంఘం పేరై వుంటుందనే నిశ్చితాభిప్రాయానికి వచ్చారు. కాని ‘శ్రీ ఉత్పత్తి పిడుగు’ మీద పరిశోధక గ్రంథం రాసిన ‘తెలుగు గోష్టి’ వ్యవస్థాపక అధ్యక్షులు చీమకుర్తి శేషగిరిరావు గారు ఈ ‘శ్రీ ఉత్పత్తి పిడుగు’లు కాలాముఖశైవులై వుంటారని, వారు అప్పట్లో 6,7 శతాబ్దాలలో బౌద్ధ, జైన ఆరామ, విహార, చైత్యాలను, దేవాగారాలను ధ్వంసం చేస్తూ ‘మేం బౌద్ధ, జైన మతాలనే ప్రమాదాలకు(ఉత్పత్తి అంటే ప్రమాదమని అర్థం) పిడుగు (వజ్రం)లాంటి వాళ్ళం’ అని(కృష్ణమూర్తి ‘ వేల్పుల కథ’) వేసిన హెచ్చరిక శాసనాలై వుంటాయని తేల్చారు. మన పాండవులగుట్ట గొంతెమ్మగుహ (బహుశః బౌద్ధుల వర్షావాసం అయివుంటుంది) లోని శాసనంలో ‘శ్రీ ఉత్పత్తి పిడుగు ఏకాంతవాసి పరమ మహేశ్వర భతన్‍ మహాముని’ అని రాసి వుండడం వల్ల చీమకుర్తి గారి వాదమే నిజమనే సాక్ష్యం లభించినట్లైంది. ఆ శాసనంలో చెక్కబడివున్న గదలాంటిది (ఇంద్రుని వజ్రాయుధం లేదా కంటకశిల కాదు) లకులీశని (ఆలంపురం దేవాలయ మ్యూజియంలోని లకులీశుని విగ్రహం) చేతిలోని ఆయుధం ‘లగుడం’ వలెనె వుంది. సున్నా గుర్తు బౌద్ధుల శూన్యవాదాన్ని సూచించే చిహ్నం అని పరిశోధకులు రాంభట్ల కృష్ణమూర్తి ‘వేల్పుల కథ’లో రాసారు.


ప్రకృతి చెక్కిన శిల్పాలవలె కనిపించే రాళ్ళు పాండవులగుట్ట పొడుగునా కనిపిస్తాయి. వాటిలో మానవాకారాలు, వివిధ జంతువుల ఆకారాలెక్కువ. సహజసిద్దంగా ఏర్పడ్డ ఈ రాళ్ళబొమ్మలు అద్భుతం. అవక్షేపశిలలు వాతావరణ ప్రభావానికి శైథిల్యం, క్షయకరణం పొంది… కోట్లాది యేండ్ల నుంచి రూపుదిద్దుకున్నాయి.

  • శ్రీరామోజు హరగోపాల్‍,
    ఎ : 99494 98698

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *