అది తెలంగాణా అపురూప ఆలయాల వెలుంగాణా. ఎక్కడికెళ్లినా అలనాటి శిల్పకళ, వాస్తువిన్యాసాల హేల! ఒక అంచనాప్రకారం తెలంగాణాలో చాళుక్యులనుంచి సంస్థానాధీశుల వరకూ దాదాపు 15 వేల ఆలయాలకు పైగానే నిర్మించారు. ఆయా రాజవంశాలు పోటీపడి, సాటిరాని మేటి శైలుల్లో రకరకాల ఆలయాలు, మండపాలను నిర్మించి, తెలంగాణా సంస్క•తిని శాశ్వతంగావించారు.
అలాంటి అపురూప ఆలయాల్లో శిథిలాలైనా, సౌందర్య శకలాలుగా నేటికీ నిలిచే ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా, కంబంపల్లి మండలం మంథని ముత్తారం సమీపంలో మానేరు నడిఒడ్డునగల చంద్రెల్లిలో. అది చంద్రెల్లికాదు. చంద్రవెల్లి. ఎంత చక్కటి పేరు! చంద్రెల్లిలోని క్రీ.శ.13వ శతాబ్దికి చెందిన కాకతీయ గణపతిదేవుని రాజగురువు విశ్వేశ్వర శివాచార్యుని శాసనంలోనూ, రుద్రమదేవి క్రీ.శ.1261 నాటి మల్కాపురం శాసనంలోనూ చంద్రవెల్లిగా పేర్కొనబడి, రాజగురువుచే విశ్వనాథలింగాన్ని ప్రతిష్టింపజేసుకొన్న ఊరు. చంద్రెల్లి శాసనంలో ఆ గ్రామంతో పాటు కంబాలపల్లి, పెద్దపల్లి పేర్లున్నాయి. పెద్దపల్లికి 770 ఏళ్ల చరిత్ర ఉందని ఈ శాసనం ద్వారా తెలుస్తుంది.
చంద్రెల్లిలోని విశ్వనాథాలయం గర్భాలయ, అర్థమండప, మహామండపాలతో మూడువైపులా ప్రవేశమండపాలతో దానికి కొంచెం దూరంలో మరో విడి ఆలయం ఉన్నాయి. ఆనాటి ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్క•తిక కేంద్రాలైన ఈ రెండు ఆలయాలూ, వన్నె కోల్పోయి, చిన్నబోయాయి.
కాకతీయ వాస్తు శిల్పానికి అద్దంపడుతూ, గోదావరిఖని సమీపంలోని జనగామలోని త్రిలింగేశ్వరాలయ రీతిలో విలక్షణంగా నిర్మింపబడిన, అర్థమండపం కప్పుభాగం, ద్వారంపై చెక్కు చెదరని నటరాజశిల్పం, గోడలపై ముక్కూ, మొఖం కోల్పోయి బాధల్ని వెళ్లగక్కలేక మూగబోయిన దేవతాశిల్పాలు. ఠీవిగా నిలబడినా తావులు తప్పుతున్న స్థంభాలు, ఆ•లయ గర్భాన్ని చీల్చుకొని శాఖోపశాఖలుగా విస్తరించిన చెట్లు, మండపం నిండా పెరిగిన పుట్టలూ, గోడలపై స్వేచ్ఛగా విహరిస్తున్న పిచ్చి మొక్కలు, గచ్చతీగలు, యుద్ధంలో ప్రాణాలొదిలి చెల్లా చెదురుగా పడి ఉన్న వీరసైనికుల్లా. ఇప్పటికీ గంభీర సౌందర్యా న్నొలకబోస్తున్న తిరగబడిన కప్పు రాళ్లు, తెప్పిస్తున్నాయి చూపరుల కళ్ల వెంట నీళ్లు. ‘ఇక చాల్లే! బాగుచేయటానికి మనసురాదు గానీ, ఆహా! ఓహో అని మమ్మల్ని వెక్కిరించటాని కొచ్చారా అని చూపరులను శాపనార్థాలు పెడుతున్న ఓపికలేక పడిపోయి నడుము విరిగిన రాళ్లు.
-ఈమని శివనాగిరెడ్డి-స్థపతి,
ఎ : 9848598446