చేతిరాత నిశ్శబ్ద ఆత్మహత్య

చిన్నప్పుడు మా పంతులుగారు మమ్మల్ని హెచ్చరించేవారు. ‘‘అరే వారీ’’ నీ చేతిరాత అందంగా లేకపోతే నీ తలరాత కూడా బాగుండదు రా’’ అని. దాని మతలబు ఏందంటే చేతి రాత బాగుంటే చదువుకూడా బాగా వస్తుందని తద్వారా భవిష్యత్తు కూడా ఉన్నతంగా ఉంటుందని అర్థం.


మా చిన్నప్పుడు పరీక్షల ప్రశ్నాపత్రం పైన కొన్ని సూచనలు ఉండేవి. ఒక ముఖ్యమైన సూచన ఏమనగా ‘‘అందమైన ముత్యాల్లాంటి చేతి రాతకు అదనంగా ఐదు మార్కులు కలపబడును’’. అటువంటి అమూల్యమైన విశేష సూచన ఇప్పుడు ఏ సబ్జెక్టుకు సంబంధించిన క్వచ్చెన్‍ పేపర్లలోనూ కనబడటం లేదు. అందుకే మన భావిభారత పౌరులైన విద్యార్థినీ విద్యార్థులు తెలుగు, హిందీ, ఇంగ్లీష్‍ బాషలలో జవాబులు రాసినా అవి అర్థంకాని పైశాచి, ప్రాకృతం, పాళీ భాషల అక్షరాల మాదిరిగా ఉండి వ్యాకరణ దోషాలు ప్రతిపదంలో తాండవిస్తూ ఉంటాయి. మా కాలంలో టీచర్లు ఇంపోజీషన్స్ రాయించే వాళ్లు. నాలుగు సార్లు, ఐదుసార్లు రాయమని! దానితో ‘‘తినగ తినగ వేము తియ్యగా ఉండును’’ అన్నట్లు రాత శుద్ధి జరిగేది. ముచ్చటైన ముత్యాల రాత మేలిమి బంగారంలా శుద్ధి చేయబడేది. తెల్ల కాగితం మీద తళతళా మెరిసేది.


ఒకప్పుడు వంద సంవత్సరాల క్రిందట, నైజాం నవాబుల పరిపాలనా కాలంలో తెలుగు భాషలో సర్కారీ బడులు లేకపోయేవి. సామాన్య ప్రజలలో అక్షరం పట్ల అనురాగం కాగడాబెట్టి వెతికినా కానరాక పోయేది. ‘‘కాలా అక్షర్‍ భైఁస్‍ బరాబర్‍’’ అన్నమాట. అటువంటి చీకటిరోజులలో సాతాని అయ్యవార్లు కాన్గీ, బడులు, వీధి బడులు లేదా ఇంటి ముంగట అరుగుమీది బడులు నడిపి ప్రజలలో విధ్యావికాసానికి దారులు వేసినారు. అప్పటికీ పలకలు, బలపాలు అపురూపం కావున పరిచిన దట్టమైన ఇసుక మీద పిల్లల లేత చూపుడు వ్రేలితో ఓనమాలు దిద్దించేవారు. ప్రతిరోజూ ఇసుకలో దిద్దీ, దిద్దీ పసిపిల్లల వ్రేళ్లు ఎర్రగా కందిపోయేవి. ఆ శిక్షణ పిల్లల పాలిట శిక్షగా మారేది. అక్షరాలన్నీ పూర్తిగా వచ్చిన తర్వాత పంతులుగారు తన భోషాణంలో జాగ్రత్తగా పాత పట్టు వస్త్రంలో భధ్రపరిచిన ‘‘పెద్ద బాల శిక్షను’’ బయటికి తీసేవారు. అది ఆ కాలంలో విజ్ఞాన సర్వస్వం. ఆ వైకుంఠపాళీ దాటినాక కొద్దిమంది మాత్రమే ‘‘అమరం’’ మొదలు పెట్టేవారు. ఇప్పటికీ తెలుగువారి ఇండ్లల్లో ఉండవలసిన ముఖ్యమైన గ్రంధాలలో ‘‘పెద్ద బాలశిక్ష’’ మొదటి వరుసలో ఉంటుంది.


ఇక మా తరం ‘‘ఇసుకలో అక్షరాలు దిద్ధిన తరం కాక పలకా, బలపం చేతపట్టిన తరం. అప్పటికి నైజాం రాచరికం అంతరించి రాష్ట్రానికి, దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. పలకా, బలపం మా చేతులను అలంకరించింది.
మా రోజులలో బాల, బాలికలకు ‘‘చెవులు కుట్టించే కార్యక్రమం ఏడ్పులార్పులతో, పెడబొబ్బలతో హింసాత్మకంగా జరిగినా ‘‘అక్షరాభ్యాసం మాత్రం ఆడంబరంగా, ఆనందంగా జరిగేది. కొత్త అంగీ, కొత్త లాగు, కొత్త పలకా బలపం, పువ్వులు, పండ్లు, మిఠాయిలు కొండకచో అయ్యవారికి కూడా పంచెలచాపు, ఉత్తరీయం, ఒక రూపాయి బిళ్ల, తాంబూలం, వక్క వగైరాలు ఇత్తడి పళ్లెంలో అమర్చేవారు. అయ్యవారు పిల్లవాడిని తన ఒడిలో కూర్చుండబెట్టుకుని నల్లగా మిలమిలా మెరిసే కొత్త పలక మీద శ్రీ అని రాసి బలపంతో దానిని రెండు మూడుసార్లు దిద్దించటంతో ఆ అక్షరాభ్యాసం ఘనంగా ముగిసేది. అట్లా శ్రీ అన్న అక్షరంతో రాతకు శ్రీకారం జరిగి జీవితంలో ‘‘రాత’’ ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయేది. ఆ శుభ సందర్భంలో అమ్మమ్మలు, నాయనమ్మలు, గుమికూడిన అమ్మలక్కలు ఈ క్రింది పద్యాన్ని రాగయుక్తంగా, శ్రావ్యంగా చదివే వారు.
‘‘తేరా పలకా బలపము
ఇయ్యరా అయ్యవారి చేతికి
ఇంపుల రంగా
పోరా భోజనం వేళకు
రారా పద్యాలు చదువ
రాజకుమారా’’.
పలకలు పలుపలు విధములు. రాతి పలకలు మరియు రేకు పలకలు. రాతి పలకలు క్రింద పడగానే అవి అతి సులభంగా పుటుక్కుమని పగిలి ముక్కలయ్యేవి. అయినా రక్షణ కోసం చెక్క ఫ్రేములలో వాటిని బిగించేవారు. అవి ప్రకాశం జిల్లా మార్కాపురంలో తయారయ్యేవి. అక్కడ రాతిపొరల గనులు ఎక్కువగా ఉండేవి. రేకు పలకలకు డిమాండ్‍ తక్కువ. వాటి మీద పూసిన నల్లటి రంగు పోగానే బలపంతో అక్షరాలు రాయటం కష్టంగా ఉండేది. బలపాలలో మళ్లీ రెండు రకాలు. తెల్లవి, రంగురంగులవి. రంగుల బలపాలతో బొమ్మలు వేయటం చాలా ‘‘ఖుషీ’’గా ఉండేది.


పలకా, బలపం అనే ప్రాథమిక దశ దాటి పిల్లలు నోటు బుక్కుల దశల ప్రవేశించే వాళ్లు. డబుల్‍ రూల్‍ నోటు బుక్కులు తెలుగు అక్షరాలు గుండ్రంగా అందంగా అభ్యాసం చేయటానికి, ఫోర్‍ రూల్‍ బుక్కులు ఇంగ్లీష్‍ అక్షరాలు కర్సీవ్‍ హ్యాండ్‍ రైటింగ్‍ ప్రాక్టీస్‍ చేయటానికి ఉపయోగపడేవి. లెక్కలకు, సైన్సులకు, మరొక రకమైన నోటు బుక్కులు ఉండేవి. భవిష్యత్తులో రూపుదిద్దుకోబోయే వారి వ్యక్తిత్వాలు వారి వారి చేతి రాతలలోనే దాక్కుని ఉండేవేమో!
పిల్లల జీవితాల్లోకి నోటుబుక్కులతో పాటు పెన్సిళ్లు, రబ్బర్లు, షార్పెనర్లు ప్రవేశించాయి. ఆ దశ తాత్కాలిమే. ఆ తర్వాత పెన్నులు, ఇంకులు రంగప్రవేశం చేసాయి. పెన్నులలో అశోకా పెన్‍ మామూలు రకం. మిసాక్‍ పెన్ను ధర చాలా పిర్యం. ప్రశ్న ఎర్ర ఇంకు పెన్నుతో రాసి జవాబు నీలి రంగు పెన్నుతో రాయటం అదొక సరదా. పరీక్షలకు ఒక రోజు ముందు పెన్నులను కడిగి శుభ్రం చేసుకోవటం, వాటిల్లో సిరా నింపుకోవటం, పెన్నుపత్తి (నిబ్‍) చెక్‍ చేసుకోవటం ఒక చిన్న సైజు యజ్ఞం. పెన్ను మూత సరిగ్గా పట్టక పోతే సిరా కారి వ్రేళ్లన్నీ రంగుమయం అయిపోయేవి. చేతులకు మైదాకు పెట్టుకున్నట్లు అదొక అందం. పెన్నులో పత్తి సరిగ్గా రాయకపోతే దానిని కాస్తా వంకర చేసి ‘‘చిలక ముక్కుగా’’ మార్చేస్తే అదేం మహాత్యమో ఏమోగాని కరకరా, పరపరా శబ్దం చేస్తూ మహాస్పీడుగా రాసేది. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్లు! 1970లలో ‘రిఫిల్‍ బాల్‍ పెన్ను’లు రావటంతో పెన్నులన్నీ చిన్న ముఖం చేసుకుని కాలం తెర వెనక్కి కనుమరుగైనాయి.
రాత గురించి రాయాలంటే వైనవైనాలుగా వర్ణించవచ్చు. అచ్చుయంత్రాలు, ముద్రణాయంత్రాలు రాని కాలంలో రాతకు చాలా ప్రాముఖ్యత ఉండేది. అసలైన మేలి ప్రతికి అనేక ‘‘నఖళ్లను’’ (ట్రూ కాపీస్‍) తయారు చేయటానికి అనేక మంది ‘‘వ్రాయస గాండ్లను’’ రాజులు తమ ఆస్థానాలలో నియమించుకొనేవారు. ఇంగ్లీషులో వారిని ‘‘కాపీ రైటర్స్’’ అని ఉర్దూలో ‘‘నఖల్‍ నవీస్‍’’లని అనేవారు. సి.పి.బ్రౌన్‍ దొరగారు కడపలో అనేక మంది వ్రాయసగాండ్లను నెలసరి జీతభత్యాలతో నియమించి వేమన పద్యాలను గ్రంధస్తం చేయటం మనందరికీ తెలిసిన సంగతే. విశ్వనాథ సత్యనారాయణ గారు తన నవల ‘‘వేయిపడగలను’’ అశువుగా చెపుతుంటే వారి తమ్ముడు రాసే వాడట. అట్లా 40 రోజులలో ఆ నవల పూర్తి అయ్యిందట. పూర్వకాలంలో కవిపుంగవులు తాము స్వయంగా చేత్తో రచన చేయకుండా శిష్యపరమాణువులకు అశువుగా చెప్పుతుంటే వారు రాసేవారట. స్వర్గీయ గోపీచంద్‍ కూడా పత్రికల వారి గడువు ఆఖరి తేదీ నాడు పేజీలకు పేజీలు ధారావాహికంగా చెపుతుంటే ఆ పత్రిక ఉద్యోగి యంత్రంలాగా రాసుకుంటూ పోయేవాడని స్వర్గీయ చావా శివకోటి గారు చెప్పేవారు.


నఖల్‍ నవీస్‍లకు చాలా గిరాకీ ఉండేది. తహసీల్‍ (రెవెన్యూ) దఫ్తర్‍లలో నఖల్‍నవీస్‍ ఉద్యోగాలు ఉండేవి. సర్కారీ ఫర్మానాలకు అనేక నఖళ్లను తయారు చేయటమే వీరి పని. కాలిగ్రఫీ అంటే చేతి రాత కళ’’. అరబ్సీ, ఫార్సీ, ఉర్దూ భాషలను ప్రత్యేకమైన చెక్కతో చేసిన ‘‘కలం’’లతో అందంగా రాయటమే కాలిగ్రఫీ. కాలీగ్రఫీ కళను మనతో ముస్లిం పరిపాలకులు అరబ్‍, ఇరాన్‍, టర్కీ దేశాల నుండి తీసుకొచ్చారు. ప్రత్యేకంగా చెట్ల ఆకులతో చేసిన సిరాను ‘‘దవాత్‍’’లలో (ఇంకు బుడ్డీ) నింపుకుని ఆ చెక్క కలంను అందులో ముంచి అక్షరాలను అందంగా అలంకరించేవారు. వీరిలో కొంత మంది చార్మినార్‍ చభూత్రాలపై కూచుని ‘‘ఆషిక్‍’’లు వస్తే వారి తరఫున వారి ప్రియురాండ్లకు రసభరితమైన, రాగరంజితమైన ప్రేమలేఖలను రాసి వారిచ్చే ‘‘బక్షీస్‍’’లను ఇనాములను స్వీకరించి జీవనోపాధి పొందేవారు. అదే చభూత్రాపై పనిపాటా లేని సోమరిపోతులు, బేకార్‍గాళ్లూ జమయ్యి పోచుకోలు కబుర్లూ, పొంకనాలు చెప్పుకునేవారు. అందుకే ‘‘చార్మినార్‍ కే హవా మే షికార్‍ పుకార్‍ కర్తేఁ హై’’ అన్న సామెత పుట్టుకొచ్చింది.


మా తరగతులలో రెండు రకాలు ఉండేవారు. క్లెవర్లు, అవరేజీలు. క్లెవర్లు సార్లు చెప్పిందంతా టకటకా నోట్సు రూపంలో తమ నోటు బుక్కులలో ఎక్కించుకునేవారు. దానిని మళ్లీ బట్టీ పట్టి పరీక్షలలో ఆన్సర్‍ పేపర్ల మీద ఉన్నది ఉన్నట్లుగా కక్కేసేవారు. స్వర్గీయ గోపీచంద్‍, కథకుడు చెప్పినట్లు కోళ్లు సజ్జలను మ్రింగి వాటిని అరిగించుకోకుండా ఉన్నది ఉన్నట్లుగానే విసర్జించే పద్దతి అన్నమాట. దానితో సార్లు ఖుష్‍. క్లెవర్లు ఖుష్‍. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు మేం అవరేజీలం కూడా వాళ్ల కాళ్లు, చేతులు, గడ్డం పట్టుకుని నానా రకాలుగా బ్రతిమిలాడి వారి నోటు బుక్కులు సంపాదించి ఇంట్ల్లో రాత్రి పొద్దు పోయేదాకా మినుకు, మినుకు మని వెలిగే గ్యాసు నూనె గుడ్డి దీపం ముందు కూచుని దానిని మెడలు విరిగిపోయేలా మా కాపీలలో ‘‘కాపీ’’ చేసుకునే వాళ్లం. దాంతో మా జబ్బ బలం పెరిగి చేతిరాత జర సాఫ్‍ అయ్యేది. 1970లల్ల జిరాక్సు మెషిన్లు రాంగనే పోరలకు రాతపని తప్పి ఈజీ పద్దతులు కట్‍ షార్ట్ పద్దతులు అలవాటు అయ్యి చేతి రాత ‘‘మటాష్‍’’ అయ్యింది. కరోనా కాలం తర్వాత ‘‘ఆన్‍ లైన్‍ క్లాసులు’’ శురూ కాంగనే పెన్ను, పేపరుతో పనిలేని పాడుకాలం దాపురించే సరికి అప్పటి వరకూ వున్న, తప్పుడు తడకల వంకరటింకర రాత కూడా అటకెక్కి మరింత బ్రష్టు పట్టిపోయింది. పేపరు, పెన్ను, రెండు కూడా సామరస్యంగానే విడాకులు తీసుకుని ఎవరిదారిన వాళ్లు వెళ్లిపోయారు.


1970, 1980 చివరి వరకు ‘‘ఉత్తర కుమారులు’’ ప్రతి చోటా ఉండేవారు. వీరు పదిపైసల పోస్టు కార్డు తీసుకుని చీమ తలకాయంత అక్షరాలతో ఎక్కడా దోమ కూడా దూరలేనంత జాగా వదలకుండా తమతమ క్షేమ సమాచార వివరాలే గాక దేశకాల పరిస్థితుల గురించి కూడా తమ అభిప్రాయాలు రాసేవారు. అట్లా ప్రతి పోస్టు కార్డు ఆర్థిక, సాంఘీక, రాజకీయ, చరిత్రను రికార్డు చేసే చారిత్రిక పత్రం లాగుడేది. 1970వ దశకం ‘‘వికసించిన విద్యుత్తేజం’’ లాంటిది. ఇక ప్రేమికులైతే కార్డులలో తమ బండారం బయటపడతదన్న భయంతో ఇన్‍ లాండ్‍ కవర్లను, లిఫాఫాలను ఆశ్రయించేవారు. జాగ్రత్తగా నాలుగు దిక్కులా జిగురుతో మూసివేసిన ఆ ప్రేమలేఖలలో చలం, క్రిష్ణశాస్త్రి, ఎంకి, నాయుడు బావలు అత్తరు గుభాళింపు సువాసనలలో దాక్కుని పవళించేవారు. ప్రేమ పక్షుల ఆ లేఖలను పోస్టుమాన్‍ నుండి అందుకోగానే ‘‘చిట్టీ ఆయీహై, ఆయీహై, ఆయీహై’’ అని గంతులేసేవారు. ఈ కాలం నాటి ప్రేమికులకు అట్లాంటివేమీ అక్కర్లేదు ఎస్‍ఎమ్‍ఎస్‍లు, వాట్సప్పుల మెసేజ్‍లే శ్రీరామ రక్ష.
1970లలో వామపక్ష ఉద్యమ చైతన్యం వ్యాప్తి చెందటం వలన యువతరం ఆదర్శ ప్రేమ వివాహాలకు మంచి సాహిత్యాన్ని, పుస్తకాలను ‘పెళ్లి కానుకలు’గా అందచేసేవారు. అట్టి పుస్తకాలు మొదటి పేజీలో తమ పేరు, శుభాకాంక్షలు తెలియచేయటంతో సరిపుచ్చుకోక పొడుగు పొడుగు సామాజిక సందేశాలను, సామాజిక కర్తవ్యాలను వెలిబుచ్చేవారు. గ్రంధాలయం పుస్తకాలలో సీరియస్‍ పాఠకులు తమ కామెంట్లను, అభిప్రాయాలను ‘పేరా’ల మధ్యలో రాసేవారు. ఇవన్నీ ‘‘రాతియుగం’’ సంగతుల లాగా ఒకనాటి ‘‘రాతయుగం’’ ముచ్చట్లు.


మొన్నా మధ్య సప్తసముద్రాల అవతల నుండి ఒక చిన్ననాటి ‘‘లగోటీయార్‍’’ చరవాణిలో మాట్లాడుతూ స్కూలులో చదువుతున్న తమ పిల్లలు పేపరు, పెన్ను, రాత మరచి పోయారని, గ్రామర్‍ మిస్టేక్స్తో వారికి పనిలేదని, అందమైన చేతిరాత నన్నయ్య, తిక్కన కాలం నాటి వని భావిస్తున్నారని సుదీర్ఘంగా ‘‘వాపోతూ’’ ఇక రాబోయే భవిష్యత్తులో జనాలు కేవలం బ్యాంకు చెక్కులపై సంతకాలు చేయటానికే పెన్నులు వాడతారని చావు కబురు చల్లగా తెలియచేసాడు.
‘‘జమానా బదల్‍గయా’’ అని నేను భీ వాడిని సమ్‍జాయిస్తూ కంప్యూటర్లు, ఆన్‍లైన్‍ క్లాసుల పుణ్యమా అని ఒకనాటి అందమైన చేతిరాత ఈ కాలంలో ఆత్మహత్య చేసుకున్నదని నా సంతాపం ప్రకటిస్తూ చేతిరాతకు నా ‘‘నివాళి’’ సమర్పించాను.
ఒక నిజం :
ఆ మధ్య నేను ప్రముఖ హుద్రోగ శస్త్ర చికిత్సా నిపుణుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టరు దాసరి ప్రసాదరావు గారిని స్నేహపూర్వకంగా వెళ్లి కలిసాను. ఆయన నా రచనల అభిమాని. కాసేపు జరిగిన సాహిత్య సంభాషణానంతరం ఆయన ఒక శాలువా కప్పి నన్ను సత్కరించాలని అనుకున్నాడు. దానికి నేను సున్నితంగా నిరాకరించాను. అప్పుడు ఆయన ఒక ఖరీదైన విదేశీ పెన్నును బహుకరించి ప్రతిరోజూ ఈ పెన్నుతోనే రచనలు చేయాలని ఆదేశించారు. దానికి నేను వినయంగా ఒప్పుకున్నాను. దాంతో నాకు ‘‘టీచర్లు మాత్రమే కాదు, డాక్టర్లు కూడా హోమ్‍ వర్క్’’ ఇస్తుంటారని నాకు బోధపడింది.
‘‘ప్రసూతి వైరాగ్యం’’ లాగా నాకు అపుడపుడూ ‘‘రచనా వైరాగ్యం’’ వస్తుంది. అటువంటి బద్దకపు క్షణాలలో డాక్టరు గారు బహుకరించిన పెన్ను నన్ను ‘‘ఇంజక్షన్‍ సూది’’లా పొడిచి నాతో రచనా వ్యాసాంగం కొనసాగిస్తుంది.


క జోకు :
ఇప్పటి డాక్టర్లు రాసే పిస్క్రిప్షన్లు పేషంట్లతో సహా సాటి డాక్టర్లకు కూడా సమజ్‍ కాదు. ఒక మందుల దుకాణం వాడికి తప్ప! ఎందుకంటే ఇప్పటి కొత్త డాక్టర్లందరు ఒకప్పటి కంప్యూటర్లు, ఆన్‍లైన్ల విద్యార్థులే. ఒక కొత్త కుర్ర డాక్టరు మొదటిసారి పుట్టింటికి వెళ్లిన భార్యకు తన విరహాన్ని తెలియచేస్తూ తొలిసారి ప్రేమలేఖ రాసాడట. పాపం ఆ భార్యకు ఆ రాత గజబిజిగా ఉండి ఏం అర్థం గాక అందులో ఏం అర్జెంటు సమాచారం వుందో అని గాభరాపడి కాసేపు ఆలోచిస్తే ఒక బ్రహ్మాండమైన ఐడియా తట్టిందట.
ఆ వీధిలో వున్న మందుల దుకాణానికి వెళ్లి ఆ ప్రేమలేఖ చూపించి కాస్తా చదివి పెట్టమని బ్రతిమిలాడిందట. ఆ షాపువాడు ఆ లేఖ పెద్ద గొంతుతో జనాంతికంగా చదివే సరికి షాపులో పని చేసే సిబ్బందే గాక, మందుల కోసం వచ్చిన గిరాకీలందరూ నవ్వులపువ్వులుగా మారిపోయినారట.
పాపం ఆమె సిగ్గులమొగ్గయ్యి ఒక్క క్షణంలో అక్కడి నుండి అంతర్ధానం అయ్యిందట!

-సమాప్తం-


-పరవస్తు లోకేశ్వర్‍,
ఎ: 91606 80847

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *