తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం వైస్‍ ఛాన్సలర్‍గా డాక్టర్‍ సూర్యా ధనుంజయ్‍

వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం వైస్‍ ఛాన్సలర్‍గా ప్రొఫెసర్‍ సూర్యా ధనుంజయ్‍ గారు బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా అభినందిస్తున్న రచయిత 40 ఏళ్ల క్రితం మొదటిసారి హైదరాబాదు వచ్చింది మొదలు కాంపిటీటివ్‍ ఎగ్జామ్‍ రాయడానికో లేదా సంబంధిత ఇంటర్వ్యూ కోసమో వచ్చినపుడు ఇటువైపు రావడం తప్పనిసరి. ఓ వైపు ఆంధ్రా బ్యాంకు, మరో వైపు కోటి ఉమెన్స్ కాలేజ్‍ మధ్యలో ఉన్న రోడ్డు ఇరువైపులా సెకండ్‍ హ్యాండ్‍ పుస్తకాల షాపులు లెక్కకు మించి ఉండేవి. ఎన్నో రకాల పుస్తకాలు తనివి తీరా చూసి, డబ్బులున్న మేర కొనుక్కుని వెళ్లిన సందర్భాలు గుర్తుకు వచ్చాయి.


ఆకాశవాణి హైదరాబాద్‍ కేంద్రంలో మొదట నాలుగు సంవత్సరాలూ రెండోసారి రెండున్నర సంవత్సరమూ పనిచేసినా ఒక్కసారి కూడా కోటి ఉమెన్స్ కాలేజ్‍ సందర్శించే సందర్భం తారసపడ లేదు.


రెండు నెలల క్రితం ఓ పుస్తకం ‘గాంధీ అండ్‍ ది ఏమేంసిపేషన్‍ ఆఫ్‍ ఉమెన్‍ ఇన్‍ ఇండియా’ చదివాను. యూనివర్సిటీ కాలేజ్‍ ఫర్‍ ఉమెన్‍ కోటి ప్రిన్సిపల్‍ గా పనిచేసిన ఎస్‍ శ్రీదేవి గారు ఈ పుస్తకాన్ని 1969లో రచించారు. గాంధీ సాహిత్య ప్రచురణాలయం హైదరాబాదు ఈ విలువైన పుస్తకాన్ని వెలువరించింది. నాలుగేళ్ల క్రితం మిత్రులు కోదాటి రంగారావు ఈ పుస్తకాన్ని నాకు ఇచ్చినా, ఇటీవల వరకు దానిని కూలంకషంగా చదివే అవకాశం రాలేదు. సుమారు ఐదున్నర దశాబ్దాల క్రితం చాలా లోతైన పరిశోధన ఆధారంగా ఈ పుస్తక రచనను చేస్తూ ముందు ముందు భారత స్త్రీ ఎటువంటి పరిణామాలు చవిచూడబోతుందో కూడా రచయిత్రి లోతుగా వివరించారు. ఈ పుస్తకానికి తెలుగు అనువాదం కూడా శ్రీదేవి గారే చేసినట్టు ఉన్నారు.
ఆ ప్రాంగణంలోకి వెళుతుంటే ఈ విషయాలన్నీ గుర్తుకొచ్చాయి. అన్నట్టు వెళ్తున్నప్పుడు తిరిగి వస్తున్నప్పుడు డాక్టర్‍ అబ్దుల్‍ కలాం కొటేషన్‍ తోట మధ్యలో నన్ను అలరించింది. ‘‘నేను పిచ్చుకను పెంచుకున్నాను, కానీ ఓరోజు అది ఎగిరిపోయింది. అలాగే ఉడతను నేస్తం చేశాను, కానీ అది కూడా ఉండలేక పారిపోయింది. తర్వాత చెట్టును వేసాను, ఆ రెండూ తిరిగి వచ్చాయి.’’ చాలా అద్భుతమైన పరిశీలన కదా, అందుకే మీకూ గుర్తు ఉండాలని ఇక్కడ రాశాను.


చెల్లి డా సూర్యా ధనుంజయ్‍ మహిళా విశ్వవిద్యాలయం వైస్‍ ఛాన్స్లర్‍గా బాధ్యతలు ఇటీవల స్వీకరించారని తెలిసి, 2024 అక్టోబరు 22 న వెళ్లి శుభాకాంక్షలు తెలియజేశాను. బ్రిటిష్‍ రెసిడెంట్‍ జెఎకిర్క్ ప్యాట్రిక్‍ కోసం 1803లో నిర్మాణం మొదలైన ఈ భవనం ఇంగ్లీష్‍ పాలకుల వారసత్వ కట్టడాలలో ఇదొకటి. కోటి రెసిడెన్సీగా పిలువబడే ఈ భవనం చాలా అందంగా, గంభీరంగా, ఆకర్షణీయంగా కనబడుతుంది. అందమైన తోట, అందులో దర్బార్‍ హాలు అనబడే ఈ అద్భుతమైన భవనంలో వైస్‍ ఛాన్సలర్‍ ఫ్రొఫెసర్‍ సూర్యా ధనంజయ్‍ అచ్చంగా సింహాసనం మీద ఉన్న మహారాణిలాగా కనిపించారు.


పదిమంది సంతానంలో తొమ్మిదో బిడ్డగా జన్మించిన సూర్య స్వయంక•షితో ఒక వైపు తల్లిగా బాధ్యతలు నిర్వహిస్తూ మరోవైపు చదువులలో క్రమంగా పట్టాలు గడిస్తూ.. ఇప్పుడు మహిళా విశ్వవిద్యాలయానికి సర్వోన్నత అధికారి అయ్యారు. ఇంతకు క్రితం వారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ ప్రొఫెసర్‍గా శాఖ అధ్యక్షులుగా సేవలందించారు. మరి ముఖ్యంగా విస్త•తంగా చదివే సూర్య నా రచనలు అంటే కూడా ఇష్టపడతారు.
ఉస్మానియా యూనివర్సిటీలో ప్రోసెర్‍గా పనిచేస్తున్న కాలంలోనే ఈ బాధ్యతలు స్వీకరించారు కనుక ఆమె పరిశోధన చేస్తూనే ఉంటారు. అందువల్లనే నేను వెళ్లిన సమయంలో పరిశోధక విద్యార్థులు డా. గదరాజు చందు, టిఆర్‍ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి జలెందర్‍ గౌడ్‍, ప్రొఫెసర్‍ సూర్య మేడం స్టూడెంట్‍, మరో ఇద్దరు చర్చిస్తున్నారు.


గ్రూప్‍ వన్‍ పరీక్షలకు వెన్యూగా సిద్ధమవుతున్న హడావుడి, బయట రోడ్డు మీద, గేటు దగ్గర అభ్యర్థుల సందోహం కనబడింది. విస్నూరు దేశముఖ్‍ దురాగత ధోరణులను ధైర్యంగా ఎదిరించిన చిట్యాల వీరనారి చాకలి ఐలమ్మ పేరున వెలిసిన ఆ విశ్వవిద్యాలయానికి ఆదివాసి కొదమసింహం కొమరం భీమ్‍ జయంతి (1901) రోజున నమస్కరించి సెలవు తీసుకున్నా.
అన్నట్టు 1924లో మొదలైన ఈ కళాశాల 1939లో గోల్డెన్‍ థ్రెష్‍ హోల్డ్ భవనంలోకి మారింది. తర్వాత బ్రిటిష్‍ వారు మన దేశం వదిలి వెళ్ళిన తర్వాత 1949లో ఈ కోటి రెసిడెన్సి భవనంలోకి కళాశాల వచ్చింది. అంటే ఈ కళాశాలకు వందేళ్లుఈ భవనంలోకి వచ్చి 75 ఏళ్లు!

  • డా. నాగసూరి వేణుగోపాల్‍
    ఎ : 9440732392

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *