మాస్టర్‍ పీస్‍ ఆఫ్‍ హ్యూమన్‍ జీనియస్‍ రాణీగారి మెట్ల బావి

ఉనికి: గుజరాత్‍
యునెస్కో గుర్తింపు: 2014
విభాగం: కల్చరల్‍ (మాన్యుమెంట్‍)
సార్వత్రిక విలువ: మెట్ల బావికి ఓ అత్యుత్తమ ఉదాహరణ రాణి-కి-వావ్‍.

భారత ఉపఖండానికి సంబంధించి సబ్‍ టెర్రేనియన్‍ వాటర్‍ ఆర్కిటెక్చర్‍కు ఇది ఓ విలక్షణ రూపం. ఇది ఏడు అంతస్తులుగా విభజింపబడింది. గొప్ప కళాత్మక, అందమైన శిల్పకళాఖండాలు ఇక్కడ ఉన్నాయి. గ్రౌండ్‍ లెవల్‍ లో మొదలయ్యే స్టెప్డ్ కారిడార్‍, నాలుగు పెవిలియన్స్ సిరీస్‍, పశ్చిమం వైపు పెరిగే అంతస్తులు, చెరువు, టన్నెల్‍ షాఫ్ట్ రూపంలో బావి… ఇలా ఈ మెట్లబావి అన్ని అంశాలనూ సమ్మిళితం చేసేదిగా ఉంటుంది.
ప్రాథమ్యం: (i), (iv)
(i) : మెట్ల బావి కళాత్మక, సంప్రదాయక నైపుణ్యాలకు ఇది ఒక నిదర్శనం. శిల్పకళానైపుణ్యాలను చాటిచెప్పేదిగా ఇది
ఉంటుంది.
(ii): కళాత్మక జల వనరు, నిల్వ వ్యవస్థకు ఇది ఒక అత్యుత్తమ నిదర్శనం. ఆలయం తరహా నిర్మాణం, నీళ్లకు ప్రకృతి పరంగా పవిత్రతను ఆపాదించడాన్ని చూడవచ్చు.


మెట్ల బావులు అనేవి భారత్‍ మధ్య, పశ్చిమ ప్రాంతాలకు సంబంధించిన ఓ విశిష్టతగా ఉన్నాయి. ఈ రెండు ప్రాంతాల్లోనూ వాతా వరణం పొడిగా, వెచ్చగా
ఉంటుంది. తరచూ వర్షపాతం చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మెట్ల బావులు నీళ్లను సంరక్షిస్తాయి. కొన్ని సమయాల్లో ఇవి ఆధ్యాత్మిక, ఆర్కిటెక్చరల్‍ వినూత్నతలతో మతపరమైన, సాంస్కృతికపరమైన కార్యకలాపాలకు సైతం వేదికలుగా మారుతాయి. భారతీయ సమాజంలో నీళ్లకు ప్రత్యేక స్థానం ఉంది. దాన్నెంతో పవిత్రమైందిగా భావిస్తారు. మెట్ల బావి (వావ్‍ లేదా బౌలి అని కూడా అంటారు) అనేది సంప్రదాయ భారతీయ ఆర్కిటెక్చర్‍ పరంగా ఎంతో ప్రాధాన్యమైంది. దేశానికి చెందిన వర్షాభావ ప్రాంతాల్లో ఈ తరహా కట్టడాలను చూడవచ్చు.


రాణి కా వావ్‍ ‘మెట్ల బావుల్లో తాజ్‍’గా కూడా ప్రసిద్ధి చెందింది. అందం, శిల్పకళా నైపుణ్యం తదితరాల్లో దాన్ని మించింది లేదు. అందుకే యునెస్కో సైతం దీన్ని ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చే సందర్భంగా ‘మాస్టర్‍ పీస్‍ ఆఫ్‍ హ్యూమన్‍ జీనియస్‍’గా పేర్కొంది. రాణి ఉదయమతి ఈ బావిని తన భర్త, సోలంకి రాజు మొదటి భీమ్‍ దేవ్‍ జ్ఞాపకార్థం ప్రస్తుత గుజరాత్‍లోని పాటణ్‍లో నిర్మించారు. భారత్‍ భూభాగంపై షాజహాన్‍ ప్రేమకు చిహ్నంగా తాజ్‍ మహల్‍ ను నిర్మించడాని కంటే ఎంతో ముందుగానే రాణి కి వావ్‍ను నిర్మించడం విశేషం. సామాన్య శకం 1064లో తన భర్త మరణించగా, పదకొండో శతాబ్దం చివరి దశాబ్దం ఆమె ఈ నిర్మాణానికి ఆదేశించారు.


ఈ మెట్లబావి ఏడు అంతస్తులుగా నిర్మించబడింది. ప్రతీ అంతస్తు కూడా పెవిలియన్‍తో ఉంటుంది. కింది అంతస్తుకు మెట్లు ఉంటాయి. అలా బావి చివరి వరకూ ఉంటాయి. నీళ్ల పై భాగంలో కనిపించే ఆర్కిటెక్చర్‍ను తరచూ ‘తలకిందులు ఆలయ రూపం’గా అభివర్ణిస్తుంటారు. కళాత్మక విలువలకు తోడుగా, హిందూ సంస్కృతిలో నీళ్లకు ఇచ్చే ప్రాధాన్యాన్ని ఇది చాటి చెబుతుంది. రాణి-కి-వావ్‍లో చెక్కిన ఎన్నో హిందూ దేవతల శిల్పాలలో ఇది కనిపిస్తుంది.


అత్యంతగా ఆకట్టుకునే విశిష్టత ఏమిటంటే దాదాపు 700కు పైగా శిల్పాలు ఇక్కడ ఉన్నాయి. బావి పక్కకు మాత్రమే కాదు, ఈ గుండ్రటి నిర్మాణం వంపుల్లోనూ, బావి చివరి ప్రాంతంలోనూ శిల్పాలున్నాయి. అప్సరసలు మాత్రమే గాకుండా వివిధ రూపాల్లో ఉన్న హిందూ దేవతలను ఇక్కడ చూడవచ్చు. విష్ణుమూర్తి, శివుడు, బ్రహ్మ, ఇతర దేవతలు మరెందరో శిల్పరూపాల్లో మనోహరంగా దర్శనమిస్తారు. ఇక్కడ పార్వతీ దేవి శిల్పాలే 15కు పైగా ఉన్నాయి. పతి వియోగం తట్టుకోలేకపోయిన పార్వతి గాధను అవి తెలియజేస్తాయి. ఒక రకంగా ఈ శిల్పాలు రాణి ఉదయమతి బాధను కూడా తెలియజేస్తాయి. తిరిగి భర్తను కలుసుకోవాలన్న ఆమె కోరికను సూచిస్తాయి. గోడల జంక్షన్స్, ప్రతీ అంతస్తులో పెవిలియన్‍ వద్ద దంపతులుగా ఉన్న దేవతలను లేదా హరిహర వంటి దివ్య జంటలుగా దర్శనమిచ్చే దేవతల శిల్పాలను కావాలనే చెక్కించినట్లుగా ఉంటుంది. బావి చివర్లో గుండ్రటి భాగం వద్ద అష్ట వసు (గంగా మాత తనయులు)లను చెక్కారు. ఈ శిల్పాలు వ్యూహాత్మకంగా బావి దిగువ అంతస్తులో ఉండడం విశేషం. బావి జలాలను పూజించడానికి, బావి జలం గంగా జలం అనడానికి సంకేతంగా అవి ఉన్నాయి.


రాణి-కి-వావ్‍లో ప్రస్తుతం నీళ్లు లేవు. దీని అద్భుత కథ అంతా కూడా పదమూడో శతాబ్దంలో సరస్వతి నదికి వచ్చిన వరదలతో ఏర్పడిన ఇసుక కుప్పల కింద దాగి ఉండింది. 1960లలో ఏఎస్‍ఐ దీన్ని వెలుగులోకి తీసుకువచ్చింది. దీన్ని పునరుద్ధరించేందుకు ఏఎస్‍ఐకి ఇరవై ఏళ్లు పట్టింది. ఈ తవ్వకం ఏఎస్‍ఐ తవ్వకాల్లో విశిష్టమైందిగా చోటు చేసుకుంది. దీని బఫర్‍ జోన్‍లో సహస్త్రలింగ రిజర్వాయర్‍ కట్టడం శిథిలాలు ఉన్నాయి. రాణి-కి-వావ్‍ నిర్మాణం కంటే మరెన్నో ఏళ్ల క్రితమే ఈ రిజర్వాయర్‍ను నిర్మించారు. దాని జలమట్టాలతో ఈ బావికి సంబంధం ఉండి ఉండవచ్చు.

  • శిఖా జైన్‍
    అనువాదం : ఎన్‍. వంశీ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *