బి.భానుప్రకాష్‍

బొల్లంపల్లి భానుప్రకాష్‍ – తెలంగాణ రాష్ట్రానికి చెందిన సుప్రసిద్ధ నటులు, దర్శకులు. 1950 నుండి 2009 వరకు తెలుగు రంగస్థలాన్ని ఏలిన కళాకారుల్లో భానుప్రకాష్‍ ఒకరు. 50 సంవత్సరాలకు పైగా రంగస్థలం మీద తన ప్రతిభతో ప్రేక్షకలోకాన్ని అలరించిన నటరాజమూర్తి భానుప్రకాష్‍. వెయ్యికి పైగా నాటకాల్లో నటించి, వందకు పైగా నాటకాలకు దర్శకత్వం వహించి తెలుగు నాటకరంగానికి విశేష సేవ చేసిన తెలంగాణ బిడ్డ.


1939 ఏప్రిల్‍ 21న నల్లగొండ పట్టణంలో కీ.శే. అండాళమ్మ వేంకటిహరి దంపతులకు తృతీయ సంతానంగా ఆయన జన్మించారు. వారి కుటుంబం చాలా పెద్దది. ఇద్దరు అక్కయ్యలు, నలుగురు తమ్ముళ్ళు, ఒక చెల్లెలు. తండ్రి తహసిల్‍ ఆఫీసులో పర్సనల్‍ అసిస్టెంట్‍గా చేసేవారు. ఆయనకు సెక్రటేరియట్‍ బదిలీ కావడంతో ఆ కుటుంబం హైదరాబాద్‍కు వచ్చి స్థిరపడింది. తన ఇంట్లో ఉన్న గ్రామ్‍ఫోన్‍ రికార్డుల్లో ఎక్కువగా రంగస్థల నాటకాలుండేవి. అవంటే భానుప్రకాష్‍కి మక్కువ పెరిగి వాటిని అనేకసార్లు వింటూ అందులోని కంఠాలను అనుకరిస్తూ ఆయన ఇంట్లోవాళ్ళని అలరించేవారు. అందులోని ‘కంసవథ’ అనే నాటకాన్ని విని విని ఆ స్ఫూర్తితో సొంతంగా స్క్రిప్టు రాసుకుని వేసవి సెలవుల్లో అమ్మమ్మ ఊరైన అమ్మనబ్రోలు వెళ్ళినప్పుడు తాతగారి ఆదేశంతో అక్కడి పిల్లలందరిని చేర్చి కంసవధ నాటకం తయారుచేయించి బొగ్గుల్ని, సున్నాన్ని మేకప్‍గా, లాంతర్లను లైట్లుగా ఉపయోగించి వారి తాతగారి గదిలోనే తొలి ప్రదర్శన వేశారు. అలా ఆ కుర్రవాడి తొలి అడుగు రంగస్థలం వైపు పడింది.


ఆ ఉత్సాహం, ఆ ప్రోత్సాహం స్కూల్‍డే ఫంక్షన్లో ‘తారుమారు’ అనే నాటకం వేసేలా పనికి వచ్చింది. ఆ నాటకం కూడా విజయవంతం కావడం, ప్రశంసలు లభించటంతో ఇక వెనుతిరిగి చూడలేదు. నాటకరంగంలో ప్రస్థానం ఆగలేదు. డిగ్రీ చేసి లాపట్టా తీసుకుని ఉద్యోగ అన్వేషణలో ఉన్నా ఎక్కడా నాటకాభిలాష తగ్గలేదు. అన్ని సందర్భాల్లోనూ నాటకాలు వేస్తూ, తెలుసుకుంటూ, పరిశీలిస్తూ గడిపేవారు. 1967 జూన్‍ 11న సరస్వతితో వివాహం అయింది. అప్పటికే HALలో ఉద్యోగంలో చేరారు. అక్కడే ‘రాయ్‍చోరీ’ అనే బెంగాలీ థియేటర్‍ ఇన్‍చార్జ్గా ఉండేవారు. ఆయన పరిచయం, ప్రోత్సాహంతో RVS రామస్వామితో కలసి ‘కళారాధన’ అనే నాటక కళాసమితిని ఏర్పాటు చేసారు. ‘కళారాధన’ సంస్థ ఆవిర్భావం తరువాత భానుప్రకాష్‍ గారి రంగస్థల ప్రయాణం మరో మలుపు తిరిగి వేగం పుంజుకుంది.


1960లో ఏర్పాటు అయిన కళారాధన సంస్థలో RVS రామస్వామి నాటకాల్ని రచించడం, భానుప్రకాష్‍గారు దర్శకత్వంలో పరిషత్తులకు వెళ్లడం బహుమతులు గెల్చుకోవడం ఒక అలవాటుగా మారింది. ఆ తరువాత వేరే నాటక రచయిత రాసిన నాటకాలకు కూడా దర్శకత్వం చేయడం మొదలుపెట్టారు భానుప్రకాష్‍గారు. చీకటి కోణాలు, వలయం, సుడిగాలి, గాలివాన, కెరటాలు, వెల్లువ, శ్రీమాన్‍ శ్రీపతి, కళారాధన’ వంటి నాటకాలు RVS రామస్వామి రచనలో దర్శకత్వం వహించగా, ‘ప్రతిధ్వనులు, ప్రతిబింబాలు’ మాత్రం శ్రీరంగ శ్రీధరాచార్య కలం నుంచి పుట్టినది. 20 సంవత్సరాలకు పైగా కళారాధన సంస్థ ద్వారా ప్రదర్శించిన అనేక నాటకాలు తెలుగు నాటక రంగస్థలంపై ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. అనేక పరిషత్తులలో ప్రేక్షకులు భానుప్రకాష్‍ నాటకం ఉందా లేదా అని వాకబు చేసేవారంటే అతిశయోక్తిలేదు. రాజమండ్రిలో పరిషత్తు నిర్వహణకు ఒకసారి నిర్వాహకులు దాతలను విరాళాలు అడిగితే భానుప్రకాష్‍ గారు అంతకుముందు అక్కడ ప్రదర్శించిన ‘సుడిగాలి’ నాటకాన్ని దృష్టిలో పెట్టుకుని, ఆ నాటకబృందం ప్రదర్శించే నాటకం ఉంటేనే మేం విరాళాలు ఇస్తాం అన్నారట. భానుప్రకాష్‍ గారి నాటకాలకి అంతటి ఆదరణ.


తెలుగు నాటకరంగ చరిత్రలో ‘గాలివాన’ సృష్టించిన సునామి మాములిదికాదు. భానుప్రకాష్‍ వెయ్యి నాటకాలను ప్రదర్శించినా నాటక ప్రేక్షకులందరికీ ‘గాలివాన’ భానుప్రకాష్‍ గానే గుర్తుండిపోయారంటే ఆ నాటకం సృష్టించిన రికార్డులు అలాంటివి. ఒక్క కళారాధన నాటక సమితి నుండే వందసార్లకు పైగా ‘గాలివాన’ ప్రదర్శింపబడింది. పాల్గొన్న అన్ని పోటీల్లో అనేక బహుమతులు ‘గాలివాన’కి దక్కేవి. ‘గాలివాన’ నాటకం నాలుగు దశాబ్దాలుగా ఏ సమాజం ఎప్పుడు ఎక్కడ ప్రదర్శించినా ప్రజాదరణ పొందుతూనే ఉంది. అంతలా ఆ నాటకాన్ని శాశ్వతం చేసారు భానుప్రకాష్‍ గారు.
భానుప్రకాష్‍ అద్భుత నటుడు. అసమాన ప్రతిభా పాటవాలు తనలో ఇముడ్చుకున్న దర్శకుడు. ఈ రెండింటి మేలు సంగమంలో పుట్టిన నాటక సృష్టి కళా హృదయులను మెప్పించకుండా ఉంటుందా? అందుకే ఆయన నాటక ప్రదర్శనలు చూసిన ప్రేక్షకులు ఆయన్ని ఎప్పటికీ మరచిపోలేరు. వారి హృదయ కమలంపై చెరగనిముద్ర వేసి మనల్ని ఇంటికి సాగనంపుతారు భానుప్రకాష్‍.


ఆయన నట ప్రస్థానం కేవలం రంగస్థలానికే పరిమితం కాలేదు. ఎన్నో రేడియో నాటకాల్లో నటించారు. గంభీరమైన కంఠస్వరం, సంభాషణలను అలవోకగా పలుకగలనేర్పు, నవరస సృష్టి చేయగలిగే నటరాజు ఆయన. అందుకే రేడియో నాటక ఉద్దండులైన శారదా శ్రీనివాసన్‍, నండూరి కె. చిరంజీవి వంటి వారితో పోటీపడి నటించి మెప్పించే వారు. సినిమా రంగంలోకి వెళ్ళాలన్న కుతూహలం లేకపోయినా సినిమాల్లోనూ ఆయన తన నటనా కౌశల్యంతో ఆకట్టుకున్న సందర్భాలు అనేకం. పాత్ర చిన్నదైనా, పెద్దదైనా ఇది భాను బాగా చేయగలడు అని ప్రేమగా పిలిస్తే వెళ్ళి వేషం వేసి వచ్చేవారాయన. దుక్కిపాటి మధుసూదన్‍రావు గారి దర్శకత్వంలో ‘చదువుకున్న అమ్మాయిలు, డా. చక్రవర్తి, పూలరంగడు’ లాంటి చిత్రాల్లోనే కాక ‘బుద్ధిమంతుడు, ఆత్మీయుడు, అమాయకురాలు, దయామయుడు, చిల్లరదేవుళ్ళు, ఆహుతి’ లాంటి ఎన్నో సినిమాల్లో, ఎందరో ప్రముఖ దర్శకుల దర్శకత్వంలో నటించినా ఎప్పుడూ సినిమా రంగంలో స్థిరపడాలనో, పేరు, డబ్బు సంపాదించాలనో తాపత్రయపడలేదు ఆయన. నా ఊపిరి రంగస్థలం అనుకున్నారు. అలాగే జీవితాంతం రంగస్థలానికే సేవ చేసారు.


50ఏళ్లకు పైగా అవిశ్రాంతంగా సాగిన భానుప్రకాష్‍ రంగస్థల ప్రస్థానంలో ఆయన్ని వరించని అవార్డులు, బిరుదులు, ఆయన గెలుపొందని బహుమతులు లేవంటే అతిశయోక్తికాదు. నటవిశారద, నాటక కృషీవలుడు, బళ్ళారి రాఘవ అవార్డు, ఎన్టీఆర్‍ అవార్డు… ఒక్కటేమిటి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఎక్కడ నాటకం ప్రదర్శించినా, ఏ నాటక కళా సంస్థ పురస్కారమయినా భానుప్రకాష్‍ ఇంట అవార్డుగా కొలువు తీరవలసిందే. తెలుగు నాటకరంగంలోని ఒక అగశ్రేణి దర్వకుడు రాసినట్లుగా..
అతని నటనలో ఒక నిండుతనం ఉండేది!
అతని దర్శకత్వంలో ఒక క్రమశిక్షణ ఉండేది!
అతని ప్రదర్శనలో కొత్తదనం ఉండేది!!
అతని న్యాయనిర్ణయంలో నిజాయితీ ఉండేది!
అతని సమక్షంలో ఒక ఆప్యాయత ఉండేది!!
భానుప్రకాష్‍ నటజీవిత ప్రస్థానం ఎందరో రంగస్థల కళాకారులకు ఆదర్శం. ఆధునిక తెలుగు సాంఘీక నాటక చరిత్రలో ఆయన ఒక లెజెండ్‍ నటుడిగా, దర్శకుడిగా భానుప్రకాష్‍ ప్రసిద్ధుడు, ప్రఖ్యాతుడు అయితే వ్యక్తిగా ఉన్నతుడు, మనసున్న మనిషి, నిగర్వి, నిరాడంబరుడు. 50 ఏళ్ళకు పైగా నట ప్రయాణం సాగించినా ఎప్పుడూ ఒకేలా ఎలా ఉండగలిగాడు అంటే ఆయన జీవితం మొత్తం రంగస్థలానికే అంకితం చేసాడు. నటన, దర్శకత్వం ఇవే ఉచ్వాస నిశ్వాసలుగా బ్రతికాడు. డైలాగ్‍ చెప్పుతూనే ఈ లోకం నుంచి నిష్క్రమించాలనే సంకల్పంతో బ్రతికారు. అలాగే జీవిత చరమాంకం వరకు రంగస్థలానికి దగ్గరగానే గడిపారు. ఆయన సంపూర్ణ కళాకారుడు. ఆ కళాకారుడి శకం ఒక చరిత్ర. ఆ చరిత్ర నేటి తరానికి, రాబోయే తరానికి స్ఫూర్తిగా నిలుస్తుందనటంలో ఎలాంటి సందేహంలేదు. ఆ స్ఫూర్తి వెలుగులను ఇప్పటి తరం అందిపుచ్చుకోవాలి. ముఖ్యంగా తెలంగాణ నాటకరంగ యువతకు ఆయన కళాజీవన ప్రస్థానం ఒక ఊతం కావాలి. అది తెలుగు నాటక రంగంలో తెలంగాణ నాటక రంగ ఉనికికి, ఉన్నతికి బలమైన స్ఫూర్తిరూపంగా నిలవాలి.


తెలంగాణ నాటకరంగం భానుప్రకాష్‍ను, అతని నాటక జీవితాన్ని రెండింటిని పదిలంగా పొదివిపట్టుకుని ముందుకు సాగాలి. ఆధునిక తెలుగు సాంఘిక నాటకరంగంలో తెలంగాణ నుంచి అంత బలమైన ముద్రవేసిన వ్యక్తి, సుదీర్ఘ నాటకానుభవం, ఆదర్శంతమైన జీవనశైలి ఉన్న మరో ప్రత్యామ్నాయం కనిపించదు. తెలంగాణ నాటకరంగం గతకాలపు గాయాల్ని కాదు – ఘనమైన గతాన్ని మనకిచ్చిన మహనీయుల్ని వారి అడుగుజాడల గుర్తుల్ని గుర్తుచేసుకుంటూ మనలో మనం స్ఫూర్తిని నింపుకుంటూ ముందుకు సాగితే తెలుగు నాటకరంగ యవనికపై తెలంగాణ జెండా గర్వంగా రెపరెపలాడే రోజు తొందరలోనే వస్తుంది. (తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ప్రచురించిన ‘తెలంగాణ తేజోమూర్తులు’ నుంచి)


-శ్రీధర్‍ బీచరాజు
ఎ : 99492 3565

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *