‘‘చిట్టీ ఆయీహై, ఆయీహై, ఆయీహై’’

నైజాంల కాలంలో కొన్ని పేర్లు ‘‘ఖానా’’లతో ముడిపడి వుండేవి. ఉదాహరణకు జైల్‍ ఖానా లేదా ఖైద్‍ఖానా, దవాఖానా, హమామ్‍ ఖానా, దివాన్‍ ఖానా, జజ్గీఖానా (ప్రసూతి ఆసుపత్రి) పాగల్‍ఖానా (మెంటల్‍ ఆసుపత్రి), కార్ఖానా, ఫీల్‍ఖానా, షరాబ్‍ ఖానా (బార్‍), పాయిఖానా, టపాఖానా లేదా డాక్‍ ఖానా.
పురానాపూల్‍ నుండి కార్వాన్‍ వెళ్లే దారిల టప్పాచబూత్రా అని ఒక స్థలం వస్తుంది. ఖుతుబ్‍ షాహీల కాలంలో అదొక సెంట్రల్‍ పోస్ట్ ఆఫీస్‍. నగరంలో నలుమూలలా ఉత్తరాలు (టపా) అక్కడి నుండే ‘‘బట్వాడా’’ అయ్యేవి. టప్పా పంచే మనిషిని ‘‘టపా జవాన్‍’’ అనేవారు. తర్వాత అది ఇంగ్లీష్‍లో ‘‘పోస్ట్మ్యాన్‍’’ అయ్యింది. ప్రపంచంలో మొట్టమొదటి పోస్ట్మ్యాన్‍లు పావురాలు. ప్రియుడు పరదేశంలో ఉన్న ప్రియురాలికి పంపే ప్రేమ సందేశాలకు పావురాలే వార్తాహరులు. శత్రుదేశపు గూఢచారులు కూడా రహస్యవార్తలను పంపటానికి ‘‘పావురాలనే’’ వాడుకునేవారు. ఇప్పటికీ మిలిటరీ వారు కార్గిల్‍ లాంటి అత్యున్నత హిమవన్నగములపై నుండి దేశభద్రతకు సంబంధించిన రహస్య వార్తలను చేరవేయటానికి పావురాలనే వాడుతున్నారు. (సిగ్నల్స్ ఉండవు కాబట్టి).


విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు ‘‘మిరపకాయ టపా’’ పంపి పోలీస్‍స్టేషన్లపై దాడి చేయబోతున్నానని హెచ్చరికలు పంపేవాడు. మిరపకాయ టపా అంటే బాణానికి ఉత్తరం కట్టి పోలీస్‍ స్టేషన్‍లో పడేలా గురి చూసి కొట్టటం.
మా రోజులలో పోస్ట్మ్యాన్‍కు ఎంతో విలువ, గౌరవం
ఉండేది. నిజమైన ప్రజల మనిషి అతను. ప్రజల కష్టాలు,
కన్నీళ్లు, సంతోషాలు, ఆనందాలు, విరహాలు, కలయికలు, శుభ అశుభ వార్తలను అతను కార్డులు, కవర్ల రూపంలో మోసుకొచ్చేవాడు. ‘‘ఏడ తానున్నాడో బావా జాడ తెలిసిన పోయి రావా అందాలా మేఘమాలా’’ అని మల్లీశ్వరి సీన్మాలో భానుమతి పాడినట్లు ప్రేయసీప్రియుల ప్రేమ సందేశాలను ఆఘమేఘాల మీద మోసుకొచ్చే ‘‘టపా’’ జవాను కోసం కళ్లు కాయలు కాచేటట్లు నిరీక్షించేవారు. ట్రింగుట్రింగుమంటూ మ్రోగే అతని సైకిలు గంట కోసం వారి చెవులు చాటలుగా మారిపోయేవి. ముసలి వారు సర్కారు వారు పంపే పింఛన్‍ డబ్బుల కోసం, ముసలి తల్లితండ్రులు దేశం బోయిన బిడ్డలు రాసే కార్డు ముక్కకోసం – వారి క్షేమ సమాచారాల కోసం ఇంటి ముందు అరుగులపై కూచుని పోస్టు వచ్చే యాళ్ల అవుతుందని కాచుకుని వీధి మొదలు మీద తమ చత్వారపు చూపుల్ని సారించేవారు. ఇటు ప్రేయసీప్రియులో అటు మూడుకాళ్ల ముసలోళ్లో ఆశా నిరాశల మధ్య ఊగిసలాడుతుండగా ట్రింగుట్రింగు మని బెల్లు మోగు తుండగా ‘‘వచ్చెడి వాడు ఫల్గుణుడు’’ అన్నట్లు అతని కటారా, డొక్కు సైకిలు లేదా పంచకల్యాణీ గజ్జెల గుర్రం – మీరేమైనా ఊహించుకోండి గాని ఆ వాహనం ఒక ప్రత్యేకమైన ధ్వని.. కాదు కాదు సంగీతంతో గల్లీలకు ప్రవేశించేది. అటు పడుచు వాళ్లు ఇటు ముసలి వాళ్ల హృదయ స్పందనలు లబ్‍డబ్‍ లబ్‍డబ్‍ మనికొట్టుకుంటూ హెచ్చిపోయేవి. రెచ్చిపోయేవి. ప్రేమ సందేశాల కోసమో క్షేమ సమాచారాల కోసమో ఫించన్‍ రూకల కోసమో! ఏదైతేనేం! ఎవరికైతేనేం!!


‘‘నల్లని వాడు, తెల్లని నయనమ్ముల వాడు, నుదుట నెమలిపింఛము వాడు’’. అన్నట్లే ఎర్రటి ఎండలో డొక్కు సైకిలు మీద, రెండు చక్రాల మధ్య నూనె లేని సైకిలు చెయిన్‍ ఫటఫటామని మోగుతుంటే తలపైన ఖాకీరంగు టోపి ఒక పక్కకు వాలుతుండగా జనపనార బస్తా లాంటి ఖాకీ రంగు కోటు వేసుకుని అదే రంగు కాటన్‍ ప్యాంటుతో ఆ మందమైన కోటుకు బోలెడన్ని పెద్ద పెద్ద జేబులతో అందులో ఒక పద్దతి ప్రకారం సర్దిపెట్టుకున్న ఉత్తరాలు, కవర్లు, మనీ ఆర్డర్లు, డబ్బులతో సైకిలు వెనక క్యారియర్‍కు బిగించి కట్టిన పెద్ద పెద్ద పార్సిళ్లతో, చెమటలు చిందిస్తూ, చెమటలు చిందే నల్లని ముడతల ముఖంలో చిర్నవ్వులు కూడా పూయిస్తూ, చెడావులో సైకిలు తొక్కిన ఆయాసంతో దమ్ములు తీసుకుంటూ ప్రతి ఇంటిముందు ఆగి ‘‘పోస్ట్’’ అని రాగయుక్తంగా రాగంతీసి తన రాకను తెలియచేస్తూ, పసుపు కుంకుమల అద్దిన పెండ్లి శుభలేఖలకు తన నవ్వులను కూడా కొంచెం అద్ది కొందరికి, కారట్‍ మీద నాలుగువైపులా నల్లసిరాతో అద్దిన చావు వార్తల కబుర్లను చిన్న బుచ్చుకున్న ముఖంతో మరికొందరికి, లంగా వోణీలతో గాలిలో తేలుతూ పరవశిస్తూ పరిగెత్తుతూ వచ్చే పడచులకూ పూబోడులకూ తన కొంటె నవ్వులతో సుతారంగా మునివేళ్లతో ప్రేమలేఖలను అందిస్తూ కొండకచో నిరాశలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగం నియామకాల ఉత్తర్వులను కూడా అందచేస్తూ జనులతో నిండిన ఈ జగన్నాటకంలో అతనొక విశిష్టమైన, ప్రత్యేక పాత్రగా భాసిల్లేవాడు. చలికి వొణికి, వానల తడిచి, ఎండలకు ఎండి తక్కువ జీతభత్యాలతో ఎక్కువ సేవలను అందించిన ప్రజాసేవకుడతను. సర్వజనుల మనోరంజనుడతను. సబ్‍కో ప్యారా ప్యారా పోస్టు మ్యాన్‍ హమారా అతను.


ఎటువంటి ఎడ్డి కాలమది?
స్వామి చిన్నతనంలో అతని రెండో అక్క పది, పన్నెండేళ్ల చిన్న పిల్ల, ఆమె హఠాత్తుగా చిన్న బాపు ఇంటికి వరంగల్‍కు వెళ్లవలసి వచ్చింది. బాపు ముందు జాగ్రత్తగా తమ్ముడికి కారటు రాశాడు. ఫలానా తారీఖు ఫలనా దినం ఫలానా రైలు బండికి బిడ్డను ఎక్కిస్తాను. నువ్వు వరంగల్‍ స్టేషన్‍లో ఆమెను దింపుకుని ఫౌరన్‍ అనగా వెంటనే కారటు రాయాలని. చిన్న బాపు నుండి ప్రత్యుత్తరం కూడా వచ్చింది సరే అన్నా అని. అక్క రైలెక్కి వెళ్లిపోయింది. మరునాటి నుండే జవాబు కోసం ఎదిరి చూపులు. చూసి చూసి చూపులన్నీ చుక్కలైపాయె. వారం దినాలు దాటిపాయె. కాకి నుండి కబురూ లేదు కారటు ముక్కా లేదు. అమ్మాబాపుకు బిపిలు పెరిగాయి. బిడ్డను ఎవరైనా ఎత్తుకపోయారేమో అని అమ్మ ఏడ్పులు. ఆ రోజులల్ల ఇండ్లల్ల ఫోన్లు లేని ఎడ్డి కాలమది. ఎక్కడో బజారులో ఒక పెద్ద దుఖాణం సేటు వద్ద ఒక ఫోను. అందులో మాట్లాడాలంటే సామాన్యులకు అదొక సాహసం. భయం, మూతి దగ్గర ఏం పెట్టుకోవాలో చెవ్వు దగ్గర ఏం పెట్టుకోవాలో అసలు ఆ యంత్రాన్ని ఎట్లా పట్టుకోవాలో తెలియక ‘‘తసబిస’’ కంగారు పడేవాళ్లు. ‘‘నోట్లె పాన్‍ ఇంట్ల ఫోన్‍’’ ఒక దర్జాకు, హోదాకు సంకేతం. అటువంటి అమాయపు కాలంలో ‘‘తోకలేని పిట్ట తొంబయి ఆమడలు పోయిందన్నట్టు’’ కారటు ముక్కే గతి క్షేమ సమాచారాలు తెలియటానికి. ఇక బాపుకు తప్పలేదు. ‘‘నాంపల్లి టేసను గాడీ రాజా లింగో రాజా లింగా’’ అన్నట్లు ఆ టేసన్‍ నుండి బెజవాడకు పోయే ప్యాసింజర్‍ గాడీ పొద్దున ఒకటి సాయంత్రం మరొకటి దినానికి రెండే రెండు రైళ్లు. ఇక మిగిలిన సమయంలో టేసనంతా ఎవరూ కానరాక నిద్రపోతున్నట్లుండేది. బాపు పొద్దుటి బండికి రైలెక్కి మళ్లీ రాత్రి బండికి బిడ్డతో సహా హైదరాబాద్‍కు వాపస్‍ వచ్చాడు. వచ్చిన బిడ్డను కావలించుకుని అమ్మ మళ్లీ కొత్త ఏడుపులు బాధతో కాదు ఆనందంతో. సంగతేందంటే చిన్న బాపు అక్క చేరుకోంగనే కారట్‍ గీసి డబ్బల ఏసిండు గని ఆ అడ్రస్సుల ఇంటి పతా జర తప్పుగ రాసిండట. గంతే. అన్నా వొదినెలు గింత పరేషాన్‍ ఐతరని ఆయనకేం తెల్సు!
పాత రోజులలో మా ఇంటి పతా ఇట్లుండేది.


TO
శ్రీమాన్‍ జియ్యరు స్వామిగారు,

మాస్టర్‍ సాబ్‍,
ఇంటి నెంరు 20-6-296,
గల్లీ : నానక్‍ భావులీ,
వయా : రూపులాల్‍ బజార్‍,
పోస్టు : శాలిబండ,
జిల్లా : హైద్రాబాద్‍ – 265


అవి ఎటువంటి ఎడ్డి రోజులో! ద ఏజ్‍ ఆఫ్‍ ఇన్ఫర్‍మేషన్‍ కాదు కదా ఆ కాలం.
ఆ రోజులలో పోస్టులో వచ్చే ఉత్తరాలు వ•డు రకాలుగా ఉండేవి. ఒకటి లేత పసుపు రంగులో ఉండే చిన్న కార్డు. దాని ధర పదిపైసలు. స్వామి చిన్నతనంలో దాని ధర ఒక ఏకానా మాత్రమే. చాలా క్లుప్తమైన సమాచారం మాత్రమే అందులో రాసే వీలుండేది. దాని తర్వాత ఇన్‍లాండ్‍ లెటరు. అంటే దాని పరిధి భారత్‍దేశపు లోపలి సరిహద్దులకు మాత్రమే పరిమితం. అది లేత నీలి రంగులో ఉండే కాగితం. దానిని వ•డు మడతలుగా మలిచి అంటించాలి. దానిపైన ఒక వైపు ‘‘ఫ్రం’’ అడ్రసు వెనుకవైపు ‘‘టు’’ అడ్రసు రాయాలి. ఆ కాగితాన్ని మడిచి అంటించే సౌకర్యం ఉండటం వలన లోపలి సమాచారం ఇతరులు చదివే వీలు ఉండేది కాదు. ప్రేమలేఖలు రాసుకోటానికి అది సురక్షితమైన సౌకర్యం. ఆ ఇన్‍లాండు లెటరు ధర పదిహేను పైసలు. వ•డవది 25 పైసలకు దొరికే ఒక ఖాళీ పోస్టల్‍ కవరు. దానిని లిఫాఫా అని కూడా అనేవారు. రెండు వ•డు తెల్ల పేపర్లపై లేఖ రాసి దాటిని జాగ్రత్తగా మడిచి అందులో పంపవచ్చును. ప్రేమికులు తమ ప్రేమను ఎదుటి వారికి పంపటానికి చివరాఖరిగా ఈ 25 పైసల పోస్టల్‍ కవర్లను ఆశ్రంచేవారు.
కొండొకచో అందులో లంబాచౌడా ప్రేమ కవిత్వాలు కూడా ఒలికిపోతుండేవి.
‘‘దూరాలను కలిపే దారాలే ఉత్తరాలు’’
చలం ‘‘ప్రేమలేఖలు’’ పుస్తకం ఆద్యంతం కవిత్మాతకం. భావాత్మకం. ప్రేమ లేఖలు కూడా కవిత్వం అంత అందంగా
ఉంటాయా అని ఆశ్చర్యపోతాం.
అప్పుడెప్పుడో ఓబుకాలాన ఇంగ్లాండులో పెళ్లి చేసుకున్న ప్రేమికులు దంపతులయ్యి కూడా ఒకే ఇంట్లో కాపురం చేస్తూ ప్రతిరోజూ ఒకరికొకరు ప్రేమలేఖలు రాసుకుని పోస్టు డబ్బాలో వేసేవారట. మాటల కందని భావాలు ఉత్తరాలలోనే సాధ్యం కదా!
ఆకాశరామన్న ఉత్తరాలు కూడా కొన్ని ఇళ్లలకు వస్తుండేవి. ఒక రకంగా అవి హెచ్చరికలు.
అయ్యా!
మీ దివ్యసముఖమునకు రాయునదేమనగా మీ అమ్మాయి లేదా మీ అబ్బాయి పలానా వారితో ప్రేమకలాపాలు, కామసల్లాపాలు జరుపుడుతున్నారు. అది పెళ్లి వరకు దారితీసే ప్రమాదము మెండుగా కలదు. మీ కులగౌరవమూ మీ పేరు ప్రతిష్టలు గోవిందో, గోవిందా. కావున పారా హుషారు. జాగ్తేరహో!


ఇట్లు
మీ శ్రేయోభిలాషి

ఆకాశరామన్న.


ఇక మరో రకం ఉత్తరాలు:
అయ్యా!
ఈ జాబులో వున్న హనుమాన్‍ చాలీసా మంత్రం మరో పది పోస్టు కార్డులతో రాసి పదిమంది మీ బంధు మిత్రులకు పంపని యెడల మీకు అపార నష్టం సంభవించి మీ ఆరోగ్యం చెడిపోతుందని, మృత్యువు సంభవిస్తుందని ముందే హెచ్చరిస్తున్నాను. ఒక వేళ మీరు పది కార్డులు రాసి పంపినచో మీకు లాటరీ తగులవచ్చు. మీ ఉద్యోగ వ్యాపారాలలో అనేక శుభములను, లాభములను పొందవచ్చునని తెలియచేస్తున్నాను.
ఇట్లు
జై రామభక్త హనుమాన్‍.

నా దోస్తు వేణూ సంకోజు పెద్ద ‘‘ఉత్తర కుమారుడు’’. టెలిఫోన్లు లేని కాలంలో సెల్‍ఫోన్లు ఇంకా రాని కాలంలో పదిపైసల పోస్టుకార్డు ముత్యాల్లాంటి చిన్నచిన్న అక్షరాలతో రాసి కార్టు చుట్టుప్రక్కలా, వెనుక భాగాన రంగు రంగుల పెన్నులను ఉపయోగించి పువ్వులతో, లతలతో నింపేవాడు. పోస్టుమ్యాన్‍ కూడా ఆ అందమైన పోస్టుకార్డు చూసి ముసిముసి నవ్వులు నవ్వేవాడు.
‘‘తోకలేని పిట్ట తొంభై ఆమడలు దూరం పోయిందని’’ పాత కాలంలో పోస్టు కార్డుకు సంబంధించిన ఒక సామెత.
కూలికోసం కూటికోసం సప్త సముద్రాలు దాటి వెళ్లిన భర్తలు, కొడుకులు, అన్న తమ్ముల నుండి ఫోన్లు సెల్‍ఫోన్లు లేని కాలంలో ఉత్తరాలు వస్తే అయినవాళ్లు సంతోషం పట్టలేక ఎట్లా నవ్వేవాళ్లో ఏడ్చేవాళ్లో పంకజ్‍ ఉదాస్‍ తన ‘‘చిట్టీ ఆయీహై, ఆయీహై పాటలో హృదయాలు ద్రవించేలా విషాదంగా పాడుతుంటే వినే శ్రోతలు కూడా కన్నీరు కార్చేవారు. ఇప్పుడు సెల్‍ఫోన్‍ వీడియోలు వచ్చాక ఆ మధురమైన బాధ మాయమై పోయింది.


పరవస్తు లోకేశ్వర్‍,
ఎ: 91606 80847

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *