అతిథులకు భోజనం పెట్టిన తర్వాత వక్క పలుకు ఇవ్వకుంటే భోజనం పెట్టిన ఫలితం దక్కదట. అలాగే భోజనం పెట్టక పోయినా, తాంబూలంగా వక్కపొడి ఇస్తే భోజనం పెట్టినంత ఫలితం దక్కుతుందని పెద్దవాళ్లు చెబుతుంటారు. అంటే వక్క కు అంత ప్రాముఖ్యత ఉంది. సాంప్రదాయ అవసరాలకు, అనేక ఆచార సంబంధ కార్యక్రమాలు, శుభ, అశుభ కార్యక్రమాల్లో వక్కకు ప్రత్యేక స్థానం ఉన్నది. ఆయుర్వేద గ్రంథాల ద్వారా వక్కకు ఔషధ గుణాలు ఉన్నట్లు తెలుస్తుంది.
వక్కను అరికానట్ చెట్టు నుండి సేకరిస్తారు. భారతదేశంలో సుమారు రెండు లక్షల ఎకరాలలో వక్క సాగు జరుగుతున్నట్లు తెలుస్తుంది. మంగళ, సుమంగళ త్రిమంగళ, శ్వేత మంగళ, నలభేరి, సమృద్ధి అనే రకాలతో పాటు నాటు రకం వక్క మొక్కలు మనకు లభిస్తాయి. వక్క చెట్టు అన్ని రకాల నేలలో సులభంగా పెరుగుతుంది 4 డిగ్రీల సెంటిగ్రేడ్ నుంచి 40 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వరకు తట్టుకుంటుంది.
వక్క చెట్టు చూడడానికి కొబ్బరి చెట్టు లాగా కనపడుతుంది. సుమారు 20 అడుగులు ఎత్తు వరకు పెరిగే ఈ చెట్టు ప్రతి ఏటా కాపు కాస్తుంది. ఒక గెలలో 200 నుంచి 300 వరకు వక్కలు
ఉంటాయి. పక్వానికి వచ్చినప్పుడు ఈ పండు పసుపు రంగు నుంచి ఆరంజి, ఎరుపు రంగులోకి మారుతుంది.
నాటు విధానం :
దుక్కి దున్నిన తర్వాత పొలంలో 9ఞ9 అడుగుల ఎడంలో ఎకరానికి 500 మొక్కలు చొప్పున 1x1x1.5 అడుగుల గుంటలు తీసి నాటుకోవాల్సి ఉంటుంది. డ్రిప్పు పద్ధతి లో నీరు అందించినచో మొక్కలు త్వరగా పెరుగుతాయి. నాటిన మొక్క నాలుగు నుండి ఐదు సంవత్సరాల మధ్యలో పూతకు వస్తుంది. ఐదు లేక ఆరు సంవత్సరాల నుండి పూర్తిస్థాయిలో దిగుబడి వస్తుంది. పశువుల, గొర్రెల, కోళ్ల ఎరువులు మరియు ఆర్గానిక్ బయో ఫెర్టిలైజర్ వాడడం వలన దిగుబడి ఎక్కువగా వస్తుంది. బాగా పెరిగిన తోట నుండి ఒక చెట్టుకు రెండు నుండి మూడు కేజీల ఎండిన వక్కల దిగుబడి వస్తుంది. సగటున ఎకరానికి 10 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. వక్క మొక్క నాటిన ఐదు సంవత్సరాల తర్వాత వక్క తోటలో అంతర పంటగా నల్ల మిరియాలు, జాజికాయ సాగు చేసుకోవచ్చు.
ఇంతే కాకుండా వక్క మొక్కలను కొబ్బరి ఆయిల్ పామ్ తోటలలో అంతర పంటగా కూడా వేయవచ్చు.
రైతుకు ఆదాయాన్నిచ్చే లాభదాయకమైన పంటల సాగు తీరు తెన్నులు అధ్యయనం చేసి ఆ పంటలను ముందుగా తాను సాగు చేసి రైతులకు భరోసాగా నిలిచే ఆదర్శరైతు తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కర్ణాటకలో ఎక్కువగా సాగవుతున్న వక్క తోటల గురించి తెలుసుకున్న తుమ్మల నాగేశ్వరరావు తన ఆయిల్ పామ్ తోటలో అంతర పంటగా వక్క సాగును చేపట్టారు. ఆయన మార్గదర్శకత్వంలో ఇతర రైతులు వక్కసాగును మొదలుపెట్టి అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సత్యనారాయణపురం గ్రామంలో ఎస్‍కెఎస్‍బి ఆగ్రో ఏజెన్సీస్ పేరుతో షేక్ సయ్యద్ బాజీ వక్క మొక్కల నర్సరీని స్థాపించారు. ఈ నర్సరీలో వక్క మొక్క తో పాటు నల్ల మిరియాలు, జాజికాయ, లవంగం, యాలకులు, దాల్చిన చెక్క వంటి మొక్కలను కూడా ఉత్పత్తి చేస్తున్నారు.
లోగడ ఇతర రాష్ట్రాల నుంచి రైతులు వక్క మొక్కలని కొనుక్కొని వచ్చేవారు. స్వయంగా రైతు అయిన షేక్ బాజీ వక్క సాగు ప్రోత్సహించడానికి, తెలంగాణలోని రైతులకు అందుబాటులో ఉండే విధంగా ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి మండలంలో వక్క నర్సరీని స్థాపించారు. దీనివలన రైతుకు శ్రమ, రవాణా ఖర్చులు ఆదా అవుతున్నాయి. నర్సరీతో పాటు వక్క ప్రాసెసింగ్ సెంటర్‍ను కూడా ఏర్పాటు చేశారు.
ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని నిర్విరామంగా కృషి చేసే ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజిమ్మల్ ఖాన్ సూచనల మేరకు ఎండిపోయి రాలి పడిన వక్క ఆకులను ఉపయోగించి భోజనం ప్లేట్లు, టిఫిన్ ప్లేట్లు, టీ కప్పులు, సాసర్లు తయారు చేసే ఇండస్ట్రి కూడా స్థాపించడానికి బాజి కృషి చేస్తున్నారు.
వక్క తోటలు చాలా ఎత్తుగా, దట్టంగా పెరగడం వలన కాలుష్యం తగ్గి రెండు నుంచి మూడు సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత తగ్గుతుంది. అనంతపురం జిల్లాలోని మడకశిర నియోజకవర్గంలో సుమారు 10,000 ఎకరాలలో వక్క సాగు చేస్తున్నారు. అనంతపురంకి మడకశిరకు సుమారు ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్
ఉష్ణోగ్రత తక్కువగా ఉందని చెప్తున్నారు. ఇక్కడ వర్షాలు కూడా అధికంగా కురుస్తున్నాయి.
పర్యావరణానికి మేలు చేసి, రైతుకు అధిక ఆదాయాన్ని అందించే వక్క తోటలు రైతులు సాగు చేసి లాభపడాలని ఆశిద్దాం.
–సముద్రాల విజయ్ కుమార్
ఎ : 8374449922