పర్యావరణ పరమైన అంశాలు చర్చకు వచ్చిన ప్రతిసారీ ఏదో ఒక మేరకు గుర్తొచ్చే పేరు సుందర్‍లాల్ బహుగుణ. ప్రపంచం ఎదుర్కొనే సమస్యలను ఆయన మూడే మూడు సరళమైన పదాలలోకి అనువదించి చెప్పగలిగాడు. మానవాళికి ఉన్న ప్రధాన శత్రువులు మూడే మూడు అంటాడు. ఒకటి యుద్ధం. రెండు కాలుష్యం. మూడవది ఆకలి. ఈ మూడు ఒకదానితో ఒకటి విడదీయరానంతగా ముడిపడి ఉంటాయి. మనషులకు మరింత మరింత కావాలనే కోరిక, ఆకాంక్ష బాగా బోధింపబడింది. ఆ బోధన ప్రజలను బాగానే ఆవహించింది. మరింత పెరుగుదల అనేది సాధించడానికి అధికారం ఉన్న శక్తులు ఖనిజ సంపద, కలప ఎక్కడైతే ఉంటుందో అక్కడి వనరులపై ఆధిపత్యం కోసం, నియంత్రణ కోసం పోరాడుతాయి. అవసరమైతే యుద్ధం చేస్తాయి. ఆ యుద్ధంలో ఎవరు మరణించినా, ఎందరు ప్రాణాలు కోల్పోయినా ఆ అధికార శక్తులకు పెద్దగా పట్టింపు ఉండదు. పాశ్చ్యాత దేశాలు ఆయుధ వ్యాపారాన్ని సృష్టించాయి. ఇవాళ ఆయుధ వ్యాపారం తెచ్చిపెడుతున్నంతగా లాభాలను ఏ కాలంలోనూ మనం మానవాళి చరిత్రలో చూడలేదు. పేదదేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలకు వాటికున్న వనరులను కొనుగోలు శక్తి ఉన్న దేశాలకో, సామ్రాజ్యాలకో అమ్ముకోవటం, ఎగుమతి చేయటం మినహా మరో గత్యంతరమూ లేదు. అవి వృక్ష సంపదను అడ్డుకుంటాయి. చెట్లను నరికివేయడానికి అంగీకరిస్తాయి. ఎగుమతి చేయడానికి, వ్యాపారాలు పెంచుకోవడానికి అవసరమైన పంటలను పండించడానికి, దిగుమతలు పెంచుకోవడానికి రసాయన ఎరువులు విచక్షణ లేకుండా వేసి భూసారాన్ని భూమిని విషమయం చేస్తాయి. సారవంతమైన భూములన్నీ విదేశీమారకం పెంచుకోడానికే ఉపయోగింపబడతాయి అంటాడు బహుగుణ. భూమి, నీరు పరివ్రమల ఉత్పత్తుల వల్ల మరింతగా కలుషితమవుతాయి. నిజానికి నేల, నీరు అనేవి మానవులకు ప్రాథమిక వనరులు. ఈ రెండు విధ్వంసం చేయబడినప్పుడు మనుషులు ఆకలితో అలమటిస్తుంటారు. ప్రస్తుతం జరుగుతూ ఉన్నదిదే అని సుందర్‍లాల్ బహుగుణ చిప్కో ఉద్యమ ప్రారంభకాలం నుంచి చెపుతూనే వచ్చారు. ఆయన తుదిశ్వాస విడిచే దాకా ఇదే విషయం చెప్పాడు. ఆయనను పర్యావరణ ఉద్యమశీలిగా, పర్యావరణవేత్తగా బాగానే గుర్తించాం, గౌరవించుకొన్నాం. కానీ ఆయన తలపెట్టిన ఉద్యమానికి ఎటువంటి దోహదం మనం చేస్తున్నామనేది ఆలోచించాల్సిన విషయం.
హిమాలయ పర్వత ప్రాంత పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్యమాన్ని ఆయన 1973లో మొదలు పెట్టారు. గాంధేయ సామాజిక కార్యకర్తగా ఆయన జీవితం మొత్తాన్ని వీలయినంత హితాన్ని చేకూర్చడానికి అంకితం చేశాడు. హిమాలయ పర్వత ప్రాంతాలలో జీవించే ప్రజలకు వచ్చిన ముప్పు నాడు అడవులను కోల్పోవటం. మైదాన ప్రాంతాల నుంచి వచ్చిన కలప వ్యాపారుల వల్ల అడవి మీద ఆధారపడి జీవనం సాగించే ప్రజలకు ముప్పు వాటిల్లింది. బ్రిటీష్‍వారి కాలం నుచే ఈ క్రమం మొదలైంది. వారి వనరులు తగ్గిపోయాక బ్రిటీష్ వారి స్వీయ అవసరాల కోసం భారతదేశంపైన దృష్టి పెట్టారు. ముఖ్యంగా ఓడల నిర్మాణానికి, కర్మాగారాలను నడపడానికి కలప విపరీతంగా అవసరమైంది.
1850ల నాటికే రైల్వే స్లీపర్ల నిర్మాణానికి దృఢమైన కలపకు డిమాండ్ పెరిగింది. ఆ కలప లభించేది హిమాలయాల పరిసరాల్లోనే కనుక అడవుల విధ్వంసం జరిగిపోయింది. హిమాలయ వాసులు ఎంతగా అడవుల మీద ఆధారపడినప్పటికీ జీవికకు అవసరమైనంత వరకే అటవీ ఉత్పత్తులను వాడుకున్నారు. అంతే కాకుండా వారు అత్యాశకు పోకుండా భవిష్యత్ తరాల కొరకు ఆ అడవులను సంరక్షించారు. ప్రభుత్వాలు అడవులను స్వాధీనం చేసుకుని చెట్లను కొట్టివేసే హక్కులను కలప కాంట్రాక్టర్లకు అప్పగించింది. ఏటికేడాది అడవులు తరిగిపోవటం మొదలైంది. చెట్లను నరికి వేశాక వాటి స్థానంలో వేగంగా పెరిగే అధిక లాభాలు తెచ్చిపెట్టే ఫైన్ వృక్షాలను పెంచడం జరిగింది. నిజానికి హిమాలయాలు ఓక్, దేవదారు వృక్షాలకు ప్రసిద్ధి.
1950ల నాటికే ఈ అడవులు తరిగి పోవటం వల్ల పర్యావరణ సమస్యలు తలెత్తాయి. పరిశ్రమలకు సమకూర్చడానికి వృక్షాలు తక్షణ సంపదగా, వాడి ఆవతల పారేయ దగిన వనరుగానే చూశాయి. వాస్తవానికి వృక్షాలు భూమికి రక్షణ కవచాలు. భారీ రుతుపవనాల వల్ల కురిసే వర్షాల వల్ల వృక్షాలు, ఆ తడిని చెమ్మను పీల్చుకుంటాయి. క్రమంగా నదీ వ్యవస్థల్లోకి నీటిని విడుదల చేస్తాయి. సంవత్సరం పొడుగునా మైదాన ప్రాంతాలకు కావలసిన నీరు అందుతూ ఉంటుంది. కొండచరివిలు విరిగి పడటాన్ని వృక్షాలు నిరోధిస్తాయి. వృక్ష సంపద రహిత భూమి విపత్తులకు నిలయంగా మారుతుంది. హఠాత్తుగా వరదలు రావటం, కొండ చరియలు విరిగి పడటం అందువల్ల జరిగే జననష్టం, జంతు జీవజాలాలు హరించుకుపోవటం అన్నీ ఒక దానికొకటిగా సంభవించేవే. వాస్తవంగా ఆలోచిస్తే గ్రామీణ ఆర్థికానికి కావలసిన సమస్తాన్నీ అడవులు సమకూరుస్తాయి. 1973లో ఒక స్వయం సహాయక బృందంగా గ్రామస్థలు తమ హక్కుల కోసం సంఘటితమయ్యారు. చెట్లను నరికేస్తున్న వారి నుండి వాటిని నరకకుండా ఆపేందుకు చెట్లను హత్తుకోవటం మొదలు పెట్టారు. ‘చిరుత ఏదైనా పిల్లవాడిపై దాడిచేస్తే తల్లి కాపాడుకున్నట్లు’ మేం ఈ చెట్లను రక్షించుకున్నాం అని ఒక కార్యకర్త చెప్పినట్లుగా చిప్కో ఉద్యమం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. గ్రామీణులకు న్యాయం జరగాలనే లక్ష్యంతోనే తన ఉద్యమ ప్రచారం మొదలుపెట్టాడు బహుగుణ. చిప్కో ఉద్యమ సారధిగా ఆయన హిమాలయాల్లోని గ్రామ గ్రామాన్ని కాలినకడతో సందర్శించాడు. ప్రచారం పాదయాత్ర ద్వారా సాగించాడు. ప్రతి గ్రామంలోనూ బహుగుణ ఇచ్చే సందేశం ఒక్కటే తమ అడవుల విలువను గుర్తించమని చెపుతూ చిప్కో ఉద్యమంలో చేరమని ప్రోత్సహించాడు. చిప్కో ఉద్యమం రెండు రకాల ప్రాపంచిక దృక్పథాలను తేటతెల్లం చేస్తుంది. ఈ రెండు దృక్పథాలు ఒకదానితో మరొకటి తలపడేవి, సంఘర్షించేవి. ఒక దృక్పథం ప్రకృతిని ప్రపంచ మార్కెట్‍లో అమ్మకపు వస్తువుగా చూపేది. రెండవది ప్రకృతిని పవిత్రంగా భావించేది. తమ జీవితాలకు పునాది.
సుందర్‍లాల్ బహుగుణ పాటలు, గేయాలు, చర్చ, సంభాషణల ద్వారా గ్రామస్థులను ఉద్యమం వైపు మరల్చటం, వారిని కూడగట్టడం చేశాడు. తన సహకార్యకర్త చండీ ప్రసాద్ భట్‍తో కూడి గ్రామస్థులందరిలోనూ చిప్కో ఉద్యమానికి కావలసిన మద్ధతును కూడగట్టాడు. బహుగుణ కృషి వల్ల ప్రభుత్వం అటవీ విధానాలను మార్చుకునేంతగా ఒత్తిడి పెంచగలిగింది. సుందర్‍లాల్ బహుగుణ చేపట్టిన ప్రచార ఉద్యమం, నిరాహార దీక్షలు అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ ఉత్తర ప్రదేశ్‍లోని హిమాలయ పర్వత పానుపుల్లో పచ్చని చెట్లను కొట్టేడయడం ముఖ్యంగా వ్యాపారనిమిత్తం చెట్లను నరకడంపై నిషేధం విదిచేందుకు దారితీసింది. 1980ల నాటికే బహుగుణ జాతీయంగా, అంతర్జాతీయంగానూ పర్యావరణ ఉద్యమ కారుడిగా ప్రసిద్ధి పొందాడు. ఐదువేల కిలోమీటర్ల దూరం పద్దెనిమిది నెలల పాటు హిమాలయ పర్వత ప్రాంత గ్రామాల వెంట నడిచాడు. చైతన్యం కలిగించాడు. ఇటీవల కాలంలో హైదరాబాద్‍కు సమీపాన ఉన్న వికారాబాద్ జిల్లా దామదుండం ఫారెస్ట్లో ఏర్పాటు కానున్న విఎల్‍ఎఫ్ నేవీ రాడార్ స్టేషన్ విషయం చర్చకు వచ్చింది. పెద్దఎత్తున ప్రజాస్పందన, అనేక సామాజిక కార్యకర్తలు, ఉద్యమకారుల మద్ధతు కూడా నేవీ స్టేషన్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ వ్యక్తమైంది. చందు తులసి సమగ్రంగా తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా సమాచారం అందించగలిగింది.
అయితే దామగుండం జీవవైవిధ్యానికి కేంద్రమని రాడార్ స్టేషన్ ఏర్పాటు వల్ల ఆ జీవవైవిధ్యానికి హాని చేకూరుతుందని ఆందోళనకారులు స్పష్టం చేశారు. అక్టోబర్ 15న రాడార్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన కూడా జరిగిపోయింది. దామగుండం ఫారెస్ట్ విస్తీర్ణం 3,261 ఎకరాలు అని తెలుస్తున్నది. ఈ అడవికి ఆనుకుని ఉన్న ఇంచుమించు 20 గ్రామాల్లో, పల్లెలు, తండాలు ఉన్నాయి. పశువులమేత ఇతర అవసరాలకు ఈ గ్రామాల ప్రజలందరూ దామగుండం పైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అదట్లా ఉంచితే రాడార్ స్టేషన్ ఏర్పాటుకు గాను 2,900 ఎకరాల్లో దరిదాపుగా 12 లక్షల చెట్లను తొలగించటం జరుగుతందని కూడా వింటున్నాం. పర్యావరణవేత్తల ఆందోళన పడుతున్న అంశం ఏమంటే దాదాపుగా 208 రకాల జీవరాశులకు ముప్పు కలుగుతుంది. రేడియేషన్ ద్వారా వచ్చే ఆపద విపత్తు వేరే ఉంది. కొందరైతే నీ జేబులో ఉన్న సెల్‍ఫోన్ కూడా రేడియేషన్‍కు కారణమవుతున్నది. మరి దానిని వదిలి వేయగలవా? అనే ప్రతివాదన కూడా చేస్తున్నారు. రక్షణ నిమిత్తం ఏర్పాటయ్యే రాడార్ స్టేషన్ కలిగించబోయే విపత్తు గురించి ప్రజలకు వివరించి చెప్పటమో వారిని ఆ మేరకు అప్రమత్తం చేయటమో, చైతన్య పరచటమో జరగాలి. అంతకంటే ముందు ఆ తొలగించనున్న పన్నెండు లక్షల వృక్షాలను హత్తుకోవలసిన మనుషులేరీ? వారిని నడిపేందుకు ఏ చండీప్రసాద్ భట్ వస్తాడు? క్షేత్రస్థాయి కార్యకర్త అయిన ఏ గౌరీదేవి వస్తుంది. ఏ సుందర్‍లాల్ బహుగుణ ఆవిర్భవిస్తాడు? పర్యావరణ హితవరులు మనలో ఎవరు? మనలో మరెవరు మనం కాక ఇంకెవరు?!
- డా।। ఆర్. సీతారామారావు
ఎ : 9866563519