ఇటీవల మనం ఒక శుభవార్త విన్నాం. ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చాలని కోరుతూ 10 జియోలాజికల్ సైట్ల పేర్లను ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు కేంద్ర ప్రభుత్వం పంపించింది. ప్రస్తుతం దేశంలో 100కు పైగా జియో- హెరిటేజ్ సైట్లు ఉన్నాయి. వాటిలో 34 మాత్రమే నేషనల్ జియోలాజికల్ మాన్యుమెంట్స్గా గుర్తింపు పొందాయి. భూమికి సంబంధించిన చరిత్రను తెలుసుకోవడంలో కీలకపాత్ర పోషించే వాటిని లేదా భౌగోళికంగా ఎర్త్ సైన్స్ పరంగా ప్రాధాన్యం ఉన్న స్థలాలను జియో- హెరిటేజ్ సైట్లుగా వ్యవహరిస్తుంటారు.
జియో పార్కుల భావనకు రెండు దశాబ్దాలకు పైగా చరిత్ర ఉంది. గ్లోబల్ జియోపార్కస్ నెట్‍వర్క్ (జీజీఎన్) 2024 అక్టోబర్ 6న అంతర్జాతీయ జియో డైవర్సిటీ డేను నిర్వహిస్తోంది. ఈ వేడుకను నిర్వహించుకోవడం అంతర్జాతీయ ప్రాధాన్యం ఉన్న జియోలాజికల్ హెరిటేజ్ సైట్లను కాపాడుకోవడం, భూమి చరిత్రకు గుర్తుగా వాటిని సంరక్షించుకోవడం తదితర అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ దినోత్సవం తోడ్పడుతుంది. ఈ సంవత్సరం గ్లోబల్ జియోపార్కస్ నెట్‍వర్క్ తన 20వ వార్షికోత్సవాన్ని కూడా నిర్వహించుకోవడం ఓ విశేషం. 2021లో యునెస్కో అంతర్జాతీయ జియోడైవర్సిటీ డేను ప్రకటించింది. నాటి నుంచి ఏటా ఈ దినోత్సవాలు జరుగుతున్నాయి.
సాధారణంగా ఆర్కియలాజికల్ సైట్లకు చట్టపరమైన భద్రత ఉంది. జియో- హెరిటేజ్ సైట్లకు మాత్రం అలాంటి భద్రత లేదు. ఈ నేపథ్యంలోనే జియోలాజికల్ హెరిటేజ్ రక్షణే ధ్యేయంగా జియో-హెరిటేజ్ సైట్స్ అండ్ జియో రెలిక్స్ బిల్లు 2022 రూపుదిద్దుకుంది. త్వరలోనే ఇది చట్టరూపం దాల్చే అవకాశం కూడా ఉంది. ప్రపంచవ్యాప్తంగా 1200 దాకా ప్రపంచ వారసత్వ ప్రదేశాలున్నాయి. ఇందులో 43 భారత్‍కు చెందినవి. వీటిలో జియోలాజికల్ సైట్ ఒక్కటి కూడా లేదు.
జియోలాజికల్ సైట్లకు ఉన్న ప్రాధాన్యం నేపథ్యంలో అక్టోబర్ 6న అంతర్జాతీయ జియో డైవర్సిటీ డేను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. జియోలాజికల్ సైట్లకు కూడా వివిధ రకాల గుర్తింపులు లభిస్తే వాటిని పరిరక్షించుకోవడం మరింత తేలికవుతుంది. దేశంలో వందకు పైగా అద్భుతమైన జియోలాజికల్ సైట్లు ఉన్నప్పటికీ, సమాజంలో మాత్రం వాటి పరిరక్షణ విషయంలో అంతగా అవగాహన ఉండటం లేదు. మహారాష్ట్రలోని లూనార్ క్రేటర్, మధ్యప్రదేశ్‍లోని భేడా ఘాట్, ఆంధప్రదేశ్‍లోని గండికోట లోయ, తెలంగాణలోని పాండవుల గుట్ట.. ఇలా మరెన్నో అద్భుతమైన జియోలాజికల్ సైట్లు మన దేశంలో ఉన్నాయి. వీటిలో అనేకం పర్యాటక కేంద్రాలుగా మారాయే తప్ప వాటి భౌగోళిక ప్రాధాన్యం మాత్రం అంతగా ప్రాచుర్యంలోకి రావడం లేదు. వాటి రక్షణ విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇలాంటి వాటికి యునెస్కో గ్లోబల్ జియోపార్క్ గుర్తింపు లభిస్తే అవి మరింతగా ప్రాచుర్యంలోకి వచ్చే అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 48 దేశాల్లో 213 యునెస్కో గ్లోబల్ జియోపార్కులు ఉన్నాయి. ఏటా కొత్తగా పది నుంచి ఇరవై దాకా విభిన్న స్థలాలను వాటికి జోడిస్తుంటారు. ఇదే విధమైన గుర్తింపును జాతీయ స్థాయిలో ప్రకటించడం కూడా ఈ స్థలాల పరిరక్షణకు, అవి ప్రాచుర్యంలోకి వచ్చేందుకు తోడ్పడుతుంది. ఇటీవలే తెలంగాణలో పాండవుల గుట్టకు ఈ విధమైన గుర్తింపు లభించింది. ఇలాంటి గుర్తింపు పొందిన ప్రాంతం తెలంగాణలో ఇదొక్కటే కావడం విశేషం. ఇప్పుడిప్పుడే జియో డైవర్సిటీ భావన ప్రజల్లోకి వెళ్తోంది. దక్కన్ హెరిటేజ్ అకాడమీ, పర్యావరణ, సాంస్కృతిక సంస్థలు, కొంతమంది వ్యక్తులు కొన్నేళ్లుగా ఈ అంశంపై విశేషమైన కృషి చేస్తున్నారు.
తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ భౌగోళిక ప్రాధాన్యం ఉన్న ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. పాండవుల గుట్ట హిమాలయాల కంటే ముందు నుంచీ ఉన్నదని చెప్పేందుకు ఆధారాలు లభ్యమవుతున్నాయి. అదే విధంగా కరీంనగర్, కొత్తగూడెం, ఆదిలాబాద్ తదితర ప్రాంతాల్లో రాక్షస బల్లుల శిలాజాలు, ప్రాచీన కాలపు తాబేళ్లు, ఇతర జంతువుల పాదముద్రలు కూడా బయటపడ్డాయి. ఇవన్నీ 160 నుంచి 200 మిలియన్ సంవత్సరాల కిందటివని అంచనా. హైదరాబాద్‍లోని మౌలాలీ పహాడ్‍కు కూడా అద్భుతమైన వారసత్వ ప్రాధాన్య చరిత్ర ఉంది. వీటిని గనుక మనం కోల్పోతే తిరిగి తెచ్చుకోలేం. యావత్ భౌగోళిక చరిత్ర వారసత్వం వాటికి ఉంది. అందుకే ఇలాంటి భౌగోళిక వైవిధ్య ప్రాంతాలను కాపాడుకునేందుకు ప్రజలే ముందుకు రావాలి. శిలా రాతి యుగం నుంచి లోహ యుగం దాకా ప్రాచీన చరిత్రను తమలో దాచుకున్న ప్రాంతాలెన్నో తెలంగాణలో ఉన్నాయి. పాండవుల గుట్ట, భువనగిరి, దేవరకొండ, ఉంద్రు కొండ, బొమ్మలమ్మ గుట్ట లాంటి ఎన్నో కొండలు, ప్రదేశాలు, ప్రాంతాలు దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గుర య్యాయి. ఇప్పటికైనా ఈ ప్రాంతాల విశేషాలను భద్రపరిచేందుకు ప్రభుత్వం, ప్రజలు నడుం బిగించాల్సిన అవసరం ఉంది.
పాండవుల గుట్ట విషయానికి వస్తే.. తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇది ఉంది. 1990 కన్నా ముందే దీని ప్రాధాన్యం వెలుగులోకి వచ్చింది. ప్రాచీన కాలపు పెయింటింగ్‍లు, గుహలు, ప్రాచీన ఆవాసాలకు సాక్ష్యాధారాలు ఇక్కడ ఉన్నాయి. ఈ పెయింటింగ్‍లలో ఎద్దు, పులి లాంటి జంతువుల బొమ్మలు, వృత్తాలు, చతురస్రాలు, రేఖాగణిత సంబంధిత చిత్రాలు, స్వస్తిక్ చిహ్నం, విల్లు, బాణాలు, కత్తి లాంటి చిత్రాలు ఉన్నాయి.
భూమి చరిత్రకు సంబంధించిన విశేషాలను జియో హెరిటేజ్ సైట్లు అందిస్తాయి. భూమి గతాన్ని ఇవి చాటిచెబుతాయి. సెయింట్ మేరీ ఐలాండ్‍లోని కాలమర్ బసాల్ట్ కావచ్చు, లేదంటే మహారాష్ట్రలోని లోనార్ క్రేటర్ కావచ్చు.. ఇవన్నీ కూడా అగ్నిపర్వతాల పేలుళ్లు, ఉల్కాపాతం, ప్రాచీన మానవ ఆవాసాలు.. ఇలా ఎన్నో విశేషాలకు సాక్ష్యాలు. అందుకే జియోలజిస్టులు, ఇతర పరిశోధకులను ఇవి అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రాచీన కాలపు శీతోష్ణస్థితులు, భూమి పొరలు, పర్వతాలు రూపుదిద్దుకున్న క్రమం ఇలా మరెన్నో విశేషాలను ఇవి అందిస్తాయి.
దేశంలో ఇప్పటి వరకు 34 ప్రదేశాలను నేషనల్ జియోలాజికల్ మాన్యుమెంట్లుగా గుర్తించారు. ఆంధప్రదేశ్‍లో ఓల్కనోజెనిక్ బెడెడ్ బైరేట్స్ (మంగంపేట), తిరుపతి ఎపర్చీన్ అన్ కన్ఫార్మిటీ (చిత్తూరు), తిరుమల సహజ శిలాతోరణం, ఎర్రమట్టి దిబ్బలు (విశాఖపట్నం) ఈ విధమైన గుర్తింపు పొందాయి. తెలంగాణలో పాండవుల గుట్టకు ఈ గుర్తింపు లభించింది. కేరళలో అంగాడిపురం లేటరైట్ (మల్లాపురం), వర్కాల క్లిఫ్ సెక్షన్ (వర్కాల), తమిళనాడులో నేషనల్ ఫాసిల్ ఉడ్ పార్క్ (పెరంబలూర్), సెయింట్ థామస్ చర్నోక్కైట్, కరాయ్ బద్లాండ్స్ ఫార్మేషన్ ఫాసిల్ పార్క్(పెరంబలూర్), గుజరాత్‍లోని ఎడ్డీ కరెంట్ మార్కింగ్ సెడిమెంటరీ స్ట్రక్చర్స్ (మహిసాగర్), రాజస్థాన్‍లోని సెంద్రా గ్రానై ట్.. ఇలా పలు రాష్ట్రాల్లో మొత్తం 34 ప్రదేశాలు ఈ విధమైన గుర్తింపు పొందాయి.
తెలంగాణ, ఆంధప్రదేశ్‍లలో జియో హెరిటేజ్ సైట్లపై అవగాహన కల్పించేందుకు దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ లాంటి సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. రెండు, మూడేళ్లుగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. జియో డైవర్సిటీ డే సందర్భంగా మౌలాలీ పహాడ్ వద్ద గతేడాది దక్కన్ హెరిటేజ్ అకాడమీ జియో హెరిటేజ్ వాక్, చర్చా కార్యక్రమాన్ని నిర్వహించింది. సంబంధిత రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 2022లో కూడా ఈ తరహా కార్యక్రమం తెలంగాణ అసెంబ్లీ ఎదురుగా ఉన్న నౌబత్ పహాడ్ వద్ద జరిగింది. ఈ ఏడాది అంతర్జాతీయ జియో డైవర్సిటీ దినోత్సవాన్ని పురస్కరించుకొని అక్టోబర్ 6న ఉదయం 9 గంటలకు హైటెక్ సిటీ సమీపంలోని ఫక్రుద్దీన్ గుట్ట (ఖాజాగూడ హిల్స్) వద్ద జియో హెరిటేజ్ వాక్‍ను దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ నిర్వహిస్తోంది. ఎఫ్‍బీహెచ్, సీడీఎస్, జేబీఆర్‍ఏసీ, టీఆర్‍సీ లాంటి పలు సంస్థలు ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నాయి.
స్థానికంగా జియోలాజికల్ చరిత్ర గురించి తెలుసుకునేందుకు జియో హెరిటేజ్ డే వీలు కల్పిస్తుంది. స్థానిక సంస్కృతులు, జీవ వైవిధ్యం, పర్యావరణం, శీతోష్ణస్థితి మార్పులు లాంటి అంశాలు కూడా ఈ సందర్భంగా చర్చకు వస్తాయి. తమ ప్రాంత విశిష్టతలను కాపాడుకునేందుకు ప్రజలు ఏకతాటిపైకి వచ్చేందుకు ఈ దినోత్సవం వీలు కల్పిస్తుంది. పర్యాటకం పెరిగేందుకు తోడ్పడుతుంది. ప్రజలు తమ ప్రాంతంతో మరింతగా అనుబంధం పెంచుకునేందుకు తోడ్పడుతుంది. ఈ దినోత్సవాన్ని పురస్కరించుకొని వర్క్షాప్స్, సదస్సులు, క్షేత్ర పర్యటనలు, కళా ప్రదర్శనలు నిర్వహించాలి. దీని వల్ల స్థానిక విశేషాల పరిరక్షణకు స్థానికులు ముందుకు రాగలుగుతారు. మన దేశంలో జియో హెరిటేజ్ సంబంధిత అంశాల ను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పర్యవేక్షిస్తోంది. పర్యావరణ, సాంస్కృతిక సంస్థలు కూడా ఈ దిశలో తమ వంతు సహకారాన్ని అందిస్తున్నాయి. యూనివర్సిటీలు సైతం ఈ విషయంలో కీలకపాత్ర పోషించే అవకాశం ఉంది. విద్యార్థులతో వివిధ ప్రాజెక్టులు చేపట్టాలి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లా చరిత్రలు, స్థానిక చరిత్రలకు ఎంతో ప్రాధాన్యం ఏర్పడింది. ఎన్నో పుస్తకాలు వచ్చాయి. అదే తరహాలో జియో హెరిటేజ్ సైట్ల విషయంలోనూ ఉద్యమంలా కృషి జరగాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో ప్రస్తుతం పాండవుల గుట్ట మాత్రమే అధికారిక గుర్తింపు పొందింది. అలాంటి గుర్తింపు మరెన్నో స్థలాలకు వచ్చే అవకాశం ఉంది. అందుకు వీలుగా సరైన రీతిలో డాక్యుమెంటేషన్, లిస్టింగ్ అండ్ నోటిఫికేషన్ జరగాలి. అందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉదారంగా నిధులు మంజూరు చేయాలి. వివిధ ప్రభుత్వ విభాగాలను సమన్వయం చేస్తూ మరెన్నో ప్రాంతాలకు అధికారిక గుర్తింపు వచ్చేలా చేయాలి. ఇలాంటి గుర్తింపులు లభిస్తే తెలంగాణలో పర్యాటక రంగం కూడా వృద్ధి చెందే అవకాశం ఉంటుంది.
(అంతర్జాతీయ జియో డైవర్సిటీ దినోత్సవం (అక్టోబర్ 6) సందర్భంగా నమస్తే తెలంగాణ తెలుగు దినపత్రికకు రచయిత రాసిన వ్యాసం యథాతంగా)
Er. వేదకుమార్ మణికొండ
ఎ : 98480 44713