కొన్నె జనగామ జిల్లా, బచ్చన్నపేట మండలంలోని ఒక చారిత్రక పురాగ్రామం.
కొన్నె గ్రామానికి ఉత్తరాన చెరువుంది. ఆ చెరువును గోనె చెరువని పిలుస్తారు అక్కడి ప్రజలు. అక్కడున్న కట్టమైసమ్మను గోనెకట్టమైసమ్మ అనే పిలుస్తారు. నిజానికి ఆ దేవత మహిషాసురమర్దిని. రాష్ట్రకూటశైలి విగ్రహం. గోనె లేదా గోన ఆ వూరునేలిన వారి వంశనామం కావచ్చు. ఆ గోనె రానురాను కొన్నెగా కుదించుకుపోయుండొచ్చు. దానితో ఈ వూరుకు కొన్నె అనే పేరు వచ్చివుంటుంది. ఈ గ్రామం వెయ్యేళ్ళ కింద కొత్తగా కట్టిన వూరు కావడానికి అవకాశముంది. పాతవూరు వేరేచోట వుండేదని గ్రామస్తులు చెపుతున్నారు. ఈ వూరుకు పాతవూరు పాటిగడ్డ వుందని పాతశివాలయం అక్కడిదేనంటారు.
పాటిగడ్డ శివాలయం:
పాటిగడ్డ శివాలయం పురాతనమైనది. ఆ ఆలయ గర్భగుడి ద్వారబంధాల మీదున్న కలశాలు, అట్లే ఆలయం ప్రధానద్వారం దక్షిణాభిముఖంగా వుండడం అది శివాలయంగా మార్చబడక ముందు జైనబసది అయివుంటుందని చెప్పొచ్చు. ఇపుడు గర్భగుడిలో ఎత్తైన పానవట్టం మీద శివలింగం వుంది. దేవాలయం విమానగోపురం తర్వాత కాలంలో నిర్మించినట్టుగా తెలుస్తున్నది. మొదట రాళ్ళు పరిచి సున్నం, పలుగురాళ్ళ కాంక్రీటుతో చేసిన దేవాలయం కప్పు మీద పాలాస్త్రి వంటి ఇటుకలతో, రాళ్ళతో విమాన నిర్మాణం చేయబడ్డది.
దేవాలయపు అర్ధమంటపం తూర్పుదిశ రాళ్ళ మధ్య ప్రతిష్టించిన ఉమాలింగనమూర్తి కొలువైనాడు. శిల్పశైలినిబట్టి అది రాష్ట్రకూటుల కాలానికి చెందినదే. విగ్రహం కింద పరిచిన రాతిస్తంభం మీద నామక (లేబుల్) శాసనముంది. ‘‘సిళిఎదే మాడిసి(ద)’’ అని తెలుగన్నడలిపిలో, కన్నడభాషలో శాసనం వుంది. పక్కన కొంత రాయి పగిలిపోయింది. అది దేవాలయ నిర్మాత పేరు. ఆ పక్కన రాజోచిత వేష, భూషణాలతో తలలేని ఒక శిల్పం వుంది. బహుశః అతడు దేవాలయ నిర్మించిన రాజగునేమొ. గుడి వెనక ఒక వీరగల్లుంది. ఈ శిల్పంలో వీరుడు కుడిచేత కత్తి ఎత్తిపట్టుకున్నాడు. ఎడమచేతిలో లింగం, ఆ పక్కన పడగెత్తిన సర్పం ఉన్నాయి. వీరుని కుడిచేతివైపు సూర్యుడున్నాడు. వీరగల్లులలోని రకాలనుబట్టి ఈ వీరగల్లు ధర్మవీరగల్లు అనబడుతుంది. వీరుడు పుణ్యదినమైన సూర్యగ్రహణంనాడు పాముచేత కరిపించుకొని ఆత్మాహుతి చేసుకునివుండాలి. లేదా పాముకాటుకు బలైవుండాలి. ఆ పక్కన ఇదేవిధమైన వీరగల్లు మరొకటి కూడా ఉంది. ఇటువంటి వీరగల్లు శిల్పాలు కొలనుపాకలో 3దాక వున్నాయి. దాని పక్కన రెండు ఆడ, మగ నాగ శిలలు వున్నవి. మరికొన్ని భూమిలో వున్నవి.
రామాలయం:
గ్రామంలో రామాలయం ప్రసిద్ధం. రామాలయంలోని సీతారామలక్ష్మణుల విగ్రహం సుందరంగా వుంది. ఆలయం కప్పుమీద అగ్నిదేవుని శిల్పమొకటి మాకు లభించింది. హనుమాండ్లగుడిలో రెండు భక్తాంజనేయుల శిల్పాలున్నాయి. గుడి ముందరి ధ్వజస్తంభం కొలనుపాకలో కనిపించిన జైనమానస్తంభాలను పోలివుంది.
గ్రామంలోని మరొక శివాలయంలో చిన్న గర్భగుడిలో శివలింగం, బయట భైరవుడున్నారు. ఆ గుడి ముందర తక్కువ గ్రామాల్లో కనిపించే సారగమ్మ విగ్రహముంది. చెరువులో వీరగల్లుంది. దుర్గమ్మ గుడిదగ్గర భైరవుడు, వీరగల్లు, తలలేని దుర్గ శిల్పాలున్నవి. గ్రామపంచాయతి దారిలో ఏనుగులను కట్టేసే రంధ్రమున్న రాతి స్తంభముంది. ఇట్లాంటిది నల్లగొండ జిల్లా ఆత్మకూరు మండలం చాడలో వుంది. ఆంజనేయుని గుళ్ళు చాలా చోట్ల వున్నవి. పాత శివాలయం దారిలో పానవట్టంతో శివలింగం, నంది, ముందర హనుమంతుడు (ప్రాచీన శిల్పం) వున్నవి.
కొన్నెలో కోట ఆనవాళ్ళు:
గ్రామంలో పాతగడి ఆనవాళ్ళే కాక వూరిచుట్టూరా కట్టిన గోడ శిథిలాలు కనిపిస్తున్నాయి. గ్రామానికి నైరుతిలో పాతకోట ఆనవాళ్ళు లభిస్తున్నాయి. అక్కడ చాలా రాళ్ళు మట్టిలో కూరుకుని వున్నవి. వాటిని బయటికి తీస్తే ఇంకా ఎక్కువ సమాచారం దొరికే అవకాశముంది. అక్కడికి కొద్దిదూరంలో దేవుని మాన్యందారిలో చింతచెట్టు కింద నల్లసరపురాతి శాసనం వుంది. దానిమీద సూర్యచంద్రులు, మధ్యలో శివలింగం చెక్కివున్నవి. దానికి పశువులను కట్టేయడం వల్ల అక్షరాలు కనిపించడం లేదు. శాసనం పూర్తిగా అరిగిపోయింది. వున్న ఒక్క చారిత్రక లిఖితాధారం దక్కకుండా పోయింది.
గ్రామంలోని దేవాలయాలను గమనిస్తే ఇక్కడ రాష్ట్రకూటుల కాలం నుండి దేవాలయాలున్నాయని, తర్వాత కాలంలో చాళుక్యులు, కాకతీయులు వాటిని పునరుద్ధరించడం, మార్చడం చేసారని పిస్తున్నది. వూరిలో భైరవులు ఎక్కువచోట్ల వున్నారు. భైరవారాధన ఎక్కువగా కాపాలికులు, పాశుపతుల్లో వుంది. కనుక జైనం, శైవాలకు సంఘర్షణ జరిగి వుంటుందనిపిస్తుంది. ఆ సందర్భంలోనే ఆలయాలమార్పు జరిగి వుంటుందనిపిస్తున్నది. గ్రామంలోని ఆ శాసనం తప్పకుండా శైవమఠాలకు సంబంధించిందై వుండడానికి అవకాశముంది. వూరిలో చాలాచోట్ల మాన్యాలుగా పిలువబడే పొలాలున్నవి.
గజగిరిగుట్ట
కొన్నె, రామచంద్రాపురం గ్రామాల నడుమ వున్న 500మీ.ల ఎత్తున్న ఈగుట్ట ఆకారంలో ఏనుగును పోలివుంటుంది. ఒకప్పటి అగ్నిపర్వత మనిపించేలా గుట్టమీద గుండ్లు అనేకం, సొరంగాలు లెక్కకు మిక్కిలి. గట్టిరాళ్ళ కొండ ఇది. క్వారీలో ధ్వంసమైపోతున్నది. సహజసిద్ధంగా ఏర్పడిన కొలనునే ప్రజలు సూర్యుడు చూడని కుండం అని పిలుస్తున్నారు. దీనిలోని నీరు తాగితే రోగాలు పోతాయని చెప్పడం ఆ నీళ్ళ స్వచ్ఛతకు, ఖనిజ ధాతువుల సంపన్నతకు నిదర్శనం. గుట్టకు పడమట, కొన్నెవైపు ఒక పెద్ద పట్టణం వున్న ఆనవాళ్ళు దొరుకుతున్నవి. దర్గా వెనక కోటవంటి నిర్మాణానికి సంబంధించిన పునాదిరాళ్ళ చాళ్ళు కనిపిస్తున్నవి. అక్కడ లభిస్తున్న గాబులు, కుండలు, టెర్రకోటబొమ్మల ముక్కలు, నూరుడురాళ్ళు, పెద్ద (14,8,4 అంగుళాల కొలతలు) ఇటుకలు శాతవాహనుల కాలం నుండి ఇక్కడ నగరమొకటి వుండేదనడానికి ఆధారాలు. ప్రజలు ఈ ప్రాంతాన్ని గజగిరి పట్టణం అని పిలుచుకుంటారు.
రాతిచిత్రాలు: గుట్టకు నైరుతిన కింద ఒక పడగరాయికి ఆదిమానవులు వేసిన రాతిచిత్రాలు కొన్ని దొరికాయి. ఆ పడగరాయిని పగుల చీరడంవల్ల రాతిచిత్రాలు దక్కకుండాపోయినవి. వున్నవాటిలో మానవాకారాలు, అస్పష్టంగా జంతువుల బొమ్మలు ఒకటి, రెండు కనిపిస్తున్నవి. ఇట్లాంటి రాతిచిత్రాల ప్రదేశాలు (చిత్రిత శిలాశ్రయాలు) రంగారెడ్డిలోని కోకాపేట, తుర్కపల్లి, లాల్ గడి మలకపేట, మెదక్ జిల్లా అస్తలాపూర్, శివారువెంకటాపూర్, ధర్మారం, నల్లగొండ జిల్లా భువనగిరి మండలంలోని వడపర్తులలో ఒక వరుసలో నెలకొని వున్నాయి. అంటే ఈ ప్రాంతమంతా ఒకప్పుడు ఆదిమానవుల ఆవాసాలని చెప్పవచ్చు.
ఈ ప్రదేశాలలో లభిస్తున్న వారి రాతిపనిముట్లను, రాతిగొడ్డండ్లు, కత్తులు, సుత్తెలు, వడిసెలరాళ్ళు, నాగళ్ళవంటి వంపురాళ్ళు,
చిల్లరాళ్ళు వంటి వాటిని పరిశీలిస్తే ప్రాచీన శిలాయుగం, మధ్య శిలాయుగం, నవీనశిలాయుగం, బృ హచ్ఛి లాయుగాలలో క్రమంగా ఇక్కడే సమృద్ధిగా పురాతన మానవావాసా లుండేవని తేలుతున్నది. గజగిరిగుట్టపైన, కింద రాసులకొద్ది వివిధ రాతియుగాల రాతిపనిముట్లు కొల్లలుగా దొరుకుతున్నవి. అంటే ఈ గజగిరిగుట్ట కూడా ఆదిమానవులకు ఆశ్రయమిచ్చిన ప్రాచీన చారిత్రక ప్రదేశమే. గుట్టపైన గుహల్లో ప్రాచీన శిలాయుగపు మొరటు రాతిపనిముట్లు పలుగురాళ్ళతో, చెక్కముకి రాళ్ళతో, పెచ్చురాళ్ళతో చేసిన పెద్దపనిముట్లు లభిస్తున్నవి. కొండపైన, దిగువన మధ్య శిలాయుగపు వడిసెలరాళ్ళు, చిల్లరాళ్ళు, ఒకపక్కన చెక్కిన రాతిగొడ్డళ్ళ వంటివి, కత్తుల రూపంలో అనేకంగా రాతిపనిముట్లు దొరుకు తున్నవి. నవీనశిలాయుగానికి చెందిన నునుపైనవి రెండువైపుల చెక్కిన రాతిగొడ్డండ్లు, కత్తులు, నూరుడు రాళ్ళే గాకుండా అక్కడక్కడ పలుచని రాతి పనిముట్లు అరుదుగా లభిస్తున్నవి. గుట్టచుట్టూ తొలగించినవి పోగా బ•హచ్ఛిలాయుగపు రాకాసి గుళ్ళని జనం పిలిచే సిస్తులు, కైరన్లు విరివిగా కనిపిస్తున్నవి.
రంగనాయకుని గుడి:
గుట్టకు పడమట కిందవైపున కొంచెం ఎత్తునవున్న గుహాలయాన్ని రంగనాయకుని గుడి అంటారు. ఇపుడైతే గుడిలో ఒకప్పుండుండిన సుందర శేషతల్పశాయి రంగనాయకుని విగ్రహం లేదు.ఏమైందో చెప్పేవారు లేరు. గుడికి ఇరువైపుల బండలమీద ఆంజనేయ, గరుత్మంతుల శిల్పాలు చెక్కివున్నవి. వెనకవైపు ఆల్వారులు, చెక్కబోయి నిలిపిన వినాయకుని శిల్పాలున్నవి. ఈ ఆలయపు
ఉత్తరాశిమీద లలాటబింబంగా గజలక్ష్మి చెక్కబడి వుండడం, ఆలయద్వారం దక్షిణాభిముఖంగా వుండడం చూస్తే ఇది కూడా ఒకప్పుడు జైనబసది కావచ్చుననిపిస్తున్నది. ఆలేరులో వున్న రంగనాయక దేవాలయం కూడా జైనమని చెప్పడానికి అదికూడా దక్షిణాభిముఖ ద్వారమే కలిగివుంది. ఇవన్ని ఒకప్పటి జైన, శైవ, వైష్ణవాల మధ్య పోటీ, ప్రాభవాల వల్లనే జరిగివుంటాయి. గజగిరికొండకు తూర్పున ఆగ్నేయంలో చిన్నగుహలెక్క కనిపించేచోట కపాలభైరవుడు, కొంచెం దూరంలో కాళికాదేవి గుట్ట రాళ్ళకు చెక్కివున్నాయి. ఇవి కాపాలికుల ఆరాధనాస్థలాలని చెప్పవచ్చు.
గజగిరిగుట్టమీద బౌద్ధం:
వాయవ్యదిక్కు నుండి వెళితే పైన పెద్ద ఇటుకల నిర్మాణాల శిథిలాలు కనిపిస్తున్నాయి. అక్కడ లభిస్తున్న పెంకులు, ఇటుకల (14,8,4 అంగుళాల కొలతలతో) వలయాల వరుసలు, కొన్ని పాలాస్త్రికి వాడే పలుచని ఇటుకలబిళ్ళలు ఆధారంగా ఇది తప్పకుండా బౌద్ధుల ఉద్దేశిక స్తూపమై వుంటుందని చెప్పవచ్చు. ఆ నిర్మాణాలు పక్కన ఏనుగుకుండం, ఆ పక్కన చాలాచోట్ల ఇటుకలచేత కట్టిన నివాసాల (ఆరామాల) ఆనవాళ్ళు, రాతి స్తంభాలు, రాతిపలకలు… ఇవన్నీ బౌద్ధుల ఆవాసాలని ధ్రువపరుస్తున్నవి. అంతేగాకుండా కొన్నెవాగు బచ్చన్నపేట వాగులో కలిసి కొలనుపాక వద్ద ఆలేరువాగు (భిక్కేరు)గా మారుతున్నది. ఆలేరువాగుకున్న భిక్కేరనే పేరు ఈ ప్రాంతంలో బౌద్ధులు విహరించారని స్తూపాలు, ఆరామాలు నిర్మించారని (ఉదాహరణకు నల్లగొండ ఆత్మకూరు మండలంలోని చాడ, ఫణిగిరి, తిర్మలగిరులలో బౌద్ధ స్తూపాలున్నవి) రాజపేట మండలం రఘునాథపురం రామస్వామిగుట్టకు బౌద్ధం బొమ్మలున్నవి. ఈ వరుసలో గజగిరిగుట్ట కూడా బౌద్ధుల ఆవాసమనడానికి సందేహం లేదు.
కొన్నెలో చరిత్రపూర్వయుగం ఆనవాళ్ళు- పురావస్తు తవ్వకాలు:
హైద్రాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని చరిత్ర విభాగానికి చెందిన ప్రసిద్ధ చరిత్రకారులు, పురాతత్వవేత్త ప్రొ. కె.పి.రావుగారి ఆధ్వర్యంలో, 2018లో గజగిరిగుట్టకు నైరుతిలో విస్తరించివున్న మెగాలిథిక్ సమాధులలో కొన్నింటిని తవ్వారు.
ఉపరితలంలో మీదనే పదునుపెట్టిన రాతిగొడ్డండ్లు, టెర్రకోట పూసలు, నలుపు-ఎరుపు, ఎరుపు, నలుపు కుండపెంకులు లభించాయి. పెదరాతియుగానికి సంబంధించిన బంతిరాళ్లతో కూడినవి, పెట్టెసమాధులు గమనించబడ్డాయి. ఇనుం, నలుపు-ఎరుపు కుండలు, చదునైన స్టియటైట్ పూసలు, క్లిష్టమైన గీతలతో కుండపెంకులు లభించాయి. సమాధిలోని పై రెండు పొరల్లో జంతువుల ఎముకలు బయటపడ్డాయి. క్రిస్టల్, ఎగేట్, ఛెర్ట్, స్టియటైట్, టెర్రకోటతో చేసిన పూసలు చాలా లభించాయి. తవ్విన మొదటి సమాధిలో 12కుండలు, గౌణసమాధికి చెందిన ఎముకలు, రెండు పుర్రెలు, నలుపు-ఎరుపు, ఎరుపు పాత్రలు, మట్టిగిన్నెలు, కుదుర్లు, నిలువ కాగులు వంటివి బయటపడ్డాయి. రెండవ సమాధిలో పక్కలలో నిలబెట్టిన రాతిసలపలు కొసలు సవ్యమైన స్వస్తికాకారంలో ఉన్నాయి. పొడువైన రాతిసలపలు ఉత్తర, దక్షిణాల వైపున్నాయి. ఇందులో 16కుండలు దొరికాయి. ఈ సమాధిలో బయటపడ్డ ఎముకలను గుర్తించలేదు. తుప్పుపట్టిన ఇనుపగొడ్డలి కళేబరం తలపైపు పెట్టివుంది.
దొరికిన ఆనవాళ్ళు, పురావస్తువులనుబట్టి ఈ సమాధులు నైవాసిక ప్రాంతాలకు సమీపంలో ఉండేవని, వీటి కాలం క్రీ.పూ. 1000-500సం.రాలని అంచనావేయబడ్డది. (ఆధారం: ప్రొ. కెపి రావుగారి గజగిరిగుట్ట పెదరాతియుగపు సమాధుల తవ్వకాల నివేదిక-2018)
కొసమెరుపు: చరిత్రకారులు, కొలనుపాక చరిత్ర రచయిత విరువంటి గోపాలకృష్ణ గారి పూర్వగ్రామం కొన్నె. వారి నాన్నగారు కొలనుపాక ‘‘సోమేశ్వర సుప్రభాతం’’ కవి విరువంటి నరసింహాచార్యులు కొన్నె రామాలయంలోని రాముని మీద కూడా శతకం రచించారు. ఈ పుస్తకం అముద్రితం. 95 పద్యాలే లభించాయి.
‘‘శ్రీమద్రఘుకుల జలనిధి
సోమ సుపర్వాణ వినుత శుభకర సుగుణ
స్తోమ మహీజావర సు
త్రామార్చిత కొన్నెనగరధామా, రామా’’
‘‘ఖరకర వంశార్ణవ హిమ
కర ఖర ఘనకదిన చాపఖండన సుగుణా
కర ఖర దానవ కానన
ఖరకరయుత కొన్నెపురి నికాయా రామా’’
ధన్యవాదాలు:
ప్రొ. కె.పి.రావుగారికి చరిత్రవిభాగం, కేంద్రీయ విశ్వవిద్యాలయం, హైద్రాబాద్, చరిత్రకారులు విరువంటి గోపాలకృష్ణ గారికి, కొన్నె చారిత్రకయాత్రలో బచ్చన్నపేట సబ్-ఇనస్పెక్టర్ శ్రీనివాసులు గారందించిన సహకారం మరువలేనిది.
కొత్తతెలంగాణ చరిత్రబృందం సభ్యులు శ్రీరామోజు హరగోపాల్, వేముగంటి మురళీకృష్ణ, చంటి, కొన్నె గ్రామసర్పంచ్ వేముల బాలనారాయణ గౌడ్, రామాంజనేయులు, ఇద్దరు శ్రీనివాసులు మరియు టి.మురళి (నమస్తే తెలంగాణ), ఎం.వీరగౌడ్ (ఆంధ్రజ్యోతి), జె.భిక్షపతి (సాక్షి), జి.తిర్మలరెడ్డి (ఆంధ్రభూమి) ఈ యాత్రలో పాల్గొన్నారు.
- శ్రీరామోజు హరగోపాల్,
ఎ : 99494 98698