సదర్ పండగ హైదరాబాద్ మహానగరంలో జరిగే ప్రధాన ఉత్సవాల్లో ఒకటి. నిజాం కాలం నుంచి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ వేడుకలు యాదవుల సాంస్కృతిక అస్థిత్వాన్ని ఆవిష్కరిస్తాయి. ఈ పండగను నగరంలోని యాదవ కులస్తులు మాత్రమే జరుపుకుంటారు. దీపావళి ఉత్సవాల్లో భాగంగా, దీపావళి ముగిసిన రెండో రోజున అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. దీనిని దున్నపోతుల ఉత్సవంగా కూడా వ్యవహరిస్తారు. ‘సదర్’ అంటే హైదరాబాదీ వ్యవహారికం ప్రకారం ‘ప్రధానమైనది’ అని అర్థం. యాదవ కులస్తులు ఒక ప్రత్యేకమైన ప్రధాన ఉత్సవంగా ఈ సదర్‍ను నిర్వహించుకుంటారు. అలంకరించిన దున్నపోతులతో యువకులు కుస్తీ పట్టడం ఈ ఉత్సవ ప్రత్యేక విశేషం.
హైదరాబాద్‍లో తప్ప సదర్ పండగ దేశంలో మరే ఇతర ప్రాంతాల్లో జరగదు. తమ జీవనాధారమైన మేకలు, గొర్రెలు, ఆవులు, గేదెలను కూడా వేడుకలు జరిగే ప్రాంతాలకు తీసుకు వస్తారు. నగరంలోని కాచిగూడ, నారాయణగూడ, ఖైరతాబాద్, సైదాబాద్, బోయిన్‍పల్లి, ఈస్ట్మారెడ్ పల్లి, చప్ప ల్‍బజార్, మధురాపూర్, కార్వాన్, పాతబస్తీ తదితర మరికొన్ని ప్రాంతాల్లో ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఇప్పటి వరకూ నారాయణగూడలో జరిగే ఉత్సవాలు నగర దృష్టిని ఆకర్శించే స్థాయిలో సాగుతున్నాయి. యాదవ కులస్తులు ఎక్కువగా ఉండే మున్సిపల్ డివిజన్లు, కాలనీలు, అపార్టుమెంట్ల ప్రాంగణాల్లో ఎక్కువ జరుగుతున్నాయి. 2009 నుండి ఈ ఉత్సవాలు కొత్త పుంతలను తొక్కాయి. ఇందుకోసం ఉత్తర భారతదేశంలోని పంజాబ్, హర్యానాల నుంచి భారీ శరీరం కలిగిన దున్నపోతులను నగరానికి తీసుకువస్తారు.
దున్నపోతుల అలంకరణ
సదర్ పండగను దృష్టిలో పెట్టుకొని దున్నపోతులను పెంచుతారు. అవి దృఢంగా ఉండడంకోసం కొన్ని నెలలపాటు వాటికి పోషక విలువలు కలిగిన తవుడు, దాన, గానుగ, పచ్చగడ్డి, కుడితి వంటివి పెడుతారు. పండగకు వారం ముందుగానే అలంకరణ ప్రారంభిస్తారు. దున్నపోతు శరీరంపై ఉన్న వెంట్రుకలను తొలగించి నల్లగా నిగనిగలాడేలా తయారు చేస్తారు. అందుకు వెన్న లేదా పెరుగు ఉపయోగిస్తారు. కొమ్ములను రంగురంగుల రిబ్బన్లతో చుడతారు. నెమలి ఈకలను అమర్చుతారు. అలంకరించిన తరువాత సుగంధ ద్రవ్యాలను చల్లుతారు.
దున్నపోతులతో యువత కుస్తీ
పండగకోసం అలంకరించిన దున్నపోతులతో యువకులు కుస్తీ పడతారు. ముక్కుతాడును చేతబట్టు కొని అదుపు చేస్తారు. ఈ క్రమంలో దున్నపోతు తన ముందరి కాళ్లను పెకెత్తి యువకుడిపైకి ఉరికి వస్తుంది. అయితే భారీ శరీరం కావడం వలన అది తప్పించుకుపోయే అవకాశం ఉండదు. కొన్నింటిని సుతారంగా గంగిరెద్దులా ఆడించే ప్రయత్నం చేస్తారు. ఎంపిక చేసిన ఆవరణలో గానీ, ఖాళీ ప్రదేశంలో గానీ, బస్తీల్లో గానీ ఈ వేడుకలను నిర్వహిస్తారు. యువకులు, మహిళలు, విద్యార్థులు అంతా ఈ ఉత్సవాలను చూసేందుకు అమిత ఆసక్తిని కనబరుస్తారు. యువకులు తీన్మార్ డాన్స్లతో హోరెత్తిస్తారు.
- దక్కన్‍న్యూస్,
ఎ : 9030 6262 88