సువ్యవస్థితమైన జలరవాణా సౌకర్యాలు ఉన్న దేశాలు ఆర్దికంగా కూడా బలంగా ఉంటాయి. ఇందుకు ఉదాహరణలు చైనాలో మూడునదుల్లో జలరవాణాతో పాటు ప్రపంచంలో అతిపెద్ద మానవనిర్మితమైన జలరవాణాకు అనుకూలమైన ఒక కాలువ ఉంది. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో మిసిసిపినది, ఇతర నదీ వ్యవస్థలలో అత్యధిక జలరవాణా జరుగుతుంది. ఐరోపా ఖండంలో అనేక దేశాలను కలుపుతూ రైన్ నది మరియు డాన్యూబ్ నదులలో జలరవాణా జరుగుతుంది. రష్యాలో బాల్టిక్ సముద్రం నుండి నల్లసముద్రం వరకు విస్తరించిన జలరవాణా జరుగుతుంది.
భారతదేశంలో జలరవాణా చరిత్ర: భారతదేశంలో వేదకాలం నుంచి నదీలోయ నాగరికతలు విలసిల్లినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఆ నదులలో పడవల ద్వారా జలరవాణా జరిగేది. కాలక్రమంలో జరిగిన వాతావరణ మార్పులు భౌగోళిక మార్పులవల్ల ఆయా నాగరికతలు అంతరించాయి. చరిత్ర కాలంలో గంగానది దాని ఉపనదులు జలరవాణాకు ఉపయోగపడినట్లు తెలుస్తోంది. పూర్వకాలంలో ఆగ్రా నుండి కలకత్తా/ముర్షీదాబాద్ వరకు పడవ ప్రయాణం జరిగినట్టు తెలుస్తోంది. బ్రిటిష్ వలస పాలనలో రైల్వేనిర్మాణం అభివ•ద్ధి జరిగిన తర్వాత జలరవాణా వ్యవస్థ కుంటుపడింది. సర్ ఆర్థర్ కాటన్ వంటి వారు కొంతవరకు దీనిని కాపాడే ప్రయత్నం చేశారు. నదుల అనుసంధానం అంకురార్పణ అప్పుడే జరిగింది.
స్వాతంత్య్రానంతరం నదుల అనుసంధానం మళ్లీ తెరపైకి వచ్చింది. డా. కేఎల్ రావు ప్రణాళిక, దస్తూర్ ప్రణాళిక వంటివి చర్చలోకి వచ్చాయి. కాని ప్రణాళికాబద్ధంగా చాలాకాలం వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు.
భారతదేశంలో ప్రపంచజనాభాలో 18 శాతంమంది ప్రజలు నివసిస్తున్నారు. కానీ ప్రపంచ జలవనరులో నాలుగు శాతం మాత్రమే ఇక్కడ ఉన్నాయి. దానికి తోడు ఇక్కడ కురిసేది 4000 బిలియన్ క్యూబిక్ మీటర్ల తక్కువ వర్షపాతం. అది కూడా జూన్ నెల నుంచి సెప్టెంబర్ వరకు మాత్రమే ఉంటుంది. వర్షపాతంలో కూడా అత్యధిక వ్యత్యాసం ఉంది. చిరపుంజిలో ప్రపంచ రికార్డు వర్షపాతం ఉంటే శివకాశిలాంటి ప్రదేశాల్లో నామమాత్రపు వర్షపాతం ఉంటుంది.
ఇక్కడ దాదాపు 400 పైగా నదులు ఉన్నాయి. వీటిలో 8 పెద్ద నదులు. ఇందులో హిమాలయ పర్వతాల నుండి ప్రవహించే నదుల్లో నీటిలభ్యత సంవత్సరం పొడవునా పుష్కళంగా ఉంటుంది, ద్వీపకల్పంలో పశ్చిమదిశగా ప్రవహించే నదులు, తూర్పుదిశగా ప్రవహించే నదులు ఉన్నాయి. వీటిలో నీటిలభ్యత అసమానంగా ఉంటుంది. వీటిని అన్నింటినీ ఒక క్రమపద్ధతి ప్రకారం అనుసంధానం చేస్తే దేశం యొక్క నీటి పారుదల అవసరాలు పూర్తిగా తీరటమే కాక, వరదల నియంత్రణ, జల రవాణా సౌకర్యాలు, పర్యావరణ పరిరక్షణ, పర్యటన మొదలైన రంగాల్లో సమగ్రంగా అభివృద్ధిని సాధించవచ్చు.
జాతీయ నదుల అనుసంధాన అధికారసంస్థ:
జాతీయస్థాయిలో నదుల అనుసంధానం బహుళ ప్రయోజనకారి అయినప్పటికీ ఎన్నో సవాళ్లతో కూడినది. రాజకీయ సుస్థిరత, ఆర్థిక వనరులు, నిర్దిష్ట ప్రణాళికలతో పాటు సాంకేతిక నైపుణ్యం ఇతర వనరుల అవసరం ఉంటుంది. ఈ దిశగా జాతీయనదీ అనుసంధాన అధికార సంస్థ,National Interlinking of Rivers Authority (NIRA) అనే స్వయంప్రతిపత్తి సంస్థ ఏర్పాటు చేయబడింది. నదుల అనుసంధానానికి ప్రణాళిక, ఆర్థిక మరియు అమలుకు ఈ సంస్థ బాధ్యత వహిస్తుంది. ఇది ఇంతకు ముందు ఉన్న జాతీయనీటి అభివృద్ధి సంస్థ National water development agency (NWDA) స్థానంలో ఉంటుంది.
దాదాపు 3000 స్టోరేజ్ డామ్‍ల ద్వారా భారతదేశంలోని 37 నదులు అనుసంధానం ద్వారా నీటిని ఎక్కువగా ఉన్న బేసిన్ల నుండి తక్కువలభ్యత గల బేసిన్లలోకి మళ్ళించే పనులు చేపడుతుంది. ఈ చర్యల వల్ల ఇతర లాభాలతో పాటు దేశంలో జలరవాణా వ్యవస్థ సుగమం అవుతుంది. ఈ దిశగా మధ్యప్రదేశ్‍లో కేన్-బేత్వా నదుల అనుసంధానం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి.
జలరవాణా ప్రయోజనాలు: ఇతర రవాణావ్యవస్థలతో పోల్చుకుంటే జలరవాణా ద్వారా తక్కువఖర్చుతో ఎక్కువ సరుకులు కాలుష్య రహితంగా సురక్షితంగా రవాణా చేయవచ్చు. అయితే ఈ రవాణా సౌకర్యం తీరప్రాంతంలో ఉన్నట్లు లోతట్టు ప్రాంతాలో ఉండదు. ప్రస్తుతం ఉన్న సాంకేతిక పరిజ్ఞానం, లోతట్టు (Inland)జల మార్గాల అభివృద్ధి తోపాటు, కృత్రిమ జలమార్గాల ఏర్పాటుకు వెసులుబాటు కల్పించింది. భారతదేశం వంటి భౌగోళిక వైవిధ్యం, వాతావరణ వ్యత్యాసం కొన్ని ప్రదేశాలలో అత్యంత అనుకూలంగా కొన్ని ప్రదేశాలలో అంతే ప్రతికూలంగా ఉంటుంది. ఎన్నో సవాళ్లతో కూడినది ఈ ‘‘లోతట్టు జలరవాణా’’ వ్యవస్థను ఒక ప్రణాళిక ప్రకారం నియంత్రణ, అభివృద్ధి చేయడం కోసం భారత ప్రభుత్వంThe Inland waterways Authority of India( IWAI) అనే ఒక స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థను ndian waterways Act 1985 ప్రకారం స్థాపించింది.
ఇంతకు ముందు ఉన్న అయిదు చట్టాలను సమన్వయపరుస్తూ జాతీయ జలమార్గాల చట్టం(National Water ways Act 2016) చేయటం జరిగింది. దీనిప్రకారం ప్రస్తుతం ఉన్న 5 జలమార్గాలతో పాటు మరో 106 లోతట్టు జలమార్గాలను జాతీయ జలమార్గాలు(Inlandwaterways)గా గుర్తించి అభివ•ద్ధి చేస్తున్నారు. ఇలా ఒక సమగ్ర జలరవాణా వ్యవస్థను ఏర్పాటుచేసి భారతదేశంలో ఉన్న లోతట్టు ప్రాంతాలను, తీరప్రాంతాలను దగ్గరలో ఉన్న ఓడరేవులకు జోడించి, రవాణా సౌకర్యాలు కల్పించి, వర్తకవాణిజ్య, పారిశ్రామిక మరియు పర్యాటకరంగాల్లో సమగ్రంగా అభివృద్ధిని సాధించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.భారతదేశంలో జలమార్గంగా అబివృద్ధి చేయటానికి 45 మీటర్ల వెడల్పు 1.5 మీటర్ల లోతు, 50 కిలోమీటర్ల దూరం ఉన్న మార్గాలను ఎంచుకుంటున్నారు. IWAI ఇప్పటికే 111 జలమార్గాలను గుర్తించింది వీటి మొత్తం పొడవు 20,000 కిలోమీటర్లు.
జాతీయనీటి మార్గాలు 3 కేటగిరీలు:
ఒకటోతరగతి: 2000 టన్నులను తీసుకువెళ్లవచ్చు,
ఉదాహరణలు గంగా భాగీరధి హుగ్లీ బ్రహ్మపుత్ర.
రెండోతరగతి: 1000టన్నుల ఉదాహరణలు బ్రహ్మపుత్ర .
మూడోతరగతి: 500 టన్నుల బరువును మోయగలదు
ఉదాహరణలు: చిన్న నదులు మరియు కాలువలు.
నీటిమార్గాలను అభివృద్ధి చేయడానికి అనేక ప్రాజెక్టులు చేపట్టారు.
గంగా భగీరథ్-హుగ్లీ నీటిమార్గాన్ని అప్‍గ్రేడ్ చేయడానికి ఉద్దేశించిన వాటిలో జలమార్గ్ వికాస్ ప్రాజెక్ట్ ఒకటి. ఇది జాతీయ నీటిమార్గం NW1 పై ప్రారంభం అయింది. ఈమార్గం, అలహాబాద్/వారణాసి నుండి ప్రారంభమై ఫరక్కా/హాల్దియా వరకు 1620 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. మిజోరం, యమునానది ద్వారా డెల్హీ ఆగ్రా తదితర ప్రాంతాలను జలమార్గంకు జోడించడంతో ప్రధాన అంతర్జాతీయ జలమార్గంగా రూపుదిద్దుకుంటుంది.
‘‘MV గంగా విలాస్’’ అనే విలాసవంతమైన పర్యాటక నౌక వారణాసి నుండి జనవరి 13న బయలుదేరి, 27 నదులపై, 3200 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఫిబ్రవరి 28,2023 నాడు దిబ్రూగడ్ చేరుకుంది. ప్రస్తుతం ఈమార్గం పర్యటనలకు ఉపయోగిస్తున్నారు.
కేరళలో జలరవాణా వ్యవస్థ:
జలరవాణా వ్యవస్థకు కేరళ అత్యంత అనుకూలం. కేరళ 44 నదులతో అనేక బ్యాక్ వాటర్స్, మడుగులు, కాలువలు మరియు అనేక చిత్తడినేలలు ఇంకా marshలతో కూడిన ఒక తీరరాష్ట్రం. ఇక్కడ తీరమైదానాలు అరేబియా సముద్రం వైపుకొద్దిగా వాలుగా ఉంటాయి, ఇందువల్ల వంపులు తిరిగిన నదులు మరియు నీటి వనరులు ఏర్పడి నాయి. ఇక్కడ సముద్రతీరం భౌగోళికంగా చురుగ్గా ఉంది. ఇక్కడ వర్షపాతం కూడా ఎక్కువే. ఇక్కడి జలమార్గాలు కొట్టపురం నుండి కొల్లం, చంపకార – ఉద్యోగ మండల కాలువలతో పాటుగా 205 కిలోమీటర్లమేర NW3గా గుర్తించి, అభివృద్ధి చేస్తున్నారు. కొచ్చి ఇడపల్లికోట్ మార్గంలో 120 కిలోమీటర్ల మార్గం కూడా IWA కృషి ఫలితంగా అందుబాటులోకి వచ్చింది.
తెలుగురాష్ట్రాల జలమార్గాలు:
తెలుగు రాష్ట్రాలలో ఉన్న జలమార్గాలను NW4 గాగుర్తించి అభివ•ద్ధి చేస్తున్నారు. ఈ జలమార్గం పొడవు 1095 కిలోమీటర్లు. కృష్ణ, గోదావరి నదులతోపాటు బకింగ్ హామ్ కాలువను అనుసంధానం చేస్తూ, భద్రాచలం నుండి ప్రారంభమై కాకినాడ దాకా గోదావరినది పైన, అక్కడ నుంచి బకింగ్ హామ్ కాలువ ద్వారా చెన్నైకి తిరిగి అక్కడ నుంచి పుదుచ్చేరి వరకు దక్షిణ బకింగ్ హామ్ కాలువ ద్వారా కలపటానికి, గోదావరి నది నుండి రాజమండ్రి – విజయవాడలను ఏలూరుకాలువ ద్వారా కలపటానికి ఉద్దేశించినది.
ఈ మార్గంలో కృష్ణానది ద్వారా విజయవాడ, వజీరాబాద్ (వాడపల్లి) వరకు అభివృద్ధి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీన్ని నాగార్జునసాగర్ వరకు, ఇంకా ముందుకు కర్నాటకలోకి కూడా పొడిగించే అవకాశం ఉంది. ఈ నదీమార్గం కాకినాడ మచిలీపట్నం, చెన్నై ఓడరేవులను కాలువలు నదులద్వారా కలుపుతుంది. ఇది మరినా బీచ్, అడయార్, ముత్తుకాడు, కల్పాకం, పాలార్, పరమనకాని కుప్పం మరియు మర్కాణంల వద్ద సముద్రంలోకి తెరుచుకుంటుంది. దీని మార్గంలో వివిధస్తలాలొ 48 లాకులు ఉంటాయి. దీని మార్గంలో 15 టెర్మినల్‍లు ఉంటాయి. ఈ మార్గం పూర్తిగా అందుబాటులోకి వచ్చాక బొగ్గు, సిమెంట్, బియ్యం ఇతర ఆహార ధాన్యాలు, ఇసుక ఇంకా అటవీ ఉత్పత్తుల మొదలైన వాటి రవాణాకు ఈ మార్గం ఉపయోగ పడుతుంది. ఈ ప్రాజెక్టు ఏడుసంవత్సరాలో 1500 కోట్ల రూపాయల బడ్జెట్‍తో పూర్తి చేయవలసి ఉంటుంది. కానీ ఆలస్యం జరిగే అవకాశం ఉంది. బడ్జెట్ అంచనా కూడా మించి పోవచ్చు.
బకింగ్ హామ్ కాలువ:
చరిత్ర ప్రసిద్ధిచెందిన బకింగ్ హామ్ కాలువ కాకినాడ నుండి పుదుచ్చేరి వరకు కోరమాండల్ తీరంవెంబడి నిర్మితమైన 717 కిలోమీటర్ల పొడవైన ఈ జలమార్గం ఆంగ్లేయుల కాలంలో ఒక ప్రధాన జలమార్గంగా చరిత్రలో నిలిచిపోయింది. 1806లో ప్రారంభించిన ఈ కాలువ పేరు కోక్రేన్ కాలువ, 1880 నుండి 1940 దాకా ఎంతగానో రవాణా అవసరాలకు పనికి వచ్చింది. 1965 తుఫాన్ వల్ల పూర్తిగా దెబ్బతింది. 2004లో వచ్చిన సునామీ నుండి చాలా గ్రామాలను రక్షించింది. ఈ కాలువ తీరం వెంబడి 0.65 కిలోమీటర్ దూరంలో నిర్మించబడింది. సహజ భౌగోళిక స్వరూపాలను సమన్వయం చేస్తూ వాటి మధ్య నిర్మించబడ్డ ఒక అద్భుత నిర్మాణం ఈ కాలువ.
హైదరాబాద్‍ను జలమార్గం ద్వారా చీఔ4కు జోడించటం సాధ్యమేనా?
హైదరాబాద్ సముద్ర మట్టానికి సుమారు 440 మీటర్లఎత్తులో ఉన్న మూసీనదిఒడ్డున ఉంది. నాల్గవ జాతీయ జలమార్గం మూసీ కృష్ణాసంగమం ఉన్న వజీరాబాద్ (వాడపల్లి) వరకు ప్లాన్ చేయబడింది. ముందుముందు నాగార్జునసాగర్ వరకు విస్తరించే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో సాంకేతిక, ఆర్ధిక, భౌగోళిక అంశాలు మూసీనది ద్వారా ‘‘హైదరాబాద్ – వజీరాబాద్’’ లను జలమార్గం ద్వారా జోడించడానికి అనుకూలంకాదు. కాని భవిష్యత్తులో జరగబోయే నదుల అను సంధానం, హైదరాబాద్ తాగునీరు పారిశ్రామిక అవసరాలకోసం మరింత ఎక్కువగా మళ్ళించ బడే జలాలవల్ల మూసీనదిలో నీటిలభ్యత గణనీయంగా పెరుగుతుంది. ఇవి ద్రష్టిలో ఉంచుకుని ఆలోచిస్తే జలమార్గం అసాధ్యంకాదు. రానురాను టెక్నాలజీ విప్లవాత్మకంగా మార్పులకు లోనవుతుంది. కొత్తపదార్దాల ఆవిష్కరణ, నిర్మాణరంగంలో మార్పులు, నిర్మాణవ్యయం తగ్గటం, చవకైన ఇంధనాల సులభ లభ్యత, కృత్రిమ మేధస్సులో వృద్ధి మొదలైన వాటిని దృష్టిలో పెట్టుకొని చూస్తే ముందుముందు ఇది సాధ్యం అనిపిస్తుంది.
ఇప్పటికే అహ్మదాబాద్ -ముంబై – పూణే మధ్య జాతీయ జలమార్గం 11 అభివృద్ధి చేస్తున్నారు. హైదరాబాద్‍కు ఉన్న ఆర్ధిక ప్రాముఖ్యత ప్రభుత్వాలను ఈ దిశగా ఆలోచించడానికి ప్రేరేపించవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మూసీ – కృష్ణా జలమార్గం వజీరాబాద్ ద్వారా సాధ్యం కావచ్చు. వజీరాబాద్‍కు స్థానికంగా వాడపల్లి అనే పేరు కూడా ఉంది. నౌకా యానానికి ఇక్కడ నది అనుకూలంగా ఉన్నందున ఓడపల్లి అనే పేరు వచ్చింది క్రమంగా అది వాడపల్లిగా స్థిరపడింది. ఇటీవలే చరిత్రకారులు డాక్టర్ M.A. వాసు ఇక్కడికి దగ్గరలో ఉన్న ముదిమాణిక్యంలో ఉన్న దేవాలయంలో ఒక నౌకాయానానికి పనికివచ్చిన 390 ఏళ్లనాటి దీపస్తంభం గుర్తించారు. ఇంకొక ప్రత్యామ్నాయ మార్గం హిమాయత్‍సాగర్ ఎగువన ఉన్న ఫిరంగికాలువ ద్వారా కూడా ఆస్కారంఉంది.
ఫిరంగి కాలువ: హిమాయత్ సాగర్ ఎగువన చందనవల్లి వద్ద 1872లో నిజాం ప్రభుత్వం, ఈసానది పైన ఈ కాలువ నిర్మించారు. 85 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇబ్రహీంపట్నంచెరువులోకి అనేక గొలుసుకట్టు చెరువుల ద్వారా నీటిని మళ్ళించడానికి ఏర్పాటుచేసిన కాంటూర్ కాలువ. దీనివల్ల దక్షిణ హైదరాబాద్‍కు వరద నివారణ జరగడమే కాక వర్షపాతం తక్కువ ఉన్న ఇబ్రహీంపట్నం ప్రాంతంలో దాదాపు 50 గ్రామాలకు సాగు, త్రాగునీరు అందేది. స్వాతంత్య్రానంతరం పాలకుల నిర్లక్ష్యం వల్ల నిరాదరణకు, ఆక్రమణలకు గురికావడంతో, ఇప్పుడు ఈకాలువ నామమాత్రంగా మిగిలింది.
ఇది శంషాబాద్ ఎయిర్ పోర్టులో పక్కనే ఉన్న ఉమ్దాసాగర్ చెరువు గుండా వెళుతుంది. ఈ ఫిరంగి కాలువను పునరుద్ధరించి జలమార్గంగా అభివృద్ధి చేస్తే హైదరాబాద్ విమానాశ్రయానికి అతిదగ్గరగా ఒక జలమార్గం అందుబాటులోకి వస్తుంది. దీన్ని ఇబ్రహీంపట్నం చెరువు నుంచి కృష్ణానదికి, నాగార్జునసాగర్ వెనుక ఉన్న పెండ్లిపాకుల / పెద్దవాగు రిజర్వాయర్లకు మధ్యలో ఉన్న ఇతర రిజర్వాయర్ల ద్వారాకానీ నేరుగా ఒక కాలువ ద్వారా కానీ జోడించే అవకాశాలు పరిశీలించాలి.
ఈవిధంగా హైదరాబాద్‍ను జలమార్గం ద్వారా NH4కు కలిపే అవకాశం ఉంది. NW4ను నాగార్జునసాగర్, శ్రీశైలంల ద్వారా బాగల్కోట్ వరకు విస్తరించే అవకాశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. అటు గోదావరినది పైన జలమార్గం భద్రాచలం నుండి నాసిక్ వరకు విస్తరించే అవకాశం ఉంది.
బెజవాడ భవిష్యత్తుకి, అమరావతితో అనుసంధానికి ఒక కాలుష్యరహిత అర్బన్ ట్రాన్స్ఫోర్ట్ అవసరం. దుర్గగుడి పాదాలవద్ద లాకులు అమర్చి, మూడు పెద్ద కాలువల్లోని (బందరు, ఏలూరు, రైవస్ కాల్వలు) ఇప్పటి లాకులను దిగువకి మార్చ గలిగితే… బస్టాండ్, కాళేశ్వరరావు మార్కెట్ల నుంచి పెనమలూరు, ఉయ్యూరు, నిడమానూరు, గన్నవరం లింక్ ద్వారా ఎయిర్‍పోర్టు వరకు ముఖ్య రహదారులకు ప్రత్యామ్నాయ జలమార్గం కల్పించే అవకాశం ఉంది. భవిష్యత్తులో అమరావతి ఇబ్రహీంపట్నం ప్రాంతాలను కూడా దీనికి కలపవచ్చని సాయి పాపినేని గారి అభిప్రాయం. ఇది జాతీయ జలమార్గం-4లో భాగంగా చేపట్టే అవకాశం ఉంటుంది.
ఈ NW4, జల మార్గం పూర్తిగా అందుబాటులోకి వచ్చాక నాసిక్ కాకినాడ రాజమండ్రి మచిలీపట్నం చెన్నై పుదుచ్చేరికి ఇటు కృష్ణానది ద్వారా విజయవాడ వజీరాబాద్ (వాడపల్లి) నాగార్జునసాగర్ శ్రీశైలం నుంచి బాగల్కోట్ వరకు దాదాపు 3000 కిలోమీటర్ల మేర విస్తరించిన ఒక పెద్ద జలమార్గం అందుబాటులోకి వస్తుంది. దీనికి మూసీనది ద్వారా హైదరాబాద్ కూడా అనుసంధానం జరుగుతే NW4 గ్రిడ్‍లో హైదరాబాద్‍తో పాటు ఇతర శివారు పట్టణాలు కూడా చేరిపోయి వేగంగా అభివృద్ధి చెందటానికి పూర్తిగా అవకాశాలు ఉన్నాయి.
ఫాల్కిర్క్ వీల్: జలరవాణా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. దీనికి ఉదాహరణ ఫాల్కిర్క్ వీల్. ప్రసిద్ధి చెందిన ఈ యంత్రం స్కాట్లాండ్‍లో ఉంది. ఒక జలమార్గంలో ఉన్న అక్విడక్ట్కు కనెక్ట్ చేయడానికి పడవను 24 మీటర్ల ఎత్తుకు ఎత్తగలగటం దీని ప్రత్యేకత. ఇలాంటి వ్యవస్థ ప్రపంచంలో మరెక్కడ లేదు. క్రింద ఉన్న యూనియన్ కెనాల్‍ను దానికన్నా 35 మీటర్ల ఎత్తులోఉన్న ఫోర్త్ & క్లైడ్ కెనాల్‍తో ఈ చక్రం కలుపుతుంది. స్కాట్లాండ్‍లోని ఫాల్కిర్క్ అనే పట్టణానికి సమీపంలో 1.5 కి.మీ నిడివిలో 11వరుస లాకుల ద్వారా ఈ రెండు కాలువలు పూర్వ కాలంలో కలపబడి ఉండేవి. కాలక్రమంలో అవి నిరుపయోగంగా మారాయి. ఈమార్గం ఫాల్కిర్క్ వీల్ ప్రాజెక్టు ద్వారా 2002లో పునరుద్ధరణ జరిగింది. దీనికి 84.5 మిలియన్లు ఖర్చయింది. ఈ వ్యవస్థ ద్వారా ఒక కాలువ నుండి ఇంకో వైపు కాలువలోకి, మొత్తం 35 మీటర్ల ఎత్తుకు పడవ చేరుకుంటుంది. అందులో 11 మీటర్ల ఎత్తు లాకుల ద్వారా, మిగిలిన 24 మీటర్లు ఒక జెయింట్ వీల్ వల్లసాధ్యం అయింది. ఇది ప్రపంచంలోనే ఒక ఇంజనీరింగ్ అద్భుతంగా చెప్పుకోవచ్చు. ఇలాంటి ఎన్నో ప్రాజెక్టులు మనదేశంలో చేపట్టాటానికి ఆస్కారం ఉంది.
-చకిలం వేణుగోపాలరావు
డిప్యూటి డైరెక్టర్ జనరల్ జిఎస్సై(రి)
ఎ: 9866449348
శ్రీరామోజు హరగోపాల్,
ఎ : 99494 98698