దక్కన్‌ల్యాండ్ మాసపత్రికలో ప్రతినెలా సైన్స్ అండ్ టెక్నాలజీపై చక్కటి వ్యాసాలు రాస్తున్న యువ రచయిత పుట్టా ఓబులేసు కృషికి తగిన గుర్తింపు లభించింది. సైన్స్ & టెక్నాలజీ సబ్జెక్ట్‌లో ఎంతో విలువైన, నాణ్యత కలిగిన వ్యాసాలు రాస్తూ యువతను, సమాజాన్ని చైతన్యపరుస్తున్నందుకు గానూ
ఓబులేసును ఉత్తమ రచయితగా గుర్తిస్తూ, ఆయన సేవలను ప్రశంసిస్తూ, గణతంత్ర దినోత్సవం సందర్భంగా కడప పెరేడ్ గ్రౌండ్స్‌లో జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ప్రశంసా పత్రంతో పుట్టా ఓబులేసును సత్కరించారు.
పుట్టా ఓబులేసు కడప జిల్లా జమ్మలమడుగు చెందినవారు. అదే జిల్లా, సింహాద్రిపురం మండలం, రావులకొలను గ్రామ ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఉపాధ్యాయుడిగా విద్యార్థులకు బోధిస్తూనే, విభిన్న సామాజిక అంశాలను స్పృశిస్తూ ఎన్నో వ్యాసాలను రాశారు. గత 15 సం।।రాలుగా రచనా రంగంలో కొనసాగుతున్న ఆయన, ప్రస్తుతం ప్రత్యేకంగా సైన్స్ అండ్ టెక్నాలజీ అంశంపైనే దక్కన్ ల్యాండ్ మాస పత్రికలో వ్యాసాలు రాస్తున్నారు. ఆ వ్యాసాలు చక్కటి విషయ పరిజ్ఞానంతో గ్రూప్స్, సివిల్స్ అభ్యర్థులకు బహుళ ప్రయోజనకరంగా ఉంటున్నాయి. అక్టోబర్‌లో జరిగిన తెలంగాణ గ్రూప్-1 పరీక్షలో సైన్స్ & టెక్నాలజీ విభాగంలో 100 మార్కులకు పైగా ప్రశ్నలు పుట్టా ఓబులేసు వ్యాసాలనుండే వచ్చాయని పలువురు అభ్యుర్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈ అంశంపై దక్కన్‌ల్యాండ్ మాసపత్రిక గత డిసెంబర్ 2024 సంచికలో ప్రత్యేక కథనాన్ని ప్రచురించడం పాఠకులకు విదితమే.
విద్యార్థులకు నాణ్యమైన బోధన అందిస్తూనే, వారు భావి రచయితలుగా ఎదిగేందుకు ఓబులేసు తోడ్పాటునందిస్తున్నారు. పదవ తరగతి ఫలితాలలో వారి విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. పలు పుస్తకాలను ప్రచురించారు. తన ప్రతిభకు గుర్తింపుగా గతంలో ఆయన విభిన్న సంస్థల నుండి పలు అవార్డులు పొందారు.
ఉత్తమ రచయితగా గుర్తించి కడప జిల్లా కలెక్టర్ తనకు అవార్డు ఇవ్వడం తనలో నూతనోత్తేజాన్ని కలిగించిందని, తాను రెట్టించిన ఉత్సాహంతో మరిన్ని విలువైన వ్యాసాలు రాసేందుకు ఈ అవార్డు తోడ్పడుతుందని, అదేవిధంగా దక్కన్‌ల్యాండ్ మాసపత్రిక ఎడిటర్ మణికొండ వేదకుమార్ మట్టిలో మాణిక్యం లాంటి తనను గుర్తించి ఎంతగానో ప్రోత్సహించారని, ఫలితంగానే తనకు ఈ అవార్డు వచ్చిందని, ఈ సందర్భంగా వేదకుమార్ సర్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాని రచయిత ఓబులేసు అన్నారు.
కలెక్టర్ చేత అవార్డు తీసుకున్న సందర్భంగా పుట్టా ఓబులేసును కడప జిల్లా విద్యాశాఖాధికారి డా।। షంషుర్దీన్ ప్రత్యేకంగా అభినందిచారు. రావులకొలను ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం, పలువురు ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు యువరచయిత పుట్టా ఓబులేసును అభినందించారు.
- కె. సచిన్, ఎ : 97010 01036