1946 ఫిబ్రవరి 13న ఐక్యరాజ్యసమితి రేడియో ప్రారంభించబడింది. కాబట్టి ఆ సందర్భంగా ప్రతిఏటా ఫిబ్రవరి 13న ఈ దినోత్సవం జరుపుకునేలా జనరల్ కాన్ఫరెన్స్ 36వ సెషన్లో ప్రపంచ రేడియో దినోత్సవాన్ని ప్రకటించాలని బోర్డు యునెస్కోకు సిఫారసు చేసింది. ఐక్యరాజ్యసమితి సభ్యదేశాలు, ఐక్యరాజ్యసమితి సంస్థలు, అంతర్జాతీయ ప్రాంతీయ సంస్థలు, వృత్తి సంఘాలు, ప్రసార సంఘాలు, ప్రభుత్వేతర సంస్థలు మొదలైనవన్ని ప్రపంచ రేడియో దినోత్సవాన్ని జరుపుకోవాలని బోర్డు ఆహ్వానించింది. ప్రపంచ రేడియో దినోత్సవాన్ని జనరల్ అసెంబ్లీలో ఆమోదించడానికి, ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవం జరుపుకునే విధంగా యునెస్కో డైరెక్టర్ జనరల్ ఈ తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ దృష్టికి తీసుకురావాలని బోర్డు అభ్యర్థించింది. ఈ అభ్యర్థనను యునెస్కో జనరల్ కాన్ఫరెన్స్ పరిగణించి, 36 సి/63 ఫైల్లో ఉన్న తీర్మానాన్ని ఆమోదించింది. ప్రపంచ రేడియో దినోత్సవాన్ని 2011 నవంబరులో యునెస్కోలోని అన్ని సభ్య దేశాలు ఏకగ్రీవంగా ప్రకటించాయి.
ఒకప్పుడు రేడియో సగటు మనిషి జీవితంలో అంతర్భాగం.. కలత చెందిన మనసుకు అదే ఓదార్పు. సంతోష సమయంలో అదే తోడు! సమాచారానికి అదే చేదోడు! కబుర్లు చెప్పే నెచ్చెలి అదే! ఇప్పటి తరానికి రేడియోతో అంత గొప్ప అనుభవాలు ఉండకపోవచ్చు కానీ, అప్పుట్లో రేడియోనే సమస్తం! పొద్దున్నే సిగ్నేచర్ ట్యూన్ సుప్రభాతం అయ్యేది.. మధ్యాహ్నం కార్మికుల కార్యక్రమంతో పొద్దుపుచ్చేది! సాయంత్రం జనరంజకంగా పలకరించేది.. రాత్రి మనసును ఆహ్లాదపరచి నిద్రపుచ్చేది.. రేడియోతో ఉన్న సౌలభ్యమేమిటంటే అది మన రోజువారి పనులను చెడగొట్టేది కాదు.. పాటలో, కబుర్లో వింటూనే పనులు చేసుకునేవారు! అందుకే రేడియో అంత పాపులరయ్యింది. ఇవాళ్టికీ రేడియోనే వినోదసాధనం! ప్రపంచ జనాభాలో 70 శాతానికి పైగా ప్రజలు రేడియోను వినియోగిస్తున్నారంటే నమ్మి తీరాలి. అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించి 75 శాతం మందికి పైగా గృహిణులు వివిధ అంశాల సమాచారం కోసం రేడియోపై ఆధార పడుతున్నారన్నది పచ్చి నిజం! రేడియో ఎవర్గ్రీన్! ఈనాటికి ప్రధాని మోదీ మన్ కీ బాత్ పేరిట దేశ ప్రజలతో తన మనసులో మాటలను, అభిప్రాయాలను షేర్ చేసుకుంటున్నారంటేనే రేడియో ఎంత గొప్ప మాధ్యమమో తెలిసిపోతున్నది.
దేశాభివృద్ధిలో ప్రభుత్వాధీంలో ఉన్న రేడియో, అన్ని రంగాలలోను సమాచారాన్ని ఇస్తూ దేశ సమగ్రతకూ, అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతోంది.
వ్యవసాయ అభివృద్ధిలో
1966 ప్రాంతాలలో వ్యవసాయ విషయాలను రైతులకు చెప్పటానికి పంటసీమలు కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. ఈ కార్యక్రమం రూపొందించంటంలో ఆ తరువాత నిర్వహించటంలో ఆకాశవాణి విజయవాడ కేద్రం కృషి ఎంతగానో ఉంది. పంటలగురించి, కొత్తరకాల వంగడాలు, సస్యరక్షణ, వ్యవసాయ పద్ధతుల గురించి రైతులకు చక్కగా వివరించే కార్యక్రమాలు ప్రసారం చేసి, ఆయా కార్యక్రమాల ద్వారా వ్యవసాయదారులకు ఎంతగానో ఉపయోగపడే సమాచారాన్ని అందించేవారు. రైతులకు వారి భాషలో, అయా ప్రాంతాల యాసలలో, ఒక్కొక్క సారి అనుభవజ్ఞులైన రైతులతో సంభాషణలు పొందుపరచి కార్యక్రమాన్ని రక్తి కట్టించేవారు. ప్రభుత్వ వ్యవసాయ విభాగాలు, రైతులకు తెలియ చెప్పవలసిన విషయాలను ఈ కార్యక్రమం ద్వారా అందచేసేవారు. పంటల గురించే కాక, పశు సంరక్షణ, పాడి పశువులను సాకటం గురించి కూడా చక్కగా విశదపరచేవారు.
సంఘం రేడియో
దళిత మహిళలు ప్రారంభించిన సంఘం రేడియో ఆసియాలోనే తొలి మహిళా రేడియో, భారత్‌లోనే తొలి గ్రామీణ సామాజిక (కమ్యూనిటీ) రేడియో (community radio). జహీరాబాద్‌కు ఐదారు మైళ్ల దూరంలోని మాచునూరు గ్రామంలో ప్రాణం పోసుకుంది. ఇది జనం కోసం, జనమే నడిపే, జనం రేడియో.

ఈ ‘రేడియో’ కార్యక్రమాలు ప్రతిరోజూ రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిదిన్నర దాకా, గంటన్నర సేపు ప్రసారమవుతాయి. జహీరాబాద్ చుట్టుపక్కల పాతిక కిలోమీటర్ల పరిధిలోని నూట యాభై పల్లెల్లో వినొచ్చు. పస్తాపూర్ కేంద్రంగా పనిచేస్తున్న దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ (డీ.డీ.ఎస్.) అనే స్వచ్ఛంద సంస్థ వాళ్ల తరఫున ముందుండి పోరాడింది.
సంఘం మనుషులు ఏ చెట్టు కిందో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న పెద్దల ముందు మైకుపెడతారు. వాళ్ల అనుభవ సారమంతా టేపుల్లో నిక్షిప్తం అవుతుంది. వారి జీవితానుభవాలను పిల్లలు తెలుసుకొనడానికి ఇదొక మంచి అవకాశం. కొంత మంది కథలు చెప్పవచ్చును, సంగీత కచేరీ కూడా చేయవచ్చును.
దక్కన్ రేడియో (నిజాం రేడియో 1932)
దక్కన్ రేడియో అనేది హైదరాబాద్ స్టేట్ యొక్క మొదటి రేడియో స్టేషన్. ఇది 1935 ఫిబ్రవరి 3న ప్రత్యక్ష ప్రసారం చేయబడింది. ప్రారంభంలో ఇది 200 వాట్ల ప్రసార శక్తితో ప్రైవేట్ ప్రసార స్టేషన్‌గా ప్రారంభించబడింది. కార్యక్రమాలు ఉర్దూలో ప్రసారం చేయబడ్డాయి. ఇది హైదరాబాద్ నగరంలోని అబిడ్స్, చిరాగ్ అలీ లేన్ వద్ద ఉంది.
మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, అసఫ్ జా VII దక్కన్ రేడియోను స్వాధీనం చేసుకుని 1935 ఫిబ్రవరి 3న జాతీయం చేశారు. ఖైరతాబాద్‌లో కొత్త రేడియో స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. ఇంగ్లండ్‌లోని మార్కోని కంపెనీ నుండి కొనుగోలు చేసిన 730 KHZతో 500 వాట్ల కొత్త ట్రాన్స్మిటర్ని ఏర్పాటు చేశారు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో తాజా వార్తా కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి సరూర్‌నగర్‌లో ప్రత్యేక ప్రసార స్టూడియోను ఏర్పాటు చేశారు. అదే సంవత్సరం ఔరంగాబాద్ (అప్పటి నిజాంల డొమైన్)లో కొత్త రేడియో స్టేషన్ ప్రారంభించబడింది. ఇక్కడ మునుపటి 200 వాట్ల ట్రాన్స్మిటర్ హైదరాబాద్ నుండి మార్చబడింది. జనాభాలో ఎక్కువ మంది మరాఠీ మాట్లాడతారు. కాబట్టి ఉర్దూ, మరాఠీలలో కార్యక్రమాలను ప్రసారం చేయడానికి ఇది జిల్లా స్థాయి రేడియో స్టేషన్. 1948 డిసెంబరు 1న, మీడియం వేవ్ స్టేషన్‌తో అప్‌గ్రేడ్ చేయబడిన 800-వాట్ షార్ట్వేవ్ ట్రాన్స్మిటర్ వ్యవస్థాపించబడింది. 3335, 6210KHZలలో నిర్వహించబడింది. నిజాంలు ఈ కొత్త యూనిట్‌ను ప్రారంభించారు. ఈ స్టేషన్ వరల్డ్ రేడియో హ్యాండ్‌బుక్ యొక్క వరుస సంచికలలో జాబితా చేయబడింది. బ్రిటీష్ కంటోన్మెంట్ ఆఫ్ సికింద్రాబాద్ 1919 ప్రారంభంలో హైదరాబాద్ స్టేట్‌లో ప్రారంభ కమ్యూనికేషన్ స్టేషన్‌ను ఏర్పాటు చేసింది. 1924లో అదే ప్రాంతం నుండి స్పార్క్ స్టేషన్ నిర్వహించబడింది. ఆ సంవత్సరం ఆస్ట్రేలియన్ రేడియో మ్యాగజైన్ దీనికి VWT స్టేషన్‌గా పేరు పెట్టింది.
ఇది హైదరాబాద్ నిజాంల అధికారిక ప్రసారకర్తగా పనిచేస్తుంది. 1950 ఏప్రిల్ 1న దక్కన్ రేడియోను భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. 1956లో ఇది ఆల్ ఇండియా రేడియో (AIR)లో విలీనం చేయబడింది. అప్పటి నుండి దీనిని AIR-హైదరాబాద్ అని పిలుస్తున్నారు.
- ఎసికె. శ్రీహరి
ఎ : 9849930145