విజయవాడలో మొగల్‍రాజపురం ఉన్నట్లే హైదరాబాద్ పాతనగరంలో ఒక మొగల్‍పురా అంటే మొగలులు నివసించిన పురం ఉంది. 1687లో ఔరంగజేబ్ గోల్కొండపై దాడి చేసినప్పుడు సైన్యాన్ని ఫతేమైదాన్‍లో (నేటి ఎల్బీ స్టేడియం) నిలిపి అధికారుల బృందాన్ని ఈ మొగల్‍పురాలో స్థిరనివాసాలతో, కార్యాలయాలతో ఏర్పాటు చేశాడు. అట్లా ఆ ప్రాంతానికి మొగల్‍పురా అని పేరొచ్చింది. ఈ బస్తీ చార్మినార్ నుంచి షాలిబండకు వెళ్లే దారిలో ఎడమవైపు
ఉంటుంది. ఒక కమాన్ నుంచి లోపలికి వెళ్లాలి. ఆ కమాన్ పేరు మొగల్‍పురా కమాన్.
యాభై సంవత్సరాల క్రితం ఈ బస్తీ మిగతా బస్తీలకన్నా విలక్షణంగా ఒక ప్రత్యేకమైన అందంతో కనబడేది. విశాలమైన రోడ్లు, మొగల్ వాస్తు శిల్పంతో ఒకేవిధంగా అన్ని గృహాలు, చౌరస్తాలలో సూఫీ ఫకీర్ల మగ్బరాలు (సమాధులు) వాటిపైన గోల్ గుంబజ్‍లు (గోపురాలు), ప్రతి ఇంటి ముందు విధిగా ఉండే బోగన్ విల్లా పూలచెట్లు ఉండేవి. గోల్కొండ రాజ్యం పతనం అయినాక ఔరంగజేబు తన రాజప్రతినిధిగా ముబారిజ్‍ఖాన్‍ను నియమించగా అతను ఈ మొగల్‍పురా నుండే కొంతకాలం తన పరిపాలన సాగించాడు. అతను ఆసఫ్‍జాహీ (నిజాం) పరిపాలనకు మూల పురుషుడు. ఈ మొహల్లా (వాడ) మధ్యలో రెండు పెద్ద సమాధులు వున్నాయి. వాటి వాస్తుశిల్ప అలంకరణలు అద్భుతంగా ఉంటాయి. వాటి లోపల తళతళా మెరిసే నల్లగ్రానైట్ రాళ్ల సమాధులు. మహమ్మద్ ఖులీకుతుబ్‍షాకు అబ్దుల్లా అనే కొడుకు జన్మించినప్పుడు 12 ఏళ్ల వరకూ తండ్రి ఆ కొడుకు ముఖం చూడరాదని ఫకీర్లు జోస్యం చెప్పారు. అప్పుడు అబ్దుల్లాను ఈ మొగల్ పురాలోనే ఉంచి ఇద్దరు గురువుల ఆధ్వర్యంలో విద్యాబుద్ధులు నేర్పారు. కుత్బుద్దీన్ రైమీతుల్లా, మీర్జా షరీఫ్‍లు ఆ గురువులు. వారి సమాధులే ఇవి.
ఈ మొగల్‍పురాలోనే మీర్‍మోమిన్ దాయెరాకు వెళ్లే దారిలో అక్కన్న మాదన్నలు కట్టించిన ‘‘మాతా మహంకాళీ దేవాలయం’’ ఉంది. ఈ అన్నదమ్ములిద్దరూ ఖుతుబ్‍షాహీ నవాబుల వద్ద దివాన్‍గా (ప్రధానమంత్రి), పేష్కార్‍గా (ఆర్థికమంత్రి) పనిచేశారు. ప్రభువులు, ముస్లిం మతస్థులు అయినా వారికి కుడి, ఎడమల నిలబడి తమ అఖండ మేధస్సుతో పరిపాలన నిర్వహించిన ఈ ఇద్దరు మంత్రులు మాత్రం హిందువులు, కుతుబ్‍షాహీలు షియామతస్తులైనందున ఈ హిందూ ముస్లిం సమైక్యత పాలు నీళ్లలా, పాన్‍సుపారీలా కలిసిపోయి సాధించబడింది. సున్ని మతస్తుడైన ఔరంగజేబుకు ఈ ఐక్యత నచ్చక గోల్కొండపై దాడి చేశాడు.
ఫిబ్రవరి ఏడవ తారీఖున 1677లో ఛత్రపతి శివాజీ ఈ మహంకాళీ దేవాలయాన్ని సందర్శిం చాడు. ఆయన శ్రీశైలానికి వెళ్తూ మార్గమధ్యంలో గోల్కొండ నవాబుకు అతిథిగా హైదరాబాద్ నగరంలో విడిది చేసిన సందర్భంలో మొగల్‍పురాలోని ఈ మహంకాళీ దేవాలయాన్ని సందర్శించాడు. అప్పుడొక వింత జరిగింది
.
‘‘నా వెంట ఎవరూ రావద్దు. నేనొక్కడినే కాళికాదేవిని పూజించు కోవాలి’’ అని అందరిని గుడి అవతలే నిలబెట్టి శివాజీ ఒక్కడే లోపలికి వెళ్లాడు. అతని పరివారమూ, స్థానిక యువకులు అందరూ గుడి బయటే నిలుచున్నారు. కాసేపు అయినాక శివాజీ ఇవతలికి వచ్చి అమ్మ బలి కోరుతుంది. ఆకలిగా ఉందట. ప్రాణాలు అర్పించటానికి ఎవరొస్తారు అని ప్రశ్నించాడు. ధైర్యం గల యువకుడు ఒకతను ముందుకు వచ్చాడు. ప్రజలందరూ ఆ యువకుడికి జేజేలు పలుకుతుంటే అతను లోపలికి వెళ్లిపోయాడు.
తర్వాత మళ్లీ శివాజీ ఇవతలికి వచ్చి అమ్మకు ఆకలి తీరలేదట. మరొకరు కావాలట ఎవరొస్తారు అని ప్రశ్నించాడు. జనంలో కలకలం మొదలైంది. అయినా మరో ధీరుడు ముందుకొచ్చాడు. ఇట్లా ఒకటి, రెండు, మూడు… పది మంది ఉడుకు రక్తం ప్రవహించే దుడుకు యువకులు లోపలికి వెళ్లిపోయారు. చూస్తున్న ప్రజలలో హాహాకారాలు మొదలైనాయి. చివరికి గుడి తలుపులు తెరచుకున్నాయి. చిరునవ్వులు చిందిస్తూ ఛత్రపతి శివాజీ మహారాజ్ ప్రజల ముందుకు వచ్చి నిలుచున్నాడు. ఆయన వెనుక ఈ పది మంది యువకులు సజీవంగా నిలుచున్నారు. ‘‘దేశాన్ని విముక్తి చేయటానికి నాకు ఇలాంటి ప్రాణాలు బలిపెట్టే సాహసమైన యువకులే కావాలి. ఈ పది మందిని నా వెంబడి తీసుకెళ్తున్నాను’’ అని ప్రకటించాడు. అప్పుడు ప్రజలందరూ కరతాళ ధ్వనులు చేస్తూ ‘‘జై భవానీ వీర్ శివాజీ’’ అని నినాదాలు చేశారు. మాదన్న నివసించిన ప్రాంతాన్ని ఇప్పుడు మనం ‘‘మాదన్నపేట’’ అంటున్నాం. ఇది యాకత్‍పురాకు దగ్గరలో వుంటుంది. మొగల్‍పురా లోని మాతా మహంకాళి గుడిని ప్రజలు అక్కన్న మాదన్నల గుడి అనే ఇప్పటికీ పిలుస్తారు. ఆదర్శ సోదరులను ‘‘రామలక్ష్మణులు’’ అని ఎలా అంటారో ఇప్పటికీ హైదరాబాద్‍లో ఎవరైనా అన్నదమ్ములు లేదా స్నేహితులు ఆదర్శంగా కలిసిమెలిసి ఉంటే వారిని ‘‘అక్కన్నమాదన్న’’ అని పిలవటం ఇక్కడి సంప్రదాయం.

పోరాటాల పురిటిగడ్డ అయిన ఈ మొగల్‍పురా మరో దేశభక్తుడికి జన్మనిచ్చింది. ఆ వీరుడే సయ్యద్ మౌల్వీ అల్లాఉద్దీన్, మొగల్‍పురా ఆ రోజులలో మేధావులు, కవులు, కళాకారులకు ప్రసిద్ది. ఇప్పటికీ కూడా మొగల్‍పురా బస్తీలో ‘‘ఉర్దూఘర్’’ అని ఒక సాహిత్య, సాంస్కృతిక కేంద్రం ఉంది. పాతనగరంలో ముస్లింలకు అది మరొక ‘‘రవీంద్రభారతి, కళాభవన్’’. అన్ని రకాల సమావేశాలు అందులోనే జరుగుతుంటాయి. ఈ మొగల్‍పురా నివాసి సయ్యద్ మౌల్వీ అల్లా ఉద్దీన్ వృత్తిరీత్యా ప్రవృత్తి రీత్యా మౌల్వీ. మత ప్రవక్త, పండితుడు. మొగల్‍పురా దాటి లోపలికి వెళ్లగానే చౌరస్తాలో ఒక పెద్ద మసీదు కనబడుతుంది. దాని పేరు సయ్యద్ మౌల్వీ అల్లా వుద్దీన్ మసీద్. దానిని అతనే కట్టించాడు. 1857లో ఉత్తరభారతదేశంలో జరిగిన ప్రథమ భారత స్వాతంత్య్ర పోరాటం అనగా సిపాయిల తిరుగుబాటు ప్రభావం హైద్రాబాద్ రాజ్యంపై కూడా పడింది. హిందూ, ముస్లిం ప్రజలు కల్సి ఇక్కడా ఆ తిరుగుబాటు బావుటా రెపరెపలాడించారు. బ్రిటిష్‍వారికి తొత్తుగా వ్యవహరిస్తున్న నిజాంపై సాయుధమైనారు. ఆ పోరాటానికి నాయతక్వం వహించిన వారు సయ్యద్ మౌల్వీ అల్లా ఉద్దీన్, తుర్రేబాజ్‍ఖాన్‍లు. ఆ సాయుధ సమరం విఫలం కాగా నగరం విడిచి పారిపోయారు. ఆ తర్వాత కొంత కాలానికి తుర్రేబాజ్‍ఖాన్‍ను చంపి కోఠి దగ్గరి పుత్లీబౌలిలో శవాన్ని మూడురోజులు అలాగే వ్రేలాడదీశారు. మౌల్వీ అల్లా ఉద్దీన్‍ను బెంగళూరులో పట్టుకుని హైదరాబాద్ తీసుకువచ్చి విచారణ జరిపి అండమాన్ జైలుకు యావజ్జీవ శిక్షగా పంపారు. ఆ వీరుడు 27 సంవత్సరాలు అక్కడే కృంగి, కృశించి 1884లో అమరుడైనాడు. ఆఖరి మొగల్ చక్రవర్తి బహద్దూర్ షాజఫర్ రంగూన్‍లో మరణించినట్లుగానే మౌల్వీ అల్లా ఉద్దీన్ కూడా అండమాన్‍లోనే తుదిశ్వాస వదిలాడు. ఈ దేశభక్తుడు జన్మించి, నివసించి, నడయాడిన పవిత్ర నేలనే మనం మాట్లాడుకుంటున్న ఈ ‘‘మొఘల్‍పురా’’.
రెండవ నిజాం 1765లో అధికారానికి రాగానే అనేక మంది ఉన్నత ఉద్యోగులు, నగర ప్రముఖులు ఇక్కడ నివాసాలు ఏర్పరచుకున్నారు. జబర్‍దస్త్ఖాన్ అను ప్రముఖుడు అజ్మీర్ దర్గా నుండి కొన్ని పవిత్ర అవశేషాలను, ఒక పగిడీని తెచ్చి తన నివాస సమీపంలో ‘‘ఖాజామొయినుద్దీన్ కా చిల్లా’’ను నిర్మించారు. అప్పట్నించి ప్రతి ఏటా అక్కడ ఉర్సు జరుగుతుంది. సాజిదా బేగం అను విదుషీమణి ఆ చిల్లాకు ఎదురుగా ఒక కమాన్‍ను నిర్మించింది. అదే ‘‘మొగల్‍పురా కీ కమాన్’’.
వంద సంవత్సరాల క్రితమే ఈ బస్తీలో ‘‘రిఫాయే ఆం’’ అన్న పాఠశాల ప్రారంభమై అది ఇప్పటికీ కొనసాగుతుంది. రిఫాయే ఆం అనగా సర్వజనులను సంస్క రించడం’’ అని అర్థం. సంస్కరణ విద్య ద్వారానే సాధ్యమని భావించిన ఆనాటి పెద్దలు ఆ పాఠశాలను ప్రారంభించారు. ‘‘ఒకే ఒక సిరా చుక్క లక్షల మెదళ్లకు కదలిక’’ అన్నట్లు ఈ బడిలో చదువుకున్న పిల్లలు తర్వాత కాలంలో జాతీయోద్యమంలో పాల్గొని ప్రముఖ నాయకులైనారు. ఈ మొగల్‍పురాలోనే ‘‘ప్రిన్సెస్ దుర్రూ షెహవార్’’ అని చిన్న పిల్లల ఆసుపత్రి వుంది. అది ఇప్పటికీ పాతనగరం పేద పిల్లలకు తన సేవలను అందిస్తుంది. పిన్సెస్ దుర్రూ షెహవార్ ఆఖరి నిజాం గారి చిన్న కోడలు. ఆమె మెట్టినిల్లు హైదరాబాద్ అయినా పుట్టినిల్లు మాత్రం ‘‘టర్కీ’’. ఆమె ఇక్కడి జనజీవన స్రవంతిలో కలిసిపోయి తన ఆస్తినంతా ఆ ఆసుపత్రికే దానం ఇచ్చింది. ఇప్పుడు ఆ ఆసుపత్రి పేద పిల్లల ‘‘సంతోష చంద్రశాల’’.
(షహర్ నామా (హైద్రాబాద్ వీధులు – గాథలు) పుస్తకం నుంచి)
-పరవస్తు లోకేశ్వర్,
ఎ: 91606 80847