పీఠికలు భిన్నభావాల పేటికలు


పీఠిక, ఉపోద్ఘాతం, ముందుమాట, తొలిపలుకులు ఇలా ఎన్ని రకాల పేర్లు పెట్టినా అవి గ్రంథాని (text)కి, పాఠకుని (target)కి అనుసంధానాలుగా ఉపకరించేవి. గ్రంథకర్త స్వయంగా రాసుకోవచ్చు. తాను పడిన శ్రమ, తనలక్ష్యం, ఇంకా భవిష్యత్తులో చేయవలసిన కృషి, సహకరించిన వారికి కృతజ్ఞతలు మొదలైన అంశాలు రచయిత తన పీఠికలో నివేదించుకొంటాడు. రచయిత తన గ్రంథానికి మరి కొందరు ఇష్టులు అయిన వ్యక్తుల చేత ముందు మాటలు రాయించుకొంటాడు. వారు సాహిత్యలోకంలో సుప్రసిద్ధులు కావచ్చు. వారి ముద్ర పడితే తన రచనకు తగిన గుర్తింపు వస్తుందన్న విశ్వాసం. ఔద్యోగికంగా ఉన్నతాధికారులు కావచ్చు. వారితో పరిచయం ఏర్పడడానికి ఇదొక అవకాశంగా భావించుకోవచ్చు. (ముప్పదేళ్ళ క్రితం ఓ స్కూలు టీచర్‍ రాసిన పుస్తకానికి వారి డైరెక్టర్‍ తో పీఠిక రాయించ మని ఉచిత సలహా ఇచ్చాను. డైరెక్టర్‍ తో పీఠిక రాయించుకోవడమే కాక నెలరోజుల్లో కోరుకున్న పాఠశాలకు బదిలీ కూడ అయ్యాడు. ఆ రచయితకు ఇది అదనపు ప్రయోజనం.) పాఠాలు చెప్పిన గురువుల ఆశీస్సులు పొందడం కోసం కూడ పీఠికలు రాయించవచ్చు.


ప్రత్యేకంగా ఆ విషయం మీద అధికారం ఉన్న వారితో రాయించుకోవడం ఒక పద్ధతి, సన్నిహిత మిత్రుల అభిప్రాయాలు పొందు పరుచుకోవడం ఒక తీరు. ఇలాగ పీఠికాకారులు బయలుదేరుతారు. మొత్తం మీద పీఠికాకారులందరు రచయిత ఇష్టంతో ముడిపడిన వారు అన్నది విస్మరించకూడదు.
పీఠికాకారులందరికి రచయిత శక్తి సామర్థ్యాల మీద అవగాహన ఉంటుంది. సదభిప్రాయం ఉంటుంది. పీఠికకు ప్రథమశ్రోత రచయితనే అవుతాడు. కనుక పీఠికలు ప్రోత్సాహకారకంగా ఉండడం సంస్కార లక్షణం. పీఠికాకారులు ‘‘వెన్నుగుద్ది’’ చెప్పకుండా ‘‘వెన్నుతట్టి’’ లోపాలను సవరించుకోవాలని సూచించడం ఆనవాయితి. పత్రికల్లో వ్యాసం, సమీక్ష రాసే విమర్శకుడయితే రచయితతో ‘‘అభ్యర్థనాత్మకమైన సంబంధం’’ ఉండని వాడవుతాడు కనుక కాస్త ఘాటుగా విమర్శించ వచ్చు. రచయిత తన ధోరణిలో తాను రాస్తాడు. తన శక్తియుక్తులు, అవగాహనలు, అభ్యాసరీతి వాటిలో ప్రతిఫలిస్తాయి. ఆ గ్రంథగత అంశం, వైశిష్ట్యం, చారిత్రక నేపథ్యం, పూరణాత్మకంగా, సవరణాత్మ కంగా, విశ్లేషణాత్మకంగా చెప్పడం, రచయిత పడిన శ్రమ, శైలీవిన్యాసం, ఆకరాలసేకరణలో, విశ్లేషణలో చూపిన నైపుణ్యం మొదలైనవి పేర్కొనడం రచయిత గ్రంథంలో అంతర్భాగం కాజాలదు. తాను అంతగా చెప్పుకోవడం సభ్యతాలక్షణం కాదు. కనుక ఇంకొకరు చెప్పవలసిందే. అలా పీఠికాకారులు చెప్పిన అంశాలు పాఠకులకు గ్రంథ అవగాహనలో ఉపకరిస్తాయనడం నిర్వివాదాంశం.


అసలు గ్రంథంలో సరుకు లేకపోయినా పీఠికల వల్ల నిలుస్తాయ నడం అబద్ధం. కాస్త తక్కువస్థాయి గ్రంథానికి పెద్దల పీఠికలతో ప్రచారం కలుగుతుందేమో కానీ ‘‘విలువ’’ పెరుగుతుందని మాత్రం విశ్వసించలేం. పీఠికల్లో అతిప్రశంసలు అనౌచిత్యానికి దారి తీసేవి మాత్రమే కాక రచయిత పట్ల పాఠకుల్లో చిన్నచూపు కలగడానికి దోహదకారులవుతాయి. ఒకరిద్దరిచేత పీఠికలు రాయించడం అందంగా అనిపించవచ్చు. కాని ఇరవై పుటల చిరుపొత్తానికి పదిమంది చేత యాబైపుటల పీఠికలు రాయించడం ఆభాసుపాలు కావడానికే హేతువవుతుంది.


ప్రాచీన కావ్యాల్లోని అవతారికలే ఆధునిక రచయితల స్వీయ ఆముఖాలుగా పరిణమించాయి. ప్రాచీన కావ్యాల్లో ఇతరుల చేత రాయించడం ఉండదు. ఆధునికుల్లో ఇతరుల చేత రాయించడం ఆంగ్లవిమర్శకుల Fore Word సంప్రదాయం నుండి వచ్చింది.
ప్రాచీన కావ్యాలను పరిష్కరించి ప్రచురించి నపుడు పండితులు అత్యంత విస్తారమైన పీఠికలు రాయడం అందరికీ తెలిసిందే. దాని వల్ల మనకెన్నో విషయాలు అవగాహనకు వస్తాయన్నది వాస్తవం. చిలుకూరి నారాయణరావు పండితారాధ్య చరిత్రకు రాసిన 348 పేజిల పీఠిక, వేటూరి ప్రభాకర శాస్త్రి క్రీడాభిరామానికి, బసవపురాణానికి, తంజావూరు ఆంధ్ర చరిత్రకుబీ అక్కిరాజు ఉమాకాన్తం పలనాటి వీరచరిత్రకుబీ ఈయుణ్ణి వీరరాఘవాచార్యులు ప్రతాపరుద్ర యశోభూషణానికి, ఆముక్తమాల్యదా పర్యాలోకనానికి రాసిన పీఠికలు నిజంగా విజ్ఞానపేటికలు. అవి ఇంచుమించు స్వతంత్ర గ్రంథాలు. వావిళ్ళ, ఆనందముద్రణాలయ సంస్థ, వేదం వెంకట్రాయశాస్త్రి & బ్రదర్స్ లాంటివారు ప్రకటించిన కావ్యాలకు పండితులు వైదుష్య భరితమైకృష్ణమూర్తి, ఆకాడమీ ప్రచురించిన ఎన్నో కావ్యాలకు, భారతం సంపుటాలకు సర్వ ఆంశాలను, సకల కోణాలను స్పృశిస్తు సుదీర్ఘమైన పీఠికలను రాసే అవకాశాన్ని కలిగించారు. నిడుదవోలు వెంకటరావు, విశ్వనాథ సత్యనారాయణ, పాటిబండమాధవశర్మ, బి.రామరాజు, పియస్‍ఆర్‍ అప్పారావు, పల్లాదుర్గయ్య, గడియారం రామకృష్ణశర్మ, నాయనికృష్ణ కుమారి, పి.యశోదారెడ్డి, కోవెల సంపత్కుమార ఇలా ఎందరెందరో విద్వాంసులు పీఠికల రూపంలో తమ ప్రజ్ఞప్రాభవాలను ప్రదర్శించారు. ఆ పరంపరలో రాటుతేలిన మరో విద్వాంసుడు శ్రీ రంగాచార్య. దశరథరాజనందన చరిత్ర, తాలాంకనందినీ పరిణయం, శ్రీరంగ మహత్త్వం, రసార్ణవ సుధాకరం, అప్పకవీయం లాంటి 70 తెలంగాణ కావ్యాలను పరిష్కరించి సప్రమాణికమైన పీఠికలు సంతరించి పండిత శబ్దానికి సార్థక్యం కలిగించారు శ్రీ రంగాచార్య గారు.


మానవల్లి రామకృష్ణకవి నన్నెచోడుని కుమారసంభవం మొదటి భాగాన్ని ప్రకటిస్తు పీఠికలో ఇతడు (నన్నెచోడుడు) క్రీ.శ. 940లో పశ్చిమ చాళుక్యులతో యుధ్ధము చేసి రణరంగమున నిహతుడయ్యెను- అని రాశాడు. అంటే నన్నయకు ముందున్నకవి నన్నెచోడుడు అన్నది తాత్పర్యం. ఇది అనేక సంచలనాలకు, తర్జన భర్జనలకు ఆస్కారాన్నిచ్చింది. అసలు నన్నెచోడుని కవిత్వవైఖరి కన్నా కాల నిర్ణయానికి పండితులు ఎక్కువ ఘర్షణ పడ్డారు. ఆనాటి పండితులందరు పాఠాంతరాల చర్చ, ప్రతుల చర్చ, కవి కాల స్థల, కులాదుల చర్చ, కృతిభర్త చర్చ, అన్యకృతులు, పూర్వాపరాలు, అనువాదవిధానం, కథాకల్పనం, ఛందో వ్యాకరణాలంకారాదుల చర్చ, అర్వాచీన కవులపై ప్రభావం మొదలైన ఒకానొక పద్ధతి (Methodology) ప్రకారంగా చర్చించారు. రాళ్ళపల్లివారిపీఠికలు ఆకారంలో చిన్నవే అయినా గ్రంథగౌరవాన్ని ప్రస్పుటం చేస్తు చమత్కార భరితంగా సూచనలు చేస్తూ పాఠకుల్లో జిజ్ఞాసను రేకెత్తిస్తాయి.


భావకవిత్వయుగంలో పీఠికల విషయంలో ఒక గమనార్హమయిన అంశం కనిపిస్తుంది. ఎక్కువ మంది కవులు ఇంగ్లీషులో పీఠికలు రాయించుకొన్నారు. ఇది ఇప్పుడు కాని అభ్యుదయకవుల కాలంలో కాని లెక్కించదగినంత కాదు. భావకవులందరు ఎక్కువగా ఇంగ్లీషు వాళ్ళ దగ్గర చదువుకోవడం కావచ్చు. నోబుల్‍ ప్రైజ్‍ మీద వారికి ఆశలుండేవి. ముఖ్యంగా జేమ్స్.హెచ్‍.కజిన్స్ మదనపల్లి కాలేజి ప్రిన్సిపల్‍గా ఉండడం. దువ్వూరి రామిరెడ్డి లాంటి వారు ఆయనకు సన్నిహితులుగా ఉండడం లాంటివి కావచ్చు.
అభ్యుదయ కవి ప్రయోక్త శీశ్రీ మహా ప్రస్థానానికి చలం యోగ్యతాపత్రం పేరుతో రాసిన పీఠిక సాహితీలోకంలో ఎంతో పేరు గడించింది. యోగ్యతాపత్రం చదివితే మహాప్రస్థానం చదవక్కర లేదనుకొనే ‘‘పిచ్చిరెడ్డి లాంటి సార్థకనామధేయులు’’ బయలుదేరారంటే చలం పీఠిక ఏ మేరకు తన సమ్మోహకశక్తిని ప్రసరింపచేసిందో విదితమవుతుంది. (చూడుడు శీశ్రీ ప్ర.జ సంపుటం) శీశ్రీ, కె.వి రమణారెడ్డి, కె.కె.రంగనాథాచార్యుల లాంటి వారు మార్క్సీయ సిద్ధాంతం, చారిత్రక భౌతిక వాదం. ప్రగతిశీల దృక్పథం ఉండాలని విస్తారంగా రాసిన పీఠికల్లో అభిప్రాయపడ్డారు. వచన కవితను ఒక పక్రియగా స్థాపించడానికీ, అందులో కథాకావ్యాది వైవిధ్యాన్ని జోడించడానికీ, సారళ్యం సమకాలీన స్పృహ ఉండాలని మార్మికత, అతి సాంస్కృతికత తగదని ప్రచారం చేయడానికీ కంకణం ధరించినట్లుగా కుందుర్తి ఆంజనేయులు పీఠికలు రాశారు.


విశ్వనాథ సత్యనారాయణ, దివాకర్ల వెంకటావధానులు వందలాది పీఠికలు రాశారు. విశ్వనాథ సత్యనారాయణ పీఠికలు రెండు సంపుటాలుగా సంకలితమయ్యాయి. కాని దివాకర్ల వెంకటావధాని పీఠికలు పుస్తకంగా రాలేదు. ఎవరైనా తెస్తే సాహిత్యలోకానికి మేలు చేసిన వారవుతారు. దివాకర్ల వారి పీఠికలు రచయితను తగిన విధంగా ప్రశంసిస్తూ , ప్రతికూలాభిప్రాయాలు లేకుండా వస్తువు, రసం, భాష, అలంకారాలు, ఛందస్సు అన్నట్లుగా దేని దానికి విడివిడి ప్యారా గ్రాపుల్లో ఒక క్రమశిక్షణాయుతమైన పద్ధతిలో (మూస పద్ధతి అనడం అపచారం) కొనసాగుతాయి. పాఠకుడు ఈ పీఠిక చదివి ఎంతో ప్రయోజనాన్ని పొందుతాడు.


విశ్వనాథ, శేషేంద్ర లాంటి వారి పీఠికలు విపరీతమైన ప్రేమాభిమానాలు కురిపిస్తాయి. గ్రంథంలోని వస్తువుకు అతీతమైన వలయంలో సంచరిస్తూనే ఆ వస్తువుతో ముడిపడివుంటాయి. విశ్వనాథ నాలగయిదు వాక్యాలలో పీఠిక అయిపోయిందని చేతులు దులిపేసుకోగలడు. విస్తారంగాను రాయగలడు. ఆ రచయిత మీద కానీ, రచన మీద కానీ ఇష్టం లేకపోతే విశ్వనాథ ఎంతో గడుసుగానూ, ఎవరికీ దొరకకుండానూ రాయగలడు. భారత రాష్ట్రపతి వి.వి. గిరిగారి శ్రీమతి సరస్వతీగిరి 1969లో బీజాక్షరమాల అని ఒక పుస్తకం రాసి విశ్వనాథ పీఠిక కోసం ఇచ్చారు. ఆ పుస్తకం అతి సామాన్యమైనది. రాసిన వ్యక్తి అసామాన్య వ్యక్తి. భారత దేశంలోనే సర్వోన్నతమైన పదవిలో ఉన్న వ్యక్తి ధర్మపత్ని. ఇంకెవరైనా అయితే అమాంతం ఎగిరి గంతేసి అత్యద్భుత మని పీఠిక రాస్తారు. కాని విశ్వనాథ ఎలా స్పందించాడో చూడండి.


ఇది ఒక గ్రంథము కాదు. అక్షరమాల. అక్షరముల వాసన, ఇందులో అక్షరములు లేవు. శబ్దాలు లేవు. అన్వయము లేదు. ఉన్నను వాని దారి వానిదే. ఒక పెద్ద అఱపు. ఒక పెద్ద ఆక్రోశము. ఒక జీవుడు- ఆ జీవుడు స్త్రీ. ఇప్పుడు గొప్ప స్త్రీ, ఒక గొప్ప పదవిలోనున్న పురుషుని భార్య. కడివెడు బిడ్డలను కన్న స్త్రీ. ఆమె సంతతి తామరతంపరగా నున్నది. గొప్ప లౌకిక జ్ఞానము కల స్త్రీ. తన భర్త పదవికి తాను హేతువు ననుకొన్నంత వివేకవతి. ఈ జీవునకు, ఈ అరచిన జీవునకు సంబంధము లేదు. ఇది ఒక ఆశ్చర్యము. పూర్వజన్మ విశిష్ట సంస్కారమో ఒక విలక్షణమైన సాధనమో కాని ఈ అఱపులో ఆ జీవుడు- లోకము నందొక లౌకిక జ్ఞానము కలవాడన్న లక్షణమున్నది. అది యిది గ్రంథమనిపించుచున్నది.


ఈ అఱచిన యీమె, యీమె కానిచో నిది సహజము. ఎవరో యోగిని. ఒక యోగిని యొక్క యున్మత్త ప్రలాపము, కాని యీమె యీమె సాధన మొక ఆశ్చర్యము. ఈ అఱపునకు ఈ కేకకు ఈ ఆక్రోశమునకు ఒక వైలక్షణ్యము తెచ్చినది. ఇట్టి సాధన నాన్యతో దర్శనీయము. పరమేశ్వరుడు విన్నాడు. వినక తప్పదు. అట్టి కేక.
ఇందులో విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్ప దలుచుకొన్న భావమేమిటో ఎవరికీ బోధపడదు. పీఠికలు రాయడం నుండి తప్పించు కోదలచిన జీవునివేదన ఇది. ఇది ఒక చమత్కారం అంతే. పీఠికలు సకాలానికీ ఇవ్వక ఇబ్బంది పెట్టే రచయిత లెందరో ఉన్నారు. ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తిని అడిగిన పాపానికి ఎన్నోరోజులు ప్రచురణలను ఆపుకొన్నవారున్నారు. డా. సి నారాయణరెడ్డి కాలం విలువ తెలిసిన వ్యక్తి. సకాలంలో పీఠిక ఇవ్వడంలో ఆయనను మించిన వారు లేరు. వారి పీఠికల్లోని ఆశీరభినందనలు అనే చివరి వాక్యం మొదట ఉండే ఔపచారిక వాక్యం తీసేసినా మధ్యలో ఉండే రెండు మూడు వాక్యాలు పుస్తకంలోని ఆయువుపట్టును సారభూతమైన అంశాన్ని వెల్లడిస్తాయి. క్లుప్తత సినారె పీఠికలకు ప్రాణం. ఇంకా జీ.వి. సుబ్రహ్మణ్యం విస్తారంగా అంశాల వారీగా వర్గీకరిస్తు విశ్లేషణాత్మకంగా పీఠికలు రాసే వారు. ఎస్వీజోగారావు, చేకూరి రామారావు, సంపత్కుమార, సుప్రసన్నాచార్య అద్దేపల్లి రామ్మోహన్‍ రావు, సంజీవదేవ్‍. తంగిరాల సుబ్బారావు , రాచపాళెం చంద్రశేఖర రెడ్డి, వెల్చేరు నారాయణరావు, ఎన్‍. గోపి, బేతవోలు రామబ్రహ్మం, నందినిసిధారెడ్డి లాంటి వారెందరో తమతమ ధోరణిలో పీఠికలు రాశారు. చాలమంది పీఠికాకారులు కూడ తేలిపోయారన్న సంగతి విస్మరించకూడదు.


ప్రముఖపేరడీ విద్వాంసులు శ్రీరమణ వివిధ రచయితల పీఠికల శైలీవిన్యాసాలను ప్రతిభావంతంగా అనుకరించిన తీరును శ్రీరమణ పేరడీలు అనే గ్రంథంలో చూడవచ్చు. డి. చంద్రశేఖరరెడ్డిగారు పీఠికల స్వరూప స్వభావాల గురించి పరిశోధించి డాక్టరేటు పట్టం పొందారు. ఆరుద్ర, విశ్వనాథ, జి.వి.సుబ్రహ్మణ్యంగారల పీఠికా సంకలవాలను సమీక్షించే అవకాశం నాకు కలిగింది. అతి పొగడ్తల పేటిక కాకుండా రచయిత మరిన్ని పుస్తకాలు రాసే విధంగా తన స్థాయిని పెంచుకొనే విధంగా ప్రోత్సాహకరంగా ఉంటూ స్వీకృతాంశానికి సంబంధించి రచయిత చెప్పలేకపోయినవి, వ్యాసంలో ఇమడక చెప్పడానికి అవకాశం లేకపోయినవి విశ్లేషణాత్మకంగా వివరిస్తు అతి స్వల్పంగాను కాకుండా అతిదార్ఘంగాను కాకుండా రచయితకు పాఠకునికి (వస్తువుకు గ్రహణశీలతకు) అనుసంధానాత్మకంగా ఉంటూ భవిష్యత్‍ లో ఆ రంగంలో మరికొంత వ్యాసంగానికి దారులు చూపిస్తు రాసేవే ఉత్తమమైన పీఠికలు.


-డా. వెలుదండ నిత్యానంద రావు
ఎ : 9441666881

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *