తెలంగాణ గ్రామీణ ధార్మిక జీవితం నుంచి శాస్త్రీయ ఆలోచనల దాకా
నా అన్న నేల ఏదీ నాది కానప్పుడు
వలస ఒక ఎక్కిల్ల దుక్కం
జీవనయానం ఒక సంచారం
-అన్నవరం దేవేందర్
ప్రజలే చరిత్ర నిర్మాతలు. ఈ మాట కొత్తదీకాదు. ఇప్పటిదీ కాదు. నిన్నటి చరిత్ర నేటికి కొనసాగింపుగా రేపటి చరిత్ర నిర్మాణానికి కారకంగా నిలుస్తుంది. అంటే చరిత్ర, మనిషి పరస్పర ప్రేరితాలు. ఏటవాలుకి కొట్టుకుపోయేవారు చరిత్ర నిర్మించలేరు. ఎదురీత చరిత్రకి మొదటి అక్షరం. జీవనయానంలో తొలి అడుగే అతని చరిత్రకి తొలి అక్షరమైంది. తెలంగాణలోని ఒక పల్లెనుంచి, దళితుల ఉపకులమైన పంబాల సాంప్రదాయ ఆచారాల నుంచి తన వారసత్వాన్ని శాస్త్రీయమైన తాత్వికత వైపు, అత్యాధునిక వైపు నడిపించిన చరిత్ర ఘంటా మొగిలయ్యది. కాలంతో నడుస్తూనే, నడుస్తున్న కాలానికి ఒక పరమార్థాన్ని కానుకగా యిచ్చిన దార్శనికుడు మొగిలయ్య.
మొగిలయ్య 1933వ సంవత్సరంలో కరీంనగర్ జిల్లా పెద్దపల్లి తాలూకాలోని బౌద్ధ ఆరామం ధూళికట్ట గ్రామంలో జన్మించాడు. తండ్రి దేవ సత్తయ్య, తల్లి శాంతమ్మ. మొగిలయ్య అసలు పేరు రాజమౌళి. రాజమౌళి వారికి ప్రధమ పుత్రుడు రాఘవులు, రామచంద్రం అనే తమ్ముళ్ళు, రాధమ్మ, తులశమ్మ, సుశీల అనే ముగ్గురు చెల్లెళ్ళూ ఉన్నారు. రాజమౌళి మానేరు ఒడ్డున వున్న యాస్వాడ గ్రామంలోని మగపిల్లలు లేని కుటుంబానికి ఇల్లరికపు అల్లుడుగా వెళ్ళాడు. అప్పటికే భర్తలేని మల్లవ్వ రాజమౌళిని పెంపకానికీ తీసుకుని, తర్వాత తన బిడ్డ జననితో పెళ్ళి చేసింది. రాజమౌళి పేరు పలకడం కష్టంగా ఉందని మొగిలయ్యగా మార్చింది. దేవ రాజమౌళి ఘంటా మొగిలయ్య అయ్యాడు.
మొగిలయ్య కులం ‘పంబాల’ కులం. ఇది గ్రామ పూజారులకు సంబంధించిన దళితుల్లో ఒక ఉపకులం. ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ వంటి సప్త మాతృకల శక్తి దేవతలకు ఆరాధ్యులుగా, పూజారులుగా ఈ కులం వారు ఉంటారు. వీరిని తెలంగాణ ప్రాంతంలో బైండ్ల, ద్యావతల, పంబాల, ఎల్లమ్మ వాళ్ళు అని పిలుస్తారు. వీరికి రెండువేల సంవత్సరాల చరిత్ర ఉన్నట్లు తెలుస్తుంది. నిజాంకాలంలో రాజవైద్యులుగా గుర్తింపు, గౌరవం పొందినట్లుగా ఆనాటి ఫర్మానాలు చెబుతున్నాయి. ఆకాలంలో ఒక్కో పంబాల కుటుంబానికి కొన్ని గ్రామాలు కేటాయించి, గ్రామ దేవతల పూజలతోపాటు, పశువులు, మనుషుల ఆరోగ్య సంరక్షణ బాధ్యతను కూడా అప్పగించేవారు. వీరిని వతన్‍దార్లు అంటారు.
మొగిలయ్య జనని ఇద్దరూ 6వ ఫారం వరకు చదివారు. 7వ ఫారం చదివితే ఉపాధ్యాయ ఉద్యోగాలకు అర్హులయ్యేవారు. కాని అప్పటికే మల్లవ్వ కుటుంబం వతన్‍దార్లుగా ఉన్నందున వీళ్ళు ఉద్యోగాల్లో చేరితే వతన్ పోతుందని చదువు మాన్పించింది. మొగిలయ్య మానకొండూరు పరిసరాల్లో జగ్గయ్య పల్లెకు వతన్‍దారుగా మారాడు. జగ్గయ్యపల్లె గ్రామ పూజారిగా 75 సంవత్సరాలకు పైగా ఉన్నారు. శక్తి దేవతలకు ఆరాధనలు, గ్రామ ఉత్సవాలు జరిపేవాడు. గ్రామ ఉత్సవ సంస్కృతిని రెండు చేతులతో కాపాడుకుంటూ వచ్చిన ధార్మిక సాంప్రదాయవాది మొగిలయ్య. ఆయుర్వేద డాక్టర్‍గా వీరికి స్వస్థత చేకూరూస్తూ మంచి పేరు సంపాదించు కున్నాడు. సాంప్రదాయ విలువలు కాపాడుకుంటూనే శాస్త్రీయ వైద్యంపై అవగాహన కల్పించేవారు.
మూఢ విశ్వాసాల పట్ల, మంత్రాలు- తంత్రాల పట్ల నమ్మకం లేకపోయినా తన వతన్‍దారీ జీవిక పద్ధతిననుసరించి మెజారిటీ ప్రజల విశ్వాసాన్ని గౌరవిస్తూ వారి సమస్యలను సమ్యగ్ దృష్టితో పరిశీలించి వీరికి సంరక్షకునిగా నిలిచేవాడు. మొగిలయ్య తన కుటుంబం మొత్తాన్ని తీర్చిదిద్దిన ఆలోచనా పరుడు, కార్యశీలి, సామాజిక మార్పులకనుగుణంగా తనలోని సాంప్రదాయ భావనలను, ఆచారాలను క్రమ క్రమంగా వదులుకున్నాడు. శాస్త్రీయ ఆలోచనలకు ఆహ్వానం పలికి తనను, తన కుటుంబాన్ని ప్రగతి వైపు నడిపించిన వాడు మొగిలయ్య.
తన వతన్‍దారీని బంధువులకు అప్పగించి వ్యవసాయాన్ని తన జీవికగా మలుచుకున్నాడు. ఆడపిల్లలకు చదువు అవసరమని గుర్తించి తన బిడ్డలను చదివించాడు. గ్రామంలోని ఆడపిల్లలు చదువుకునేలా ప్రోత్సహించాడు. మొగిలయ్య పెద్ద బిడ్డ చంద్రమణి నాలుగవ తరగతి (ఆ స్కూల్లో అంతవరకే వుంది), రెండవ బిడ్డ కనకతార 6వ తరగతి, మూడవ బిడ్డ వసంత ఎం.ఏ, బిఈడీ చదివారు. మగపిల్లల్లో పెద్దవాడు అశోక్ సత్యనారాయణ పాలిటెక్నిక్ ఇంజనీర్ చదివారు. చక్రపాణి ఎంఏ సోషియాలజీతో పాటు జర్నలిజంలో మాస్టర్ డిగ్రీ చేసి, తన పంబకుల సాంస్కృతిక వారసత్వంపై డాక్టరేట్ చేసారు.
ఓపెన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‍గా ఉన్నారు. తెలంగాణ సాధన మలిఉద్యమంలో మేధోవంతమైన పాత్ర పోషించారు. చక్రపాణి తెలంగాణ పునర్నిర్మాణ ప్రణాళికలు రూపొం దించారు. సామాజిక, చారిత్రిక విశ్లేషకుడు. తెలంగాణ రాష్ట్రం తొలి పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్మన్ అయ్యారు. దేశంలోని వివిధ కమీషన్లకు ఆదర్శంగా నిలబెట్టారు.
చంద్రశేఖర్ ఎం.ఎ, ఎం.సి.జె, డాక్టరేట్ పొందారు తెలంగాణ విశ్వ విద్యాలయంలో ప్రొఫెసర్‍గా ఉన్నారు. మొగిలయ్య సంతానం, కోడళ్ళు, మనవ సంతానం అందరూ ఉన్నత స్థానాల్లో ఉన్నారు.
మానేరు డ్యాం వల్ల ముంపుకు గురైన యాస్వాడను ఖాళీ చేసి తను పుట్టిన ఊరు ధూళికట్టకు వెళ్ళి, 200 ఎకరాలు భూమిని రైతులతో కలిసి ఉమ్మడిగా తీసుకొని వ్యవసాయక్షేత్రాన్ని, యాస్వాడపల్లెని ఏర్పాటు చేసారు.
తర్వాత మల్కాపూర్‍లో పిల్లలు కట్టిన ఇంటిలో ఉన్నారు. 87 ఏళ్ళ వయస్సులో అనారోగ్య సమస్యల వల్ల చక్రపాణి ఇంట్లో ఉంటున్నారు. మోకాళ్ళ నొప్పులు, శ్వాస సంబంధించిన చికిత్సలకోసం ‘నిమ్స్’లో చేరారు. కోలుకుంటు న్నారనుకున్న సమయంలో 2020 జనవరి 10వ తేదీ ఉదయం 8.45 గం।।లకు అల్పాహారం తింటూ గుండె నొప్పితో మరణించారు. వారికి ఘనమైన నివాళి.
ఒక తెలంగాణ గ్రామీణ నేపథ్యం నుంచి అత్యాధునికత వరకు చేసిన ఈ సుదీర్ఘ ప్రయాణమంతా ఒక సామాజిక పరిణామాల చరిత్రే.
‘‘మొగిలయ్య లాంటి మనుషుల కోసం
కాలం తలుపు తెరిచే ఉంచుతుంది’’ (- జూలురి గౌరీశంకర్).
జుగాష్‍విలి,
ఎ : 9030 6262 88