అవును…
అతడికి మరణం లేదు
అతడు నిత్యం చైతన్యప్రవాహమై
ప్రపంచాన్ని పహరాకాస్తూనే ఉంటడు
నదిలా కొత్తదారుల వెంట ప్రవహిస్తూనే
భూమండలమంతా పారుతూనే ఉంటడు
ప్రపంచ బాధను తనదిగా భావిస్తూనే
నిత్యం కలవరపడుతూనే ఉంటడు
ప్రపంచంలో ఏ మూలన ఏమి జరిగినా
మనసిరిగినట్టు విలవిల్లాడిపోతుంటడు
అతడు…అతడే
అతడికి మరణం లేదు
అన్ని కాలాల్లోనూ, అన్ని ఋతువుల్లోనూ
జరిగే సంఘటనలకు మౌనసాక్షవుతుంటడు
మది మెదళ్ళలో మెదిలే సంఘర్షణలకు
దిక్సూచియై లోకానికి దారిచూపుతుంటడు
అనేక ప్రశ్నలకు మౌనంగా సమాధానమిస్తూనే
ప్రజాస్వామ్యాన్ని ఎత్తిచూపుతూనే ఉంటడు
జీవితపు సుడిగుండంలో కొట్టుమిట్టాడుతుంటూనే
ఎన్నో గాయపడిన దేహాలకు లేపనమవుతుంటడు
అతడు…అతడే
అతడికి మరణం లేదు
అతడు ఒంటరిగా బతుకును సాగిస్తూనే
సమూహమై సమాజాన్ని ప్రక్షాళన చేస్తుంటడు
అంతరిక్షంలో ఎగిరే రాకెట్టులా దూసుకెళ్తూనే
లావాలా నిప్పుకణికలను ఎగజిమ్ముతుంటడు
చీకటికోణాలను చిటికెలో పట్టుకుంటూనే
నడిబజారు నగ్నత్వాన్ని బయలు చేస్తుంటడు
ఎన్నిసార్లు అతడు నెత్తినోరు మొత్తుకున్నా
ప్రజాస్వామ్య చిరునామా మనకు కనపడదు
అతడు…అతడే
అతడికి మరణం లేదు
- డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్
ఎ : 9032844017