కల్లోల కలల కాలం (సలాం హైదరాబాద్‍ – రెండవ భాగం : నవలా పరిచయం)


ఒక మనిషి – అనేక జీవితాలు
నవల సమకాలీన సమాజ చరిత్రను, జీవన సంబంధాలలోని వైరుధ్యాలను, మానవ జీవిత సంబంధాలలోని సంఘర్షణలను, విలువలను వ్యాఖ్యానించే ఆధునిక వచన సాహిత్య కళా పక్రియ నవల. దీనినే సాంఘిక నవల అంటున్నాం. ఇందులో సమకాలపు చరిత్ర ఘటనల గతిక్రమం నేపథ్యంగా ఉండవచ్చు. పాత్రలు, ఇతివృత్తం కల్పితాలై ఉంటాయి. కానీ కథ కల్పితమైనా సమకాలపు వాస్తవ సామాజిక ఆర్ధిక రాజకీయ సాంస్కృతిక పరిణామాలు గుర్తించదగిన పోలికలతో ఇతివృత్తంలో భాగమైతే అది డాక్యుమెంటరీ నవల. నిజమైన ప్రజలు, నిజమైన ఘటనలు నాటకీయ శిల్పంతో చెప్పబడటం డాక్యుమెంటరీ నవల లక్షణం. మాలపల్లి, చివరకు మిగిలేది, అతడు- ఆమె వంటి నవలలలకు అటువంటి లక్షణం ఉంది. రచయిత స్వీయ జీవిత అనుభవాలు కాల్పనిక ఇతివృత్తంతో మిళితమైనప్పుడు అది ఆత్మచారిత్రాత్మక నవల అవుతుంది. కొడవటిగంటి కుటుంబరావు చదువు, జీవితం వంటి నవలలు అలాంటి ఆత్మచారిత్రాత్మక నవలలు. అటు డాక్యుమెంటరీ నవల లక్షణాన్ని, ఇటు ఆత్మచరిత్రాత్మక నవల లక్షణాన్నికలుపుకొన్న సరికొత్త ప్రయోగం లోకేశ్వర్‍ గారి ‘కల్లోల కలల కాలం’ నవల. ప్రథమపురుష కథనం కాకపోతే ‘స్వీయ చరిత్ర’ అనటానికి వీలున్న రచన కూడా ఈ నవల. ఈ పద్ధతికి తెలుగులో ఇదే మొదటిది.


అంతేకాదు. ఈ నవలకు మరొక ప్రత్యేకత వుంది. లోకేశ్వర్‍ నవలా పరంపరలో ఇది రెండవది. పదిహేనేళ్ల క్రితం ఆ కాలానికి అవసరమైన, అద్భుతమైన నవలగా చర్చలోకి వచ్చిన ‘సలాం హైదరాబాద్‍’ లోకేశ్వర్‍ మొదటి నవల. దానికి కొనసాగింపు ఈ ‘‘కల్లోల కలల కాలం’’ నవల. దీనికి కొనసాగింపుగా మరొక నవల వచ్చే అవకాశం కూడా ఉంది. స్వతంత్ర నవలగా ప్రత్యేకమైన శీర్షికతో, కథాక్రమంతో ఉంటూనే ఒక సాధారణ కథాంశంతో, పాత్రలతో ఒక సుదీర్ఘ కాలక్రమంలో సంభవించే సామాజిక పరిణామాలను చిత్రిస్తూ వ్రాయబడే నవలలు ఇవి. వీటిని ‘సీక్వెల్‍ నవలలు’ అని కూడా అంటారు. ఇలాంటి నవలల రచన చేసినవాళ్లు తెలుగులో ఇద్దరు ముగ్గురిని మించి లేరు.


వీళ్లకు ఆద్యుడు ఉప్పల లక్ష్మణరావు గారే కావాలి. 1950లో ప్రచురించిన ‘అతడు- ఆమె’ నవలకు కొనసాగింపుగా అదే పేరుతో, అవే పాత్రలతో మరొక మూడు భాగాలు 1986 వరకు అప్పుడప్పుడూ ప్రచురించారు. అవి వేటికవిగా చదువుకోదగినవే. జాతీయోద్యమ కాలం నుండి ప్రత్యేక తెలంగాణా (1969) ఉద్యమం వరకు దాదాపు అర్ధ శతాబ్ది కాలం మీద సంభవించిన పరిణామాలను ఆరు పాత్రల (ముగ్గురు స్త్రీలు – ముగ్గురు పురుషులు) ముఖంగా వ్యాఖ్యానిస్తూ వ్రాసిన నవల అది. 1969లో వ్రాసిన ‘అంపశయ్య’ నవలకు కొనసాగింపుగా నవీన్‍ రవి అనే ప్రధాన పాత్రను అలాగే కొనసాగిస్తూ అతని జీవితంలోని భిన్నదశలు వస్తువుగా ముళ్లపొదలు (1976) ‘అంతస్స్రవంతి’ (1991) నవలలు వ్రాసారు. ఆ తరువాత మళ్ళీ ఆయనే 1944 నుండి 1994 వరకు యాభై ఏళ్ల కాలం మీద తెలంగాణ సమాజ చరిత్రను రాజకీయ ఆర్ధిక పరిణామాలను చిత్రిస్తూ రాజు అనే పాత్ర జీవిత గమనాన్ని వస్తువుగా చేసి 2001లో వ్రాసిన నవలలు కాలరేఖలు (2002), చెదిరిన స్వప్నాలు (2003) బాంధవ్యాలు (2001).


లోకేశ్వర్‍ 2005లో ప్రచురించిన ‘సలాం హైద్రాబాద్‍’ నవల ఇతివృత్తంలో 1578 నుండి 1970 జులై వరకు గడచిన కాలంమీద, హైదరాబాద్‍ చరిత్ర, సంస్కృతీ సంప్ర దాయాలు, నగర జీవితం ఒక పాయ. ఆకాలంలో, ఆస్థలంలో నడిచిన రాజకీయాలు, ఉద్యమాలు మరొక పాయ. ఆ రెండింటి సంబంధంలో ప్రధాన పాత్ర స్వామి జీవిత పరిణామాలు మూడవపాయ. వెరసి మూడుపాయల జడ అల్లిక ఆ నవల. ఆ నవలలో కథ నిజానికి 2005 జూన్‍ 10 వతేదీన ఇరానీ హోటల్లో కూర్చొని చార్మినార్‍తో స్వామి చేస్తున్న ఏకాంత సంభాషణ దగ్గర ప్రారంభమై గతించిన జీవితపు జ్ఞాపకాల తలపోతగా 1969 అంతటా పరుచుకొని 1970 జులైలో ఆగుతుంది. ఆ నవలలోని స్వామి జీవితపు కొనసాగింపు ఈ నవల. 1969లో 17 సంవత్సరాల వయసు పిల్లగాడైన స్వామి అనుభవాలు, చింతన మొదటి నవలలో చిత్రించ బడితే ‘కల్లోల కలల కాలం’ నవల లోకథ 1970 సెప్టెంబర్‍ ఆఖరి వారంలో ప్రారంభమై 1989 వరకు ఇరవైఏళ్ళ కాలం మీద విస్తరించుకొని హైద్రాబాద్‍ కేంద్రంగా జాతీయ అంతర్జాతీయ రాజకీయార్థిక పరిణామాలను పరామర్శిస్తూ వాటికి స్పందిస్తూ పరిణమిస్తున్న స్వామి వ్యక్తిత్వాన్ని ఆవిష్కరిస్తుంది. నిజానికి ఇందులో కథ 2013 నవంబర్‍ 17 ఆదివారం ఉదయం స్వామి పేపర్‍ చదువుతూ కృష్ణా టాకీసు కూల్చివేత వార్తతో కలత చెందటం దగ్గర ప్రారంభమై అతని జ్ఞాపకాల తలపోతగా 1970 సెప్టెంబర్‍ దగ్గరకు వెళ్లి స్వామి జీవిత సంఘర్షణలను, పరిణామాలను చిత్రిస్తూ విస్తరించింది.


పుట్టి పెరిగిన ఊరి మీద ప్రేమ ఎవరికైనా సహజం. ఆ ఊరి చరిత్రను సృజన రూపంలో ఆవిష్కరించటం కొందరికే సాధ్యం. పుట్టుక, ఎదుగుదల, జీవితం అన్నీ హైద్రా బాద్‍ తోటే ముడిపడి వున్న లోకేశ్వర్‍ వ్యక్తిత్వంలో అది విడదీయరాని భాగం. అందుకనే హైద్రాబాద్‍ నగరం గురించి వ్రాయాలనుకుంటే అనివార్యంగా అది అతను తనను తాను తెలుసుకొంటూ తన అనుభవకోణం నుండి నగరాన్ని దర్శించి ప్రదర్శించటంగా ఈ నవల రూపొందింది..
లోకయాత్ర మహా ఇష్టమైన మనిషి లోకేశ్వర్‍. స్కూటర్‍పై ఛత్తీస్‍ ఘర్‍ యాత్ర, సిల్క్ రూట్‍ సాహస యాత్ర, యూరప్‍ యాత్ర, నల్లమల దారులలో యాత్ర చేసి వచ్చి యాత్రాకథనాలను వ్రాసి ప్రచురించిన అభిరుచి ఆయనది. ఆ యాత్రికుడి స్వభావం ఈ నవల కథనంలోనూ కనబడుతుంది. హైద్రాబాద్‍లో స్వామి తిరుగాడిన ప్రాంతాలు, ఇతివృత్తంలో ప్రధాన ఘటనలు సంభవించిన స్థలాలను, పాత్రల కార్యక్షేత్రాలను పరిచయం చేసే సందర్భాలలోను పాత్రల మధ్య జరిగే సంభాషణల రూపంలోనూ హైద్రాబాద్‍ నగరంలోని కోమటికుంట వంటి చెరువులను గౌలీ గూడా బస్‍ డిపో, లాల్‍ దర్వాజా, అప్సరా టాకీస్‍, ఫూల్‍ బాగ్‍ చమన్‍, శాలిబండా రూప్‍ లాల్‍ బజార్‍ చమన్‍, లలితాబాగ్‍ బస్తీ, ఉప్పుగూడా హరిజన బస్తీ, అలియాబాద్‍ బస్తీ, నయాపూల్‍, సైదా బాద్‍, నౌబత్‍ పహాడ్‍, ఎల్బీ స్టేడియం, సుల్తాన్‍ బజార్‍, హిమాయత్‍ నగర్‍, బీహెచ్‍ఇఎల్‍ టౌన్‍ షిప్‍, హైద్రాబాద్‍ సెంట్రల్‍ యూనివర్సిటీ, ఆబిడ్స్, సికింద్రాబాద్‍ ఇలా అనేక ప్రాంతాలను మనకు పరిచయం చేస్తారాయన. స్వామి ఇష్టపడి పెళ్లిచేసుకున్న అక్క కూతురు ఆంజల్య కోసమో, కమ్యూనిస్టు పార్టీ శిక్షణ తరగతులు, సభలు సమావేశాల కోసమో వరంగల్‍, విశాఖ వంటి ఊళ్లకు వెళ్లిన సందర్భాలలో ఆ ఊళ్ళు కూడా ఒక భౌగోళిక భౌతికత, రాజకీయ తాత్వికత కలగలసిన స్వామి చూపు నుండి అవి పాఠకులకు పరిచయం అవుతాయి. పొరకల దొర దాసరి లక్ష్మీకాంతం గురించి తెలుసుకొనటానికి వరంగల్‍ నుండి బెల్లంపల్లి, ఆసిఫాబాద్‍, కాగజ్‍ నగర్‍, పాల్వంచ వరకు స్వామి చేసిన ప్రయాణంలో మనమూ అతనితో పాటు ఉన్నట్లే, తెలుసుకొంటున్నట్లే ఉంటుంది. అందువల్ల యాత్రాచరిత్ర లక్షణాలు కలిగిన నవలగా కూడా దీనిని గుర్తించవచ్చు.


1970 నుండి 1990 వరకు భారతదేశంలో రైల్వే సమ్మె, ఎమర్జెన్సీ, ఎన్నికలు, ప్రభుత్వాలు మారటం, స్వర్ణదేవాలయంపై ఆపరేషన్‍ బ్లూస్టార్‍ పేరిట జరిగిన దాడి, ఇందిరాగాంధీ హత్య అనంతర పరిణామాలు వంటి అనేక చారిత్రక ఘటనలతో, ప్రత్యామ్నాయ ప్రజా రాజకీయాలను సహించలేని అణచివేత పక్రియలతో పార్లమెంటరీ ప్రజాస్వామ్య గమనం ఎలా సాగిందో దానిని వెలుగునీడలతో సహా మనుషుల అనుభవ కోణం నుండి తెలుసుకొనటానికి ఈ నవల ఒక మంచి వనరు. ప్రత్యేకించి ఆంధ్రదేశంలో హైద్రాబాద్‍ కేంద్రంగా ఉభయ కమ్యూనిస్టుపార్టీల నుండి నక్సలైట్‍ పార్టీల వరకు ప్రత్యామ్నాయ ప్రజా రాజకీయాల నిర్మాణ ఆచరణల స్వభావం గురించి సాధికారమైన విమర్శనాత్మక చర్చ ఈ నవల ఇతివృత్తంలో సహజ భాగం అయింది. హైద్రాబాద్‍లో ఉభయ కమ్యూనిస్టు పార్టీల నిర్మాణ కార్యాచరణలలో భాగమైన స్వామి అతని మిత్రబృందం అనుభవాలు సంభాషణలు హైద్రాబాద్‍ పారిశ్రామిక జీవనాన్ని, కార్మిక చైతన్యాన్ని తెలియచేస్తాయి.


నక్సలైట్‍ విప్లవ రాజకీయాలకు తొలి సిద్ధాంత కర్త అయిన చారుమజుందార్‍ దగ్గర నుండి విరసం రచయితలు, కళాకారులపై మోపబడిన కుట్రకేసులు, అరెస్టులు, జైళ్లు మొదలైన విషయాలు, హైద్రాబాదులో ఆ మధ్యకాలంలో జరిగిన రాజకీయ సభలనుండి సాహిత్య సభల వరకు అనేకం, అనేకమంది రాజకీయ సాహిత్య కళా సాంస్కృతిక రంగాలకు చెందిన వ్యక్తులు, రచనలు కళ్ళముందు కదిలిపోయే దృశ్యాలు. అలాగని ఇది కేవలం రాజకీయ నవల కాదు. వాటితో పెనవేసుకొని, సంఘర్షిస్తూ మారుతూ మార్పిస్తూ, విభేదిస్తూ, అర్ధం చేసుకొంటూ సాగిపోయే మానవసంబంధాల స్రవంతి బహు ఆసక్తికరంగానూ, ఆహ్లాదంగానూ కూడా ఉంటుంది. సామాజిక సంవేదనా శీలిగా నూతన సమాజాన్ని కలలుకనే యువకుడుగా చేసిన ప్రయాణంలో స్వామి కుటుంబం పట్ల బాధ్యతగా ఉండటం కూడా ఒక భాగమే. అతనికి అందమైన ప్రేమకథ కూడా ఉంది. అక్క కూతురు ఆంజల్య పుట్టుకతోనే నిర్ణయించబడిన వధువు అయినా ఇద్దరిలో పరస్పరం మొగ్గతొడిగి వికసించిన స్నేహానురాగాల నుండి భావాలు, ఆదర్శాలు కలిసి చేసుకొన్నపెళ్లే వాళ్ళది. వాళ్ళిద్దరిమధ్య నడిచిన ఉత్తరాలు అందుకు నిదర్శనం.


ఆంజల్య వరంగల్‍ అమ్మాయి. ప్రభుత్వ పింగిళి కళాశాల విద్యార్థి. ఆ అమ్మాయి స్వామికి వ్రాసిన ఒక ఉత్తరంలో హైద్రాబాద్‍ నుండి పీవోడబ్ల్యూ లలిత వాళ్ళు వచ్చి ఒక మీటింగ్‍ పెట్టిన విషయం ప్రస్తావించబడింది. అది ఆ కాలేజీ బిఎ విద్యార్థిగా నేను కూడా అప్పుడు ఆ మీటింగ్‍కు హాజరైన సంగతిని గుర్తుకు తెచ్చింది. సమకాలీన సమాజచరిత్రతో నడుస్తూ సర్వేంద్రియాలతో తాను గ్రహించినదానిని చైతన్యంతో విలువకడుతూ లోకేశ్వర్‍ వ్రాసిన ఈ ‘కల్లోల కలల కాలం’ నవల ఇతివృత్తానికి ఉన్న భిన్న సామాజిక రాజకీయ సంఘటనల విస్తృతి దృష్ట్యా, భిన్న సామాజిక అనుభవ అంతరాలతో ఉన్న ప్రజల జీవితాన్ని చుట్టుకొని నడిచినందువల్ల ఒక ఐతిహాసిక స్వభావాన్ని పొందింది.


ఈ నవలకు నన్ను మొదటి పాఠకురాలిని చేసి ఈ మాటలు వ్రాసే అవకాశం ఇచ్చిన లోకేశ్వర్‍ గారికి కృతజ్ఞతా పూర్వకమైన అభినందనలు.

కాత్యాయనీ విద్మహే
పశ్యంతి, వరంగల్‍.
(‘కల్లోల కలల కాలం’కి ముందుమాట)


× × ×


ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఇది మా తరం కథ. స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో జన్మించిన వారి కథ. 1948లో హైద్రాబాద్‍ రాజ్యంపై పోలీస్‍ యాక్షన్‍ జరిగి 1951 నాటికి తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటం ముగిసిన మధ్య కాలంలో జన్మించిన మా తరం వారి కథ. వ్యక్తిగతంగా, సామాజిక – రాజకీయ పరంగా మాతరం అనుభవించిన ‘ఆత్మక్షోభ’ కథ. ‘‘కాలం కత్తుల వంతెన’’ మీద కదను తొక్కిన ‘‘కన్నీటి కాలం కథ’’. నెత్తురు నిండి శక్తులు మండిన మా తరం కన్న కలలన్నీ కల్లోలానికి గురై కల్లలుగా మారి జీవితమే ఒక ‘‘పగిలిన అద్దం’’లా మిగిలిన మా తరం కథ.
ఖండిత శిరస్సు తెగిపడి నేల వాలినా ఆ కళ్లల్లోని ధిక్కార స్వభావాన్ని మాత్రం కోల్పోని తరం మాది. స్వాతంత్య్రోద్యమ తరానికి ఎటువంటి సమున్నత ‘‘స్వాభిమానం’’ ఉండేదో సరిగ్గా అట్లాంటి ‘‘స్వాభిమానమే’’ మా తరానిది కూడా! చేసిన యుద్ధాలలో క్షతగాత్రులమైనా, మనసులోపలి గాయాలు మానకుండా ఇంకా పచ్చిగానే సలుపుతున్నందున, గతం చేసిన గాయాలను గానం చేసి ఈ తరం వారికి అర్థం అయ్యేలా చెప్పటం కోసమే చేసిన యాత్ర ఈ ‘‘అక్షర యానం’’. సుదీర్ఘంగా ఎడతెగని ఈ ‘‘విషాదగానం’’. స్వాతంత్య్రానంతరం కాలం కనిన బిడ్డల ‘‘కన్నీటి గానమే’’ ఒక దుఃఖపూరిత గానంగా, ఒక పురాగాధగా ఒక సుదీర్ఘ కావ్యంగా, ఒక అక్షర సత్యంగా మీ ముందు నిలబడింది.


‘‘సలాం హైద్రాబాద్‍’’ నవల మొదటి భాగం వచ్చి (2005) దాదాపు పదిహేను సంవత్సరాలు. ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధనలో ఆ నవల తన వంతు పాత్రను నిస్సందేహంగా నిర్వహించింది. ఆ నవల వచ్చిన కొత్తలో చాలా మంది మిత్రులు, పాఠకులు రెండవ భాగం కూడా త్వరగా రాయాలని తొందరపెట్టారు, కోప్పడ్డారు. మరికొంతమంది అలిగి స్నేహం మానుకుంటామని బెదిరించారు. రెండవ భాగం రాయటంలో ఆలస్యానికి కారణం ఉద్యమంలో నేను చురుకుగా వివిధ ప్రజాసంఘాలలో పాల్గొనటమే గాక నడుస్తున్న ఉద్యమాన్ని సాంఘీక శాస్త్రాల విద్యార్థిగా అనేక కోణాల నుండి పరిశీలించటం. రాష్ట్ర సాధన జరిగి ఐదు సంవత్సరాలు ముగిసిన తర్వాత ఇప్పుడు ఇట్లా మీ ముందుకు ఈ రెండవ భాగంతో హాజరవుతున్నాను.
‘‘సలాం హైద్రాబాద్‍’’ మొదటి భాగం 1970 జులైలో ముగిసింది. ప్రస్తుతం ఈ రెండవ భాగం నవలలో 1970 నుండి 1989 చివరి వరకు ఇరవై సంవత్సరాల కాలాన్ని రికార్డు చేసాను.


-పరవస్తు లోకేశ్వర్‍, ఎ: 91606 80847

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *