(గత సంచిక తరువాయి)
సలాబత్ జంగ్ అతని సైన్యం గుల్బర్గాలో మకాం వేసిన సమయంలో బుస్సీ అనారోగ్యం పాలయిండు. వైద్యుల సలహా మేరకు సేదదీరడం కోసం మచిలీపట్నంకు వెళ్ళిండు. అయితే ఫ్రెంచ్ సైన్యం అంతా నిజాం యిలాకాలోనే ఉండింది. ఆ తర్వాత కొద్దిరోజులకు సలాబత్ జంగ్ హైదరాబాద్ చేరుకుండు. ఈ దశలో దివాన్ లష్కర్‍ఖాన్ ఫ్రెంచ్ వారికి వ్యతిరేకంగా పనిజేసిండు. మొదటి నిజాం ప్రభుత్వంలో సర్వసైన్యాధ్యక్షుడిగా పనిజేసిన లష్కర్‍ఖాన్ ఫ్రెంచ్ వారి ప్రాబల్యం పెరిగి పోయిన తర్వాత తనకు అంతగా గౌరవం దక్కడం లేదని భావించాడు. బుస్సీ హైదరాబాద్‍లో లేని సమయంలో ఒక ఎత్తుగడ ప్రకారం ఫ్రెంచ్ మిలిటరీ అధికారులను జిల్లాల్లో రెవిన్యూ వసూళ్ళు రాబట్టడానికి పంపించాడు. అప్పటికే చాలా ప్రాంతాల్లో ఖజానాకు బకాయిలున్నాయి. ఫ్రెంచ్ సైన్యాధికారులు తమ జీత భత్యాలను మినహాయించుకొని వసూలు చేసిన సొమ్ముని ఖజనాలో జమచేయాలని లష్కర్‍ఖాన్ ఉత్తర్వులు జారిచేసిండు. ఇట్లా ఫ్రెంచ్ అధికారులు రెవిన్యూ వసూళ్ళకు వెళ్ళినట్లయితే ప్రజల్లో వారిపై వ్యతిరేకత పెరుగుతుందనేది ఎత్తుగడ. దాంతో వారిని హైదరాబాద్ నుంచి బయటికి పంపించడం సుళువైతుందని అంచనా! మరోవైపు రహస్యంగా ఫ్రెంచ్ సైనికులకు జీతాలు చెల్లించకుండా ఆపించిండు. అంతేకాదు ఫ్రెంచ్ సైనికుల సేవలను రద్దు చేస్తూ సలాబత్ జంగ్ చేత ఉత్తర్వులు జారీ చేయించాడు. ఇదంతా తెలుసుకున్న బుస్సీ పూర్తిగా కోలుకోక ముందే హైదరాబాద్‍కు చేరుకొని తమకు రావాల్సిన బకాయిల కోసం చార్మినార్‍ని ముట్టడించాడు. తమ అధీనంలోకి తెచ్చుకుండు. చివరికి సలాబత్ జంగ్ బుస్సీని సగౌరవంగా ఆహ్వానించి అతని పూర్వపు హోదా కల్పించడంతో సమస్య సద్దుమణిగింది. ఇది 1753లో జరిగింది. దీని గురించి గతంలో ఇదే కాలమ్‍లో రాయడమయింది. ఈ సంఘటన తర్వాత కూడా ఫ్రెంచ్ సైన్యం నిజామ్ ప్రభుత్వానికి అండగా నిలిచింది. డూప్లెక్స్ తర్వాత కౌంట్ లాల్లీ ఫ్రెంచ్ కంపెనీకి నేతృత్వం వహించాడు.
1760లో అహ్మద్‍నగర్ ఖిలేదారు మరాఠాలకు అమ్ముడుపోయి ఖిలాను వారికి దారదత్తం చేసిండు. అయితే అప్పటికే నిజాం ప్రభుత్వం సైనికులకు బకాయిలుండడంతో వారెవ్వరూ యుద్ధానికి సన్నద్ధంగా లేరు. మీదు మిక్కిలి అప్పుడే నిర్మల్ దేశ్‍ముఖ్‍తో కూడా పోరాటం జరగడంతో బలగం బలహీనమయింది. వీటన్నింటి దృష్ట్యా ఎన్నో ఏండ్లుగా తమ అధీనంలో ఉన్నటువంటి అహ్మద్‍నగర్ కోటను కోల్పోవాల్సి వచ్చింది. (బ్రిగ్స్- ది నిజామ్ మొదటి సంపుటం). అయినప్పటికీ ఓటమి ఒప్పుకోకుండా తన తమ్ములతో సఖ్యత చేసుకున్నడు. ఖైదునుంచి విడుదల చేసిండు. వారిని వెంట బెట్టుకొని యుద్ధానికి సన్నద్ధమయిండు. అహ్మద్‍నగర్ కోటను స్వాధీనం చేసుకునేందుకు సలాబత్ జంగ్, అతని సోదరుడు నిజామ్ అలీలు సర్వ సైన్యంతో అహ్మద్‍నగర్‍కు బయలుదేరినప్పటికీ మధ్యలోనే మరాఠాలు యుద్ధతంత్రంలో భాగంగా రెచ్చగొట్టే పోరాటాలు చేసిండ్రు. మరాఠాలు వేసిన పాచికలో పావులై ఎక్కువ ఆయుధాలను నిజామ్‍లు ఖర్చుబెట్టిండ్రు. ఆఖరికి ఈ యుద్ధంలో మరాఠాలకు బీజాపూర్ తదితర కోటలను సమర్పించుకొని ప్రాణహాని లేకుండా నిజామ్ అలీ దౌత్యంతో సలాబత్ బతికి బయటపడ్డారు. ఇట్లా హైదరాబాద్‍కు తిరిగి వస్తున్న సమయంలో అదును చూసుకొని 1762 జూలై ఎనిమిదిన (ఇది 1761 జూలై 18 అని కొంతమంది రాసిండ్రు) తన అన్న సలాబత్ జంగ్‍ని నిజామ్ అలీ బందీగా చేసి బీదర్ కోటలో ఉంచుతాడు. దీంతో తెలంగాణ/హైదరాబాద్ రాజ్యంలో సుబేదార్‍ల పాలన ముగిసి మళ్ళీ నిజామ్‍ల పాలన ప్రారంభమయిందని చెప్పవచ్చు. సలాబత్ జంగ్ బీదర్ కోటలోనే 16 సెప్టెంబర్ 1763లో చనిపోయిండు. దీంతో శవాన్ని హైదరాబాద్ తీసు కొచ్చి మక్కామసీదులో ఖననం చేసిండ్రు. (బీదర్‍లోనే ఖననం చేసినట్లు మరో దగ్గర రాసి ఉంది).
మొదటి అసఫ్జాహీ రాజు నిజాముల్ ముల్క్ మొదటి ప్రధాన మంత్రి హిందువు. 1723లో నిజామ్ దివాన్‍గా రాజా దీనానాథ్ నియమితుడయిండు. (బ్రిగ్స్ – నిజామ్ మొదటి సంపుటం) దీనానాథ్ తర్వాత నిజామ్‍ల దగ్గర దివాన్‍గా అత్యున్నత పదవిలో పనిచేసింది తెలుగువాడయిన రామదాసు పండిట్. ఈయన శ్రీకాకుళంకు చెందిన వాడు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే ఫ్రెంచ్‍వారి ప్రాపకంతో శ్రీకాకుళంలో ఫౌజుదార్‍గా ఉన్నటువంటి రామదాసు పండిట్ తన కుతంత్రాలు, కుట్రలతో పేష్కర్ బక్షీగా, ఆ తర్వాత దివాన్‍గా ఎదిగిండు. నాసిర్‍జంగ్ సైన్యానికి జీతాల చెల్లింపులన్నీ ఈతని నేతృత్వంలోనే జరిగేవి. ఇతను నాసిర్‍జంగ్ దగ్గర ఉద్యోగిగా ఉన్నప్పటికీ లోపాయకారిగా ఫ్రెంచ్ వారికి సహాయం చేసేవాడు. శ్రీకాకుళం జిల్లాలో ఫౌజ్‍దారుగా ఉన్నటువంటి ఈ నల్ల బాపనాయిన రామదాసు పండిట్ అక్కడి ఫ్రెంచ్ వారి ప్రాపకంతో నిజామ్ కొలువులో చేరిండు. నాసిర్ జంగ్ దగ్గర సైన్యానికి డబ్బులు చెల్లించే పేష్కారుగా ఉన్నాడు. ఆయన పనిచేసేది నాసిర్‍జంగ్ దగ్గరే అయినప్పటికీ ఆయన బద్ధ వ్యతిరేకులైన ఫ్రెంచ్ వారికి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తూ వారి ప్రాపకం పొందుతూ ఉండేవాడు. అయితే డూప్లెక్స్ సూచనల మేరకు కర్నూలు నవాబు హిమ్మత్‍ఖాన్ ద్వారా నాసిర్‍జంగ్‍ని కుట్రపూరితంగా చంపిస్తాడు. (బ్రిగ్స్ – ది నిజామ్ మొదటి సంపుటం). బుస్సీ సూచనల మేరకు తర్వాతి కాలంలో ముజఫర్ జంగ్ రామదాసు పండిట్‍కు ‘రాజా రఘునాథ్ దాస్’ బిరుదు ఇవ్వడమే గాకుండా ప్రధానమంత్రి హోదాను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారి చేసిండు. ప్రధానమంత్రి హోదాలో ఉంటూ కూడా ముజఫ్ఫర్ గుట్లన్నీ ప్రత్యర్థులకు ఎరుక పరిచింది రామదాసు పండిట్.
రామదాసు పండిట్ ఫ్రెంచ్ వారి ప్రాపకంలోకి రావడానికి అబ్దుర్ రెహ్మాన్ అనే అతను కారణం. అబ్దుర్ రెహ్మాన్ తండ్రి కొన్ని అప్పులు చేసి, కప్పం కట్టకుండా తప్పించుకు పోవడంతో అతనిపై నిజాం సైన్యం నిఘా వేసింది. ఈ దశలో ఆయన శిక్షనుంచి తప్పించుకునేందుకు పాండిచ్చేరిలో ఫ్రెంచ్‍వారి ఆశ్రయం తీసుకున్నడు. తండ్రితోపాటు చిన్నతనం నుంచి పాండిచ్చేరిలోనే పెరిగిన అబ్దుర్ రెహ్మాన్ ఫ్రెంచ్ నేర్చుకోవడమే గాకుండా వారికి దుబాసీగా, రాయబారిగా, నమ ్మకస్తుడైన వ్యక్తిగా పనిచేసిండు. ఈ అబ్దుల్ రెహ్మాన్ తాను శ్రీకాకుళం ఫౌజుదారుగా ఉన్నప్పుడు రామదాసు పండిట్ చాకచక్యాన్ని, నేర్పుని గ్రహించి అతన్ని ఫ్రెంచ్‍వారికి పరిచయం చేసిండు. (జేమ్స్ డఫ్ గ్రాంట్ – ది మరాఠాస్). ఇట్లా తన స్కిల్స్తో రామదాసు పండిట్ ప్రధానమంత్రి పదవి వరకూ ఎదిగిండు.
ఆ తర్వాత ముజఫ్ఫర్ జంగ్ హత్య తర్వాత అంతకు ముందటి పదవిలోనే రామదాసు పండిట్ కొనసాగిండు. ముజఫర్ జంగ్ అవసరం తీరిన తర్వాత డూప్లెక్స్ అతన్ని వదిలించుకోవాలను కున్నాడు. దాంతో మళ్ళీ ఆయన రామదాసు పండిట్‍ని ఉపయోగించు కున్నాడు. ఈ దశలో రామదాసు పండిట్ కడప నవాబును హత్యకు పురమాయిస్తాడు. కడప జిల్లా లక్కిరెడ్డి పల్లెలో మకాం చేసిన సైన్య శిబిరంలో కడప నవాబు ఈటెను విసిరి ముజఫ్ఫర్ జంగ్‍ని హతమారుస్తాడు అయితే అతను చనిపోయిన విషయం సైనికులకు తెలిస్తే గొడవ జరుగుతుందనే ఉద్దేశ్యంతో అతడు కేవలం గాయపడ్డాడు అని భ్రమిప జేస్తు కుర్చీలో కూర్చుండబెట్టి క్యాంప్‍కు రామదాసు తానే దగ్గరుండి తరలింపజేస్తాడు. అతడు చనిపోయిండని నిర్ధారణ జరిగిన తర్వాత అదే క్యాంపులో బందీగా ఉన్నటువంటి సలాబత్ జంగ్‍ని విడుదల చేసి అతనికి పదవిని కట్టబెడతారు. దీంతో సలాబత్ జంగ్ తనకు అన్ని విధాల సహకరించిన రామదాసు పండిట్‍ని దివాన్‍గా నియమిస్తాడు. తాను ప్రధానిగా ఉన్న సమయంలో కొల్లాపూర్ (సతారా)కు చెందిన రాణి తారాబాయితో రాజకీయ చర్చలు జరిపిండు. సలాబత్ జంగ్- రాణిల మధ్యన సయోధ్యను కుదర్చిండు. అట్లాగే లక్షల రూపాయల లావాదేవిలను రామదాసు పండిట్ చేసేవాడని ఆనంద రంగం పిళ్ళై డైరీల ద్వారా తెలుస్తుంది. రామదాసు పండిట్ మేనల్లుడు కోదండరామ్ కూడా సలాబత్ జంగ్ కొలువులో పేష్కర్‍గా ఉన్నతోద్యోగంలో ఉన్నాడు. అంటే తన పరపతి ద్వారా అనేక మందికి ఈయన కొలువులిప్పించాడని అర్థమయితుంది.
అయితే ఈతని హత్యా రాజకీయాలను దగ్గరి నుంచి గమనిస్తూ ఉన్నటువంటి వఫాదార్లయిన సైనికులు తమకు చెల్లించాల్సిన జీత భత్యాలు సమాయానికి చెల్లించడంలో రామదాసు పండిట్ విఫలమయ్యాడనీ, ఇందుకు ఆయన తలబిరుసు తనమే కారణమని గ్రహించి ఏప్రిల్ ఏడు 1752 నాడు మహరాష్ట్రలోని భాల్కిలో సైనికులు రామదాసు పండిట్‍ని నరికి చంపుతారు. అయితే రామదాసు పండిట్ డబుల్ క్రాస్ చేసిండు. దక్కన్ నుంచి ఫ్రెంచ్‍వారిని తరిమికొట్టే
ఉద్దేశంతో వారి గుట్టుమట్లన్నీ బ్రిటీష్ వారికి అందజేస్తూ ఉండడంతో ఆయన హత్యకు గురయ్యిండని ఛాబ్రా రాసిండు. రామదాసు చనిపోయిన సమయంలో సలాబత్ జంగ్ హైదరాబాద్‍లో ఉన్నడు. అయితే తన దివాన్‍లో అత్యంత సమర్ధులయిన లష్కర్ ఖాన్, షానవాజ్ ఖాన్‍లను ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్‍కు రమ్మని ఆహ్వానం పలికిండు. వారిద్దరు వచ్చిన తర్వాత లష్కర్ ఖాన్‍ని దివాన్‍గా నియమిస్తాడు. ఇతను ఘాజియుద్దీన్‍కు చాలా దగ్గరి మనిషి. అందుకే అన్నదమ్ముల మధ్యన యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు విజ్ఞతను ప్రదర్శించి దాన్ని నివారించాడు. బుస్సీని కూడా అందుకు ఒప్పించిండు.
దివాన్ (ప్రధానమంత్రి)గా నియమితులైన లష్కర్‍ఖాన్ ఫ్రెంచ్‍వారి పంజరంలోంచి సలాబత్ జంగ్‍ని బయటపడేయటానికి ప్రయత్నించాడు. అనారోగ్య కారణాల వల్ల బుస్సీ రాజధానికి దూరంగా ఉన్న సమయంల ఈయన సలాబత్ జంగ్‍ని ఒప్పించి తన సైన్యంలో భాగమైన మొత్తం యూరోపియన్లను వెనక్కి పంపించేందుకు ఏర్పాట్లు చేసిండు. అయితే అనారోగ్యం నుంచి కోలుకున్న బుస్సీ ఈ విషయం తెలుసుకొని లష్కర్ ఖాన్ స్థానంలో షానవాజ్ ఖాన్‍ని దివాన్‍గా నియమింప జేసిండు.
1762లో నిజాం అలీఖాన్ అధికారం చేపట్టిన తర్వాత షానవాజ్ ఖాన్ స్థానంలో రాజా పర్వత్ వంత్ అనే మరో బ్రాహ్మణున్ని దివాన్‍గా నియమించుకున్నడు. ఈతని గురించి తర్వాత వివరంగా తెలుసుకుందాం.
దీన్ని బట్టి అర్థమయ్యేదేమిటంటే కుతుబ్‍షాహీల కాలంలోనే కాదు ఆ తర్వాత కూడా హిందువులను ముఖ్యంగా బ్రాహ్మణులను దివాన్‍లుగా నియమించే పరంపర కొంతమేరకు కొనసాగింది. నిజాం రాజులు సున్నీలయితే ప్రధానమంత్రులుగా షియాలను లేదంటే హిందువులను నియమించుకునేవారు. ఈ పరంపర చివరి వరకూ కొనసాగింది. బ్రాహ్మణ ప్రధాన మంత్రుల చీకటి కార్యక్రమాలు ఇంతవరకూ తెలుగు పాఠకులకు అంతగా తెలియవు. అంతేగాదు మొదటి నిజామ్-రెండో నిజామ్ మధ్యన దక్కన్ సుబేదార్లుగా నిలిచిన నిజామ్ కుటుంబీకుల పాలన గురించి కూడా సమగ్రంగా ఎక్కడా రికార్డు కాలేదు. అయితే ఇంగ్లీషు పుస్తకాల్లో, అప్పటి ట్రావెలాగ్స్, ఉర్దూ చారిత్రక గ్రంథాల్లో కొంత మేరకు రికార్డయింది. వాటి ఆధారంగా ఈ వ్యాసం తయారయింది. చీకట్లో కనుమరుగవుతున్న తెలంగాణ చరిత్రను వెలుగులోకి తెచ్చే ప్రయత్నమిది. అందులో భాగమే ఈ వ్యాసం.
జెడిబి గ్రిబుల్, బ్రిగ్స్, సయ్యదలీ బిల్‍గ్రామి, ఇంకా అనేకమంది నిజాముల తొలి పాలన గురించి సవివరంగా రాసిండ్రు. ఆనందరంగ పిళ్ళై డైరీల్లోనూ ఆనాటి హైదరాబాద్ చరిత్ర చాలా వరకు తేదీలతో సహా నమోదయింది. ఉర్దూ పుస్తకాల్లోని సమాచారం చాలా వరకు హైదరాబాద్‍లోనే అందుబాటులో ఉన్నప్పటికీ ఇప్పటికీ తెలుగులోకి రాలేదు. ఇరు భాషా ప్రేమికుల మధ్య తర్జుమా సంబంధాలు ఉన్నట్లయితే ఆ యా విషయాలు అందరికీ తెలిసేవి. అట్లా అందరికీ అందుబాటులోకి ఆకరాలు వచ్చినప్పుడే చరిత్ర సమగ్రమయితది.
(సమాప్తం)
-సంగిశెట్టి శ్రీనివాస్,
ఎ : 9849220321