హిమాయత్‌నగర్ ఆక్స్ఫర్డ్ పాఠశాలలో బాలచెలిమి 23వ ముచ్చట్లు
బాల చెలిమి పిల్లల వికాస పత్రిక, చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ సంయుక్తాధ్వర్యంలో ‘బాలచెలిమి’ తెలంగాణా బడి పిల్లల కథలు తెలుగు రాష్ట్రాల బాల సాహితీవేత్తలు, చిత్రకారులు, బాలవికాస కార్యకర్తలు-అంతరంగాలు అనే అంశంపై 23వ బాలచెలిమి ముచ్చట్లు హిమాయత్‌నగర్‌లోని ఆక్స్ఫర్డ్ గ్రామర్ పాఠశాలలో జనవరి 29న జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై.. ప్రసంగించారు. తాను బాలసాహిత్యం చదివి తయారైన రచయితను అన్నారు. తాను చదువుకున్న జిల్లా పరిషత్ పాఠశాల తనకు ఎన్నో అద్భుతమైన పాఠాలను నేర్పిందని, తను సాహిత్యకారుడు అయినందుకు చాలా సంతోషంగా ఉందని, పిల్లలను సాహిత్యంవైపు తీసుకొస్తే సమాజంలో చెడుపనులు జరగకుండా అడ్డుకోవచ్చన్నారు. మంచివాళ్లు ఎవరో, చెడువాళ్లు ఎవరో కూడా సాహిత్యం చెబుతుందని, బడి పిల్లల్లో మార్పు వస్తే సమాజంలో కూడా తప్పకుండా మార్పు వస్తుందన్నారు. పిల్లలు పాటలు పాడుతున్నా, కథలు రాస్తున్నా, బొమ్మలు వేస్తున్నా, క్రీడల పట్ల ఆసక్తి చూపినా వారికి ఆహ్వానం పలకాలన్నారు. సాంకేతిక పరికరాలు, మాదకద్రవ్యాలు ఇవాళ్టి తరాన్ని ఆవహించి ఉన్నాయని, ఆ ప్రభావం నుంచి పిల్లలను కాపాడుకోవడం మన బాధ్యత అన్నారు. బాలచెలిమి చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అభినందించారు.
బాలసాహిత్యమే భవితకు బాటలు పరుస్తుంది : చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ చైర్మన్ మణికొండ వేదకుమార్
చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ చైర్మన్ మణికొండ వేదకుమార్ మాట్లాడుతూ బాలసాహిత్యమే భవితకు బాటలు పరుస్తుందని, రెండు తెలుగు రాష్ట్రాల్లో బాల సాహిత్యాన్ని పెంపొందించేందుకు, పిల్లల వికాసాభివృద్ధికి బాలచెలిమి ముచ్చట్లు కార్యక్రమాలను నిర్విరామంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సమాజంలో ఉత్తమ పౌరులుగా ఎదిగేందుకు బాలసాహిత్యం దోహదం చేస్తుందని, మంచి సమాజం ఆవిర్భవించాలంటే మంచి సాహిత్యం రావాల్సిన అవసరం ఉందన్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో బడి పిల్లల కథలకు విశేషమైన గుర్తింపు : ప్రచురణల కన్వీనర్ గరిపల్లి అశోక్
రెండు తెలుగు రాష్ట్రాల్లో బాలచెలిమి బడి పిల్లల కథలు ఒక సంచలనంగా మారాయని, వీటికి ఎంతో పేరు, ప్రతిష్టలు వచ్చాయని తెలుగు రాష్ట్రాల బడి పిల్లల కథల కన్వీనర్ గరిపల్లి అశోక్ అన్నారు. ఆ పిల్లలను ప్రోత్సహించిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు, జిల్లా కన్వీనర్లకు అభినందనలు తెలిపారు. జిల్లా కన్వీనర్లు కొంచెం చొరవచూపి బడి పిల్లల కథల పుస్తకాలకు విస్తృత ప్రచారం చేయాలన్నారు.
మంచి టీమ్‌ను ఎంచుకొని చక్కని బొమ్మలు గీశాం : ప్రముఖ చిత్రకారులు కూరెళ్ల శ్రీనివాస్
బాలచెలిమి కోసం దాదాపు డజన్‌మంది చిత్రకారులు పనిచేసినట్లు బాలచెలిమి చిత్రకారుల కార్యశాల కన్వీనర్, ప్రముఖ చిత్రకారులు కూరెళ్ల శ్రీనివాస్ అన్నారు. మంచి టీమ్‌ను ఏర్పాటు చేసుకొని మంచి ఆలోచనా విధానంతో కథలకు సరైన, చక్కని బొమ్మలు గీసినట్లు చెప్పారు. తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రంలోని చిత్రకారులు టెస్ట్ బుక్స్ తయారు చేయడానికి రాత్రింబవళ్లు పనిచేసి వాటికి బొమ్మలు గీసినట్లు చెప్పారు. బాలసాహిత్యానికి బొమ్మలు గీయడం అనేది మామూలు విషయం కాదని, వంద ఉంటే వంద రకాలుగా ఆలోచించి బొమ్మలు గీయాల్సిన అవసరం ఉందన్నారు. ఇంత మంది బడి పిల్లల కథలు చదవడం కూడా తమ అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఈ కథలకు బొమ్మలు వేసిన చిత్రకారులందరూ ఉపాధ్యాయులు కావడం చాలా సంతోషం అన్నారు.
పిల్లలు భవిష్యత్‌లో గొప్పవాళ్లు కావాలి : ఆకెళ్ల వెంకట సుబ్బలక్ష్మి
ప్రతి ఇంట్లో బాలలకు మంచి పుస్తకాలు కొనిచ్చి చదివించాలని, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ డిక్షనరీలను కూడా పిల్లలచేత చదివించా లన్నారు. దీంతో పిల్లలు భవిష్యత్‌లో రచయితలు, మేధావులు, గొప్ప వ్యక్తులుగా ఎదిగే అవకాశం ఉందన్నారు. మనిషి జీవితంలో ఇష్టపడేది బాల్యం అన్నారు.
బాలసాహిత్యానికి ఐకాన్ వేదకుమార్ : భీంపల్లి శ్రీకాంత్
తెలంగాణ నుండి నూతన సాహిత్యకారులను పరిచయం చేయడం గర్వకారణం అని, బాలసాహిత్యానికి ఐకాన్ వేదకుమార్ అని భీంపల్లి శ్రీకాంత్ అన్నారు. ప్రభుత్వం చేసే పనిని వేదకుమార్ తన భుజాలమీద వేసుకొని చేయడం అభినందనీయం అన్నారు.
పిల్లల కథలకు బొమ్మలు గీయడం చాలా సంతోషంగా ఉంది : ఆర్టిస్టు బీర శ్రీనివాస్
బాలచెలిమి పిల్లల కథలకు బొమ్మలు గీయడం చాలా సంతోషంగా ఉందని, పిల్లల్లో అద్భుతమైన శక్తులు దాగి ఉన్నాయని చిత్రకారులు బీర శ్రీనివాస్ అన్నారు. కొన్నిసార్లు పిల్లలు చేస్తున్న పనులను చూస్తే పెద్దవాళ్లు సైతం ఆశ్చర్యపోతారన్నారు. బాలసాహిత్యానికి, చిత్రాలకు విడదీయలేని సంబంధం ఉందన్నారు. పిల్లలు నేడు గొప్ప కథలు రాయడం, వాటిని పుస్తక రూపంలో తీసుకురావడం గర్వకారణం అన్నారు. తాను బాలచెలిమికి బొమ్మలు గీస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.
బాలచెలిమి ముచ్చట్లు ఒక యజ్ఞంలాంటి కార్యక్రమం : ఉపాధ్యాయులు కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి
బాలచెలిమి ముచ్చట్లు ఒక యజ్ఞంలాంటి కార్యక్రమం అని ఉపాధ్యాయులు కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి అన్నారు. ఎవరైతే శ్రద్ధ పెట్టి కథలు రాస్తారో వాళ్లు గొప్పవాళ్లు అవుతారని చెప్పారు. పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు చాలా కథలు వచ్చి ఉండాలన్నారు. ఈ రోజుల్లో ఎంత బిజీగా ఉన్నా పిల్లల సాహిత్యం కోసం బాలచెలిమి చేస్తున్న కృషి అమోఘం అన్నారు.
బాలచెలిమి కోసం పరితపిస్తారు : సుతారపు వెంకటనారాయణ
బాలచెలిమి అంటే వెంటనే గుర్తొచ్చే పేరు వేదకుమార్ అని, బాలచెలిమి కోసం పరితపించి, ఎంతో ఖర్చును భరించి బాలచెలిమిని తీసుకురావడం చాలా సంతోషం అని సుతారపు వెంకటనారాయణ అన్నారు. భూదాన్‌పోచంపల్లిలో చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ, బాలచెలిమి ప్రారంభించిన తొలి బాలచెలిమి గ్రంథాలయం విజయవంతంగా నడుస్తుందని, పిల్లలు దీనికి బాగా వినియోగించు కుంటున్నారని అన్నారు.
కమర్షియల్ ఆర్టిస్టు నుండి క్లాసికల్ ఆర్టిస్టుగా మార్చారు : ఆర్టిస్టు కె.రాఘవాచారి
తాను ఇప్పటి వరకు కమర్షియల్ ఆర్టిస్టుగా పనిచేశానని, కూరెళ్ల శ్రీనివాస్ సహకారంతో సృజనాత్మక చిత్రకారునిగా మారినట్లు ఆర్టిస్టు కె.రాఘవాచారి తెలిపారు. బాలచెలిమిలో బొమ్మలు గీయడం అనేది తన జీవితంలో మరుపురాని అనుభూతి అన్నారు.
కథకు సందర్భోచితంగా బొమ్మలు గీయాలి : ఆర్టిస్టు కైరంకొండ బాబు
పిల్లలు రాసిన కథల పుస్తకంలో తాను బొమ్మలు గీయడం చాలా సంతోషంగా ఉందని ఆర్టిస్టు కైరంకొండ బాబు అన్నారు. బొమ్మలు వేయాలంటే పిల్లల్లాగ ఆలోచించి బొమ్మలు గీయాల్సిన అవసరం ఉందన్నారు. కథకు సందర్భోచితంగా ఊహించి బొమ్మలు గీసినప్పుడే దానికి సార్ధకత లభిస్తుందన్నారు.
సాహిత్యాన్ని వెలికితీసేందుకు కృషి : మాడభూషి లలితాదేవి
బాలచెలిమి పెట్టడం వల్ల వేదకుమార్ చాలా మంచి పని చేశారని, ఆయన చేసిన గొప్ప కార్యక్రమాల్లో ఇది ఒకటిగా మిగిలిపోనుందని లలితాదేవి అన్నారు. దీనివల్ల ఎంతో మంది వెలుగులోకి వస్తున్నట్లు చెప్పారు. ఇది పిల్లలకే కాదు, పెద్దలకు కూడా చాలా ప్రోత్సాహకంగా ఉందన్నారు. మనలోనూ, పిల్లల్లోనూ దాగిన సృజనాత్మకతను వెలికితీయడానికి బాలచెలిమి చేస్తున్న కృషి అమోఘం అన్నారు.
బాలల కథల ద్వారా తన బాల్యం గుర్తొచ్చింది : పర్కపల్లి యాదగిరి
బాలలు రాసిన కథలు చదువుతుంటే తన బాల్యం గుర్తొచ్చిందని, బాలలు రాసిన కథలు చాలా బాగున్నాయని చిత్రకారులు పర్కపల్లి యాదగిరి అన్నారు. చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ చేస్తున్న కృషిలో అందరూ భాగస్వాములు కావడం గర్వకారణం అన్నారు. పిల్లలు ఆలోచింపజేసే బాలసాహిత్యం రావాలని ఆకాంక్షించారు.
కథలు రాయడం వల్ల పిల్లల మానసికశక్తి పెరుగుతుంది : ఉపాధ్యాయురాలు పులి జమున
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర పాఠశాల నుండి 70 మంది పిల్లలు కథలు రాశారని ఉపాధ్యాయురాలు పులి జమున అన్నారు. తమ పిల్లలు రాసిన కథలు అత్యధికంగా సెలక్ట్ కావడం గర్వకారణం అన్నారు.పిల్లలు బాగా ఆలోచించి కథలు రాయడం వల్ల వారి మానసికశక్తి పెరుగుతుందన్నారు. ఆగస్టు 15న 70 మంది విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేసినట్లు చెప్పారు. కథలు రాయడం వల్ల పిల్లలకు ఏదైనా సమస్య వచ్చినా వారే పరిష్కరించుకునే తెగువ వచ్చిందన్నారు.
పిల్లల్లో ఎంతో జ్ఞానం ఉంది : చిత్రకారులు రామకృష్ణ
పిల్లలను చిన్నపిల్లలు అని చూడాల్సిన పనిలేదని, పిల్లల్లో అనేక రకాల జ్ఞానం ఇమిడి ఉందని చిత్రకారులు రామకృష్ణ అన్నారు. పిల్లలకు ఆలోచనాశక్తి చాలా ఉందని, వారిని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నిత్యం ప్రోత్సహించాలన్నారు.
బాలల ప్రపంచం సృష్టించబడుతుంది : డా.ఎస్.రఘు
పిల్లలచేత కొత్త ప్రపంచం ఆవిష్కరించబడటం, మంచి సాహితీ వాతావరణాన్ని చిల్డ్రన్స్ ఎడ్యుకేషనన్ అకాడమీ తీసుకురావడం అభినందనీయమని డా.ఎస్.రఘు అన్నారు.పిల్లల పుస్తకాలకు ప్రధానమైన ఆకర్షణ బొమ్మలే అన్నారు. బాలల కథల పుస్తకాలకు చిత్రకారులు తొందరగా బొమ్మలు గీయడం సంతోషదాయకం అన్నారు. కొత్త కథాంశంతో నూతనంగా బాలలు కథలు రాయాలని ఆకాంక్షించారు. ఇవి గాలికి ఎగిరిపోయే ముచ్చట్లు కాదని, ఇవి శాశ్వతంగా నిలిచిపోయే ముచ్చట్లు అన్నారు.
బాలలు సృష్టించే సాహిత్యం గొప్పది : శాంతారావు
బాలలు సృష్టించే సాహిత్యం చాలా గొప్పదని, తెలియకుండానే సహజమైన చిత్రాలు గీయడం ద్వారానే పిల్లలు తమ శక్తిసామర్థ్యాలను వెల్లడిస్తారని శాంతారావు అన్నారు. ప్రతి పిల్లవాడి అంతర్ముఖంలోంచి వచ్చిన అద్భుతాలే చిత్రాలు లేదా సాహిత్యం అన్నారు. పిల్లలు రాసిన మంచి కథలను బయటి ప్రపంచానికి తెలియపరుస్తునందుకు బాలచెలిమికి ధన్యవాదాలన్నారు. పిల్లలు రాస్తున్న కథలు నలుగురికి చెబుతారని, తద్వారా వాళ్లు నూతన ప్రపంచంవైపు ఆనందంగా అడుగులు వేస్తారని చెప్పారు. సృజనశీలమైన కళ ద్వారా సాహిత్యానికి కొత్త ఒరవడి తీసుకొస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
బాలచెలిమి కథలకు బొమ్మలు వేయడం సంతోషం : వడ్డేపల్లి వెంకటేష్
పిల్లలు రాసిన కథలకు తాము బొమ్మలు గీసినందుకు చాలా సంతోషిస్తున్నట్లు వడ్డేపల్లి వెంకటేష్ అన్నారు. తాము నల్గొండలో కొన్ని సందర్భాల్లో వివిధ కథలకు బొమ్మలు గీశానని, ఎక్కువగా కార్టూన్స్ గీయడమంటేనే ఇష్టం అన్నారు. తాను ఇప్పటి వరకు జరిగిన 22 బాలచెలిమి ముచ్చట్లు మిస్ కావడం బాధాకరం అన్నారు. పిల్లల కోసం బాలచెలిమి చేస్తున్న కృషి మర్చిపోలేనిదన్నారు.
మూడు తరాల నుండి మణికొండ ఫ్యామిలీతో అనుబంధం : రిటైర్డు హెచ్ఎం ధర్మపురి లక్ష్మణ్‌స్వామి
మూడు తరాల నుండి మణికొండ ఫ్యామిలీతో తమకు అవినాభావ సంబంధం ఉందని రిటైర్డు హెచ్ఎం ధర్మపురి లక్ష్మణ్‌స్వామి పేర్కొన్నారు. బాలచెలిమి మొదటి సంచికను తాను 1990లో చూసినట్లు తెలిపారు. బాలసాహిత్యం పెంపొందించడంకు ఇతరులకు సాధ్యం కాని రీతిలో వేదకుమార్ వైవిధ్యంగా మంచి కార్యక్రమాలు చేయడం గర్వకారణం అన్నారు.
చిన్నారులకు బొమ్మలు గీయడమంటే మహాసరదా : ఉండ్రాళ్ల రాజేశం
23వ బాలచెలిమి ముచ్చట్లకి సమన్వయకర్తగా వ్యవహరించిన ఉండ్రాళ్ల రాజేశం మాట్లాడుతూ చిన్నారులకు బొమ్మలు గీయడమంటే మహాసరదా అని, ఎంతో అందంగా, మరెంతో వైవిధ్యంగా బొమ్మలు గీసి అద్భుతాలు సృష్టిస్తున్నట్లు చెప్పారు. పిల్లల ప్రపంచం ఎంతో గొప్పదని, ఆ ఊహా ప్రపంచం నుంచి కథలు రాస్తారని, బొమ్మలు గీస్తారని చెప్పారు.
భావితరానికి మంచి మార్గదర్శకులుగా నేటి పిల్లలు : ఉపాధ్యాయురాలు ఉరిమెళ్ల సునంద
పిల్లల కోసం ఇంత చక్కని కృషి చేస్తున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు అని ఉపాధ్యాయురాలు, రచయిత్రి ఉరిమెళ్ల సునంద అన్నారు. పిల్లలను గుర్తించి వారిని ప్రోత్సహించడం అనేది చాలా గొప్ప విషయమని, తమ పాఠశాలలో పిల్లలచేత కథలే కాదు, కవితలు కూడా రాయిస్తున్నట్లు చెప్పారు. పఠనం అనేది చాలా అవసరమైనదని, మంచి మార్గదర్శకులుగా పిల్లలు తయారు కావాలంటే చిన్నప్పటి నుండే సాహిత్యంపై మక్కువ కలిగించాలన్నారు. ఖమ్మం జిల్లా కథల్లో తమ పాఠశాల నుండి నలుగురు ఎంపిక కావడం గర్వకారణం అన్నారు. తమ పాఠశాల విద్యార్థి రాసిన కథకు జాతీయస్థాయిలో కన్సలేషన్ బహుమతి సాధించడం చాలా సంతోషంగా ఉందన్నారు.
తెలుగు ఉపాధ్యాయులు ప్రవీణ్ శర్మ
తాను 2012లో బదిలీపై నిజామాబాద్‌లో ఒక పాఠశాలకు వెళ్లానని, అప్పటి నుంచి ఆ పిల్లల చేత ఎక్కువ పుస్తకాలను చదివించినట్లు తెలుగు ఉపాధ్యాయులు ప్రవీణ్ శర్మ తెలిపారు. తమ పాఠశాలలో పిల్లలచేత పుస్తకాలు చదివించి ఎంతో ప్రోత్సహించినట్లు తెలిపారు. తమ గ్రామం తడపాకలో ఎం.వేదకుమార్ 50 వేల రూపాయల విలువగల విలువగల పుస్తకాలతో బాలచెలిమి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం అన్నారు.
ఎంత మంచి కథలు రాస్తే సమాజం అంత అభివృద్ధి : గుళ్లపల్లి తిరుమల క్రాంతికృష్ణ
సమాజంలో కవులు ఎంత మంది తయారైతే అంత మంచిదని, తద్వారా సమాజం ఎంతో పురోగమిస్తుందని గుళ్లపల్లి తిరుమల క్రాంతికృష్ణ అన్నారు. పాఠశాలలో ఉపాధ్యాయులు పిల్లలపై ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు. పిల్లలపై తల్లిదండ్రులు ఎక్కువగా శ్రద్ధ పెట్టినట్లయితే ఉత్తమ ఫలితాలు వస్తాయన్నారు. అప్పట్లో బాలసాహిత్యంపై పెద్దగా అవగాహన ఉండేది కాదని, ఇప్పుడు ఎంతో మంది బాలసాహిత్యంపై అవగాహన పెంచుకొని విభిన్నమైన సాహిత్యాన్ని వెలుగులోకి తీసుకురావడం సంతోషదాయకం అన్నారు. బాలసాహిత్యంపై చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అకాడమీ చేస్తున్న కృషి అమోఘం అన్నారు.
ఉదయం జరిగిన పుస్తకావిష్కరణకి వచ్చిన ఆహుతులందరూ ఈ కార్యక్రమానికీ విచ్చేసి బాలచెలిమి ముచ్చట్లలో పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి ఖైజర్ భాషా వందన సమర్పణ చేశారు.
– జుగాష్విలి, 9030 6262 88