కరోనా నేపథ్యంలో శాస్త్రీయ పరిజ్ఞానం గూర్చి, ప్రకృతి గూర్చి, జీవం పుట్టుక గూర్చి, జీవ పరిణామం గూర్చి విధిగా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత వుంది. ముఖ్యంగా రేపటి తరాన్ని తీర్చిదిద్దే ఉపాధ్యాయులు, రేపటి పథ నిర్దేశకులైన విద్యార్థులు ఈ విషయాల్ని అవగతం చేసుకుంటే, తమ పరిమితులు, బాధ్యతలు గుర్తెరిగి ప్రకృతి అనుకూల జీవనం సాగిస్తే పది కాలాల పాటు హాయిగా మనుగడ సాగిస్తాం! కాదంటే, ప్రకృతి ప్రకోపానికి, మమ్మారీలకు బలికాక తప్పదు!!
‘చివరి కొమ్మను నరికిన తర్వాత గాని, ఆఖరి చేప పిల్లను పట్టి తిన్న తర్వాత గాని, తుది నీటిబొట్టుతో గొంతు తడుపుకున్న తర్వాతగాని, ప్రపంచంలో వున్న డబ్బునంతా పోగుపోసి ఖర్చు చేసినా, ఓ చిన్న గులకరాయిని మానవుడు సృష్టించలేడు…’ అంటూ పర్యావరణవేత్తలు నినదిస్తూ వుంటారు. ఈ నినాదం వాస్తవ రూపం దాల్చడానికి మరెంతో దూరం లేదని కరోనా మహమ్మారి హెచ్చరిస్తూ వున్నది. గత ఆరు నెలలుగా ప్రపంచ వ్యాపితంగా కరోనా నేపథ్యంలో జరుగుతున్న, జరిగిన పరిణామాల్ని పరిశీలిస్తే, మానవ ఇతిహాసంలో ఇంతటి విపత్తును (స్పానిష్ ప్లూ తప్ప) ఎదుర్కొన్న దాఖలాలు లేవు. రోగాలు, నొప్పులు, ప్రకృతి విపత్తులు మానవునికి కొత్తేమి కాకున్నా, యావత్ ప్రపంచాన్ని వణికించిన ఘటనలు లేవు. ఇలాంటి విపత్తులు రాలేదని, జరగలేదని కాదు.. పోతే, ఓ ప్రాంతానికి, దేశానికి, ఓ భూభాగానికి పరి మితంగా అనేక మహమ్మారీలు మానవునికి, ఇతర జంతు జీవానికి సుపరిచతమే ననేది గత చరిత్ర తెలుపుతున్నది. అయితే శాస్త్ర, సాంకేతికంగా ఎంత అభివృద్ధి సాధించినా ప్రకృతి ముందు మానవు డెల్లప్పుడు ఓ పిపీలికమే ననేది ఓ నగ్న సత్యం!
ఈ సందర్భంగా అనేక వాదనలు, సిద్ధాంతాలు ముందుకు రావడమే కాక, బ్రహ్మంగారి లాంటి వారు ఈ మహమ్మారి గూర్చి ముందే ఊహించి చెప్పారని నమ్మేవారు, ప్రచారం చేసేవారు వున్నారు. వీటిని నమ్మేవారి సంఖ్య కూడా గణనీయంగానే వుంటుంది. వీటిని నమ్మడంలో ఆశ్చర్యం లేదు. కాని భౌతిక, రసాయన శాస్త్రాల్ని ఆపోసన పట్టి, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పట్టాలు పొందినవారు, ఉపాధ్యాయులుగా చలామణి అయ్యే బుద్ది జీవులు ఈ అశాస్త్రీయ వాదనలతో చేతులు కలపడం ఓ చేదు నిజం. వీరి దృష్టిలో సైన్సుకు, జీవితానికి సంబంధం వుండదు. చదివిన చదువు పొట్టపోసు కోవడానికైతే నమ్మకాలు నిత్యజీవిత సంబంధాలని భావిస్తారు! ఇలాంటి వింత, విపత్కర పరిస్థితుల్లో కరోనా పుట్టుక గూర్చి, కరోనా అక్కా చెల్లెండ్లైన మరికొన్ని వైరసుల గూర్చి, ప్రకృతిలో వీటి స్థానం గూర్చి, సంబంధం గూర్చి విధిగా తెలుసుకోవాల్సిందే! అందులో కొన్ని: మన దేశానికి సంబంధించి జపానిస్ ఎన్‍సైఫలిటిస్ (Japanese Encephalitis JEV) 1950లో, మిగతా ఎన్‍సైఫలిటీస్ (మెదడు వాపు వ్యాధులు) 1955లో బయట పడగా, 2000 సం।। తర్వాత హెర్పస్ వైరస్ (Herpes Simplex) ఎంటరో వైరస్ (Entero), చంద్రాపుర్ వైరస్, వెస్ట్నైల్ వైరస్ (West Nile), క్యాసనూర్ అటవి వైరస్ (Kyasanuv forest)లతో పాటు స్క్రబ్ టైపస్ బాక్టీరియా (Scrub Typhus) చెప్పుకో తగ్గవి. ఇందులో కొన్నింటికి వాక్సిన్ రాగా, మరికొన్ని మందుల ద్వారా నయం చేయడం జరుగుతున్నది. అయినా, ఎన్‍సైఫలిటిస్ (AES) వేలాది మంది పసిపిల్లల్ని ప్రతీ సంవత్సరం చంపుక తింటూనే వున్నాయి.
ఈ ప్రాణాంతక వైరసులు, బాక్టీరియాలు కొత్తవేమి కాకున్నా, గతంలో కూడా ఇవి మానవ హోమాన్ని సాగించాయి. ఈ విషయంగా మన తండ్రులు, తాతమ్మలు ప్లేగు, కలరా తదితర వ్యాధుల గూర్చి ప్రస్తావించడం తెలిసిందే! ఇక మశూచి, ధనుర్వాతం, క్షయ, పోలియో లాంటి వాటి గూర్చి అనునిత్యం అప్రమత్తంగా వుంటూనే టీకాలతో, చుక్కల మందులతో పిల్లల్ని రక్షించుకుంటున్నాం. ఈ మహమ్మారీలన్నింటికి కంటికి కనపబడని వైరసులు, బాక్టీరియాలు, కొన్ని జాతుల శిలీంద్రాలు (FUNGI) కారణం. ఇవి జంతువుల ద్వారా, కీటకాల ద్వారా, పక్షుల ద్వారా, గాలి, నీటి, స్పర్శల ద్వారా, ఆహారం ద్వారా, వస్తువుల ద్వారా మనుషులకు వ్యాప్తి చెందుతాయి. విధిగా ఓ వాహకము వీటికి అవసరమన్న మాట! ఈ విషయాన్ని కరోనా మనకు బాగా అవగాహన కల్గించింది. కరోనా పుట్టుకకు ఇదమిత్తంగా గబ్బిలమనో, పునుగు పిల్లి అనో కచ్చితంగా చెప్పకున్నా, ఏదో ఒకటి మూలకారణమై వుంటుంది. అయితే వీటిని తుదముట్టిస్తే సరిపోతుందిగా అనేవారు వున్నారు. కాని, ఇది అసహజమైన పక్రియనేకాక ప్రకృతి విరుద్దమైన చర్య కూడా! గతంలో నిపా (NIPHA) వైరస్ సోకినప్పుడు మలేసియాలో లక్షలాది పందుల్ని వధించడం జరిగింది. దీంతో అక్కడ ఆహారపు కొరత ఏర్పడడమే కాక, పందుల జీవనాధారంగా బతికే వేలాది కుటుంబాలు వీధిన పడ్డాయి. ఈ అనుభవం 2000 సం।।లో మనం చూసాం.
ప్రకృతి ఏ ఒక్క మానవుడి సొత్తు కాదు:
భూమిపై వుండే అన్ని జీవరాసులకు జీవించి వుండే హక్కు వుంటుందనే ప్రకృతి సూత్రం ప్రకారమే తగు జాగ్రత్తలు తీసుకుంటూ జీవన యానం సాగించడమే ప్రకృతి విధానం! ఇప్పుడు జరగాల్సింది కూడా ఇదే! ఇది అవగతం కావాలంటే, జీవుల పుట్టుక గూర్చి తెలియాలి. ఇది తెలియాలంటే, భూమి పుట్టుక, సౌరకుటుంబం ఏర్పాటు, దీనికి సంబంధించిన బిగ్‍బాంగ్ సిద్ధాంతం (Bigbang) తెలియాలి. జీవ పరిణామం, మానవ పరిణామం, విస్పోటాలు, మహా విస్పోటాలు అర్థం కావాలి. అప్పుడే ప్రకృతిలో మానవుడి స్థానమేంటో, శక్తి ఎంతో, భవిష్యత్ ఏంటో అంచనా వేయగలం. అలా కాకుండా డబ్బుంది కాబట్టి దేన్నైనా కొనుక్కునే శక్తి వుంటుందని, అవసరమైతే బంకర్లలో దాక్కొని జీవించ వచ్చని, లేదంటే, చంద్రమండలాన్ని ఆవాసంగా చేసుకొని హాయిగా సుఖపడవచ్చని భావిస్తే ఓ భ్రమ అని కరోనా నిరూపిస్తున్న దాన్ని మననం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు కావాల్సింది ఆరోగ్యకరమైన ఆలోచనా, శాస్త్రీయ దృక్పథం, ప్రకృతి సహిత జీవన విధానం! ఇవి కొరవడితే డాలర్లు, యూరోలు, యెన్‍లు, రూపాయలు నాలుక గీసుకోవడానికి కూడా పని చేయవని గుర్తించాలి. వాటి వివరాల్లోకి పోయే ముందు బుద్దుడి ఓ జాతక కథను చూద్దాం!
కిసా గౌతమి : (KISA GAUTAMI)
కిసా గౌతమి ఓ అనాధ బాలిక. ఓ ధనవంతుడి బంగారం, వెండి అంతా బూడిదగా మారగా, దాన్ని బంగారంగా, వెండిగానే గుర్తించిన అనాధ బాలికకు తన కుమారునితో పెళ్లి చేస్తాడు. వీరికో కుమారుడు జన్మిస్తాడు. కాని, ఆ బాలుడు మరణించడంతో దుఃఖించిన కిసా గౌతమి, చనిపోయిన పిల్లవాన్ని ఎత్తుకొని, కనిపించిన వారందరిని తన కొడుకు బతకడానికి మందులు ఇవ్వమని కోరుతుంది. దీనికి ఇరుగు పొరుగు వారు కిసా గౌతమి మతిస్థిమితం కోల్పోయిందని ఎగతాళి చేయగా, ఓ పెద్ద మనిషి, తన దగ్గర పిల్లవాన్ని బతికించే మందు లేదుగాని, ఓ మంచి వైద్యున్ని చూపిస్తానని, సాఖ్యమునిగా గుర్తించబడ్డ బుద్దున్ని చూపిస్తాడు. సంతోషించిన కిసా గౌతమి, తన కుమారున్ని బతికించమని, మందుల్విమని బుద్దున్ని కోరగా, ఓ పిడికెడు ఆవాలు కావాలని, అవి కూడా ఏ ఒక్కరు మరణించని కుటుంబం నుంచి తేవాలని బుద్దుడు ఆదేశిస్తాడు. అర్థం కాని కిసా గౌతమి ఆవాలకై ఇల్లిల్లు అడుగుతూ, మరణం లేని ఇంటికై వెతుకుతుంది. ఒక్కటంటే ఒక్క ఇల్లు దొరక్క పోగా, ప్రతి ఇంట్లో బతికున్న వారికంటే, చనిపోయిన వారి సంఖ్యనే అధికంగా వున్నట్లు కిసా గౌతమి గుర్తించి బుద్ధుడి అంతరంగాన్ని అర్థం చేసుకొని మరణానికి సంబంధించిన జ్ఞానోదయాన్ని పొందుతుంది.
ఈ కథ శాస్త్రీయమా, వాస్తవమా అనే వాదన కాకుండా, జీవితానికి సంబంధించిన నగ్న సత్యాన్ని కాచి వడబోసిన సారంగా గుర్తిస్తాం! ఈ కోణంతో ముందుగా ప్రకృతి సూత్రాల్ని (Laws of Nature) చూద్దాం!
భూమి ఏర్పడిన నుంచి, మానవుడి పుట్టుక బుద్ధి కుశలత చేగూరిన నుంచి నేటి దాకా పోగుపడిన విజ్ఞాన మంతా కొన్ని సూత్రాలకు లోబడి వుంటాయని 2000 సం।। (Y2K మిలినియం) ఆరంభంలో ఆధునిక ప్రపంచ శాస్త్రజ్ఞులు సూత్రీకరించారు. అవి 18. ఇవి సత్యాలు (faets)గా, శిఖరాగ్ర (cardinals) సూత్రాలుగా నేటికి మనజాలుతున్నాయి. ఇందులో మొదటి 14 సూత్రాలు భౌతిక, రసాయన సంబంధమైనవి కాగా, మిగతా 4 జీవ సంబంధమైనవి. (వచ్చే సంచికలో వీటిని చూద్దాం!)
– డా।। లచ్చయ్య గాండ్ల
ఎ : 9440116162