నిత్యజీవితంలో ఆహార పదార్థాల తయారీలో కాయగూరలకు వున్న ప్రాధాన్యత మనందరికి తెలిసినదే. శరీరానికి అవసరమైన పోషక విలువలకు, విటమిన్లను, ఖనిజాలను, ప్రొటీన్లు వంటి వివిధ ఆవశ్యపు పదార్థాలను కాయగూరలు అందించి, సరైన శారీరక, మానసిక వికాసానికి తోడ్పడమే కాకుండా రోగనిరోధకశక్తిని వృద్ధి చేసి అనేక రోగాలను రాకుండా నిరోధించగలిగే శక్తి నాణ్యమైన కాయగూరలకు ఉంటుందని శాస్త్రీయంగా రుజువైంది. కాని నేటి పరిస్థితులలో నాణ్యమైన, తాజా కాయగూరల లభ్యత ముఖ్యంగా నగర, పట్టణ వాసులకు కష్టతరమౌతున్నదని చెప్పవచ్చు.
కాలుష్య ప్రభావానికి గురి అవుతున్న కాయగూరలు:
కాయగూరల ఉత్పత్తి దశ నుండి వినియోగదారులకు చేరే వివిధ దశలలో వివిధ రకాలైన కాలుష్యాలకు గురై, నాణ్యమైన పరిశుభ్రమైన కాయగూరలుగా వినియోగదారులకు చేరటం లేదన్నది వాస్తవం. పంట దశలోనే కాయగూరల పంటకు తెగుళ్ళు సోకినప్పుడు, వివిధ రకాల పురుగు మందులను తెగుళ్ళ నివారణకు పంటలపై చల్లటం జరుగుతుంది. అవి పొడిరూపం, ద్రావణ రూపంలోనైనా వుండవచ్చు. ఒకసారి పంటపై పురుగుమందులు చల్లిన తరువాత కనీసం వారం లేదా పదిరోజుల తరువాత కాని పంట కొయ్యకూడదు. కాని నేటి అనిశ్చిత మార్కెట్ పరిస్థితులలో రైతులు అంతకాలం వేచివుండలేక, మార్కెట్ నుండి ఎంక్వయిరి వచ్చాక వెంటనే పంటలనుకోసి, మార్కెటుకు పంపటం జరుగుతుంది. అందువలన హానికర రసాయనాలు కాయగూరలపై మిగిలి వుంటాయి.
తీరా మార్కెట్‍కు వచ్చిన తరువాత రోడ్ల ప్రక్కనే దుకాణాలలో కాయగూరలకు అమ్మకానికి వుంచటం వలన రోడ్డుపై దుమ్ము, దూళి మరియు వాహనాల పొగవల్ల వచ్చే కార్బన్ ఈ కాయగూరలపై చేరుతుంది. కాయగూరల దుకాణాల యజమానులు ఈ కాయగూరలను తాజాగా కనిపించే విధంగా చెయ్యటానికి నీళ్ళు చల్లుతారు. ఆ నీరుకూడా పరిశుభ్రంగా వుండదు. అందువలన నీటి వలన కూడా కొంత కాలుష్యం ఈ కాయాకూరలపై చేరుతుంది. ఈ విధంగా వివిధ దశలలో కాలుష్యానికి గురైన కాయగూరలను వినియోగదారులు సమయాభావం వలన సరైన పద్ధతిలో శుభ్రం చేసుకుని, అహార పదార్థాలను తయారు చేసుకొనే పరిస్థితులలో లేరు. అందువలన నేడు అనేక మంది వివిధ రకాలైన వ్యాధులకు గురి అవుతున్నారు. పరిశోధన ప్రకారం నేడు క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరగటానికి తోడ్పడే అనేక కారణాలలో కాలుష్యంతో కూడిన కాయగూరలను తినటం ఒకటిగా చెప్పవచ్చు.
సరైన పద్ధతిలో వాషింగ్ & ప్రాసింగ్ అవసరం:
పైన తెలిపినట్లుగా వివిధ దశలలో కాలుష్యానికి గురి అవుతున్న కాయగూరలను సరైన విధంగా వాషింగ్‍చేసి కస్టమర్లకు నేరుగా అందించటం ఒక మంచి ఉపాధి అవకాశం అవుతుంది. కాయగూరల లోపలికి చేరే రసాయనాలను పంట సాగు విధానంలో మార్పులు వస్తే తప్ప ఎవ్వరూ నివారించ లేరు. కనుక కనీసం కాయగూరల ఉపరితలంపై చేరే హానికర రసాయనాలను, దుమ్ము మరియు దూళి, కార్బన్, ఫంగస్ వంటి వివిధ హానికర కాలుష్యాలను తొలగించటం ద్వారా వినియోగదారులకు కొంత నిజమైన కాయగూరలను అందించి, వారి ఆరోగ్యాభివృద్ధికి కృషి చెయ్యవచ్చు. ఎక్కువ పరిమాణంలో కాయగూరలను శుభ్రపరచటానికి ప్రత్యేక యంత్రపరికరాల అభివృద్ధిచేయటం జరిగింది. అదేవిధంగా కాయగూరల ఉపరితలంపై కాలుష్యాన్ని 90 నుండి 95శాతం వరకు తొలగించటానికి వీలుగా ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంలో తయారు చెయ్యబడే వాషింగ్ లిక్విడ్‍ను ఉపయోగించటం వలన మరియు ఆహారపదార్థాల ప్రాసింగ్ కొరకు తయారు చెయ్యబడి ప్లాస్టిక్ బ్యాగులలో ప్యాకింగ్ చేసి, నగరాలు, పట్టణాలలోని కుటుంబాలకు వివిధ రకాల కాయగూరలను నిర్ణీతపరిమాణంలలో ప్రాసింగ్ చేసి, వారం రోజులకు సరిపడు నట్లు ఫ్రిజ్‍లో వుంచుకొనే విధంగా చక్కగా ప్యాకింగ్ చేసి వినియోగదారులకు అందచేయాల్సిన అవసరం వున్నది.
మార్కెట్‍లో ఆవశ్యకత వున్నది:
నాణ్యమైన పద్ధతిలో వాషింగ్ చేసి, గృహవినియోగ దారులకు అవసరమైన సైజులలో (ఉదా: 500 గ్రా. ప్రాసింగ్ చేసి, ఒకేసారి వివిధ కాయగూరలకు సరఫరాచేసి వారికి క్రింది కారణాల వలన మంచి మార్కెట్ అవకాశాలు వున్నాయని చెప్పవచ్చు.
1.వినియోగదారులలో పెరుగుతున్న ఆరోగ్యం పట్ల శ్రద్ధ.
2.కాయగూరలపై పెరుగుతున్న కాలుష్య ప్రభావం.
3.భార్యభర్తలు ఉద్యోగస్థులు కావటం వలన ప్రత్యేక శ్రద్ధతో కాయగూరలకు శుభ్రం చేసుకొనే సమయం ఉండక పోవటం
4.నాణ్యమైన కాయగూరలకు ఎక్కువ మొత్తాన్ని వ్యయం చెయ్యటానికి సిద్ధపడే వారి సంఖ్య పెరగటం 5.మధ్యవర్తులను నివారించటం ద్వారా తక్కువ ధరకు, నాణ్యమైన కాయగూరలను అందించే అవకాశం వుండటం.
పరిశ్రమకు అవసరమైన యంత్ర పరికరాలు:
విజిటబుల్స్ వాషింగ్‍మిషన్, బిల్లింగ్, ప్రింటర్‍తో కూడిన తూనిక యంత్రాలు, ఫ్రూట్ వాషింగ్ లిక్విడ్ యంత్రం, సీలింగ్ యంత్రాలు, ప్లాస్టిక్ క్రెట్స్, డ్రమ్ములు, టబ్‍లు (టబ్స్) మొదలగునవి.
ముడి పదార్థాలు:
రైతుల నుండి సేకరించబడే కాయగూరలు ఉదా: బెండ కాయలు, దొండ కాయలు, వంకాయలు, పొట్లకాయలు, కాకరకాయలు, దోసకాయలు, బీరకాయలు, బీన్స్ మరియు అన్ని రకాల ఆకుకూరలు, ప్యాకింగ్ ప్లాస్టిక్ బ్యాగులు (అరకిలో సైజు), 3 కేజీల సైజు ప్రింటెక్ ప్లాస్టిక్ బ్యాగు, వాషింగ్ లిక్విడ్ తయారీ పదార్థాలు, బిల్లింగ్ కాల్స్, ఇతరములు.
ప్రాసెసింగ్ విధానం:
రైతుల నుండి నేరుగా కొనుగోలు చేసిన వివిధ రకాల కాయగూరలను ముందుగా వాషింగ్ లిక్విడ్ కలిపిన నీటిలో అరగంట సేపు నానబెడతారు. తరువాత ఈ కాయగూరలు ప్రత్యేక వాషింగ్ మిషన్‍లో ఎక్కువ స్రిడ్‍గా వచ్చే నీటిలో రెండుసార్లు అటోమెటిక్‍గా శుభ్రం చేయబడి, కన్వేయర్ ద్వారా బయటకు వచ్చి నీరు పూర్తిగా తొలగిపోవటం జరుగుతుంది. తరువాత ఓ పక్క కాయగూరలును వేరే వేరుగా అరకిలో పరిమాణంలో తూకం మరియు బిల్లింగ్ యంత్రంలలో ప్యాకింగ్ చేసి, 6 లేదా 10 వేల కూరల ప్యాకెట్ల నిల్వ పెద్ద సైజ్ ప్రింటెడ్ బ్యాగులో వేసి కస్టమర్లకు నేరుగా వాళ్ళకు అందించటం జరుగుతుంది. ఈ ప్యాకెట్లను సూపర్ మార్కెట్ల ద్వారా కూడా మార్కెట్ చెయ్యవచ్చు. ఇదే పరిశ్రమలో వివిధ రకాల పండ్లను కూడా వాషింగ్ చేయ్యవచ్చు. ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంలో తయారు చేయబడే వాషింగ్ లిక్విడ్‍ను కూడా ప్రత్యేకంగా మార్కెట్ చేయ్యవచ్చు.
ఎవరికి అనుకూలం:
నాణ్యమైన కాయగూరలను వినియోగదారులకు అందించాలనే తపన వున్న ఎవరైన ఈ పరిశ్రమను ప్రతి మండలానికి ఒకటి చొప్పున ప్రారంభించవచ్చు.
పరిశ్రమ వ్యయం:
పరిశ్రమ సామర్థ్యం: గంటకు 1000 కేజీల కాయగూరల వాషింగ్ మరియు రోజుకు 200 లీటర్ల వాషింగ్ లిక్విడ్ తయారీ.
పరిశ్రమ వ్యయం: రూ.23 లక్షలు (ఇరవై మూడు లక్షలు).
దక్కన్‍న్యూస్
ఎ : 9030 6262 88