తెలంగాణ గిరి‘జనం’ జాతర


మేడారం మహా జాతర ఓ అద్భుతం. ఇది ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవం. గత ఎనిమిది వందల ఏళ్లుగా ఒక తరం నుంచి మరొక తరానికి అందిస్తున్న ఆదివాసీల ఆరాధ్యదైవాల సజీవ సంస్కృతుల సమ్మేళనం. అడవిబిడ్డల ఆరాధ్యదేవతలైన సమ్మక్క-సారలమ్మ పోరాట పటిమకు.. ధిక్కారస్వరానికి.. ఆత్మగౌరవానికి ప్రతీకలు. ఆదివాసీల పరిభాషలో పంచభూత ప్రకృతి దైవాలుగా విరాజిల్లుతున్న సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు, నాగులమ్మల కలయికే మేడారం జాతర. కీకారణ్యంలో రెండేళ్లకోమారు ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ జాతరకు రాష్ట్ర ప్రభుత్వం సకల సౌకర్యాలు కల్పించడంతో.. మేడారం జాతర అంతర్జాతీయస్థాయికి ఎదిగింది. గూగుల్‍, ఇంటర్నెట్‍, వాట్సాఫ్‍, ట్విట్టర్‍, ఫేస్‍బుక్‍ల్లో మేడారం జాతర విశేషాలు మారుమోగాయి. స్వదేశీయుల జానపదపాటలు, విదేశీయుల లఘుచిత్రాలు హైలెట్‍గా నిలిచాయి. బహుభాషల్లో అడవితల్లుల స్మరణ కొనసాగింది. మామూలు రోజుల్లో మౌనం ఆవహించినట్లుండే మేడారం ఒక్కసారి ఆధ్యాత్మికచింతనతో ప్రపంచాన్ని తనవైపు తిప్పుకుంది. ఆదిమ వారసత్వాన్ని ఒకసారి గుర్తుచేసింది. అడవి తల్లులైన సమ్మక్క, సారలమ్మకు భక్తివిశ్వాసమే ప్రధానాలంభనగా సేవించుకొని తరిస్తున్న భక్తులతో మేడారం పులకరించిపోయింది. జంపన్నవాగు.. భక్తిసాగరమైంది. చిన్నారులను కేరింతలు కొట్టించింది. భక్తులకు పూనకాలు తెప్పించింది. అశేష జనాలకు పుణ్యస్నానాలు చేయించింది. జలాశీస్సులు ఇచ్చి.. పరమపవిత్రంగా గద్దెలకు చేర్చింది.


తెలుగునాట కుంభమేళ
సమ్మక్క – సారలమ్మ జాతర

మేడారం జాతర… తరతరాల మహిళా శక్తి ప్రాధాన్యాన్ని చాటిచెప్పే మహత్తర జాతర ఇది. ఫిబ్రవరి 12 నుంచి 15 వరకు నాలుగు రోజుల పాటు ఇది జరుగనుంది. పితృస్వామ్య వ్యవస్థను సవాల్‍ చేసే జాతర ఇది. చారిత్రాత్మక వీర నారీమణుల శౌర్యప్రతా పాలకు జోహార్లు అర్పించే జాతర ఇది. ఉత్తర భారతంలోని గంగానదికి జరిగే ప్రయాగ కుంభమేళా తర్వాత, గోదావరి, కృష్ణానది పుష్కరాలం తటి జనం సందర్శించే విశిష్టమైన బృహత్‍ జాతర ఇది. రాష్ట్ర ప్రభుత్వం 18 ఏళ్ల కిందటే, అంటే 1996 లోనే అధికారిక జాతరగా ప్రకటించిన జాతర ఇది.


రెండేళ్ల కొకమారు దండకారణ్యంలో జరిగే తెలుగువారి గిరిజన జనారణ్య జాతర ఇది. ఎలాంటి దేవతామూర్తుల ప్రతిమలు లేకుండా చెట్ల మధ్య కేవలం కుంకుమభరిణలనే తెచ్చి పూజించే సంప్రదాయమున్న గిరిజన కోయపూజారులు నిర్వహించే జాతర ఇది. మన రాష్ట్రం నుంచే కాకుండా, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‍గఢ్‍, బస్తర్‍ మధ్యప్రదేశ్‍, కర్నాటక తదితర రాష్ట్రాల నుంచి భక్తులు వెల్లువలా సందర్శించే జాతీయస్థాయిలో చెప్పుకోదగిన జాతరలలో ఇది ఒకటి. తెలంగాణకే పరిమితం కాదు, తెలుగునాట, దక్షిణ భారతంలో ప్రసిద్ధి పొందిన జాతర ఇది. దివ్యమైన శక్తి ప్రభావాలను వీరనారీమణులైన తల్లీబిడ్డలకు ఆపాదించి, కొలవందుకుంటున్న సమ్మక్క – సారాలమ్మ జాతర. ఇలా చెప్పుకుంటూ పోతే, ఈ జాతర ఎన్నెన్నో రికార్డులను తిరగరాస్తోంది. ప్రతిసారీ కొత్త రికార్డులను సొంతం చేసుకుంటోంది. విజయనగరంలో పైడితల్లి జాతర, విజయవాడ, అలంపురం క్షేత్రాల్లో దుర్గా జోగులాంబా తల్లుల నవరాత్రి ఉత్సవాలు, సికింద్రాబాద్‍ మహంకాళి బోనాలు, తెలంగాణ బతుకమ్మ పండుగ, రాయల సీమలో గంగానమ్మ జాతరలు కూడా శక్తి స్వరూపాలతోనే జరుగుతున్నాయి. కాకతీయుల కాలంలో ప్రతాపరుద్రదేవుడిని ఎదిరించిన వీర నారీ మణులైన సమ్మక్క – సారలమ్మల ధైర్యసాహసాలకు ఈ జాతర మూలకారణంగా నిలిచింది. కాకతీయుల వీర ప్రతాపాన్ని, పరిపాలన పటిమను మనం పొగుడుకుంటూనే, వీరిని ఎదిరించి కప్పం కట్టడానికి నిరాకరించి, వీర మరణం పొందిన ఈ గిరిజన నారీమణులను ఆరాధించే తత్వం వైవిధ్యంగా, రెండు రకాలుగా కనిపిస్తుంది.


కాకతీయ రాణి రుద్రమ, వీరనారీ ఝూన్సీలాగా సమ్మక్క సారలమ్మలు గత ఏడు వందల సంవత్సరాల నుంచి చరిత్రలో. నిలిచిపోయారు. వీరిని స్మరించుకుంటూ మాఘ పౌర్ణిమ నుంచి జరిగే జాతరను చూడడానికి రెండు కళ్లు సరిపోవు. మూడు రోజులు జాతరగా చెప్పుకుంటున్నప్పటికీని, దాదాపు నెల రోజుల ముందు నుంచే జాతరకు జనం గద్దెల వద్దకు తరలివచ్చి, మొక్కుబడులు చెల్లించుకుంటారు. ఏటూరునాగారం అభయారణ్యంలో వరంగల్‍ జిల్లా తాడ్వాయి మండలంలో నిర్వహించే ఈ జాతరకు లక్షల మంది వస్తారు.


గిరిజనులతో సంబంధాలున్న జాతరల్లోకి వెడితే ఆదిలాబాద్‍ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో గోండుల ఆధ్వర్యంలో జరిగే నాగోబా జాతర, శ్రీశైల క్షేత్రంలో నల్లమల గుట్టల్లో నివసించే చెంచులు ఆరాధించే మల్లన్న శివరాత్రి జాతరలు కూడా సుప్రసిద్ధమైనవే. వీరు ఈ దేవతామూర్తులను నేటికినీ తమ ఆరాధ్య దైవంగా కొలుస్తారు. ఖమ్మం, నల్లగొండ తదితర జిల్లా నుంచి పలు లంబాడాల జాతరలు కూడా ఉన్నాయి. గిరిజన పోరాట యోధుటైన బిర్సాముండా. కొంరంభీమ్‍, గోండ్వానా రాంజీలు కూడా గిరిజనులకు ఆరాధ్యదైవాలే.


కథలోకి వెళ్లితే…

కాకతీయ రాజ్యానికి సామంతరాజైన మేడారం పగిడిగిద్దరాజు కరువు కాటకాల వల్ల కప్పం చెల్లించడానికి నిరాకరిస్తాడు. పగిడిగిద్ద రాజు కరీంనగర్‍ జిల్లా పాలన ప్రాంతాన్ని పాలించిన మేడరాజుకు మేనల్లుడు. కాకతీయ చక్రవర్తియైన ప్రతాపరుద్రుడు కోపించి, తన మంత్రి యుగంధరుడిని సైన్యంతో యుద్ధానికి పంపిస్తాడు. మేడారం వద్ద యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధంలో సంపెంగవాగు వద్ద కుమారుడు జంపన్న వీర మరణం చెందుతాడు. అప్పటి నుంచి ఆ వాగుకు జంపన్నవాగు అని పిలుస్తున్నారు. పగిడిగిద్ద రాజుతో పాటు, అతని భార్య సమ్మక్క- బిడ్డ సారలమ్మ, అల్లుడు గోవిందరాజులు వీరమరణం పొందుతారు. సమ్మక్క మాత్రం చిలుకలగుట్టవైపు వెళ్లి అంతర్థాన మైందని, ఆమె కోసం వెదికితే అక్కడ కుంకుమ భరిణె దొరికిందని అప్పటి నుంచి వీరనారీమణులకు జోహారుగా ఈ జాతరను రెండేళ్ల కొకసారి గిరిజనులు నిర్వహిస్తున్నట్లు చెబుతారు. ఈ వృత్తాంతం చరిత్రలో సరిగా నమోదు కాలేకపోవడం వల్ల రకరకాలుగా కథలు, జనఐతిహ్యంలో ప్రచారంలో ఉన్నాయి. ఇటీవలి కాలం నుంచి పక్కా.

ఆధారాలను వెతికే పనిలో పరిశోధకులు ఉన్నారు. ఇప్పటికే ఈ చారిత్రక సంఘటనపై పరిశోధకులు ద•ష్టి సారించి, కొంత సమాచారాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు.
దా. దివిటి అంజనీదేవి, కాకతీయ విశ్వవిద్యాలయ ఆ ఆచార్య అజ్మీరా సీతారాంనాయక్‍, డాక్టర్‍ ఎండి రాజ్‍మహమ్మద్‍, రాష్ట్ర గిరిజన మ్యూజియం క్యురేటర్‍ డాక్టర్‍ ద్యావనపల్లి సత్యనారాయణ తదితరులు ప్రత్యేకంగా పరిశోధనలు చేస్తూ, వ్యాసాలన వెలువరిస్తున్నారు. మేడారం చిలుకలగుట్ట సమీపంలో కట్టిన రెండు గద్దెలతో ఈ జాతర జరుగుతుంది. జాతర జరిగే నాలుగు రోజులు సమయంలో అక్కడ తల్లీబిడ్డలను రప్పించి ఈ జాతరను గిరిజను సంప్రదాయం ప్రకారంగానే నిర్వహిస్తున్నారు. గిరిజన తెగల్లోని కోయలు, చెంచులు, వడ్డెలు, గోండులు, లంబాడీలు, ఖిల్లులు తదితరులు ఈ జాతరను విశేషంగా సందర్శిస్తున్నారు.


దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ జాతరను నామమాత్రంగా నిర్వహిస్తుండగా, 1975 నుంచి 1986 వరకు ఈ జాతర ప్రాధాన్యత పెరిగింది. తదుపరి ప్రభుత్వంలోని వివిధ శాఖల సమన్వయం, సంయుక్తాధ్వరంలోనే జాతర ఏర్పాట్లు జరుగుతున్నాయి. వరంగల్‍ జిల్లా మేడారం వద్దనే కాకుండా గత ముప్పై ఏళ్ల నుంచి కరీంనగర్‍, వరంగల్‍, ఖమ్మం తదితర జిల్లాల్లో సుమారు 70కి పైగా చోట్ల ఉప జాతరలు జరుగుతున్నాయి. సింగరేణి కార్మికులు తమ పనులు వదిలి జాతరకు వెళ్లకుండా ఉండడానికి గోదావరిఖనివద్దే ఈ జాతరను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ జాతరను ఆసియా ఖండంలోనే అరుదైన ప్రత్యేక గిరిజన జాతరగా అభివర్ణిస్తున్నారు.
ఈ జాతరలో గిరిజనుల మనోభావాలు, ఆచార సంప్రదాయాలు దెబ్బతినకుండా చూడడానికి నిర్వాహకులు ప్రయత్నిస్తున్నా.. కొన్ని ఆటంకాలు ఎదురవుతుండడం పట్ల గిరిజన సంఘాల నాయకులు తమ అసంతృప్తులను వెల్లగక్కుతున్నారు. ఉప జాతరల నిర్వహణ తతంగం పెరిగిపోతుండడంతో మేడారం కోయ పూజారులతో సహా, గిరిజన సంఘాలు తమ నిరసన వ్యక్తం చేస్తున్నాయి. జాతర ప్రాధాన్యం నిర్వీర్యం చేయడానికి, మదింపు చేయడానికి ఉప జాతరలు నిర్వహిస్తున్నారని వీరు పేర్కొంటున్నారు.


మాఘ పూర్ణిమ నాటి నుంచి మూడు రోజుల పాటు జాతర వైభవం కనబడుతుంది. తెల్లవారి తల్లీబిడ్డలను సాగనంపే వరకు ఈ జాతర నాలుగు రోజుల అధికారిక జాతరగా పేర్కొనవచ్చు. జాతరలో మొదటి రోజు కన్నెపల్లి నుంచి సారాలమ్మను తొలుత కోయపూజారులైన వడ్డెలు తీసుకుని వస్తారు. రెండో రోజు చిలుకల గుట్ట నుంచి సమ్మక్కను తీసుకొని వస్తారు. మూడో రోజున మొక్కు బదుల చెల్లింపులు
ఉంటాయి. నాలుగవ రోజున సాయంత్రం దేవతలు వనప్రవేశం (వీడ్కోలు) చేస్తారు. పగిడిగిద్ద రాజు, గోవిందరాజులను కొత్తగూడ మండలం పొన్నుగూడెం నుంచి, తాడ్వాయి మండలం కొందాయ్‍ నుంచి తీసుకొని వస్తారు.


జాతర విశిష్టాంతాలు
1992 లోనే జిల్లా కలెక్టర్‍ వంద మీటర్ల పొడవుగల జంపన్న వాగుపై బ్రిడ్జిని నిర్మించడం వల్ల మేడారానికి గిరిజన తెగలు రాకపోకలు సాగించడం సులువైంది. ఈ జాతరలో జంపన్న వాగులో పుణ్యస్నానాలు, శివసత్తుల పూనకాలు, అమ్మవార్ల గద్దెల సందర్శనాలు, తులాభారాలు, ముడుపులు, ఎదురుకోళ్ళు, తలనీలాలు వంటి మొక్కుబడులు చెల్లించుకోవ చాలు. టెంకాయలు కొట్టడం, బంగారం (బెల్లం) పంచడం, బంగారంగా పనువు వినియోగించడాలు విశేషంగా వుంటాయి. ఈ జాతరకు వచ్చేముందు భక్తులు వేములవాడ రాజన్నను, కొమురవెళ్ళి మల్లన్నను, కొత్తకొండ వీరన్నను, ఐనవోలు క్షేత్రాలను సందర్శించుకునే ఆచారం వుంది. వీటన్నింటిని పరికించి చూస్తే, శాక్తేయానికి మిశ్రమ వీరశైవారాధనకు ఈ జాతర ముడిపడివుందని అర్థమవుతుంది.

  • కట్టా ప్రభాకర్‍
    ఎ : 8106721111

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *