హైదరాబాద్ రాజ్యమే ఎనుకటి ఇండియాలో పెద్ద సంస్థానం. దానికి అనుబంధంగా ప్రతి జిల్లాలో చిన్న, పెద్ద సంస్థానాలు పరిపాలన సాగించేవి. ఈ సంస్థానాధీశులతో చాలా మందికి దగ్గరి సంబంధాలుండేవి. దోమకొండ సంస్థానానికి అమరచింత సంస్థానాధీశులతో, గద్వాల సంస్థాన పాలకులకు మెదక్ జిల్లాలోని పాపన్నపేట సంస్థానానికి, జటప్రోలు (కొల్లాపురం) సంస్థానాధీశులకి వెంకటగిరి, నూజివీడు, బొబ్బిలి పాలకులతో, వనపర్తి సంస్థానం వారికి మునగాల పాలకులతో సంబంధ బాంధవ్యాలుండేవి. ఇవన్నీ ఆ పరిపాలన సజావుగా జరగడానికి, వారి రాజరికాన్ని, అధికారాన్ని నిలుపుకోడానికి ఏర్పాటు చేసుకున్న బాంధవ్యాలు. పెద్ద సంస్థానాలతో పాటుగా చిన్న చిన్న సంస్థానాలు కూడా చాలానే ఉండేవి. మహబూబ్‍నగర్ జిల్లాలోని బోరవెల్లి, లోకాయపల్లి, నల్లగొండ జిల్లాలోని సంస్థాన్ నారాయణపురం, రాజపేట, నిజామాబాదులోని సిర్నాపల్లి, ఖమ్మంలోని పాల్వంచ ఇలా అనేక సంస్థానాలు, జమిందారీలు సాహిత్య పోషణతో పాటుగా, తెలంగాణ సాంస్క•తిక వికాసానికి దారులు వేసి, కళలకు ప్రోత్సాహమిచ్చారు. ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. మరోవైపు పరిస్థితి భిన్నంగా ఉండింది. తెలంగాణలోని దాదాపు అన్ని సంస్థానాల్లో పరిపాలన ఎప్పుడో ఒకప్పుడు మహిళల చేతుల్లో ఉందనేది అక్షరసత్యం. వారసత్వ గొడవలు, దత్తపుత్రుల ఎంపిక, ఈ సంస్థానాల్లో ఎడతెగని సమస్యలుగా ఉండేవి. వనపర్తి, గద్వాల లాంటి పెద్ద సంస్థానాలు తప్ప మిగతా సంస్థానాలన్నీ పేరు గొప్ప ఊరు దిబ్బ లాగుండేది. అభివృద్ధికి ఆమడదూరంలో ఉండి, నిజాం పాలకులను అనుసరిస్తూ, అధికార మత్తులో ప్రజల సమస్యలకు ప్రాధాన్యం ఇవ్వకుండా వారిపై పన్నులు వేస్తూ డబ్బులు పిండుకునే వారు. ఇది తర్వాతి కాలంలో తిరుగు బాటుకు కూడా దారి తీసింది. మునగాల సంస్థానంలో ప్రజలు ప్రత్యక్షంగా తిరుగుబాటు చేశారు. ఆంధ్ర మహాసభ తరఫున నిజనిర్థారణ సభ్యులుగా గద్వాల సంస్థాన స్థితిగతులు పరీక్షించిన బద్దం ఎల్లారెడ్డి, వట్టికోట ఆళ్వారుస్వామిలు తమ నివేదికలో ఆ సంస్థానాధీశులు చేస్తున్న దుర్మార్గాలను రికార్డు చేశారు. ఇక మునగాలలో అధిక పన్నులకు వ్యతిరేకంగా ఉద్యమించిన రైతులు అందులో తమ ప్రాణాల్ని అర్పించుకున్నారు. మునగాల జమిందార్ రాజా నాయని వెంకట రంగారావు తెలంగాణలో తొలి చైతన్య వికాసాలు ప్రజ్వలితం చేసిన వ్యక్తే అయినప్పటికీ 1940వ దశకం ఆరంభం నాటికి సంస్థానంపై అజమాయిషీ అధికారులపై వదిలివేయడంతో వారు ప్రజల్ని దోచుకునే వారు. దాంతో అంతకు ముందు ఆయన చేసిన సేవలు కూడా గుర్తింపుకు నోచుకోకుండా పోయాయి.
మెదక్ జిల్లాలో అతిప్రాచీనమైన సంస్థానం పాపన్నపేట. ఈ సంస్థానాధీశులు నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసి యుద్ధంలో తమ ప్రాణాల్ని సైతం అర్పించి తెలంగాణ ప్రజలకు మార్గదర్శకులయ్యారు. రాణి శంకరమ్మ కత్తి పట్టి యుద్ధం చేసిన అపర రుద్రమ దేవి. ఈమె వీరగాథలు ఇప్పటికీ గ్రామాల్లో మార్మోగుతాయంటే ఆమె ఘనతను అర్థం చేసుకోవచ్చు. ఈ సంస్థానాల్లో మహిళలు పాలించిన కాలంలో జరిగిన కార్యకలాపాలు, నోచుకున్న అభివృద్ధి, చోటు చేసుకున్న ఆధునికత, పోషించిన కళలు, సాహిత్యం తెలుసుకోవడం ద్వారా తెలంగాణ ప్రగతిని అర్థం చేసుకోవచ్చు. ఇందులో ప్రభ్విణుల పాత్ర, ఈ కాలంలో వెలువడ్డ సాహిత్యానికి వారు చేసిన ఇతోధిక సేవ, మొత్తం తెలంగాణ అభివృద్ధిలో వారి తోడ్పాటు అంచనా వేయడానికి ఈ పరిశీలన ఒక పరికరంగా ఉపయోగపడుతుంది. కొందరు సంస్థానాధీశులు కర్కషంగా వ్యవహరించినందుకు అందర్నీ నిందించడం కూడా సబబు కాదని అర్థం చేసుకోవాలి. నాటి కాల, స్థల, పరిస్థితులను బట్టి సంస్థానాధీశుల చర్యల్ని పరిశీలించి చరిత్రలో వారి పాత్రపై ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరముంది. ఇందుకు సాహిత్యం, ఇంటర్వ్యూలు, గెజిట్స్, పత్రికలు ఇలా చాలా వనరుల నుంచి సమాచారాన్ని సేకరించి క్రోడీకరించుకొని సంస్థాన పాలక, మహిళల పాత్రని నిర్థారించాలి. తెలియకుండా పోయిన చరిత్రను పరిశోధించి వెలుగులోకి తేవాలి. కొత్తగా రాసుకోవాలి.
వనపర్తిలో జానమ్మ, గద్వాల ఆదిలక్ష్మి దేవమ్మ, పాపన్నపేట శంకరమ్మ, అమరచింత భాగ్య లక్ష్మమ్మ, మునగాల లచ్చాయమ్మ ఇలా ప్రతి ఒకరు అపర రుద్రమదేవిలా పరిపాలన చేసి ప్రజాభ్యున్నతికి కృషి చేశారు. ముందుగా సాహిత్య రంగానికి చిరస్మరణీయమైన సేవ చేసిన రాణీ భాగ్యలక్ష్మమ్మ గురించి తెలుసుకుందాం.
రాణీ భాగ్యలక్ష్మమ్మ
తెలంగాణ సాహిత్య గౌరవానికి తగిలిన దెబ్బకు స్పందనగా సురవరం ప్రతాపరెడ్డి సంకలనం చేసిన తెలంగాణ కవుల ‘గోలకొండ’ సంచిక అంకితం పొందిన మహిళ ఈ భాగ్యలక్ష్మమ్మ. ఆధునిక కాలంలో ఇది తొలి తెలంగాణ (కవితా) సంచిక. అమరచింత – ఆత్మకూరు సంస్థానం మహబూబ్‍నగర్ జిల్లాలో ఉంది. మొదట ఈ సంస్థానం అజరుచింత (అమరచింత) వర్ధమాను అను రెండు పరగణాలుగా ఉండేది. ఇందులో మొత్తం 64 గ్రామాలుండేవి. 1292 సంవత్సరంలో ఏర్పాటయిన ఈ సంస్థానంలోని 25వ తరం వాడయిన రాజా శ్రీరామ భూపారామభూపాలరావు చనిపోయిన 4 సంవత్సరాలకు భాగ్యలక్ష్మమ్మ అధికారంలోకి వచ్చింది. భావ సంవత్సర జ్యేష్ఠ శుక్ల పూర్ణిమ (1933?) నాడు అధికారాన్ని చేపట్టిన భాగ్యలక్ష్మమ్మ తన భర్తతో కలిసి అనంతశయనము, సేతు మొదలైన దక్షిణ దేశ యాత్రలను చేసి అక్కడి భక్తులకు వసతి సదుపాయాలు కల్పించారు. ఈమె గురించి గోలకొండ కవుల సంచిక ఇలా పేర్కొంది.
‘‘శ్రీమంతు సవైరాజా శ్రీరామభూపాలరావు బల్వంత బహదరుగారి పట్టపు రాణి శ్రీమంతు సవైరాణి భాగ్యలక్ష్మమ్మ గారు పతివ్రతా శిరోమణులు, దేవబ్రాహ్మణ భక్తియుక్తులు, ప్రజాపాలనా ప్రావీణ్యురాలు, న్యాయైక విచక్షణలు, ధైర్య స్థయిర్య సౌశీల్య చాతుర్య వినయాది సుగుణోపేతలు, విద్యా వివేకయుతులు, రాజనీతి నిపుణురాలు.’’ (గోలకొండ కవుల సంచిక, 1934) నిజాం నవాబుచే 1343 (1933 ప్రాంతం) ఫసలీలో అధికారానికి వచ్చిన భాగ్యలక్ష్మమ్మ ఖర సంవత్సరం ఆశ్వయుజ శుక్ల షష్టినాడు వృషభలగ్న మందు దోమకొండ సంస్థానాధీశులగు జస్వంత్, రంగమాంబ దంపతులకు జన్మించారు. గోలకొండ కవుల సంచికను అంకితమిస్తూ సురవరం ప్రతాపరెడ్డి ఇలా పేర్కొన్నారు.
‘‘అమరచింత – ఆత్మకూరు సంస్థాన ప్రభ్విణి శీశీశ్రీ సవైరాణీ భాగ్యలక్ష్మమ్మ బహదరువారికి – శ్రీవారి నిర్మల యశస్సౌరభము నిఖిలాంధ్ర ప్రపంచమునందు చిరస్థాయిగా బ్రలరించునట్లు – గోలకొండ ఆంధ్ర కవివరేణ్య కవితా విలాసపుష్పము’ కృతజ్ఞతా బద్ధముగా – అనుజ్ఞాపూర్వకముగ సమరిప్తము.’’ ఆ నాటికి పెద్ద సంస్థానాలైన గద్వాల, వనపర్తి కాకుండా అమరచింత సంస్థానాధీశురాలికి అంకితమివ్వడంలో ప్రతాపరెడ్డికి ఆమెతో గల సాన్నిహిత్యమే కారణం. రాణి కోరిక మేరకు అంతకుముందు సంస్థానంలో జరిగే అవకతవకలను అరికట్టే నిమిత్తం అక్కడ పర్యటించి తీసుకోవాల్సిన చర్యల్ని భాగ్యలక్ష్మమ్మకు సూచించడం కూడా జరిగింది. అలాగే సంస్థానం పూర్తి బాధ్యత కోర్టు నుండి అప్పుడప్పుడే తన అధికారంలోకి రావడంతో గోలకొండ కవుల సంచిక ప్రచురణకు ఆవిడ విరివిగా విరాళాలిచ్చి ఆదుకున్నారు. బహుశా అందుకే ఆమెకు అంకితమిచ్చి ఉంటాడు. తమ సంస్థానంలో ప్రతి యేటా ఫాల్గుణ శుక్ల తదియ, చవితి రోజుల్లో విద్వత్కవి గాయక సభలు నిర్వహించే వారు. ఇందులో తెలుగు సీమలోని ప్రతి ప్రాంతం నుంచి పండితులు పాల్గొనే వారు. సవైరాణి భాగ్యలక్ష్మమ్మ పరిపాలన సమయంలో కూడా ఈ సభలు ఏలాంటి లోపం లేకుండా జరిగేవి. రాఘవశాస్త్రి లాంటి ప్రాచీనులే గాకుండా నవీనులైన నంబాకం రాఘవాచార్యులు, బులుసు అప్పన్న శాస్త్రి, గాడేపల్లి వీరరాఘవ శాస్త్రి, తిరుమల బుక్కపట్టణం వేంకటాచార్యులు మొదలయిన కవి పండితుల చేత శాస్త్ర పరీక్ష చేయించి వారికి బహుమతులందజేసే వారు. (సురవరం ప్రతాపరెడ్డి, గోలకొండ కవుల సంచిక, 1934, హైదరాబాద్).
భాగ్యలక్ష్మమ్మ భర్త రామభూపాలు బహదూర్ తల్లిదండ్రులు రామలక్ష్మమ్మ, సీతారామ భూపాల బల్వంత బహదూరు. రామభూపాలుడు శా. శకం 1810 (క్రీ.శ 1888) సర్వధారి సంవత్సర అధిక చైత్ర శుక్ల పంచమినాడు వృశ్చిక లగ్నమందు జన్మించాడు. ఈయన ఆంధ్రాంగ్ల, పార్సీ భాషలభ్యసించాడు. ఈయన విశ్వావసు సంవత్సరంలో రాజ్యభారం తండ్రి ద్వారా స్వీకరించి ప్రమోదూత సంవత్సర వైశాఖ బహుళ అమావాస్యనాడు మరణించాడు. అనంతరం దాదాపు నాలుగేళ్ళ తర్వాత భాగ్యలక్ష్మమ్మ రాజ్యభారాన్ని, నిజాం ద్వారా సనదుని స్వీకరించింది. ఈమె బంధువు తాటికొండ అనంత రెడ్డి ప్రోత్సాహము ద్వారా గోలకొండ కవుల సంచిక ప్రచురణకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తోడ్పడింది. (తూమాటి దోణప్ప; ఆంధ్ర సంస్థానములు సాహిత్య సేవ)
సవై మహారాజా రామభూపాల రావు కాలంలోనూ (1915-1930) కాలంలోనూ, తర్వాత భాగ్యలక్ష్మమ్మ కాలంలోనూ విద్వత్సభలు కొనసాగాయి. ఈ సభలు ప్రతియేటా ఫాల్గుణ శుద్ధ తదియ, చవితి రోజుల్లో జరిగేవి. ఇందులో పాల్గొనేందుకు దూరప్రాంతాల నుండి కూడా ఎందరో పండితులు హాజరయ్యేవారు. ఇందులో బులుసు అప్పన్నశాస్త్రి, త్రిపురాంతక శాస్త్రి, గాడేపల్లి వీరరాఘవ శాస్త్రి, శ్రీరాముల సచ్చిదానంద శాస్త్రి, అవధానం చంద్రశేఖర శర్మ, పోకూరి కాశీపతి అవధాని, పెద్దమందడి వేంకట కృష్ణకవి, చెమికల చెన్నారెడ్డి తదితరులు పాల్గొనేవారు. వీరికి తిరుమల బుక్కపట్టణం వేంకటాచార్య, నంబాకం రాఘవాచార్యులు పరీక్షాధికారులుగా వ్యవహరించే వారు. (ఎస్వీ రామారావు, మహబూబ్‍నగర్ జిల్లా సర్వస్వం).
శ్లో. శ్రీమద్దివ్యరథాంగ శంఖ మహా పద్మాగిసర్వాయుధైః
శమత్కౌస్తుభ దివ్యహారమణిభి శ్శ్రీవత్స చిహ్నాదిభిః
యుక్త శ్శ్రీపతి రేషనిత్యమవతు శ్రీభూమినీళాదిభిః
శ్రీరామా వనిపాల మౌళి మహిషీం శ్రీ భాగ్యలక్ష్యంబికాం
-తిరుమల బుక్కపట్టణం వేంఖటచార్యులు
మం. స్థిర సామ్రాజ్యమనాయంబు జయలక్ష్మీ వ్యాప్తి శశ్వద్యశ
స్ఫ్సురణంబండిత పోషనాభిరతి సంపూర్ణానుకంపాప్తియున్
బరమౌదార్యము నైజపాదభజన వ్యాసంగమున్ గూర్చి శ్రీ
కర కుర్మూర్తి గిరీశుడోము నిను దీక్షన్ భాగ్యలక్ష్యంబికా
-దీక్షితుల నరసింహన్ శాస్త్రి
జయతు జయతు నైజాం చక్రవర్తీ రాజ్యం
జయతు జయతు రాజత్తత్ప్రజా తత్కుటుంబం
జయతు జయతు తస్యానుగ్రహాల్లబ్ధ రాజ్యా
జయతు జయతు రాజ్ఞీ భాగ్యలక్ష్చంబికాఖ్యా
-జోస్యం వేంకటాచర్యులు
(గోలకొండ కవుల సంచికలో ఆశీస్సు పేరిట గ్రంథాదిలో ఈ పద్యాలున్నాయి)
మునగాల
ఈ మునగాల సంస్థానం చాలా ప్రాచీనమైంది. 1262 – 1326 మధ్యకాలంలో ఇది కాకతీయుల చక్రవర్తుల కింద సామంత రాజ్యం. ఔరంగజేబు కాలంలో దీనికి సన్నదు దొరికింది. 1802 (?)లో సర్కారులపై ఆధిపత్యానికై ఇంగ్లీష్, ఫ్రెంచి వారికి జరిగిన ఆధిపత్య పోరులో మునగాల వారు ఇంగ్లీష్ వారికి మద్దతుగా ఒక ఫ్రెంచ్ పటాలాన్నీ ఓడించడంతో బ్రిటిష్ వారు జమిందారీ హోదా కల్పించారు. మెకంజీ కథనం ప్రకారం గుర్లపాటి అయ్యన్న దేశాయి వీరి పూర్వీకుల్లో ఒకరు. 1693లో అయ్యన్న దేశాయి మరణించడం, అంతకుముందే ఆయన కుమారుడు చనిపోవడంతో కోడలు సుభద్రమ్మకు సంస్థానాధికారం సంక్రమించింది. అయితే సంస్థాన పరిపాలన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించలేక పోవడంతో ఆమె సోదరుడు కీసర ముకుందప్ప మునగాల పాలకుడయి ఔరంగజేబు సన్నదు పొందిండు.
ముకుందప్ప తర్వాత ఆయన కోడలు, నరసన్న భార్య అయిన లచ్చాయమ్మ మునగాల సంస్థాన నిర్వహణ బాధ్యతలు చేపట్టింది. ఈమె, యుద్ధతంత్రంలో, రాజనీతిలో చాకచక్యంతో రాణించి సంస్థానానికి పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చింది. ఈమె కుమారుడు వెంకటరామన్న. ఆయన కుమారుడు వెంకట నరసింహారావు 1802లో ఇంగ్లీషు వారి నుండి సన్నద్ – ఇ మిల్కియత్ ఇస్తిమిరార్ స్వీకరించాడు. వెంకట నరసింహారావు అనంతరం ఆయన కుమారుడు కోదండరామయ్య రాజ్యభారం వహించి 1814లో అకాలమరణం పొందాడు. ఈయన కుమారుడు వెంకటనరసింహారావు పసివాడగుటచే సంస్థానము 1814 – 1818 మధ్యన కోర్టు ఆఫ్ వార్డస్ వశమయింది. ఆ తర్వాత 1818లో వెంకటనరసింహారావు అధికారంలోకి వచ్చి 18 యేండ్లు పాలించి 1836లో మృతి చెందాడు. ఈయనకు సంతానం లేనందున కోదండరామయ్య అనే అతన్ని దత్తత తీసుకున్నారు. ఈతను మైనర్ కావడంతో మరోసారి అధికారము కోర్టాఫ్ వార్డస్ చేతిలోకి వెళ్ళింది.
1850లో కోదండరామయ్యకు సంస్థాన పట్టం దక్కింది. అయితే అది ఎంతో కాలం నిలువలేదు. 1854లో కోదండరామయ్య మరణించడంతో ఆయన భార్య రుక్కమ్మ జమిందారిణీ అయ్యింది. ఆమె 14 సంవత్సరాలు పాలన చేసి 1868లో మరణించింది. అయితే వారసత్వ గొడవల కారణంగా 1873లో సంస్థానపాలకురాలిగా బాధ్యతలు చేపట్టిన లచ్చమ్మారావు 1892లో చనిపోయేవరకు వాటిని నిర్వహించారు. ఈమె పాలన కాలంలో మునగాల సంస్థానం కార్యకలాపాలు శిరిపురం కేంద్రంగా నడిచాయి. అనంతరం కేసరి రుక్కమ్మ కూతురు లచ్చమ్మా రావు అధికారంలోకి వచ్చి వరంగల్లు జిల్లాకు చెందిన నాయని వెంకట రామయ్యని వివాహమాడింది. ఆయన నిస్సంతుగా మరణించడంతో 1888లో మరో బంధువు మహబూబాబాద్ తాలూకా నెల్లికుదురు గ్రామానికి చెందిన నాయని రాఘవ రెడ్డి మూడో కుమారుడు రంగారెడ్డిని లచ్చమ్మారావు దత్తత తీసుకుంది. ఆయనకు వెంకటరంగారావు అని నామకరణం చేసింది. మైనర్ అయిన కారణంగా సంస్థానం కోర్టాఫ్ వార్డస్ లో ఉండింది. నాయని వెంకట రంగారావు 1900లో మేజర్ అయి సంస్థాన బాధ్యతలు స్వీకరించాడు. కేసరి రుక్కమ్మ, ఆమె కుమార్తె లచ్చమ్మారావు ఆధునిక కాలంలో మునగాల సంస్థానికి మూలస్థంబాలని చెప్పవచ్చు. ఎన్నో కోర్టు కేసులు ఎదుర్కొని సంస్థాన అధికారాన్ని నిలుపుకొని ఆధునికత ద్వారాలు తెరిచారు. మూడు వైపుల మద్రాసు ప్రెసిడెన్సీ యిలాకా ఉండడంతో మచిలీపట్నం, జగ్గయ్యపేట, విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాల్లో జరిగే కార్యకలాపాలు తమ సంస్థానంలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేశారు. విద్యావసతులు కల్పించారు.
అయ్యదేవర కాళేశ్వర రావు, కొమర్రాజు వెంకట శివయ్య, పింగళి వెంకయ్య తదితరుల్ని సంస్థాన ఉద్యోగులుగా నియమించి వారిచే కార్యకలాపాలు నడిపించారు. 1930వ దశకం నాటి సంస్థానం ఖజానా వివిధ వ్యాజ్యాల మూలంగా ఖాళీ కావడంతో ప్రజలపై అధికభారం మోపి దౌర్జన్యాలు కొనసాగించండంతో ప్రజలు తిరుగుబాటు చేశారు. ఈ సమయంలో జమిందారు వివిధ వ్యాజ్య గొడవల్లో ఇరుక్కొని వరంగల్లు, హైదరాబాద్, మచిలీపట్నం, మద్రాసు కోర్టుల్లోనూ, లండన్ ప్రీవీ కౌన్సిల్లోనూ కేసులు నడిచాయి. నాయని వెంకటరంగారావు తన వ్యాజ్యాలే గాకుండా తన భార్య తాలూకు, ఆమె పితృ సంబంధమైన వ్యాజ్యాలను, తన మరదలు ఎనసాని రుక్కమ్మ వ్యాజ్యాలను, వనపర్తి రాజా కుమారుని వ్యాజ్యాలు కూడా చూడాల్సి వచ్చింది. రెండు కేసులైతే 40 యేండ్లకు పైగా సాగాయంటే వాటికి ఆయన వెచ్చించిన మొత్తం అందుకు ఖజానా ఖాళీ అయిన తీరు అవగతమవుతుందని తటవర్తి వెంకటేశ్వరరావు అంటున్నారు. (తటవర్తి వెంకటేశ్వరరావు – మునగాల పరగణా ప్రజా ఉద్యమ చరిత్ర, మునగాల, 1981).
-సంగిశెట్టిశ్రీనివాస్,
ఎ:98492 20321