అభినందనలు


పిల్లల రచనలకు ప్రాచుర్యం కల్పించడం, ప్రచురించడం, పంపిణీ చేయడం, మార్కెటింగ్‍ లాంటి సమస్యలు ఉన్నా, ఇలాంటి అంశాలపై దృష్టి సారించిన ‘చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్‍ అకాడమీ’ తెలంగాణాలోని ఉమ్మడి 10 జిల్లాల ‘‘బడి పిల్లల కథలు’’ సంకలనాలుగా అందమైన బొమ్మలతో వెలువరించింది. ఆ ‘పది జిల్లాల బడి పిల్లల కథలు’ దక్కన్‍ల్యాండ్‍ పాఠకులకు పరిచయం చేయడంలో భాగంగా ‘హైదరాబాద్‍ బడిపిల్లల కథలు’ గురించి బాల సాహితీవేత్త డా।। సిరి గారి విశ్లేషణ.
కథల కోసం చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్‍ అకాడమీ వారి ఆహ్వానం మేరకు హైదరాబాద్‍ జిల్లా ‘బడిపిల్లల కథలు’ ఎంపిక కోసం 64 కథలు రాగా కథల కార్యశాలలో పాల్గొన్న నిష్ణాతులైన బాలసాహితీవేత్తలు 21 కథలను ఎంపిక చేశారు. ఈ పుస్తకానికి కవర్‍ ఆనంద్‍ గడ, లోపలి బొమ్మలు ఎల్‍. నరేందర్‍ వేశారు. ఈ బాధ్యతను నెరవేర్చే క్రమంలో ‘చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్‍ అకాడమీ’ నిష్ణాతులతో ఎన్నో సమావేశాలు, సదస్సులు, చర్చలు, బాల చెలిమి ముచ్చట్లు నిర్వహించింది.
‘బాలసాహిత్యం’ ఒక వనమైతే, అందులో ఉన్న అక్షర వృక్షాలన్నీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం, వారి వికాసం కోసం పెద్దలు తరతరాల నుండి నాటుతున్న మొక్కలే. కథలు, గేయాలు, కవితలు పాటలతో నిండుగా ఉన్న వృక్షాలపై రెక్కలు కట్టుకుని వచ్చివాలే బాలగువ్వలెన్నో. ఆ కథలే వారి మనో వికాసానికి దారులు పరిచాయి. అవే వారిలోని వివేకాన్ని తట్టిలేపాయి. సాహిత్యమే వారి వ్యక్తిత్వం వికసించడానికి, వారు గొప్ప వ్యక్తులు కావడానికి దోహదపడింది. ఆ బాలసాహిత్యమే, వారిని మంచి మార్గంలో పయనించేలా చేసింది. నేస్తమై, ఊతమై, ముందుకు నడిపింది.


పిల్లల మనసు ఎంతో స్వచ్ఛమైనది. కల్మషంలేని ఆలోచనలు వారివి. నూతన ప్రపంచాన్ని స•ష్టించగల సామర్థ్యం ఉంది. అయితే, వారి ఆలోచనలని వారి అంతరంగం నుండి బయటకు తీసుకురావడం చాలా కష్టం. ఎందుకంటే, పిల్లలు, తాము పిల్లలమని, తమ ఆలోచనలని చూసి ఇతరులు నవ్వుతారని, ఇలా పలురకాల కారణాలతో, తమ ఆలోచనలని, భావనలని బయటకు వ్యక్తీకరించడానికి సందేహిస్తుంటారు. కొందరు వ్యక్తీకరించాలను కున్నా, ఎలా చెప్పాలో తెలియక సతమతమౌతుంటారు. అయితే, తమలోని ఆలోచనలు, తమకు తామే వ్యక్తీకరించడానికి, వారికి తమ ఆలోచనలని, ఒక మార్గం చూపబడింది. అదే ‘రచన’. పిల్లలు తాము వ్రాసే రచనల ద్వారా తమ ఆలోచనలని, అంతరంగాన్ని వ్యక్తపరచడమే కాదు, వారి రచనలతో మంచికి మార్గం పరుస్తున్నారు. సాహిత్యానికి సరికొత్త సొబగులు అద్దుతున్నారు.


‘ఎవరు గొప్ప’, ‘ప్రతిభ’, ‘కోతి – కొబ్బరికాయ’, ‘మరిచిపోలేని మిత్రుడు’, ఇలా ఈ పుస్తకంలోని ఎన్నో కథలు మనుషుల ఆలోచనలో మార్పు తీసుకొస్తాయనడంలో సందేహం లేదు. ఈ కథలు, మనిషి వ్యక్తిత్వంపై, ఆలోచనా ధ•క్పథంపై, సమాజంపై చెరిగిపోని ముద్రవేస్తాయనడంలో అతిశయోక్తి ఏ మాత్రం కాదు.
పిల్లల బంగారు భవిష్యత్తుకి తమ వంతుగా చేయూతనందిస్తూ, వారికి బాసటగా నిలుస్తూ వారి కథలకు పుస్తక రూపం ఇచ్చి, వారిలోని ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్న ‘చెలిమి’ కృషిని అభినందిస్తూ, ఈ కథలు మరెంతో మంది చిన్నారులలో స్ఫూర్తిని నింపి, వారిని ‘బాల’ సాహితీవేత్తలుగా మారుస్తాయని నమ్ముతున్నాను. తమ రచనల ద్వారా సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తున్న బాలలందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ…


-డా।। సిరి
బాల సాహితీవేత్త

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *