‘‘కావ్యేషు నాటకం రమ్యమ్’’ అని చెప్పినట్లుగా జానపదకళా రూపాల్లో యక్షగానం రమ్యమైనది. నేటికీ గ్రామాల్లో ఆడబడుతున్న అచ్చమైన జానపదకళారూపం. యక్షగాన ప్రదర్శనల వలన సామాన్య ప్రజలకు తెలుగుభాష పట్ల ఆసక్తి పెరిగింది. యక్షగానాల ప్రభావంతో రామాయణ, భారత, భాగవత, పురాణ, చారిత్రక కథలు ప్రాచుర్యాన్ని పొందాయి.
ప్రపంచంలోని ప్రతి మానవుడు తన ఆలోచనలను, ఇతరులకు తెలపడానికి, ఇతరుల ఆలోచనలను తెలుసుకోవడానికి ఉపయోగించే సాధనమే భాష. భాష ప్రవాహం లాంటిది. కొత్త కొత్త పదాల్ని తనలో ఇముడ్చుకుంటుంది. మానవుడు భాషను సృష్టించినప్పటినుండి ఇప్పటి వరకు ఈ విధమైన మార్పు జరుగుతూనే ఉంది. పాశ్చాత్యులు పరిపాలన ప్రారంభించాక భాషలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. భాషా వికాసం జరుగకపోతే క్రమక్రమంగా ఏ భాషైనా సరే మృతభాష అవుతుంది.
యక్షగానాలు ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణలోను, దక్షిణదేశంలో, తంజావూరు, మధురై, మైసూరు, పుదుక్కోట తిరుచునాపల్లి, చెంగల్పట్టు, సేలం, మదరాసు మొదలైన ప్రదేశాలలోనూ తెలుగుభాష వ్యవహరింపబడుతున్న అనేకచోట్ల విస్తరించినవి. తెలుగున రచించబడిన ఈ యక్షగానాల్లో తెలుగుతో పాటు ఆయా ప్రాంతాల మాండలికాలు, మాండలిక భాషతో పాటు వివిధ కులాల వారు వ్యవహరించిన భాషాభేదాలు, కొన్ని యక్షగానాల్లో సంస్కృత, ప్రాకృత, పాళీ మొదలైన భాషల పదజాలం, జాతీయములు, ప్రయోగించబడాయి. వ్యాకరణముల అడుగుజాడలను ఆశ్రయింపక పదప్రయోగ విషయములో యక్షగానకవులు స్వాతంత్య్రమును పొందారు. వివిధ భాషల నిలయమై భాషా విషయకంగా యక్షగానం తన ప్రత్యేకతను నిలుపుకొని వైవిధ్యాన్ని కనబరుస్తుంది.
జానపదుల భాష వ్యవహరికం. వ్యవహారిక భాషలోని మాండలిక పదాల మాధుర్యాన్ని ఆస్వాదించాలంటే యక్షగానాన్ని మించిన సాహిత్య పక్రియ మరొకటి లేదని చెప్పవచ్చు. ఉదాహరణకు తాకట్ల మాటలు, అంబట్యాళ, ఒకపారి, గోస, గద్దరించు, తటుకును, తొక్కుడు, దెంకపోవు, బుదగరించు, గండుమెండు, బుగులు, లెంకుడు, గులోబు, సంసారం, సోయి, వుసుక, సరసర బ్కొబొర్ల, సరాన, సంకటి, కురిచి మొదలైన మాండలిక పదాలు యక్షగానాలలో కనిపిస్తున్నాయి.
చారిత్రక, సామాజిక కారణాలవల్ల ప్రతిభాషలో అన్యదేశ్యాలు చోటుచేసుకుంటాయి. తెలంగాణ ప్రాంతం అనేక సంవత్సరాలు నిజాం నవాబుల ఏలుబడిలో ఉన్నందున అనేక ఉర్దూపదాలు తెలుగు సాహిత్యంతో సహజీవనం చేసాయి. అలాగే ఆంగ్లేయుల ప్రభావం వల్ల ఆంగ్లపదాలు, సరిహద్దు రాష్ట్రాల ప్రభావం వల్ల మరాఠీ, కన్నడ పదాలు, యక్షగానాలలో ప్రవేశించి తెలుగు పదాలే అన్నంతగా కలిసిపోయాయి. తమాషా, తహసీలు దాఖలు, సుబేదారు, మజా, దస్కతు, జారీ, దివాను, బైఠో, తల్వార్, దర్వాజ్, హకీల, బేటి, ఫిరంగి, బందోబస్తు, బేజారు బనాయించు, సలామ్, సీసా, చా, జిద్దు, పాటక్, కామూష్ వంటి పదాలు యదాతథంగా యక్షగానాలలో ప్రయోగించబడ్డాయి. ఇలాంటి పదాలే కాకుండా నిఘంటువుల కెక్కని పదాలు చాలా దర్శనమిస్తున్నాయి.
భాషకు అందాన్ని చేకూర్చి దాని విస్తరణకు తోడ్పడేవి జాతీయాలు. చాలా మంది కవులు తమ యక్షగానాల్లో జాతీయాలను ప్రయోగించి భాష పెంపుదలకు తోడ్పడ్డారు. ప్రపంచంలోని భాషలన్నింటికి ఏ భాష ప్రత్యేకత ఆ భాషకే ఉంటుంది. ఒక భాషలోని సొగసు, వాక్య నిర్మాణం ఇంకో భాషలోనికి అనువదించడం కష్టం. కొన్ని పదాలు అసలు అనువాదానికి లొంగవు. కనుక వాటిని యదాతథంగా ప్రయోగిస్తారు. మానవ జీవితంలో కంటికి కనిపించే, అనుభవంలోకి వచ్చే, అనుభూతిని కలిగించే విషయాల నుండి జాతీయాలు పుడుతాయి. నంగనాచి, పిలవని పేరంటం, పొద్దుగూకుల, దుమ్ముకొట్టు, అడవిలవడ్డట్టు, చెల్లిపోవు, కంట్లోదుమ్ముకొట్టు మొదలైన చాలా జాతీయాలు యక్షగానాలలో చోటుచేసుకున్నాయి.
అల్పాక్షరాలలో అనల్పార్థరచనలాగా అల్పాక్షరాలలో అనంతమైన జీవితానుభవాన్ని అందించేవి సామెతలు. సామెతల ప్రయోగం వలన కూడా భాష యొక్క అందాన్ని ఇనుమడింప చేయవచ్చు. అన్ని భాషల్లోనూ ఈ సామెతలు ఉన్నాయి. కాలం తెలియని ఏనాడో, ఏ వ్యక్తి నోటనో, పుట్టి పరంపరగా ఒకతరం నుండి మరొక తరానికి తరలి వచ్చినవీ సామెతలు. కానీ ఎప్పుడు, ఎవరి ద్వారా పుట్టాయో తెలియకపోయినా వీటి పుట్టుకకు కారణం జానపదాలే అని చెప్పొచ్చు. ప్రజల దైనందిన వ్యవహారాలలో వాడే సామెతలు యక్షగానాలలో అడుగడుగునా దర్శనమిస్తాయి. ‘‘మంత్రాలకు చింతకాయలు రాలవు’’, ‘‘నోరాడితే చెయ్యాడును’’, ‘‘తల్లిలేని పిల్లంత దయ్యాలపాలు’’, ‘‘పిల్లికనులు మూసుకొని పాలు త్రాగుచు ఒరులెరుగరని తలచినట్లు’’, ‘‘ముందు నుయ్యి వెనుక గొయ్యి’’, ‘‘పెద్దతనంబు వచ్చె బుద్ది పెడతల బిట్టె’’, ‘‘ఈడుబడ్డకొద్ది యవ్వనమొస్తది’’, ‘‘లోతెరుగక చెర్లబడ్డట్టాయెనే’’ మొదలైనవి. లోకానుభవంలోని సామెతలను రచయితలు కొంచెం మార్పు చేసి యక్షగానాలలో ప్రయోగించారు.
పాశ్చాత్యుల దండయాత్రలతో మనభాషలో ఇతర భాషాపదాలు చేరి తెలుగుతనం ఉట్టిపడేటట్లు మన సారస్వతంలో కలిసిపోయాయి. ఈనాడు యక్షగాన సాహిత్యంలో కూడా కలిసిపోయి భాష సారస్వతం ఒక కొత్త అందాన్ని సంతరించుకున్నది.
-డి. రాజు ఎ : 9989515549,