ఉమ్మడి వరంగల్ జిల్లా – గ్రామ నామాలు

తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్, సికింద్రాబాద్ రెండు నగరాలు జంట నగరాలుగా పిలుచుకోవడం ఒక విశేషమైతే వరంగల్, హనుమకొండ, ఖాజీపేట ఈ మూడు పట్టణాలను కలిపి ట్రై సిటీస్’గా పిలుచుకోవడం మరో విశేషం. ఉమ్మడి వరంగల్ జిల్లా చారిత్రకంగా ప్రసిద్ధిగాంచిన ప్రాంతం. “వరంగల్లును పరిపాలించిన గొప్ప రాజవంశం కాకతీయ వంశం. వరంగల్ నగరానికి ఓరుంగల్లు, ఓరుగల్లు, కాకతీపురము అనే పేర్లు వ్యవహారంలో ఉన్నాయి.

ఓరుంగల్లు శబ్దం నుండే వరంగల్లు, ఏకశిలానగరం, ఏకశిలాపురి, ఏకోవల అని సంస్కృతీకరించిన రూపాలు శాసనములందు, కావ్యములందు కలవని ఆదిరాజు వీరభద్రరావు గారు తమ పరిశోధనలో తెలిపినారు. తెలుగు ప్రాంతమునంతటినీ పాలించిన కాకతీయులకు రాజధానిగా ఉన్న కారణంగా ఆంధ్రనగరి అని పేరు వచ్చింది.” (ఆలోకనం: డా. సాగి కమలాకర శర్మ, పుట-251) “క్రీ.శ.1504కాలం నాటి షితాబ్ ఖాన్ వరంగల్ కోటలో వేయించిన శాసనంలో ఏకోపాలపురి, ఏకశిలాపురి అని ఉన్నది.”(కాకతీయుల నుండి అసఫ్జాహీల వరకు తెలంగాణ : తె.సా.అకాడమీ, పుట-262,263) 2011 జనాభా లెక్కల ప్రకారం ఐదు రెవెన్యూ డివిజన్లు,51మండలాలు,1049 గ్రామాల సమాచారమున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటులో జనగామ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, వరంగల్, హన్మకొండ అను ఆరు జిల్లాలుగా ఏర్పడింది. ఉమ్మడి జిల్లాలో గ్రామ నామాలపై చారిత్రక ఆధార గ్రంథాల సమాచారం అధికంగానే ఉన్నప్పటికీ స్థల పరిమితి వలన కొన్ని గ్రామ నామాలను మాత్రమే చర్చిస్తున్నాను.

కొరవి/కురవి:- కురవి పేరుతో పిలువబడుతున్న మండల కేంద్రమిది.”క్రీ.శ.935కాలం నాటి ముదిగొండ చాళుక్య నిరవద్యుని కొరవి శాసనంలో రెండవ వైపు ఐదవ పంక్తిలో కొరవి’ అని ప్రస్తావించబడినది.”(మీరూ శాసనాలు చదవొచ్చు: ఈమని శివనాగిరెడ్డి స్థపతి. పుట-279) కాల క్రమంలో కొరవి’యే కురవి’గా మారింది.

జనగామ: జైనం విలసిల్లిన ప్రాంతం కావున పూర్వపు జైన్ గావ్ నుండే జనగామ’గా రూపాంతరం చెందింది. జైనులను సిద్ధులు, వేములు అంటారు. జైన తీర్థంకరులను వేల్పులుగా కొలుస్తారు. సిద్దెంకి గ్రామం, సిద్దుల గుట్ట, వేల్పు కొండ, వేములతోట, వెల్ల వేముల, ఎల్లంల ఇట్లా జైన సంబంధ గ్రామనామాలు, గుట్టలు ఉన్నాయి. జైన మతాన్ని అవలంబించిన రాష్ట్ర కూటులకు, కళ్యాణి చాళుక్యులకు కొలనుపాక రాజధాని. వీరి కాలంలో వేసిన శాసనాలు జైన బసదులకు దానమిచ్చిన వివరాలను తెలుపుతున్నాయి. (ఆలోకనం: డా. సాగి కమలాకర శర్మ, పుట-65)

పాలకుర్తి: జనగామ జిల్లాలోని మండల కేంద్రమిది. “తెలంగాణ ప్రాచీన కవి పాల్కురికి సోమనాథుడి జన్మస్థలమిది. సోమనాథుడి కాలంలో పాలకురికి అని వ్యవహారంలో ఉండేది. సి.పి బ్రౌన్ కాలం నాటి నుండి పాలకురికి’ని సోమనాథుడి నివాస స్థలముగా విశ్వసిస్తున్నారు. పాలకుర్తి సమీపంలో ఎలకురికి, ఉరికురికి అనే గ్రామనామాలు ఎలకుర్తి, ఉరికుర్తి’గా వ్యవహరిస్తున్నారు.”(శ్రీపండితారాధ్య చరిత్ర : పరిష్కర్త డా.చిలుకూరి నారాయణ రావు,1939.పుట-09)అట్లాగే పాలకురికి నుండి పాల్కురికి పాలకుర్తి’గా పరిణామం చెందినది.

బమ్మెర: పాలకుర్తి మండలం లోని గ్రామమిది. సుప్రసిద్ధ తెలుగు కవి బమ్మెర పోతన జన్మస్థలమిది. “క్రీ.శ.1124 కాలం నాటి విరియాల కామవసాని గూడూరు శాసనంలో విరియాల వంశానికి చెందిన మల్లుడు నిర్మించిన మల్లేశ్వరాలయానికి ఈ గ్రామాన్ని దానం చేసిన సందర్భంగా శాసనంలో ఈ గ్రామ నామం బమ్మరిగె (బమ్మెర) అని ప్రస్తావించ బడినది.”(అలనాటి మేటి తెలంగాణ శాసనాలు: ఈమని శివనాగిరెడ్డి స్థపతి. పుట-111) కాల క్రమంలో బమ్మరిగె నామం బొమ్మెర’గా, బమ్మెర”గా పరిణామం చెందినది.

మహబూబాబాద్: ఈ నగరాన్ని మానుకోటగా కూడా పిలుస్తారు. “చుట్టూ మ్రానులతో నిండి ఉన్న మట్టికోట ఇక్కడ ఉండేది. అందువల్లనే దీనికి మ్రానుకోట పేరు వచ్చిందని చారిత్రక కథనం. తద్వారా మ్రానుకోట’యే మానుకోట’గా స్థిరపడింది. ఆరవ నిజాం మహబూబ్ అలీఖాన్ నివాసముండిన ప్రాంతం కనుక అతని జ్ఞాపకంగా ఈ పట్టణానికి మహబూబాబాద్ అనే పేరుతో పిలువ బడుతున్నది.”(ఆలోకనం: డా. సాగి కమలాకర శర్మ. పుట-157)

ములుగు: “ఈ ప్రాంతంలో దొరికిన ప్రాచీన మానవుల పనిముట్ల ప్రాచీనత ఆధారంగా, ‘ ములుగు’ పద ప్రాచీనత ఆధారంగా కొందరు చరిత్రకారులు శాసనాలలో అశ్మక రాజ్యంతో కలిపి పేర్కొనబడిన ‘ ములకరాజ్యం’ ఈ ప్రాంతమేనని వాదించారు.”(తెలంగాణలో కొత్త విహార స్థలాలు: డా.ద్యావనపల్లి సత్యనారాయణ, పుట-55) ములుగు ప్రాంతంలో అడవులు ఎక్కువగా ఉండడం వలన సంవత్సరమంతా మేఘాలతో ఆవరించి ఉండేదని, ఆ మేఘాలను స్థానిక భాషలో “మొగులు” అని పిలిచేవారు. మొగులు నుంచి ములుగు’గా మారిందన్న ఐతిహ్యమున్నది.

రామప్ప దేవాలయ శాసనం: వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామ పరిధిలోనిది. “క్రీ.శ.1213 కాలం నాటి రేచర్ల రుద్రుడు వేయించిన రామప్ప దేవాలయ శాసనంలో ఆతుకూరు, నెక్కొండ, విప్పర్లపల్లి, బొర్లపల్లి, నడికుడి అనే గ్రామ నామాల ప్రస్తావనలున్నవి.”(మీరూ శాసనాలు చదవొచ్చు: ఈమని శివనాగిరెడ్డి స్థపతి. పుట-401) నాటి శాసన రూపాలు ప్రస్తుతం ఆత్మకూరు, నెక్కొండ, ఉప్పర పల్లి, బోర్లపల్లి, నడికుడి’గానూ వ్యవహరిస్తున్నారు.

వల్మిడి: పాలకుర్తి మండలం లోని గ్రామమిది. “క్రీ.శ.1567 ఇబ్రహీం కుతుబ్ షా కాలం నాటి వల్మిడి శాసనంలో మూడోవైపు ఆరవ పంక్తిలో వలిమిడి’ అని ప్రస్తావించ బడినది.”(కొత్త తెలంగాణ శాసనాలు: శ్రీరామోజు హరగోపాల్. పుట-198) వలిమిడి క్రమంగా వల్మిడి’ గా మారింది. వాల్మీకిపురమనే ఐతిహ్యమున్నది.

హనుమకొండ: “కాకతీయుల కంటే ముందు ప్రస్తుత పద్మాక్షి, సిద్ధేశ్వరాలయాలు ఉన్న ప్రాంతాన్ని అనుమడు, కొండడు పరిపాలించారు. ఈ నాయకుల పేర్ల మీదుగానే ఈ ప్రాంతానికి అనుమకొండ, హనుమకొండ అనే పేరు వచ్చింది.”(కాకతీయులు : పి.వి.పరబ్రహ్మ శాస్త్రి, పుట-49) సిద్దేశ్వర చరిత్రలో అనుమడు, కొండడు ప్రస్తావన ఉన్నది. “అంబాల, అనుమగిరి, అనుమకొండ, ఎలుగూరు, ఏకశిలానగరం, ఐయినవోలు, ఒడ్డపల్లి, ఒడ్డెపల్లి, ఓరుగల్లు, ఓషధిపురం, కందారం, కల్లూరు, కాళేశ్వరం, గంగాపురము, గణపవరము, గణపురము, గొట్టిపరు, చెర్వుపల్లి, పాలకుర్తి, పెద్ద శివనగరము, ప్రతాపగిరి, మొగిలిచర్ల, రాచర్ల, రుద్రవరము, సిరిపురం, హనుమాద్రి మొదలగు వరంగల్ మరియు ఇతర ప్రాంతాల గ్రామనామాలు కనపడతాయి.”(కాసె సర్వప్ప ప్రణీతము, శ్రీ సిద్దేశ్వర చరిత్రము : సంపాదకుడు ఖండవల్లి లక్ష్మీరంజనం.1960)

ఉమ్మడి జిల్లా పరిధిలో ఇనుగుర్తి-ఇనుగుర్కి,ఎనుమామ్ల-ఏనుబాముల, కట్కూరు-కట్టకూరు, కళ్లెం-కళ్యాణపురం,కుందవరం-కుందసముద్రం, ఖిలాషాపూర్-కిలాస్ పూర్, కొమురవెల్లి-కొమురెల్లి, గణపు రం-గణపతిపురం, గుండెపుడి-గుండియాపూండి, గుమ్మడవెల్లి-గుమిడెల్లి, గురిజాల-గురిందాల,గూడూరు-గుముడూరు, చౌండవరం-చౌండసముద్రం, జాఫర్ ఘడ్-వేల్పుకొండ, టేకుమట్ల-తేకుంబెడ్డ, నేరెడు-నేరడ, బెక్కల్లు-బెక్కంటి, మట్టియలస్థలం-మట్టెవాడ, మడికొండ-మెట్టుగుట్ట,మాంగల్లు-మాగల్లు,మొగిలిచర్ల-మొగిలిచెరువు/కేతకీ తటాకపురము, వంతడుపుల-అంతడుపుల, శనిగరం-శృంగవరం,స్తంభాలపల్లి-కంబాలపల్లి’ వంటి అనేక గ్రామ నామాల రూపాలు కనబడుతవి.

డా. మండల స్వామి
m: 9177607603
mandala.smy@gmail.com

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *