ఈ కథలో మనకు ప్రధానంగా కనిపించే పాత్రలు రెండే రెండు రత్తమ్మ, సుందరమ్మ. రత్తమ్మ నెమ్మదస్తురాలు, డాంబికాలు నచ్చవు. ఉన్నదాంట్లో సర్దుకు పోయే మనిషి, సుందరమ్మ కాస్త డాబుసరి. ఆవిడకి హెచ్చులు, ఆడంబరాలు ఎక్కువ. ఇద్దరికీ భర్తలు లేరు. కాలాంతరము చెందారు. ఇరువురు తమ పిల్లల ఉద్యోగాల కోసం రాజమండ్రికి వచ్చారు. రత్తమ్మకు ఇద్దరు పిల్లలు. ఒక కొడుకు, ఒక కూతురు. కొడుకు బి.ఎ. పూర్తి చేసి
ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. సుందరమ్మకు ఇద్దరూ కొడుకులే. ఒకడు బి.ఎ. పూర్తి చేసి ఉద్యోగం వెతుకుతున్నాడు. ఇంకొకబ్బాయికి 9వ ఏడు. అయితే పెద్ద కొడుకుకు 16వ ఏడు వెళ్ళకుండానే పెళ్ళి చేసింది. ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా సుందరమ్మ డాంబికము మనిషి. చాలా గొప్పలు చెప్పుకుంటుంది. గొప్పలు కోసం, తన గాజులను, రెండు పేటల గోవర్ధన గొలుసును, ఉంగరాన్ని ప్రదర్శిస్తుంది. సుందరమ్మ తన కొడుకు పెద్ద ఉద్యోగాన్నే చేస్తాడని చిన్న చిన్న ఉద్యోగాలు చెయ్యడని, చాలా గొప్పగా చెప్పుకుంటుంది. రత్తమ్మ తన కొడుకు బి.ఎ. చదివినప్పటికినీ ఒక తాపీమేస్త్రీ పనికి కొడుకును పంపిస్తుంది. శ్రమించి బ్రతకటమే ప్రధానమని, శ్రమ విలువను గుర్తించాలని రత్తమ్మ పిల్లవాడి ఆకాంక్ష. సుందరమ్మ హెచ్చులు, ఆడంబరాల తోనూ కొడుక్కు ఏ ఉద్యోగమూ సంపాదించు కోలేకనూ చివరకు ఆ గొలుసును, ఉంగరాన్ని రెండు జతల గాజులను విధిలేని పరిస్థితులలో అమ్మాల్సి వచ్చింది. రత్తమ్మ కొడుకే కొంటాడు. ఇక్కడ విచిత్రమేమిటంటే సుందరమ్మకు తెలియకుండానే ఆమె నగలు రత్తమ్మ దగ్గరకు వెళ్ళాయి. రత్తమ్మకు తెలియదు తన పిల్లవాడు తెచ్చిన నగలు సుందరమ్మవేనని. ఓడలు బండ్లు, బండ్లు ఓడలు కావటం సహజం. కాని డాంభికాలతో, ఆడంబరాలతో, కన్ను మిన్ను కాని అహంకారాలతో క్రింద పడటం అనేది క్షంతవ్యం కాదు. ఎప్పుడైనా నిరాడంబరత, శ్రమ విలువ సుఖాన్ని, ఆనందాన్ని ఇస్తాయి.
- జి. ప్రణయశ్రీ
9వ తరగతి, ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్, హైదరాబాద్