కూ•రమృగాలుగా ముద్రవేసిన జంతువులు ఎదురుపడితే పారిపోతారు. అదే మేము (పాములు) ఎదురుపడితే అరిచి, జనాన్ని పోగుచేసి చంపుతారు. పైగా చిన్న పామునైనా పెద్దకర్రతో చంపాలని కథలు చెపుతారు. మరోవైపు ఏ జంతువుకు చూపని భక్తిశ్రద్ధల్ని, ఆరాధనను మాపట్ల చూపుతారు. నాగపంచమి పేరున మీ మహిళలు (మగవారు కాదు) మా ఆవాసాలైన పుట్టల్లో (అన్ని పుట్టల్లో మేం వుండం) పాలుపోసి తరిస్తారు. మాపట్ల మీకు ఇంత గౌరవం భక్తిశ్రద్ధలు వున్నాయి కదా అని మేం మీ వెనక వచ్చామనుకోండి… అరిచి, చంపేస్తారు. ఇది ద్వందవైఖరి కాదా?
అసలు వాస్తవం:
గిరిజనులు నాగోబా పేరున జాతర చేసి, మా పట్ల భక్తి శ్రద్దల్ని చూపినా, జనాలు నాగపంచమి రోజున మాకు పాలు పోసినా, మాపై నిజమైన ప్రేమతో కాదు. ఆహారపు సేకరణకై, ఉత్పత్తికై విధిగా మీరు అడవుల్లో, పంట పొలాల్లో తిరగాల్సి వస్తుంది. ఈ ప్రాంతాలే మా ఆవాస ప్రాంతాలు కూడా! ముఖ్యంగా పంట చేళ్లల్లో వుండే ఎలుకలు, కప్పలు, ఎండ్రకాయలు మాకు మంచి ఆహారం. ఈ ఆహారపు వేటలో మేము పంట పొలాల్లో తిరగడం సహజం. ఆ సమయాల్లోనే మీరు తిరగాడడం, అనుకోకుండా మమ్మల్ని తొక్కడం, తాకడం జరిగిన సమయాల్లో మా రక్షణార్థం మేం కాటువేయడం జరుగుతుంది. అది కూడా కొన్ని జాతుల పాములచే మాత్రమే మీకు అపాయం జరగవచ్చు. కాని కాటువేసిన ప్రతీసారి మా విషం మీ శరీరంలోకి ప్రవేశించదు. మేమేదైనా జంతువుని ఆహారంగా తీసుకున్నప్పుడు మా విషం బయటికి వచ్చేస్తుంది. తర్వాత దేన్ని కాటువేసినా మా విషప్రభావం అంతగా వుండదు. అలాగే కాటువేసిన శరీర భాగాన్ని బట్టి కూడా మా విషతీవ్రత వుంటుంది.
మానుంచి అనుకోకుండా జరిగే ఈ ప్రమాదాన్ని గుర్తించకుండా, మా పట్ల భక్తిశ్రద్ధల్ని ప్రదర్శిస్తే, మేం మీకు ప్రాణహాని తలపెట్టమని భావించి, మీరు మమ్మల్ని ఆరాధిస్తూ వుంటారు. నిజంగా మా రక్షణ కోసం ఇది జరిగితే సంతోషమే!
సినిమాలు – అబద్ధ ప్రచారాలు:
ప్రపంచవ్యాపితంగా మాపై అనేక సినిమాలు తీసారు. భారత్‍లాంటి దేశంలోనైతే, నాగులపై సినిమాలేకాక, నాగలోకం వుంటుందని, నాగకన్యలు వుంటారని (నాగకుమారులు వుండరు), వీరి కళ్ళు పాముకళ్ళలా వుంటాయని చూపుతారు. మమ్మల్ని ఆరాధిస్తే మేలుచేస్తామని, కీడు చేస్తే పగబట్టి చంపుతామని ప్రచారం చేస్తారు. మాకు పగ, ద్వేషం లేదు. అంతగా అభివృద్ధి చెందిన మెదడు, నాడీ వ్యవస్థ కూడా మాకు లేదు. మాకు ఇబ్బంది అని భావిస్తే, పెంచిన యజమానినే కాటువేస్తాం. ఇది మాకు తెలియకుండా జరిగే పక్రియ. మీరు పెంచుకున్న కుక్కలు, ఇతర జంతువులతో కూడా ఇలాంటి ప్రమాదాలున్నా, ‘పాముకు పాలుపోసి పెంచడం..’ అనే సామెతను మా పట్ల ప్రచారం చేసారు. ఏ జంతువుకు ఈ ఉపమానాన్ని వాడరు. మా పట్ల ఇంత వివక్షత ఎందుకో మీరు ఏనాడు ఆలోచించరు.
మీ ఇతిహాసాల నుంచే ఈ వివక్షత:
పాండవుల మనుమడైన జనమే జయుడు మొత్తం మా పాముల జాతిని బలితీసుకోవడానికై యగ్నం చేసాడని గొప్పగా చెపుతారు. ఇప్పటికి ఇది తప్పు అని మీరు భావించరు. కాని, నాగజాతి (తిరిగి అన్ని పాములు కాదు) రక్షకుడైన ఆస్తీకుడిచే మేము రక్షించబడినట్లుగా ఆ గాధ! (చూడండి జనమేజయుడి సర్పయాగం).
అలాగే 7వ శతాబ్దంలో హర్షుడిచే రాయబడిన నాగానందం నాటకంలో గరుత్మంతుడి నుంచి మమ్మల్ని జీమూతవాహనుడనే రాజ్యాన్ని త్యజించిన యువరాజు రక్షిస్తాడు. దీనికో గాధను చెపుతారు. (చూడు నాగానందం నాటకం – హర్షుడు) 17వ శతాబ్దానికి చెందిన ఆంగ్లకవి జాన్‍మిల్టన్ రాసిన ప్యార్‍డైస్ లాస్ట్ (paradise lost) అనే కావ్యంలో ఆదిమానవులైన ఆడమ్, ఈవ్‍ల మధ్యన కోరికల్ని జనింపచేసింది ఓ పెద్దపాము (serpent) అని వర్ణించాడు. దీంతోనే బాధలతో, కష్టాలతో వుండే నేటి మానవ ప్రపంచం ఏర్పడిందని అభివర్ణిస్తే, మీ మానవులు గుడ్డిగా నమ్మి, ఈ కావ్యానికి ఇతిహాస హోదానిచ్చారు. దీన్ని బట్టి మీరెంత స్వార్థపరులో తెలుస్తున్నది.
ఇలాంటి కాల్పనిక గాధలు ప్రపంచ వ్యాపితంగా వున్నాయి. ఆదిమకాలంలో శాస్త్రీయ ఆలోచనలు లేనివారికి ఇలాంటి అపోహలు వుండడం సహజమే కావచ్చు! కాని, ఆధునిక కాలంలో, సైన్సు అభివృద్ధి చెందిన తర్వాత కూడా కొనసాగడం, మీ మానవుల అశాస్త్రీయ భావజాలానికి నిదర్శనం!
దేవాలయాలు – సంపదలు – సర్పాలు :
ప్రజలనుంచి దోచుకున్న సొమ్ముల్ని ఆభరణాలుగా, బంగారంగా మార్చిన రాచరిక వ్యవస్థలు నేలమాళిగల్లో దాచుకునేవారు కదా! అలాగే మీ దేవుళ్ళకు వచ్చే ఆధాయాన్ని, బంగారాన్ని కూడా దశాబ్దాలుగా నేలమాళిగల్లో దాస్తూ, వీటికి మా సర్పాలు కాపలగా వున్నట్లు తప్పుడు ప్రచారాన్ని సాగించారు. ఇదెంతటి అబద్ధ ప్రచారమో మొన్నటి జగన్నాథుడి ఆలయ సంపదల్ని వెలికి తీసినప్పుడు తేలిపోయింది. పైగా మా సర్పాలు ఎక్కడ కాటువేస్తాయోనని భయపడి పాములవారిని, డాక్టర్లను, విషపు విరుగుడు ఇంజక్షనను సిద్ధం చేసుకోవడం మీ పిరికి చర్యకు ఉదాహరణ. ఇప్పటికైనా, మిగతా దేవాలయాల్లో, కేరళలోని పద్మనాభస్వామి ఆలయ నేలమాళిగల్లోని సంపదల్ని వెలికితీసి, ప్రజా, జంతు సంక్షేమానికి, పర్యావరణ పరిరక్షణకు ఉపయోగించండి. కనీసం మీరు మానవులని నిరూపించుకోండి.
ఆదిశేషుడు – వాసుకి:
ఈ రెండు సర్పాల గూర్చి భారతీయులకు విడదీయరాని బంధం వుంది. కాని, వీటి పుట్టుక గూర్చిన కథనాలు వాస్తవాలకు నిలబడవని తెలిసినా, తరాలుగా ఈ గాధలు ప్రచారంలోనే వుంటున్నాయి. నిజానికి మీరనుకున్నట్లు ఆదిశేషుడు భారీ ఆకారంతో వుండే అవకాశం లేదు. పోతే, వాసుకిని శివుడి మెడలో వేసుకునే అవకాశం వుంది. అయితే వీరిద్దరు అన్నదమ్ములని, కశ్యపముని, కద్రువల వెయ్యిమంది (పాముల) సంతానంలో వీరు పెద్దవారని నమ్మడమే విచిత్రం కాదా.. పైగా సవతియైన వినత కొడుకు గరత్మంతుడు ఈ పాముల్ని తిని వైరివారయ్యాడనే ప్రచారం మరొకటి. నిజానికి ప్రకృతి పరంగా, డేగలు పాముల్ని తినడం సహజం! ఈ వాస్తవాల్ని గుర్తించకుండా, కాల్పనిక గాధల్ని ప్రచారంలో పెడుతూ మాపట్ల పరస్పర విరుద్ధ ప్రచారాల్ని సాగించడం బాధాకరం!
అప్పుడే పుట్టిన శ్రీకృష్ణున్ని వాసుదేవుడు యమునను దాటిస్తుంటే, ఏడుతలల ఆదిశేషు వర్షాన్నుంచి కాపాడాడని చెపుతూనే, బృందావనం లోని నీటి మడుగులో వున్న కాలియా (సర్పం)ను శ్రీకృష్ణుడే చంపాడని చెపుతారు. ఓ వైపు మాగూర్చి గొప్పలు చెపుతూనే, మరోవైపు మమ్మల్ని విషపు జంతువులుగా ప్రచారం చేస్తూ చంపడం అనాదిగా జరుగుతూనే వున్నది.
భారీకాయపు పాములు – పాశ్చాత్యులు:
నమ్మకాలతోపాటు, హేతుబద్దత, తార్కిక దృష్టి మెండుగా గల ఇంగ్లాండ్, కొన్ని యూరప్ దేశాలు వీటిని గూర్చిన వాస్తవాలు తెలుసుకోవాలని అనేక ప్రయత్నాలు చేసినా, అవన్నీ అబద్దాలని, ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందిన పుకార్లని తేలాయి. ఇందులో కొన్ని పరిశీలనలను మీ దృష్టికి తెస్తున్నాం.
అమెరికన్ ఇండియన్స్, అజటెక్స్ (Aztecs) ప్రజలు రెక్కలతో ఎగురగల సర్పాలున్నట్లు నమ్ముతారు. భారతీయులు నాగుపామును ఆరాధించినట్లుగా, లాటిన్ అమెరికా దేశాల ప్రజలు భారీ ఆకారము ఉన్న అమర్ (Amar) అనే సర్పాన్ని ఆరాధిస్తారు. అలాగే భారీకాయపు సర్పాలు (అనకొండలు) వున్నట్లుగా అమెరికా, లాటిన్ అమెరికా దేశాల ప్రజలకు నమ్మకాలున్నాయి.
ఈ నమ్మకాల గూర్చి తెలుసుకోవాలన్న ఆకాంక్షతో మొదటిసారి బ్రిటీషు ఆర్మీకి చెందిన కల్నల్ పెరిసి ఫాసెట్ (percy fawcett)ను దక్షిణ అమెరికాకు పంపించగా, ఇవన్నీ ఉత్తుత్తివేనని గుర్తించాడు. పోతే, రెండు నెలల తర్వాత అదే కల్నల్ తానే స్వయంగా 19 మీటర్ల పొడవున్న భారీ అనకొండను చంపినట్లు ప్రచారం చేసుకుంటే, ఆయనో అబద్దాలకోరని తేల్చారు. ఆ తర్వాత 1935, 1948లలో ఆర్మీ క్యాంపుల దగ్గర గల నీటి మడుగుల్లో 10 మీటర్ల, 35 మీటర్ల అనకొండల్ని మిషన్‍గన్‍తో సిపాయులు కాల్చి చంపినట్లు వార్తలు వచ్చినా, ఆధారాలు మాత్రం లభించలేదు. అయినా, దక్షిణ అమెరికాలో 50 మీటర్ల అనకొండ వుందన్న వార్తలు రావడంతో, లోరెంజ్ హగన్‍బెక్ (lorenz hagenbeck) తన పరిశోధన బృందంతో వెళ్ళి దాన్ని బంధించి ఇంగ్లాండ్‍కు తేవాలను కున్నా, ఇది వట్టి పుకార్లని తేలిపోయింది. తర్వాత స్వీడిష్ సాహసవేత్త రోల్ఫ్ బ్లూమ్‍బర్గ్ (rolf blomberg) కూడా ప్రయత్నం చేయగా, ఈయనకు 12 మీటర్ల పొడవున్న పాము చర్మం లభించింది. తీరా దాన్ని సరిగ్గా కొలిచి చూడగా, అది 6 మీటర్లని తేలింది.
భారీ అనకొండ – బహుమతులు :
మా పాముల గూర్చిన వాస్తవాలని నిజమని రుజువు చూపిన వారికి, 10 మీటర్ల కన్నా పొడవైన అనకొండను పట్టి తెచ్చినా, ఆనవాలు వాస్తవంగా చూపినా, 5,000 వేల డాలర్ల బహుమతిని నాటి అమెరికా అధ్యక్షుడు రూస్‍వెల్ట్ (Roosevelt) ప్రకటించాడు. అలాగే న్యూయార్క్ జూ కూడా 20,000 వేల డాలర్ల బహుమతిని ప్రకటించినా, నేటికి ఈ బహుమతిని ఎవరు కూడా స్వంతం చేసుకోలేకపోయారు.
అనకొండ – కోరలు – మండే కళ్ళు :
హాలివుడ్ సినిమాలు:
అనకొండలు భయంకరమైన జంతువులనే ప్రచారం అత్యధికంగా దక్షిణ అమెరికా ప్రజల్లో సర్వవ్యాపితం కాగా, అలివర్ పికెడ్ (Oliver Pequet) అనే ఫ్రెంచ్ జర్నలిస్టు, చాలామందిని విచారించగా, మాకు నాలుగు కాళ్ళుంటాయని, పొడవాటి కోరలు (fangs), మండే కళ్ళు వుంటాయని చెప్పినా, ఏ ఒక్కరూ వాస్తవంగా చూపలేక పోయారు. అలాగే స్విస్ పత్రిక కూడా ఈ విషయంగా ఓ 60 మందిని వివరాలు అడగ్గా మనిషికో రకంగా చెప్పడం గమనార్హం. సేకరించిన వివరాల్ని విశ్లేషించగా, అమెజాన్ అడవుల్లో సాధారణంగా తిరుగాడే కొండచిలువ గాని, లేదా మిల్కావో (milkavo) గాని అయి వుంటాయని భావించారు.
నిజానికి, ఎంత భారీ కొండచిలువకైనా బయటకు కనిపించే కోరలుండకపోగా నోరు తెరిచినప్పుడే అవి కనపడుతాయి. ఇక కళ్ళు అతి చిన్నగా, ముక్కుపుటకు అటూ ఇటూ వుంటాయి. ఇలాంటి అభూత కల్పనలకు, వాస్తవ చింతనలేని కొందరి ఫోటోగ్రాఫర్లు తీసిన తప్పుడు ఫోటోలని, ఊహగానాలని తేలిపోయాయి. అయినా, ఆధునిక సాంకేతికత, మాపై సినిమాల్ని తీసి సొమ్ముచేసుకోవడం, మా పట్ల విద్వేషాన్ని పెంచడం గర్హించతగ్గ విషయమే! హాలివుడ్ సినిమాల్లో చూపినట్లుగా మేం మానవుల్ని భక్షించే జీవులం కాము. మా ద్వారా ఇప్పటికి, ఏ ప్రాంతంలో ఒక్కరంటే ఒక్కరు మరణించలేదు. పోతే మాపై పరిశోధనలు చేస్తున్న వ్యక్తులపై రెండుసార్లు దాడులు మాత్రం జరిగినా, ఎవరికి ప్రాణహాని కలుగలేదు.
మా దవడల నిర్మాణం సాగే కండరాలతో వుంటుంది కాబట్టి చిన్నపాటి జంతువుల్ని, దూడల్ని, జింకల్ని తినగలుగుతాం. అది కూడా, మింగి, శరీరాన్ని మెలివేయడంతో ఆ జంతువు మాకు ఆహారంగా మారిపోతుంది.
ఏడుతలల సర్పాలు – శిలాజ శాస్త్రం
శిలాజశాస్త్రం ప్రకారం ఏడుతలల సర్పాలు, భారత్‍లోనే కాదు, ప్రపంచంలో ఎక్కడా ఆనవాలు దొరకలేదు. చూసినవారు లేరు. ఇవన్నీ ఇతిహాస గాధలే! పోతే గుజరాత్ రాష్ట్రం కచ్ ప్రాంతంలోని పనాంద్ర లిగ్నైట్‍గనిలో లభించిన ఓ సర్పం శిలాజం సుమారు 998 కి.గ్రా. బరువు, 10.9 నుంచి 15.2 మీ. పొడవు వున్నట్లుగా అంచనా. దీని కార్బన్ డేటింగ్ ప్రకారం ఇది సుమారు 47 మిలియన్ సంవత్సరాలగా భావించారు. ఇంతవరకు లభించిన, చూసిన పాముల్లో ఇదే అత్యంత పురాతనమైనదిగా భావిస్తారు. కాని, మీరు దీన్నే వాసుకిగా భావించడం గమనార్హం! దీని గూర్చిన వాస్తవాల్ని 2018లో రాయల్ సొసైటీ ఓపెన్ సైన్సు జనరల్‍లో ప్రచురించింది. ఈ సర్పం మాడ్‍సోయిడె (madtsoiidae) కుటుంబానికి చెందినదిగా మీ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇది జీవించిన కాలంలో మీ మానవులు అసలు పుట్టనే లేదు.
మాపట్ల వున్న వ్యతిరేకతనే మమ్మల్ని భూమిపై లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే IUCN జాబితాలో మాలోని కొన్ని రకాల పాముల అంతిరించి పోయాయని, మరికొన్ని అత్యంత ప్రమాదకర స్థాయిలో వున్నట్లు చూపుతున్నాయి. మీ మానవులకన్నా, మా అవసరమే ఈ భూప్రకృతికి, పర్యావరణానికి అవసరమని ఇప్పుడన్నా భావించండి. (వచ్చే సంచికలో ఈ వ్యాసపరంపరలో చివరి వ్యాసం వుంటుంది).
- డా।। లచ్చయ్య గాండ్ల,
ఎ : 9440116162